Aanagar Colony 2

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

2 వ భాగం

జనవరి నెల కావడం వల్ల ఇంకా పొగమంచు విడిపోలేదు. రిక్షా వాళ్ళు అంత చలిలోనూ కాళ్ళు బార్ల చాపుకొని, ఆకాశం వంక చూస్తున్నారు.

"ఇదేంటి చెప్మా....వాళ్ళకు చలి వేయడం లేదేంటా?" అని సరిపెట్టుకున్నాడు.

ఆ వాతావరణం ఆహ్లాదంగా వుంది. చేతులు రెండు జేబుల్లో పెట్టుకున్నాడు. బ్లాక్ కలర్ జీన్స్ మీద ఎల్లో కలర్ డిజైన్స్ తో వున్న టీషర్ట్ వేసుకున్నాడు సాకేత్. ఇరవై అయిదేళ్ళ సాకేత్ ఎత్తుకు తగ్గ లావుతో చూడ్డానికి హీరోలా ఉన్నాడు. రిక్షా స్టాండు దగ్గరికి వెళ్ళాడు.

"ఏయ్ రిక్షా కాదు. హమ్ అప్ కే హై కౌన్ రిక్షా" అన్నాడు రిక్షా వాలా గుర్రుగా సాకేత్ వంకచూస్తూ.

"అదేంటి...ఏదో మాట వరుసకి ఏయ్ రిక్షా అన్నాను"

"మీరు మాట వరుసకి అన్నా పాట వరుసకు అన్నా, నా రిక్షా పేరు హమ్ అప్ కే హై కౌన్.

"అదేం పేరు?"

"ఆ సినిమా రిలీజైనప్పుడు కొన్న రిక్షా....అదిగో అపక్కనున్న రిక్షా "దిల్ వాలే దుల్హానియా లేజాయింగే," రిక్షా...ఇటు పక్కకు వున్న రిక్షా " డర్"....ఆ పక్కనున్న రిక్షా.....పేరు "షోలే" అతను హిందీ సినిమాల పేర్లు, ఏఏయ్ రిక్షాలకు వున్నాయో చెప్పుకుపోతున్నాడు. తెలుగు రిక్షాల్లేవా? అడిగాడు కాసింత హాశ్చర్యాన్ని మొహంలోకి ట్రాన్స్ ఫర్ చేసుకొని.

"తెలుగు రిక్షాలు కావాలా?" ఎదురుగా వున్న స్టాండు దగ్గరికి వెళ్ళు.

"బావగారూ.... బాగున్నారా...." "ప్రేమించుకుందాం రా...", "నిన్నే పెళ్ళాడతా" ఖైదీ ఇన్ స్పెక్టర్" బోల్డు రిక్షాలున్నాయి." చెప్పి సాకేత్ వైపు చూసి "ఇన్ఫర్మేషన్ బాగా చెప్పానా?" అని అడిగాడు.

"థ్యాంక్యూ రిక్షాబాబు...ఒక్క చిన్న ప్రశ్నకు.... ఎంత పెద్ద జవాబు చెప్పావు" అన్నాడు కళ్ళొత్తుకుంటూ సాకేత్.

"మీ సంతృప్తియే మా ధ్యేయం...ఓ ఫైవ్ ఇప్పించేయండి" అన్నాడు అతను.

"ఫై వెందుకు?"

"ఇందాక రిక్షాల ఇంఫర్మేషన్ చెప్పినందుకు"

"మాట సాయానికి డబ్బా."

"హలో....నా పేరు మల్లికార్జున రావండీ. మా ఇంటి పేరు వెర్రి మా లోకం కాదు....నా గొంతు నొప్పెట్టేలా ఇందాక మీకు పుల్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కదండీ... అదే టైంలో, నా కాళ్ళు నొప్పెట్టేలా రిక్షా తొక్కినా అంత డబ్బు వస్తాది."

"ఆశ్చర్యంలో నుంచి తేరుకొని బలవంతాన ఓ వెర్రి నవ్వు నవ్వి జేబులోనుంచి అయిదు రూపాయలు తీసి అతడికి ఇచ్చాడు. వెంటనే ఏర్ బ్యాగ్ లో నుండి ఓ డైరి తీసుకొని ఈ విషయాన్ని అందులో నోట్ చేసుకున్నాడు.

"హలో...బావగారూ....బాగున్నారా....ఆహానగర్ కాలనీ వస్తారా?"

"నా రిక్షా పేరు మాస్టర్. బావగారు బాగున్నారా....ఆ పక్కనుండి" చెప్పి ముసుగుతన్నాడు రిక్షావాలా.

"పోనీ పాతాళభైరవి రిక్షా ఎక్కడుందో చెబుతారా."

"చూపుడు వేలితో చూపించి...మళ్ళీ ముసుగుతన్నాడు. ఆ రిక్షావాలా. శిధిలావస్థలో వున్న రిక్షా అది. అచ్చు పాతాళభైరవిలో అంజిగాడి గెటప్ లో వున్నాడా రిక్షాశాల్తీ. యాభై యేళ్ళు వుంటాయేమో...గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళి. "ఆహానగర్ వస్తావా?" అని అడిగాడు.

ఆ శాల్తీ లేచి సీటు దులిపి... "రాను....ఎక్కండి" అన్నాడు.

బిత్తరపోయాడు సాకేత్.

"రాను...ఎక్కండి" అంటాడేంటి? అని "రాను ఎక్కండి" ఈసారి గట్టిగానే అన్నాడా శాల్తీ.

"నువ్వు రానంటే నేనెలా ఎక్కేదయ్యా" ఏడుపు గొంతుతో అన్నాడు సాకేత్.

"రామ....ఎక్కండి అంటే అలా నిలబడిపోతారేంటి?" రిక్షావాడి గొంతులో అసహనం.

ఏర్ బ్యాగ్ తో ఆ రిక్షావాడి మొహం ఆవకాయపచ్చడి చేయాలన్న కోరికను బలవంతంగా అణుచుకొని .... "అంటే అన్నా అంటావు గానీ...నువ్వు రాను అని అన్నాక రిక్షా ఎలా ఎక్కాలయ్యా పాతాళభైరవి కీచుగొంతుతో అడిగాడు సాకేత్.

"ఈ కాలనీ కొత్తలా వున్నావు" అంటూ మల్లికార్జునరావు అక్కడికి వచ్చి.... "ఇక్కడ రాను అంటే వస్తానని అర్థం" చెప్పాడు.

ఇంకా ఏదో డౌట్ అడగాలని అనుకున్నాడు. కానీ, అందుకు కూడా ఎక్కువ డబ్బులు అడుగుతాడేమోనని భయపడి కామ్ గా రిక్షా ఎక్కాడు. రిక్షా ఆహానగర్ కాలనీకి ప్రవేశించింది.

ఇంకావుంది