Aahanagar Colony 21

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

21 వ భాగం

బబ్లూ తల్లిని ధైర్యంగా వెళ్ళిరా...అన్నట్టు చూశాడు. బాబ్లూని తాకట్టు పెట్టడం మొదటసారి. సేఠ్ చంపుతాలాల్ వీపు అదిరింది. అతనికి జరగబోయే డ్యామేజి ఏమిటో అర్థంకాలేదు. ఒరే సేఠూ నువ్వయిపోయావ్రా....

* * *

"ఏమండీ...." గట్టిగా అరిచింది లావాంబరి.

"వస్తున్నానే....చొక్కా వేసుకుంటున్నాను" అన్నాడు యూనిఫామ్ వేసుకుంటోన్న రామేశం.

"తొందరగా రండి....నాకు మూడ్ వచ్చేసింది" అంది బాత్రూంలో నుంచి.

వెంటనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ..." అబ్బ...వూర్కో లావూ...మిడ్ నైట్ కదా మూడొచ్చిందాన్నావు....నేను వెంటనే కమిటయ్యాను. బాత్రూంలో మళ్ళీ మూడ్ వచ్చిందంటున్నావు. సెక్స్ టాక్స్ వుందన్న విషయం మరిచిపోయావా?" అన్నాడు రామేశం.

"అబ్బ...మూడ్ అంటే' ఆ మూడ్' కాదండీ....కవిత్వం మూడ్ తొందరగా పెన్నూ, పేపరూ పట్టుకురండి" అంది.

"లావాంబరి" కి కవిత్వం పిచ్చి ఎక్కువ. ఏదో ఓరోజు తన కవితలు ఈ విశ్వప్రపంచాన్ని వూపేస్తాయని ఆమె ప్రగాఢ విశ్వాసం.

దానికి తోడు ఈ మధ్యే "బంకమన్ను" అనే కల్చరల్ సంస్థ లావాంబరి దగ్గరికి వచ్చి మీకు సన్మానం చేస్తామను వూరించారు. అందుగ్గానీ, కొంత డబ్బు ముట్టజెప్పాలని, ఓ మంచి కవిత రాయమని చెప్పారు. ఆ కవితకు స్టేజి మీద చదివించి, కవితారత్న, విశ్వ ప్రపంచ కవియిత్రి రత్న టైటిల్ కూడా ఇస్తామన్నారు.

దాంతో,...ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ కవిత్వం వచ్చేసింది. అంటూ మొగుడ్ని చంపుకుతింటుంది. రామేశం తలబాదుకొని పెన్నూ, పేపరూ, ప్యాడూ తీసుకువెళ్ళాడు.

బాత్రూంకి ఇటుపక్క నిలబడి "చెప్పు చావు" అన్నాడు.

"ఏమన్నారు? లోపల్నుంచి ఆనందంగా అడిగింది. "చెప్పిచావు" అని చచ్చా" అన్నాడు విసుగ్గా రామేశం.

" అవతల స్టేషన్ కు వెళ్ళాలి. "చెప్పిచావు అన్నారు మా వారు.

నేను చెప్పి చచ్చా....శ్రీ వారూ.... అని "ఎలా వుందండీ..." అని అడిగింది లావాంబరి బాత్రూం లోపలి నుంచి. తలని బాత్రూం డోర్ కేసి కొట్టుకొని "నా పిండాకూడులా ఉంది అన్నాడు. "ఆహా....నాతో సహవాస దోష ఫలితం....మీక్కూడా కవిత్వం వచ్చేస్తుంది.

"నా పిండాకూడు ....వేసాను మూకుడులో. నా లోలంగాకు లేదు బొందు....' "ఎలా వుందండీ..." అని అడిగింది లావాంబరి.

వెంటనే బెడ్ రూమ్ లో వున్న తన లాఠీ తెచ్చుకొని, తన తల బద్దలుకొట్టుకోవాలన్నంత ఇరిటేషన్ వచ్చింది. కానీ, ఏమీ చేయలేకపోయాడు. ఏవండీ...రాస్తున్నారా?" అడిగింది లావాంబరి.

"నీ తలకాయ....నా మెడకాయ....అరిస్తే పీక పిసుకుతా......దరిద్రమను....

దరిద్రమని..." అని పిచ్చిగా అరిచి, ప్యాడ్ కింద పారేసి, చక్కా బయటకు వెళ్ళిపోయాడు. తనలా అరిస్తే, లావాంబరి కామ్ అయిపోతుంది అని తెలుసు. అందుకే ఆ చిట్కా ప్రయోగించాడు.

"ఏంటో....ఈయనకు అప్పుడప్పుడూ ఇలా పిచ్చి కోపం వస్తుంది అనుకుంది లావాంబరి."

* * *

మేడమీద పచార్లు చేస్తోంది నమ్రత. అలా పచార్లు చేస్తోన్న ఆమె దృష్టి మేడపైన తాడు పట్టుకొని ఎగబాకుతున్న ఓ శాల్తి మీద పడింది.

"ఎవరీ శాల్తీ.....మేడ మీద పోర్షన్ లోకి వచ్చిన కొత్త వ్యక్తా? అనుకుంది నమ్రత. కిందికి తొంగి చూసింది మొహం కనిపించడం లేదు. అతి కష్టం మీద తాడు సాయంతో పైకి వస్తున్నాడు. వాహ్ జేమ్స్ బాండ్, కళల రాకుమారుడు ప్లస్ గ్రీకువీరుడూ ఈజీక్వల్టు ఈ శాల్తీ అనుకుంది. వెంటనే ఈ సన్నివేశాన్ని క్లిక్ చేస్తే ఎలా ఉంటుంది.?

ఈ ఆలోచన రావడంతోనే నమ్రత గబగబా తన గదిలోకి వెళ్లి కెమెరా తీసుకొని మేడపైకి వచ్చింది. ప్లాష్ బటన్ ఆన్ చేసి, లెన్స్ అడ్జస్ట్ చేసి "హలో మిస్....మీకేమైనా స్క్రూ లూజా? అన్నాడు. "మీరు కొత్తగా దిగిన టెనెంటా?" అంది నమ్రత.

ఔను. మరి తమరెవరో? ఈ ఇంటికి మీని ఓనర్ ని అంది. సడన్ గా ఇంటి ఓనర్ కండిషన్ గుర్తొచ్చింది. అప్పుడే నమ్మీ...మేడ మీద ఎవరితో మాట్లాడుతున్నావు? అన్న చారుమతి మాటలూ, అడుగులూ వినిపించాయి.

అయిపొయింది తన పని అనుకున్నాడు సాకేత్. ప్లాష్ లా ఓ ఐడియా వచ్చి రాగానే నీట్ గా దువ్వుకున్న క్రాఫ్ ని చెరిపేసుకున్నాడు. చొక్కా చింపుకొని, ఫ్యాంట్ పైకి మడిచాడు. నమ్రత బిత్తరపోయి ఆ సన్నివేశాన్ని చూస్తోంది. సరిగ్గా అప్పుడే చారుమతి వచ్చేసింది. వస్తూనే సాకేత్ వంక అనుమానంగా చూసింది.

"నువ్వేమిటి....ఇప్పుడు ఇలా....ఈ అవతారమేమిటి? ఎవరతోనైనా గొడవపది వచ్చావా? కొంపదీసి మా అమ్మాయి..." అని కూతురి వంక పరిశీలనగా చూసింది.

తల బాదుకొని అంది నమ్రత....అమ్మా....నీకు పిచ్చి రాన్రాను ముదురుతోంది. అతనికి లేని ఐడియాలు ఇచ్చేలా వున్నావు.అతను నన్నేమీ చేయలేదు. ఆ మాటకు వస్తే అతనో బుద్ధావతారం. ముద్దపప్పు....పప్పుముద్ద..." కసిగా అతనివైపు చూసి అంది నమ్రత. ఏ కళనుందో గానీ నమ్మీ.....నువ్వు పద...అయినా పైకి రావద్దని నీకు చెప్పానా? లేదా? అంది కూతుర్ని కిందికి తీసుకెళ్తూ....