ప్రేమించండి ప్లీజ్


    "మరి మా వ్యాపారమే దానిమీద వస్తువెంత నాణ్యంగా వుంటే అంత బాగా అమ్ముడవుతుంది"
    ఏ వాస్తవంలోంచి అతను తప్పించుకోవాలని ఉబలాట పడుతున్నాడో ఆమె మాటలు దాన్నే గుర్తు చేస్తున్నాయి.
    కోరికతో కాలిపోయే వాడికి ఉపశమనం ఇవ్వగలదు ఆమె. ప్రేమ కోసం తపించేవారి దాహం ఎలా తీర్చాలో ఆమెకు తెలీదు. ఆ వృత్తి దాన్ని నేర్చలేదు ఆమెకు.
    "ఏ వూరు" అతను ముద్దుగా అడిగాడు.
    "స్వంత వూరు ఏదో తెలీదు. బుద్ది తెలిసినప్పట్నుంచి ఈ వూర్లోనే వున్నాను. రాజమండ్రి దగ్గర మన వూరని చెప్పేది అమ్మ అయినా ఎప్పుడూ వెళ్ళలేదు. ఏం వస్తుంది అక్కడ? ఇక్కడే పెరిగాను ఇక్కడే సెటిల్ అయిపోయాను"
    "మీ నాన్న"
    "నాలాంటి దానికి నాన్న వుండడు. వుండేది అమ్మే" అని ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఏడుపు బాధ కలిపి వుండడాన్ని అతను పసికట్టాడు ఆవిద్య అనుభవం వల్ల వచ్చింది అతనికి.
    తనకు నాన్న వున్నాడు. అమ్మలేదు. ఈమెకు అమ్మ వుంది నాన్నలేడు. తనలా ఈమె నాన్న కోసం వెంపర్లాడరా?
    "నాన్న ఎప్పుడయినా గుర్తుకొస్తాడా?" చాలా అమాయకంగా అడిగాడు.
    "అసలుంటే గదా గుర్తు రావటానికి మా అమ్మకే తెలీదు. ఎవరి వల్ల కడుపొచ్చిందో. అలాంటప్పుడు నాన్నని ఎవర్ని అనుకోగలను? అమ్మలోనే నాన్నను చూసుకుందేదాన్ని"
    బుజ్జికి ఆచిట్కా అయినా తెలుసు. మరి తనెందుకి నాన్నలో అమ్మను చూసుకోలేకపోయాడు?
    తప్పంతా నాన్నదేననిపించింది. తనను ఎప్పుడయినా దగ్గరకు తీసుకున్నాడా? మురిపెంగా ముద్దుల వర్షం కురిపించాడా? ఎప్పుడయినా తిన్నానా అని అడిగాడా? తనకు బుద్ది తెలిసినప్పటినుంచీ నాన్న తనను దగ్గరకు పిలవలేదు. కానీ నాన్నను అంత తీరికెక్కడిది? వయసులో వున్నప్పుడు గొడ్డు చాకిరీ చేసేవాడు. ఉదయం లేచి పొలంపని కెళితే ఎప్పుడో రాత్రి ఇంటికొచ్చేవాడు. వున్నది తిని పడుకొనేవాడు. అలిసి పోయిన శరీరం నిద్రను ఆశ్రయించేది తననే కాదు పిన్ని పిల్లల్ని కూడా నాన్న చేరనిచ్చేవాడు కాడు.
    "ఎవరినయినా ప్రేమించావా?"
    "ఆ ప్రశ్నకు ఉలిక్కిపడింది బుజ్జి.
    ఆమెకు వినపడిందో లేదోనని అతను మళ్ళీ అడిగాడు.
    "నీ కోసం ఈ ఒక్కదాని కోసమే పరితపించే వాళ్ళున్నారా? నీ సుఖమే తన సుఖమనుకొని ఏడిస్తే తనూ కన్నీళ్ళు కార్చే వ్యక్తి వున్నాడా?"
    "ఎందుకు లేరు? చాలా మంది వున్నారు. నన్ను ఆప్యాయంగా అక్కా అని పిలిచే ఈ అమ్మాయిలున్నారు. నా లంచం కోసం ఆశగా చూసే పోలీసులున్నారు. పెళ్ళాం విసుగనిపిస్తే మందు ఎక్కువయితే నన్ను వెదుక్కుంటూ వచ్చే ఎస్.ఐ వున్నాడు. 'నవ్వుతూ ఎగిరెగిరి పడుతోంది బుజ్జి.
    తన ప్రశ్నని ఆమె చాలా క్యాజువల్ గా తీసుకొందని అతను గ్రహించాడు. అదికాదు నేనడిగింది నీ ఆవేశాల్ని, నీ సుఖదుఃఖాలను నిండు మనసుతో పంచుకొనేందుకు ఎవరయినా వున్నారా అని?
    అతను సీరియస్ గా అడుగుతున్నట్టు తెలిసింది ఆమెకు. అలా అనుకోవడంతోనే ఆమెకూ ఎక్కడో ఓ మూల బాధ కలుక్కుమంది. కానీ దాన్ని ఎలా అధిగమించాలో తెలుసు.
    "ప్రేమ దోమ ఇలాంటి మాటలేం తెలియవు నాకు.