ప్రేమించండి ప్లీజ్


    ఈ మాటలను వింటున్న ప్రభావతికి అస్పష్టంగా ఏవేవో చిత్రాలు కళ్ళముందు కదులుతున్నాయి. రంగు రంగుల కలలు పరుచుకుంటున్నాయి. ఆమె ట్రాన్స్ లో వున్నట్టు నిశ్చలంగా అలానే చూస్తోంది. మనసులోని భావాలు నిజాలై సాక్షాత్కరిస్తున్నాయి.
    దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు- క్షణాలు గడుస్తున్న కొద్దీ చప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తోంది. గుర్రం మీదున్న యువకుడు ఇప్పుడు బాగా కనపడుతున్నాడు. ముఖంలో చిరునవ్వు- చేతిలో కత్తి- మరో చేతిలో డాలు-- తలమీద వజ్రవైడూర్యాలు పొదిగిన కిరీటం- ప్రభావతి ఈ రాకుమారి అప్పుడు గున్నమామిడి చెట్టుకింద నిలబడి వుంది. చెట్టుపైనున్న కోకిల సన్నాయి రాగం విన్పిస్తోంది. మంగళ వాయిద్యాల్లా గుర్రపు డెక్కల చప్పుడు మారిపోయింది- విచిత్రం- ఇప్పుడు రాకుమారుడి చేతిలో కత్తిలేదు. పూలహారం వుంది. డాలు బదులు మంగళసూత్రాలు వున్నాయి. రాకుమారుడు దగ్గరికి వచ్చేశాడు.
    తను కళ్ళెత్తి పైకి చూసింది. మచ్చల పాములమీద పడ్డట్టు జడుసుకుంది. తనకు చేయి అందివ్వబోయిన రాకుమారుడ్ని పెద్ద డేగ తన్నుకుపోతోంది. తను పరుగెత్తాలి. కానీ ఇదేమిటి? తన కాళ్ళు కదలకుండా చుట్టూ త్రాచుపాములు- తను దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తోంది. తనను ఎవరో ఎత్తుకొచ్చి ఓ శిధిల భవనంలో గిరవాటేశారు. ఏమిటి మాయ? తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఏడీ నా రాజకుమారుడు?- ఏదీ.....ఎక్కడ....ఎక్కడ?.....
    ప్రభావతి నోరు కదులుతోందిగానీ, మాటలు బయటకు రావడం లేదు.
    అందుకే ఆమెలో వస్తున్న మార్పులను ఎవరూ గమనించలేకపోయారు.
    ఇంద్రాణి చెబుతోంది. "ఈ భాగోతం ఎంతసేపు? ఎంత మందిని చూడలేదు. ఇలాంటి వాళ్ళను మూడు రాత్రులు ముగుస్తూనే ఇద్దరికి మొహం మొత్తెయ్యదూ. దాంతో వాడి దారి వాడిది. దీని దారి దీనిది. కులంగాని వాడితో లేచిపోయి వూర్లోకి రాగలదా---- రాదు ఎక్కడో ఒళ్ళమ్ముకుని బతకాల్సిందే అలా అయిపోయి కొన్ని రోజులకు జబ్బులతో టపా కట్టేస్తుంది....."
    ఆమె అయిదారేళ్ళుగా మోదులాగా బతుకుతుండడంతో సివిక్ గా మారిపోయింది. ఎప్పుడూ ఆమె చీకటినే చూస్తుంది. వెలుగును ఆమె టెలిబరేట్ గానే గుర్తించదు. ఎదుటివాళ్ళు ఎవరూ సుఖంగాలేరని, వుండరనే ఆమె అనుకుంటుంది. దాన్నే ప్రచారం చేస్తుంది. అందుకే మంజుల జీవితం నాశనమై పోతుందని ఏ మాత్రం సంశయం లేకుండా చెబుతోంది. సివిసిజాన్ని ఆమె అలవరచుకుంది. లేకపోతే ఆమె తప్పుచేయకుండా వుండే వీలులేదు.
    "అలా అంటావేమిటి ఇంద్రాణీ? జీవితాంతం వుండేవాళ్ళు రూ" కాంతమ్మ అంది.
    "అ అదంతా మీ కాలంలో ఏమో, ఈ కాలంలో అంత నీతి నిజాయితీతో వుండేవాళ్ళు ఎవరున్నారు? ఎవరో నాలాంటిది గుణానికి వెరిసో, సంఘానికి భయపడో గుట్టుగా వుంటుంది. చాలామంది ఇవన్నీ పట్టించుకోరు. మొగుడు చచ్చిన మూడోవాడే పువ్వుల జడ వేసుకుణేవాళ్ళున్నారు. పోయింది మొగుడే కానీ మగవాడు కాదు కదా. అని తలచేవాళ్ళే ఎక్కువ. మంజుల నెంబర్ వన్ కిలాడీ అనుకో? నువ్వు చూసే వుంటావు అది వీధిలో నడిచేటప్పుడు- ఎన్ని వయ్యారాలు పోతుందని......"
    ఇంద్రాణి చెప్పుకుపోతూనే వుంది.
    ప్రభావతి కి ఇవేమీ వినిపించడం లేదు. రాకుమారుడ్ని డేగ ఎత్తుకు పోయిన దగ్గర ఆమె ఆలోచన ఆగిపోయింది. బాధ శరీరాన్ని లుంగలు చుట్టిస్తోంది. నరాలు పట్టుతప్పిపోతున్నాయి. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు జరజరా కిందకు పాకుతున్నాయి.
    ఆమె అలానే కిందకు వాలిపోయింది. ఫిట్స్ రావడంవల్ల కాళ్ళూ చేతులూ గిలగిలా కొట్టుకుంటోంది.
    టపటపా శబ్దం రావడంతో మొదట కాంతమ్మ అటు చూసింది. వెంటనే ఒక్క గెంతులో కూతురి దగ్గరకువచ్చి కాళ్ళూ చేతులూ పట్టుకుంది.
    "ఒరేయ్ ఆంజనేయులూ" బిగ్గరగా అరిచింది.
    ఆంజనేయులు ఉలిక్కిపడి లేచి ఇంట్లోకి పరుగెత్తాడు.
    లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు. గిలగిలా కొట్టుకుంటున్న ప్రభావతిని చూడగానే కడుపులో ఎవరో కరెంటు తీగలను పెట్టేసినట్టు విలవిల్లాడిపోయాడు.
    అటూ ఇటూ చూసి రెండు మూడు ఇనుప వస్తువులను ఆమె చేతుల్లోపెట్టాడు.
    ఇంద్రాణి మాత్రం ఆమెను పట్టించుకోలేదు. మంజుల లేచిపోయిన వుదంతాన్ని మరో ఇంటిలో చెప్పడానికి హడావుడిగా వెళ్ళింది.
    కొంతసేపటికి ప్రభావతికి ఫిట్స్ తగ్గాయి. మామూలుగా అయ్యింది. ఆమెను అలానే మంచంలో పడుకోబెట్టారు. కూతురికి ఏమైందో తెలియని కాంతమ్మ ఆమెను దిగాలుగా చూస్తూ విసనకర్రతో విసరడం మొదలుపెట్టింది.
    నాగరాజు, శారద ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు.
    ఆంజనేయులు తిరిగి బయటకొచ్చి మంచంలో పడుకున్నాడుగానీ పుస్తకం తెరవలేక పోయాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో  గజిబిజిగా కదులుతున్నాయి.
    ఏమైంది ప్రభావతికి ఫిట్స్ రావడం ప్రారంభించాయి. అంటే జబ్బు మరింత ముదిరిందన్నమాట. పెళ్ళికోసం తపించిన మనసు శిధిలమై జబ్బు రూపంలో రాలిపోతూ ఉందన్నమాట. మనసూ, శరీరమూ, రెండు వేరు కావు. ఆలోచించే అవయవమే మనసు. మనసుకూ, శరీరానికి మధ్య పెద్ద గోడ ఏమీ లేదు. ఆ రెండింటి మధ్యా కేవలం ఓలైట్ లైన్ వుంటుందంతే అని ఎప్పుడో చెప్పాడు వినయ్.
    కోర్కెలు తీరని ఇంద్రాణి శరీరం మనసును కోతిని చేసింది. అందుకే ఆమె మనసు వికారంగా గంతులేస్తోంది. ప్రభావతి అంతే ఇరవై ఎనిమిదేళ్ళ శరీరం ఏ అనుభవమూ లేక ఫిట్స్ రూపంలో తన ప్రొటెస్ట్ ను తెలియజేస్తుంది. ఇంతకాలం అర్ధంలేని భావచిత్రాలతో నలిగిపోయిన మనసు ఇప్పుడు మరింత చెడింది.
    మనిషి ప్రవర్తనమీద పరిసరాల ప్రభావం ఎంత ఎక్కువగా వుంటుందో వినయ్ ఓరోజు ఉదాహరణ తో సహా వివరించాడు.
    వాళ్ళ కాలనీలోకి ఓ కొత్త జంటవచ్చి దిగిందట. ఆరునెలల క్రితం ఆమె, అతడు చాలా అన్యోన్యంగా వుండేవాళ్ళు, బయట వీధిలోనైనా ఒకరికొకరు చాలాక్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళు ఇంట్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఎవరున్నా ఒకరిమీద ఒకరు పడడం. గిచ్చుకోవడాలు, గిల్లుకోవడాలూ, చేసేవాళ్ళట చాలా ఫ్రీగా ఒకరినొకరు తాకుతూ కూర్చొనేవాళ్ళట. ఆ భార్యభర్తల అనుబంధాన్ని గురించి కాలనీ అంతా  గొప్పగా చెప్పుకునేవాళ్ళు.
    ఇదీ వినయ్ కి తెలిసింది. జనరల్ గా భార్యభర్తలు ఇలా వుండరు. తమ శృంగారాన్ని ఇతరుల ముందు ప్రదర్శించడానికి ఒప్పుకోరు. ఇలా ఆలోచిస్తూవున్న వినయ్ కు వాళ్ళు ఎందుకంత క్లోజ్ గా వుంటారో స్ఫురించింది. తనకు తట్టిన కారణం నిజమోకాదో తేల్చుకోవడానికి వాళ్ళను గురించి బాగా తెలుసున్న కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. తనకు కావల్సిన సమాచారం రాబట్టాడు. కరెక్టే తను వూహించింది. ఆ దంపతులకు పెళ్ళి అయి ఆరేళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు కలగలేదు.