ప్రేమించండి ప్లీజ్


    అప్పటివరకూ వర్షంలో తడిచినవాళ్ళూ ఇప్పుడే గదికి వచ్చారని అర్ధమైంది ఆంజనేయులకు.
    జీవన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంత రాత్రిపూట వినయ్, శకుంతల ఇక్కడికెందుకొచ్చారు? వాళ్ళిద్దరి మధ్యా ఏం కాబోతోంది?
    అతనిలో ఆ ప్రశ్నలు కొండ చిలువలు మత్తుగా కదులుతున్నట్లు తిరుగుతున్నాయి.
    తలుపు తడదామనుకున్నాడు. తలుపు దగ్గరికి వెళ్ళిన చేయి ఠక్కున ఆగిపోయింది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూడాలన్న ఉత్సుకత చేతిని వెనక్కిలాగేస్తోంది.
    తలుపు తట్టాలన్న ప్రయత్నాన్ని విరమించుకుని కళ్ళను మరింత సాగదీశాడు.
    "ఎలా వినయ్? ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఇప్పటికే అమ్మావాళ్ళు కంగారుపడుతుంటారు" శకుంతల ఆందోళనతో అంది.
    "వెళుదురు లెండి వాన ఆగిన తరువాత ఇక ఒక్కక్షణం కూడా ఇక్కడ వుండకండి" వినయ్ అన్నాడు.
    "వర్షం వస్తుందని తెలిస్తే సినిమాకు వెళ్ళేవాళ్ళం కాము"
    "అందుకే గదండీ వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారు."
    అంటే వాళ్ళు సినిమాకు వెళ్ళారని, వర్షం వస్తే తలదాచుకోవడానికి అక్కడకు వచ్చారని అర్ధమైంది ఆంజనేయులకు.
    "వానరాకడ, ప్రాణం పోకడ విషయం తెలియదుగానీ ఇప్పుడు ఈమె మానం పోకడ మాత్రం గ్యారెంటీ. ఏదో దురుద్దేశ్యం లేందే ఆమెను ఇక్కడికి పిలుచుకువచ్చేవాడు కాదు వినయ్." ఇప్పుడు మహాలింగం ఇక్కడ వుంటే అలా అనేవాడనిపించింది.
    "జీవన్ గారు లేరా?" ఆమె అడిగింది.
    "ఉదయం వూరెళ్ళాడు. కీస్ నా దగ్గర ఇవ్వడం వల్ల మనం వర్షంలో తడవకుండా ఇక్కడికి రాగాలిగాము."
    "వర్షం ఇప్పట్లో తగ్గదనుకుంటాను" ఆమె కిటికీలోంచి బయటకు చూస్తూ వుందని తెలిసి ఆంజనేయులు ఠక్కున తలదించుకున్నాడు.
    "వర్షం మాట ఏమోగానీ మీలో కంగారు మాత్రం ఇప్పట్లో తగ్గదనుకుంటా" వినయ్ నవ్వాడు.
    ఆమె నవ్వడానికి ప్రయత్నించి విఫలమైంది.
    "నవ్వండి మేడమ్ మీ నవ్వు బావుంటుంది, వాన వెలిశాక నిర్మలత్వంతో మెరిసే ఆకాశం లాగా.    
    శకుంతల సిగ్గుపడి నవ్వడం కనిపిస్తోంది ఆంజనేయులకు.
    మరి తను మంజులను మేడమ్ అని పిలిస్తే తనెందుకు నవ్వుల పాలయ్యాడు? తను మేడమ్ అని పిలిచేప్పుడు తన గొంతు అల్లరిని ప్రకటించలేకపోయింది. తన పిలుపులో భక్తి, గౌరవాలు తప్ప మరేల లేవు. అందుకే తను చులకనైపోయాడు.
    'స్త్రీ దేనికీ ఒప్పుకోదు,. దేన్నీ వ్యతిరేకించదు. డీల్ చేసేవాడి మీదే గెలుపు ఓటములు ఆధారపడి వుంటాయి. అలా అని స్త్రీకి వ్యక్తిత్వం లేదని నేను అనడం లేదు. ఆమె ఏం కోరుకుంటూ వుందో నువ్వు పసికట్టి పాచికవెయ్యాలి' - ఇదీ వినయ్ థీరి. అందుకే అతను సక్సెస్ అవుతున్నాడా?
    అతను గెలుస్తాడని అనిపించగానే గుండెల్లో బాధ మొదలైంది ఆంజనేయులకు. ఇక ఒక్కక్షణం కూడా నిలబడలేక అలానే కిందకు జారి కూర్చుండిపోయాడు.
    "తల బాగా తుడుచుకోండి, లేకపోతే జలుబు చేస్తుంది -మీకు కాదు నాకు" వినయ్ అంటున్నది వినిపిస్తోంది.
    ఆమె నవ్వింది.
    తనూ, ఆమె వేరువేరు కాదనీ ఎంత అందంగా చెప్పాడు వినయ్. ఆమె తల తుడుచుకోకపోతే తనకు జలుబు చేస్తుందన్న ఒక్కవాక్యంతో ఎన్ని అర్ధాలు చెప్పగలిగాడు! వినయ్ స్థానంలో తనువుంటే... ఎంత అసహజంగా ప్రవర్తించేవాడో వూహించాడు శకుంతలను దగ్గరకు తీసుకోవాలనీ మనసు ఎంతగానో కోరుకుంటున్నా బలవంతంగా వాటిని అణుచుకుంటాడు. తనకు అలాంటి భావనలు కలగడం లేదని? తను అందరి కంటే అధికుడినని ఆమె అనుకోవాలనీ తెగ తాపత్రయ పడతాడు అందుకే లోపలున్న మరో గదిలోకెళ్ళి తల తుడుచుకుంటాడు. ఆమె శీలాన్ని కోల్పోవడానికి సిద్దంగా వున్నట్టు తను, ఆమెను రక్షిస్తున్నట్టు ఫోజు పెడతాడు. అందుకే తనలాంటివాడు ఎప్పుడూ అసహజంగా బిహేవ్ చేస్తాడు.
    "ఇలా మంచంమీద కూర్చోండి" లోపల వినయ్ అంటున్నాడు. మాటలనుబట్టి వాళ్ళ కదలికల్ని వూహిస్తున్నాడు అతను.
    మంచం చివరన కూర్చుంది శకుంతల.
    "మిమ్మల్ని ఇలా చూస్తుంటే, ఏమనిపిస్తుందో తెలుసా? పూజకోసం పూలను తేవడానికి వెళ్ళిన శకుంతల పూలరెమ్మలను కిందకు వంచితే, రాత్రంతా మంచు బిందువులతో బరువెక్కిన వాటినుంచి తుంపరలు రాలితే - అలానే కణ్వాశ్రమానికి వచ్చినట్టుంది."
    ఆమె నవ్వింది - మంచు తుంపరలు పైనపడితే కలిగేహాయిలా.
    ఎక్స్ ప్రెషన్ ఎంత గొప్పది -? వినయ్ తన గుండెలోని భావాలకు ఎంత అద్భుతంగా అక్షర రూపం ఇవ్వగలడు తనకు ఆ ఆర్ట్ ఎందుకు తెలీదు?
    "బ్లూ శారీలో మీరెలా కనిపిస్తున్నారో తెలుసా? ఆకతాయి కుర్రాడు మందారం మొక్కమీద ఇంక్ చల్లినట్టుంది" వినయ్ కాంప్లిమెంటుకు ఆమె కెరటంలా ఎగిరిపడడం కనిపిస్తోంది ఆంజనేయులుకు.
    మరో అయిదు నిమిషాల వరకు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమెలో ఏవేవో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
    ఆ రాత్రి, వర్షం, ఎదురుగ్గా తన మాటలతో ఆకట్టుకుంటున్న వ్యక్తి - జీవితం కొత్త కోణంలోంచి దర్శనమిస్తోంది.
    "స్త్రీల ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. వాళ్ళు ఒక్కోదగ్గర ఒక్కోవిధంగా ప్రవర్తింటారు. ఇంట్లో అత్తమామల మధ్య ఆడబడుచుల సందట్లో మూగగావున్న ఓ అమ్మాయి బయటకొస్తే పెద్ద వాగుడు కాయిలా గలగలా మాట్లాడేస్తూంటుంది. ఎప్పుడూ ఇల్లు అనే బందీఖానాలో వుండే స్త్రీలు పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళకు బయటికొస్తే ఎక్కువ అల్లరి చేస్తుంటారు అయితే ఈ అల్లరిని చూసి మొగుడనేవాడు భయపడిపోతాడు. ఈ అల్లరి ఇలా కంటిన్యూ అయితే ఏమౌతుందోనని సందేహిస్తాడు. ఇంట్లో నోరు విప్పడానికి భయపడే భార్య త్రుళ్ళుతూ కేరింతలు కొడుతుంటే  సహించలేడు. అందుకే ఆమె ఉత్సాహం మీద నీళ్ళు చల్లాలని ప్రయత్నిస్తాడు. లేనిపోని భయాలను ఆమెలో కలగచేస్తాడు స్త్రీ ఎలా వుండాలో ఎలా నడుచుకోవాలో నూరిపోస్తాడు. తన రక్షణ కరువయిన రోజున ఆమె ఎన్ని బాధలు అనుభవించాలో చెబుతాడు. ఇందుకు కొందర్ని ఉదహరిస్తాడు. పాపం! ఆ అమాయకురాలు భర్త ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్ధంకాక గింజుకుంటుంది."
    ఇలా మాట్లాడే వినయ్ కు పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం కష్టం కాదనిపించింది ఆంజనేయులకు.
    "భార్యాభర్తలంటే స్నేహితుల్లా వుండాలి. కానీ మన సంఘంలో మన పెళ్ళి పేట్రన్ లో అలా వుండే అవకాశం లేదు. భర్తంటే భయపడే ఆడపిల్ల పడకటింట్లో కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కాళ్ళు పైన వేస్తే ఏమనుకుంటాడో అని సందేహించే భార్య సెక్స్ లో ఏ సుఖం అనుభవిస్తుంది. అందుకే భర్తతో బిగుసుకుపోయే స్త్రీ ప్రియుడుతో ఆ సమయంలో రెచ్చిపోతుంది. మరీ తెగువున్న ఆడపిల్ల అతనితో లేచిపోతుంది."