ప్రేమించండి ప్లీజ్


    ఆ మాటలు విన్నప్పుడు గుండె ఝల్లుమనలేదు ఆంజనేయులకు. అతను చావుకి ఎన్నో రోజుల్నుంచీ ప్రిపేర్ అయిపోయాడు. అందుకే అతను నర్వస్ గా ఫీల్ కావడం లేదు. కానీ తను ఎవరి ప్రేమనూ పొందకనే అర్ధాంతరంగా అదృశ్యం అయిపోతున్నందుకు బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు.
    వురిశిక్ష పడ్డా తనను ఎవరూ చూడడానికి రాలేదన్న సత్యం అతని నరాలను తెగ్గొడుతోంది.
    హత్యవార్త వినగానే అతను తన కొడుకే కాదనుకున్నాడు శీనయ్య. సంసారం ఇక ఎలా గడుస్తుందన్న దిగులుతో కాంతమ్మ మంచమెక్కింది. అంతవరకు శరీరంలో దొంగతనంగా కాపువేసిన క్షయ అప్పటికే ఎముకల్ని తినడం ప్రారంభించింది. ప్రభావతి హిస్టీరియాలోంచి పిచ్చి;లోకి మారింది. వీధిలోని కాగితాలు ఏరుకోవడం, అవన్నీ తనకు వచ్చిన ప్రేమ లేఖలని కనిపించిన వాళ్ళకి చెప్పడం, పెద్ద బండరాయిని పాపాయిగా చేసుకుని ఆడించడం, మగవాడు కనిపిస్తూనే భయపడి, దూరంగా పారిపోవడం లాంటివి చేస్తోంది ఇక నాగరాజు అవిటివాడై పోవడంవల్ల జైలుకి రాలేకపోయాడు.
    బతికున్నప్పుడూ తనను సమాజం గుర్తించలేదు. ఇప్పుడు చావు అంచువరకూ వచ్చినా తనను గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. తను ఒంటరిగానే పుట్టాడు. ఒంటరిగానే చచ్చిపోతున్నాడు. తను ఉన్నా లేకపోయినా జనం పట్టించుకోవడం లేదన్న బాధకంటే మించిన విషాదం మరొకటిలేదని అనుకున్నాడు ఆంజనేయులు.
    తను అనామకుడిగానే పుట్టాడు అనామకుడిలాగానే చచ్చిపోతున్నాడు. తన జీవితంలో ఎవరూ కనీసం అతిధి పాత్రను కూడా పోషించలేకపోయారు. గుప్పెడు ప్రేమకోసం తపించిపోయిన ఈ గుండెనిండా మరో కొన్ని గంటలకి మలిన రక్తం పొంగుతుంది. మనసు చిట్లిపోతుంది. ఈక్షణంలోనైనా ఎవరైనా వచ్చి 'నీకోసం నేనున్నానని' అనకూడదా.....? కానీ ఎవరూ అనరు. ఆంజనేయులు బలవంతంగా మనసుని కంట్రోల్ చేసుకున్నాడు.
    "ఎన్ని గంటలకి వురి?" అడిగాడు సెంట్రీని.
    అంత తాపీగా తన మరణ ముహూర్తం ఎప్పుడని అడుగుతున్న అతన్ని చూసి సెంట్రీ జడుసుకున్నాడు. జీవితం మీద ఎవరికైనా మమకారం వుంటుంది. అదీ లేదంటే ఎదుటివ్యక్తి ఎంత దీనావస్థలో వున్నాడో సెంట్రీ అర్ధం చేసుకున్నాడు.
    "మరో గంటకి - సూర్యుడు పుట్టకముందే పని అయిపోవాలి. వచ్చి తయారవ్.
    "తయారవడం అంటే....? సందేహంగా అడిగాడు ఆంజనేయులు మరో గంటకు చచ్చిపోతున్నప్పుడు తీరిగ్గా దంతధావనం చేసుకోవడం నిదానంగా బాగా సబ్బుపట్టించి స్నానం చేయడం ఇలిక్యులస్ గా అనిపించింది. అందుకే అతను ఆ ప్రశ్న అడిగాడు."
    "వురి తీయడమంటే జైల్లో పెద్ద హడావుడి. నీకు మొదట షేవ్ చేస్తారు. డాక్టర్ వచ్చి నీకు పరీక్షలు జరుపుతాడు. నువ్వు నిక్షేపంగా వున్నావంటేనే వురి. లేకపోతే వాయిదా వేస్తారు. ఆ తరువాత నీకు బ్రహ్మాండమైన టిఫిన్ పెడతారు. బతికున్నప్పుడు ఏ ఖైదీకి బాగుచూడని ప్రభుత్వం చివరి క్షణంలో తల్లిప్రేమను కనపరుస్తుంది. ఓ మనిషిని వురి తీస్తున్నామన్న పాపభీతివల్లే ఈ రూల్స్ గట్రా పెట్టారని నాకనిపిస్తుంది." అని ఆంజనేయులు చేయిపట్టుకుని బయటికి పిలుచుకొచ్చాడు.
    ఆంజనేయులు బయటికొచ్చి పైకి చూశాడు.  విశాలమైన ఆకాశం కొత్తగా వుంది. సెల్లో వున్నప్పుడు కిటికీ అంత ఆకాశం కళ్ళల్లో గుచ్చుకున్నట్టు కనిపిస్తుంది. నిండైన ఆకాశాన్ని చూడడానికైనా జైలుకి రాకూడదనిపించింది.
    చీకట్లు ఇంకా లోకం నుండి వీడ్కోలు తీసుకోలేదు. వెలుగు చారికలు అక్కడక్కడా వెండి పట్టీల్లా వేలాడుతున్నాయి. జైలంతా తాబేటి చిప్పలా ముడుచుకుని కనిపిస్తోంది. తెల్లవారు జామున వీస్తున్న గాలి చలిచలిగా వుంది.
    "త్వరగా రా బార్మర్ రడీగా వున్నాడు."
    కొత్త గొంతు వినిపించగానే ఆంజనేయులు అటూ ఇటూ చూశాడు. గదికి కొద్ది దూరంలో హెడ్ వార్డెన్ నర్సయ్య నిలబడివున్నాడు. ఆయన వెనకకు మరో నలుగురు వార్డెన్లు, ఒక సెంట్రీ వున్నారు.
    అలాగేనన్నట్టు తలూపి అతను వాళ్ళవెంట బయల్దేరాడు.
    జైలుకి మధ్యనున్న బావి దగ్గర బార్బర్ రడీగా వున్నాడు. ఇంకొంతసేపటికి వురి తీస్తారన్న మనిషికి షేవ్ చేస్తుంటే ఆ బార్బర్ ఎలా స్పందింస్తాడో అడగాలనిపించింది ఆంజనేయులకి. శవాలకి అలంకరణ అంటే ఇదేనేమో అనుకున్నాడు.
    "ఇతనే కాండిడేట్. కానీ నర్సయ్య అనడంతో 'రా బాబూ' అంటూ పిలిచాడు బార్బర్."
    ఆంజనేయులు ఆయన ముందు మునికాళ్ళమీద కూర్చున్నాడు.
    షేవ్ పూర్తయ్యేసరికి జైలు సూపరింటెండెంట్ జగన్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆంజనేయులుకన్నా అతనే ఎక్కువ బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. తన హయాంలో ఓ వ్యక్తిని వురితీయాల్సి రావడం అతనిని కలచివేస్తోంది.
    తన ఫీలింగ్స్ ని బలవంతంగా అణుచుకుంటున్నాడు అతను.
    ఆంజనేయులు రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. ఖైదీ తను సొంత అన్నదమ్ముల్లా చూసుకునే ఆయనంటే ఖైదీలకు గౌరవం. తోటి సిబ్బందికి కడుపుమంట.
    వృత్తిపట్ల, తాము చేస్తున్న పనిపట్ల అంత అంకిత భావంవున్న వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు మనకు. ఆఫీసర్ల నుంచి ఆర్టీసీ కండెక్టర్ వరకు తన ఉద్యోగాన్ని చిరాకుగానే చేస్తుంటారు. తాము విధిలేక ఈ ఉద్యోగం చేస్తున్నట్లు మనుషుల్ని కసురుకోవడం ద్వారానో, టికెట్లు విసుగ్గా చిచడం లోనో, చిల్లర ఇవ్వనందుకు కోపంగా చూడడం ద్వారానో కండెక్టర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఈ కారణం చేతనే ఉద్యోగుల్లో చాలామంది పబ్లిక్కుకి అసౌకర్యం కలుగచేస్తుంటారు.
    ఉద్యోగం రాగానే  తాము ఉద్యోగం కోసం ఎన్ని కష్టాలు పడిందీ ఎన్ని అవస్థలు ఎదుర్కొందీ మరిచిపోతారు. ఎవరో నూటికి కోటి జగన్ లాంటి వాడు ఒకడుంటాడు. ఉద్యోగాన్ని జీతం డబ్బుల కోసం కాక సర్వీసు కింద ఫీలై చేస్తుంటారు.
    నిజానికి అతనికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. లక్షాధికారి పుత్రుడు అతను బాగా చదువుకున్నాడు. ఎప్పుడో 'మై ప్రిజన్ లైఫ్ ఇన్ ఇండియా' అన్న పుస్తకం చదివి ఖైదీలపట్ల వున్న తన ప్రేమను పబ్లిక్కు  మీటింగుల్లో మైక్ చేతపట్టుకుని అదరగొట్టలేదు అప్పటినుంచే వారికి ఎలా సేవ చేయడానికి వీలుంటుందో ఆలోచించాడు జైళ్ళను సంస్కరణాలయాలుగా మార్చడానికి సూపరింటెండెంట్ కావాలనుకున్నాడు అయ్యాడు. సంవత్సరం ముందు ఆ జైలుకి డైరెక్టుగా రిక్రూట్ అయ్యాడు. ఈ మధ్యనే వివాహమైంది.
    "ఐ యామ్ సారీ ఆంజనేయులుగారూ! మీరు ఒక విధంగా హంతకులైతే, నేను ఈ రోజు మిమ్మల్ని వురితీసి హంతకుడు కాబోతున్నాను నన్ను క్షమించండి" అన్నాడు అతను.
    ఆ మాటలు వూరికే వుబుసుపోక, మెహర్భానీ కోసం అనడం లేదనీ, అవి గుండె తడిలో తడిసి వస్తున్నాయనీ గ్రహించాడు ఆంజనేయులు. అందుకే అతను చలించిపోయాడు.
    "అలా మాట్లాడకండి సార్ మీ ఆదరణకు అభిమానం మరిచిపోలేనిది సార్. నాలాంటి వాడికి అవి ఎంత విలువైనవో తెలుస్తుంది. మీలాంటి మంచి మనిషి సమక్షంలో చచ్చిపోవడం నా అదృష్టం."
    ఇక వినలేకపోయాడు జగన్. అక్కడినుంచి వచ్చేసి, ఆఫీసు గదిలో చేతుల్ని గడ్డం కింద ఆనించుకుని కూర్చుండిపోయాడు.
    మరో పావుగంటకు డాక్టర్, మేజిస్ట్రేటు, వురితీసే తోటీ వచ్చారు. అందరూ జైలు ఆవరణలో ఓ మూలనున్న ఉరికంబం దగ్గరికి చేరుకున్నారు.
    ఆంజనేయుల్ని బలి పశువును అలంకరించినట్టు అలంకరించారు. తలనిండా టెంకాయ నూనె పెట్టారు. బాగా వుతికి, తోమిన బట్టలు వేశారు.
    ఇద్దరు సెంట్రీలు పక్కన నలుగురు వార్డెన్లు వెనకరాగా అతను వురికంబం దగ్గరికి చేరుకున్నాడు.
    తూర్పు ఆకాశం పురిటినొప్పులు పడుతోంది. అక్కడంతా ఎర్రగా కమిలిపోయింది. అశుభ సూచకంగా చెట్లమీద కాకులు అదేపనిగా అరుస్తున్నాయి. గాలి ఆ ప్రాంతాన్ని బహిష్కరించినట్టు వుక్కగా వుంది.
    "ఆంజనేయులుగారూ! మీ చివరి కోరిక ఏమైనా వుంటే చెప్పండి" అని అడిగాడు జగన్ ఒక్కోమాట వత్తిపలుకుతూ.
    చప్పున తల పైకెత్తాడు ఆంజనేయులు. జగన్ అలా అగడగానే ఠక్కున "ప్రేమకావాలి" అని అడగాలనిపించింది. అది ఎంత అసాధ్యమో తన జీవితకాలంలో తెలుసుకున్నాడు. ఎందుకు వృధా ప్రయాస అనుకుని తల దించుకున్నాడు.
    ఆంజనేయుల్ని వురివేసే ఫ్లాట్ ఫామ్ మీదికి ఎక్కించారు.
    తోటీ అతన్ని మధ్యలోకి తీసుకువచ్చి పొజిషన్ లో నిలబెట్టాడు అతనికి ముఖానికి తొడగడానికి నల్లటి ముసుగుని తీసుకుని అధికారుల వైపు చూశాడు.
    "మీ చివరి కోరిక ఏమైనా ఉంటే భయపడకుండా, బిడియం లేకుండా చెప్పండి. తీరుస్తాం" జగన్ మరోసారి అడగడంతో మేజిస్ట్రేట్ విసుగ్గా చూశాడు. ఆయన టెన్నిస్ కోర్టుకి వెళ్ళే టైమైంది. ఎప్పుడు ఈ తతంగం ముగిసి బయటపడదామా అన్న ఆతృతతో  వున్నాడాయన తను ఏభై అయిదేళ్ళ వయసులో కూడా చాలా రొమాంటిక్ గా ఆలోచించగలుగుతున్నానంటే అదంతా టెన్నిస్ ఆడడంవల్లే అన్న అజ్ఞానంతో వున్నాడాయన. ఆ అజ్ఞానాన్ని స్టేటస్ సింబల్ గా భావించడంవల్ల దానిని వదిలించుకునేందుకు ఆయన సిద్ధపడడంలేదు.