ప్రేమించండి ప్లీజ్


    ఇదీ కథ అచ్చు సినిమాలాగా పాటలు పద్యాలతో బ్యాక్ రౌండ్ మ్యూజిక్ తో అదిరిపోతోంది.
    కథ క్లయిమాక్స్ కు చేరుతుంది. ప్రేమికుల్ని విడదీశామన్న సాడిస్టిక్ ఆనందంతో భూస్వామి. ఆమె అన్న మందు పార్టీ చేసుకుంటూ వుంటారు.
    ప్రభావతి పూర్తిగా అందులో లీనమైపోయింది. ఆమెలో తనను వూహించుకుంటోంది. డాక్టర్ స్థానంలో రాజకుమారుడు వున్నాడు. ప్రేయసీ ప్రియుల విడిపోవడాన్ని ఆమె భరించలేక పోతోంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది.
    ఆమె దుఃఖంతో కదిలిపోయింది. ఇది స్వయంగా తనకే జరిగిందన్న భావన ఆమెను ఎమోషన్ గా మార్చివేసింది.
    భూస్వామి, హీరోయిన్, అన్న విజయగర్వంతో మందు బిగిస్తున్నారు.
    ప్రభావతి భరించలేక పోయింది. చేత్తో చుట్టూ కింద తడిమింది. రెండు మూడు రాళ్ళు తగిలాయి. వాటిని చేతుల్లోకి తీసుకొంది.
    ఆమె పూర్తిగా కంట్రోల్ తప్పింది.
    అంతే చేతిని బాగా వెనక్కి లాగి టీవీ మీదకు రాయి విసిరింది. ఒకటి.....రెండూ.....మూడు..... నాలుగు....టీవి బ్రద్దలైపైన గ్లాస్ కిందపడి భళ్ళున పగిలింది.
    చుట్టూ వున్న జనంలో కలకలం.
    ఏం జరిగిందో తెలియటానికి అయిదు నిముషాలు పట్టింది. అంత వరకు చీకటిగా వున్న ఆ ప్రాంతం ఒక్కసారిగా వెలుగుల్ని విరజిమ్మింది.
    చేతుల్లో రాళ్ళు పట్టుకుని వున్న ప్రభావతిని చూసి గుంపులో ఎవరో అరిచారు 'దానికి పిచ్చి పట్టింది"
    ప్రభావతికి మధ్యాహ్నం ఫిట్స్ వచ్చిన విషయం ఇంద్రాణి అప్పుడే వూరి చెవుల్లో వూదేసింది.
    ఆమెను ఎప్పుడయితే పిచ్చిది అన్నారో అప్పుడే ఓ పిల్లాడు  ఆమె మీదకు రాయి విసిరాడు. అది ఆమె నుదురుకి తగిలి గాయం చేసింది రక్తం పైకి చిమ్మింది.
    "అయ్యో! అమ్మా!" అంటూ కాంతమ్మ కూతురి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని గట్టిగా కౌగిలించుకుంది.
    రాయి విసిరిన ఆకుర్రాడ్ని చూసి మిగిలిన పిల్లలు రాళ్ళు విసరడం ప్రారంభించారు.
    శారద అరుస్తూ ఆంజనేయులు  దగ్గరకు పరుగెత్తింది.
    ప్రోగ్రామ్ మధ్యలో ఎందుకాగిందో జనం ఎందుకలా గుంపుగా దడి కట్టారో తెలియక గింజుకుపోతున్న ఆంజనేయులు చెల్లెలి కేకలతో దిగ్గున పైకి లేచాడు.
    శారద ఆయాసంతో ఎగిసి పడుతూ అన్నయ్యా! అక్కను. రాళ్ళతో కొడుతున్నారన్నయ్యా. అక్కకు పిచ్చి పట్టిందని జనమంతా అప్లై చెప్పలేకపోయింది. ఏడుపు ఎక్కువై మాటలకు అడ్డంపడింది.
    ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు అతను. ముందుకు పరుగెత్తాడు.
    జనం మధ్యలో దూరి ఒక్క అంగలో వాళ్ళను చేరుకున్నాడు. చెల్లెల్ని, పిన్నిని రెండుచేతులతో పొదివి పట్టుకుని అక్కడి నుంచి తీసుకొచ్చాడు.
    అప్పటికి జనం కూడా శాంతించి పిల్లల్ని అదిలించారు.
    రాళ్ల వర్షం ఆగిపోయింది.
    ముగ్గురూ అక్కడి నుంచి మెల్లగా బయటపడ్డారు!
    ఇంటికొచ్చాక కాంతమ్మ ఏదో ఆకు తెచ్చి, దాన్ని పసరు తీసి కూతురి గాయాలకు కట్టింది తను కూడా అదే చికిత్స చేసుకుంది.
     కొంతసేపయ్యాక ఆంజనేయులు బయటికొచ్చి మంచం మీద పడుకున్నాడు.
    ప్రభావతి అలా హిస్టీరిక్ గా ప్రవర్తించడం అతన్ని చాలా బాధపెట్టింది. తన అశక్తత వల్లే ఆమె అలా అయిపోయినట్టనిపించి దుఃఖం ఆగలేదు. కుమిలి కుమిలి ఏడ్చాడు.
    అలా ఎంతసేపున్నాడో అతనికే తెలీదు. ఎప్పుడో తెల్లవారు జామున కునుకు పట్టింది.
    బాగా తెల్లవారడానికి ఇంకా గంట టయిం వుండగా ఎవరో లేపుతున్నట్టనిపించింది. ఆంజనేయులు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఎదురుగ్గా శీనయ్య.
    "ఏం నాన్నా?"
    "శారద కనిపించడం లేదురా? మెల్లగా రహస్యం చెబుతున్నట్లు చెప్పాడాయన.
    ఒక్కక్షణం మెదడంతా బ్లాంక్ అయిపోయినట్టు ఫీలయ్యాడు ఆంజనేయులు. అది కలో, నిజమో అర్ధం కాలేదు.
    కలకాదని నిర్ధారించుకోవడానికి అన్నట్టు మరోసారి అడిగాడు 'ఏమైంది నాన్నా?"
    "శారద కనిపించడంలేదురా మీ పిన్ని నాకు ఈ విషయం చెప్పి వెతకటానికి వెళ్ళిందిరా"
    అంటే కల కాదన్నమాట శారద ఏమైంది? నిన్న జరిగిన సంఘటనతో ఆమె విరక్తి చెంది ఏ నుయ్యో, గొయ్యో చూసుకుందా?
    ఇక ఆలోచనను భరించలేక పోయాడు. ఆంజనేయులు గబగబా రెండుచేతులతోనూ దుఃఖాన్ని రుద్దుకుని "నేను వెళ్ళి చస్తానులే నాన్నా" అన్నాడు చెప్పులు వేసుకోవాలన్న ధ్యాసైనా లేకుండా బయటపడ్డాడు.
    ఇంత కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక మిత్రుదయినా లేక పోవడాన్ని తలుచుకుంటుంటే జీవితమంటేనే అసహ్యమేసింది.
    తనలో తానే కుమిలిపోతూ ప్రతి బావి దగ్గరకు వెళ్ళి చూశాడు. బస్టాండ్ అంతా గాలించాడు. పొలాల్లో పరుగెడుతూ వెదికాడు.
    శారద ఎక్కడా కనిపించలేదు.
    అప్పటికే పొద్దు భారెడెక్కింది. టైమ్ ఎనిమిది దాటింది.
    రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం టెన్షన్ తో కళ్ళు తిరుగుతున్నాయి నీరెండకు. కాళ్ళు పీకుతున్నాయి.
    ఇక తనవల్ల కాదని మొరాయిస్తున్న శరీరాన్ని బలవంతంగా లాక్కుంటూ ఇల్లు చేరాడు.
    ఇంటి వసారా కింద కూర్చుని కాంతమ్మ నిశ్శబ్దంగా ఏడుస్తోంది.
    అతన్ని చూసి మెల్లగా పైకి లేచింది. అతను సమీపించగానే 'ఈ చీటీ దేవుడి పటాల ముందు కనిపించింది. ఇది ఆ పిల్ల రాసిందేమో చూడు" అని గుప్పెట్లో దాచిన కాగితాన్ని తీసి ఇచ్చింది.
    అతను మౌనంగా దాన్నందుకున్నాడు.
    ఒక్కో మడత విప్పుతుంటే చేతులు వణుకుతున్నాయి.
    మొత్తం విప్పాక అది శారద రాసిందేనన్న సంగతి తెలిసింది. అక్షరాల వెంట ఆయన చూపులు పాకుతున్నాయి.
    అన్నయ్యా!
    నేను వెళ్ళిపోతున్నాను. మరీ స్పష్టంగా ఇంద్రాణి మాటల్లో చెప్పాలంటే లేచిపోతున్నాను. ఈమాట ఎవరు కనిపెట్టారోగానీ దీనంత చెత్తమాట మరొకటి వుండదు. ఈమాటకు ఎంత పవిత్రత ఆపాదించాలన్నా ఏదోచెడిపోతున్నామన్న అర్ధం వస్తుంది. కానీ ఒకబ్బాయితో ఒకమ్మాయి వెళ్ళిపోవాలన్న అర్ధం స్ఫురించేందుకు ఈమాట తప్ప మరోమాట లేకపోవడం మన తెలుగు భాష చేసుకున్న దురదృష్టం. ఇంద్రాణి లాంటి వాళ్ళు అన్నంత వరకు ఈ మాట అర్ధం చెడకుండా సజీవంగానే వుంటుంది.