Taataadhitai Tadigibatom - 17

తాతా ధిత్తై తరిగిణతోం 17

జీడిగుంట రామచంద్రమూర్తి

"బైది బై!...నామటుకు నేను స్నేహాన్ని తప్ప ఈ సృష్టిలో దేన్నీ నమ్మను. అందుకే అంటాను. అసలు స్నేహమే చెయ్యకు చేస్తే దాన్ని ప్రాణస్నేహంగా తీర్చి దిద్దుకో అని. నువ్ 'అబ్జర్వ్' చేశావో లేదో నా బిడ్డకి, కాలేజీలో స్నేహితులెవరూ లేరు.

అది పుట్టి ఇన్నేళ్ళయినా ఇప్పటివరకూ ఇలా ఎవర్నీ తీసుకొచ్చి 'నా ఫ్రెండ్' అంటూ పరిచయం చెయ్యలేదు. 'దటీజ్ మై బేబీ' అశ్విని' గర్వంగా చెప్తున్న విష్ణుమూర్తి కళ్ళలో మెరుపు చూశాడు శ్రీరామ్. అశ్విని అప్సరకాంతలా తయారై 'ట్రే' లో 'ఆరెంజ్ జ్యూస్' గ్లాసుల్ని పెట్టుకుని వచ్చింది.

"కమాన్! హేవిట్ మా బేబి ఆరెంజ్ జ్యూస్ తయారు చేసిందంటే అది తాగిన వాళ్ళకి మరో పాతికేళ్ళ ఆయుర్ధాయం పెరుగుతుంది." అంటూ ఓ గ్లాసు శ్రీరామ్ కి అందించి తానో గ్లాసు తీసుకున్నాడు విష్ణుమూర్తి.

"నీ పేరు 'శ్రీరామ్' అని కదూ అన్నావ్?" కొన్ని క్షణాల తర్వాత జ్యూస్ 'సిప్ చేస్తూ' అడిగాడు.

"నేను అన్లేదండి. మీ అమ్మాయే నన్ను పరిచయం చేస్తూ చెప్పింది మీకు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు శ్రీరామ్.

"దట్స్ గుడ్! అలా జోక్స్ కట్ చేస్తూ 'లవ్లీ' గా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆ మాట కొస్తే నాకు శ్రీరాము డంటే కూడా ఇష్టమే. ఆదర్శపురుషుడు.

"ఈయన కూడా ఆదర్శ పురుషుడే డాడీ. తండ్రి మాటంటే వేదవాక్కు. నున్నగా గుండు చేయించుకుని, ఆపై ఖద్దరు టోపీ పెట్టుకుని వాళ్ళ ఊరి స్కూల్లో బంట్రోతు పని చెయ్యమని వాళ్ళ నాన్నగారు ఆజ్ఞాపిస్తే తూ.చ. తప్పకుండా మరుక్షణం పాటిస్తాడు.

" శ్రీరామ్ ణి ఆట పట్టించే ధోరణిలో చెప్పింది అశ్విని. సరిగ్గా శ్రీరామ్ ఆ క్షణాన అదే రూపంలో కనిపించిన భ్రమ కలిగింది విష్ణుమూర్తికి! పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. శ్రీరామ్ కి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టుగా వుంది. అయినా మర్యాద కోసం బలవంతంగా నవ్వు తెచ్చుకొనే ప్రయత్నం చేశాడు.

"కమాన్! మా ఇల్లు చూద్దువుగాని!" జ్యూస్ తాగటం పూర్తయ్యాక శ్రీరామ్ చేయి పట్టుకుని మేడమీదకు తీసుకెడుతూ అన్నాడు విష్ణుమూర్తి ముగ్గురూ ముందుగా బెడ్ రూమ్ లోకి వచ్చారు. ఆ గది చాలా ఖరీదుగా వుంది. నేలమీద బిస్కట్ కలర్ మెత్తటి తివాసీ పరిచివుంది. పందిరి మంచానికి పక్కగా గోడమీద పెద్ద పెయింటింగ్ వేళాడుతోంది. దానిమీద కిందభాగంలో ఓ 'కొటేషన్' రాసుంది.

"కెరటం నా ఆదర్శం లేచి పడినందుకు కాదు పడి లేచినందుకు!"

"ఎలావుంది?" చదివింతర్వాత అడిగాడు.

"మీ వాయిస్ చాలా బావుంది."

"వాయిస్ లాగే చాలా గంభీరంగా వుంది...పువ్వుకి తావి అబ్భినట్టుగా వుంది." చెప్పాడు శ్రీరామ్ గొప్పగా.

"థాంక్యూ అప్పుడప్పుడూ ఎవరైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఇలాంటి మంచి వాక్యాలు కనిపిస్తే వాటిని ప్రత్యేకంగా నోట్ బుక్ లో రాసుకుని ఇలా సద్వినియోగ పరుస్తుంటాను." గర్వం తొణికిసలాడే స్వరంతో చెప్పాడు విష్ణుమూర్తి.