Rampandu Kshatagatrulu

రాంపండూ - క్షతగాత్రులూ

“ అచలపతీ! నీకు మరొక్క అవకాశం ఇస్తున్నాను. ఆ బొమ్మకేసి నిదానంగా చూసి నీ అభిప్రాయం మార్చుకో. తక్కిన విషయాలలో నువ్వు ఫరువాలేదనుకో.కానీ ఆర్ట్ విషయంలో నీ పురాతన భావాలు పక్కన పెట్టి దాని మీద ప్రెష్ లుక్ వేయి.”

హితువు చెప్తున్నది అనంత్.అచలపతి అభిప్రాయం మార్చుకోవలసినది రుక్మిణి గీసిన అనంత్ పెయింటింగ్ మీద.సుమనోహరి పుస్తకం గొడవ లేకపోతే రుక్మిణికి అనంత్ బొమ్మ వేసే అవకాశమే రాకపోవును!

పబ్లిషర్ దొరకడంతో సుమనోహరి పుస్తకం కాస్త ముందంజ వేసింది.ఆ పుస్తకం కవరు పేజీ వేయమని తన ప్రెండు రుక్మిణిని అడిగింది సుమనోహరి.ఆ సందర్భంలోనే ఈమెను రాంపండుకి (అనంత్ కి కూడా) పరిచయం చేసింది. అప్పటిదాకా ఏ కళాకారుడు (కళాకారిణి అయితే సమస్యే లేదు) అనంత్ ను చూసి బొమ్మ వేయడానికి ముచ్చట పడలేదు.కానీ రుక్మిణి పడింది. ఆ ముచ్చట చూసి అనంత్ ముచ్చట పడ్డాడు.

పది రోజుల శ్రమ తర్వాత ఆమె వేసిచ్చిన ఆయిలు పెయింటింగ్ చూసి మరీ ముచ్చట పడ్డాడు. కానీ అది అచలపతి అభిశంసనకు గురయ్యింది.ఆ బొమ్మలో ఉన్నవి 'ఆకలి చూపుల'ని అన్నాడతను.

అనుకోకుండా ఎముక కలలోకి వచ్చిన కుక్క చూపులతో వాటిని పోల్చవచ్చని కూడా అన్నాడు. దాన్ని ఫ్రేము కట్టించి మెయిన్ హాల్లో పెట్టి అనంత్ ప్రయత్నాలను సున్నితంగానే ప్రతిఘటిస్తున్నాడు. తన ఆలోచనలను పునర్విమర్శ చేసుకోవాలని ఇప్పుడు అనంత్ మళ్ళీ విజ్ఞప్తి చేసినా అది వ్యర్థమయినట్టే ఉంది.

ఐదు నిమిషాల దీర్ఘాలోచన తరువాత ఆచలపతి తల విదిలించాడు. తన సహచరుడికి అనంత్ ఇంకో అవకాశం ఇవ్వదలిచేడు.

“చూడు, నేను క్లబ్బుకి వెళ్లి ఓ గంట తరువాత తిరిగి వస్తాను.ఈలోపున బాగా ఆలోచించుకుని, నేనన్నదానికి సరేనను.” అని బయటకు వెళ్ళిపోయేడు.

గంట తరువాత తిరిగి వచ్చాక ఆ పెయింటింగు గురించి అనంత్ అడిగే లోపునే అచలపతి చల్లగా ఓ బాంబు పేల్చాడు.

“రాంపండు గారు వచ్చి వెళ్లారు సర్" రాంపండు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక ముప్పును వెంటబెట్టుకు రావడం అనంత్ కి అనుభవానికి వచ్చిన సత్యం. అందువల్ల కాస్త బెదురుతూనే అడిగాడు.

“మళ్ళీ వస్తానన్నాడా ? ”

"అడగలేదండి.సమాధానం చెప్పే మూడ్ లో లేరండి,”

“ఏం పాపం ?”

“ఏక్సిడెంట్ వల్ల చాలా డిస్టర్బ్ అయినట్టు కనబడ్డారు సర్ "

“అయ్యో ! ఏక్సిడెంటా ? దెబ్బలు తగిలాయా ?”

“కొద్దిగా తగిలాయి సర్. ఆయనకు కాదు. ఆయన తెచ్చినాయనకి !”

“ఆయనెవడు ? ఎక్కడున్నాడు ?”

“ మీ బెడ్ రూమ్ లో సర్ "

అనంత్ వెంటనే అక్కడికి పరిగెట్టాడు.

అక్కడ ఓ ఆజానుబాహువు, గిరిజాల జుత్తువాడు, అందగాడు, అనంత్ పక్క మీద పవ్వళించి వున్నాడు. సినిమా హిరో స్టయిల్ లో, నుదిటికి ఈశాన్యమాల ఓ చిన్న ప్లస్ మార్కు పట్టీ ఉంది. కుడి చేత్తో ఓ ఆపిల్ పండు కొరుక్కు తింటూ ఎడమ చేతిలో ఓ డిటెక్టివ్ పుస్తకం పట్టుకుని చదువుతున్నాడు. అన్నిటికంటే ఘోరం, అతనూ అనంత్ పైజమా, షర్టు వేసుకుని ఉన్నాడు.అనంత్ అడుగుల చప్పుడు వింటూనే తలెత్తి చూసి పలకరించాడు.

“హాయ్!అనంత్ ! ఈ పరుపేమిటి ? ఇలాంటిది కొన్నావ్.?

అనంత్ పళ్ళు పటపటలాడించేడు.

“తమరు" అన్నాడు వెటకారం ధ్వనిస్తూ.

“ఫల్గుణ్ ! మీ పనివాడు చెప్పలేదా ?వట్టి చవటలా ఉన్నాడే.ఈ పాటికి నా గురించి నా అనారోగ్యం గురించి అంతా చెప్పే వుంటాడనుకొన్నానే!” కోపాన్ని అణుచుకుంటూ అనంత్ అడిగాడు.

“తమరి అనారోగ్యం అంటే...ఆ పట్టీయేనా ?” అని

“హారినీ !డాక్టరు వచ్చి కనీసం వారం రోజులయినా ఇక్కడ,ఇలాగే కాలు కదపకుండా పడి వుండాలని చెప్పిన విషయం మీ వాడు చెప్పలేదా ? బట్, లెట్మీ టేల్యూ. ఈ పరువు మార్చకపోతే వారం రోజుల పాటు ఇలా వుండడం నా తరం కాదు.”

“వారం రోజులా ! అదీ నా పక్క మీద! ”

“అంత గట్టిగా అరవకు అనంత్ ! బాగా రెస్ట్ తీసుకొమని మరీ మరీ చెప్పాడు డాక్టరు. పైగా ఈ డిటెక్టివ్ నవల చదువుతూ అసలే టెన్షన్ లో ఉన్నాను. నువ్విలా అరిచి హడలగొడితే నా గుండేకేమైనా కావచ్చు. సరే, సరే నీతో ఈ డిస్కషన్ పెట్టుకునేంత టైము నాకు లేదు.వ్యవహారాలు చప్పున తెమల్చుకుని నువ్వు బయటకు వెళితే నేను కాసేపు కునుకు తీస్తాను "

“ ఎవడా చెప్పిన డాక్టరు.? పైగా నీతో నాకు వ్యవహారాలేమిటి ?” అంటూ అనంత్ మళ్ళీ అరిచాడు.

“వ్యవహారం ఏమిటేమిటి ? ఈ ఏక్సిడెంట్ గురించి మనమో అండర్ స్టాండింగ్ కి రావాలి.లేకపోతే మా అక్క దగ్గర పేచీ వస్తుంది.”

“ మీ అక్కెవరు?”

“ దుర్గక్క. దుర్గా సూప్స్ ప్రొప్రయిటర్ కుచేరరావు లేడూ. అతని భార్య. నేనంటే పడి చస్తుంది.”

“అదేం పాపం? నువ్వొక్కడివే తమ్ముడివా"?

“కాదు మేం అరడజను మంది ఉన్నాం. అందరిలోకీ చిన్నవాణ్ణి నేను. పైగా పెళ్ళికాలేదు అందుకని ".

“అయితే నాకేమిటి ?” ఫల్గుణ్ తెల్లబోయి చూశాడు.తర్వాత అర్థం చేసుకున్నట్టు చిరునవ్వు నవ్వాడు.

“నిన్ను మందబుద్ధి అని అందరూ ఎందుకంటారో నాకు ఇప్పుడు తెలిసింది.నేను విపులంగా చెప్తాను విను. మా అక్క నా మీద ఈగ వాలినా సహించలేదు. మరి కారు వాలితే సహించగలదా ? లేదు. నాకీ ఏక్సిడెంట్ చేసిన వాణ్ణి కోర్టు కీడ్చి నానా రభసా చేస్తుంది.”

“అవును చేస్తుంది.”

“ చేస్తుంది కదా! మరి దాని వల్ల నష్టపోయేది ఎవరు ?సుమనోహరి - అందాల సుమనోహరి" కథ ఎటుపోతుందో అనంత్ కు అర్థం కాలేదు.

“దీన్లో సుమనోహరి ఎక్కణ్ణించి వచ్చింది.”?

“వాళ్ళింటి నుంచి! రుక్మిణి వేసిన అనంత్ బొమ్మ చూపిస్తా రా ' అంటూ మీ ఇంటికి రమ్మనమంది. నేను మీ ఇంటికి వస్తుండగానే మలుపుల్లో కార్లో వచ్చి గుద్దేశింది

.” ఓహో , సుమనోహరి లేనిదే ఏ ట్రాజెడీ ఉండదు కదా అనుకుని అనంత్ నిట్టూర్చి

"మరి రాంపండు ఎక్కణ్ణుంచి వచ్చాడు.?

“ సుమనోహరితో బాటు ఆ కారులోనే ఉన్నాడు కదా వేరే ఎక్కణ్ణుంచో రావడం ఎందుకు ?”

“ఓహో ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వచ్చి నీ మీద కారేక్కించేశారన్నమాట "

“కబుర్లు చెబుతూ కాదు. కాలు మూసుకుని కూడా కారెలా డ్రైవ్ చేయవచ్చో సుమనోహరి డిమాన్ స్ట్రేట్ చేస్తుండగా".

"ఇక నాకు అర్థమయ్యింది.సుమనోహరికి డ్రైవింగ్ లైసెన్సు లేదు కాబట్టి, రాంపండు త్యాగం చేసి ఆ యాక్సిడెంటు నేరాన్ని తన నెత్తి మీదా వేసుకుని,ఆ బాదితుడి భారాన్ని నా నెత్తి మీద పడేసి పోయాడు. అంతేనా ?

“దాదాపు అంతే ఓ చిన్న అదనపు సమాచారం. ఆ త్యాగాన్ని చేయమని రాంపండుని ప్రోత్సహించినది సుమనోహరే. క్షణాల మీద అంత చక్కటి ఆలోచన చేసిన సుమనోహరి మా దుర్గక్క కారణంగా చిక్కుల్లో పడుతుందంటే నేను సహించలేను.”

“పోనీ రాంపండు చేశాడంటే...” 'అప్పుడు సుమనోహరికి రుచించక పోవచ్చు. ఎందుకొచ్చిన గొడవ. ఆ విషయం ప్రస్తావించకుండా ఊరుకుంటే పోయే. మనం ఒక పెద్ద మనుష్యుల ఒప్పందానికి వద్దాం.ఫోన్ చేశా.అక్క వచ్చి అడిగినా అంతా గప్ చిప్....ఓ.కే.”

“అసలు ఆవిడకు తెలియాల్సిన అవసరం ఏముంది ?” అనంత్ కి అనుమానం వచ్చింది.

“ తెలియపరచకపోతే నన్ను తిడుతుంది. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది.

నాకేవరైనా హాని తలపెడితే ఆడపులిలా తిరగబడి చంపేస్తుంది. అందుకని నన్ను గుద్దేసినా కారు నెంబరు చూడలేదని చెప్తానులే.ఓకే అనంత్ ! లీవ్ మీ నౌ. డాక్టరు రెస్టు తీసుకోమన్నాడు.పైగా ఈ డిటెక్టివ్ పుస్తకంలో విలన్ మన హీరోయిన్ బెడ్ రూమ్ వెంటి లేటర్లోంచి ఓ పాముని లోపలికి పడేశాడు.నేను తక్షణం దాని సంగతి చూడాలి.నాకేదైనా అవసరం వస్తే పిలుస్తానులే. ఇక వెళ్ళు.” అని పుస్తకంలో మునిగిపోయాడు.

అనంత్ బయటికి వస్తూనే "ఆచలపతీ తల పగిలిపోతుంది. కాస్త నిమరసం తీసియ్యి. ఈ ఫల్గుణ్ గాడి పురమాయింపులు భరించేలేను.వెళ్లి క్లబ్బులో కూచుని పేకాడుకుంటాను. నన్ను వీదిపాలు చేసినందుకు రాంపండు గాడికో చిన్న కోటింగు ఇవ్వాలి.హోటల్ కి వచ్చి కలవమను " అన్నాడు.

రాంపండు అనంత్ కంట పడటానికి రెండు గంటలు పట్టింది.ఈ లోపున క్లబ్బులో చక్కటి భోజనం అమిరింది. రాంపండు కనబడగానే నమిలి మింగేద్దామన్న కోపం, అతను కంటబడగానే కాస్త కరిగింది.తుఫాను దెబ్బ తిన్నా ప్రభుత్వ సాయం అందని రైతులా ఉన్నాడు రాంపండు. ఏమయిందన్నాడు అనంత్. 'సుమనోహరితో నా ప్రేమ ఫలించలేదేమోరా ' అని బావురుమన్నాడు రాంపండు.

“ఏం ?” “ఏమేమిటి? అక్కడ ఫల్గుణం గాడు అలా మంచం మీద పడివుంటే నాకేసి ఏం చూస్తుందిరా ?

ఆడవాళ్ళ కసలే జాలిగుండె. తన చేతుల్తో క్షతగాత్రుడిని చేసిన వాడు పాలి పోయిన మొహం వేసుకుని,రెండు దిళ్ళు ఆసరాగా అమర్చుకుని, పళ్ళ రసం తీసే గాజు పళ్ళాన్ని పక్కన స్టూలు మీద పెట్టుకుని మంచి ఇంట్రస్టింగ్ గా కనబడుతుంటే నాకేసి కన్నెత్తి చూస్తుందా ? గదిలోకి వెళ్లి వాణ్ణి చూసి, గుండె కరిగి, వాడి కాళ్ళోత్తి త్యాగమూర్తిగా, సతీ సుమనోహరిగా చరిత్ర కేక్కేద్దామని నిశ్చయించుకుని గది బయటకు వస్తుంది.బయట ఉన్నదెవరు ? ఆపిల్ పండు ఏడ్ లో మోడల్ లా కనబడే రాంపండు. ఒళ్ళు మండదూ ?అసలు ఇంతంత ఆరోగ్యాలతో మనుష్యులు ఎలా ఉంటారు బాబూ అని చికాకు పడుతుంది కూడా "

“పోనీ నువ్వు కూడా ఏదైనా జలుబూ,రొంపా.....”

“లాభం లేదురా. వాడు కాలు విరిగిన కేసు. సింపతీ ఫ్యాక్టరంతా పోగేసుకుని కూచున్నాడు.అందునా వాడు మహా గొప్ప యాక్టరులే.అయిపొయింది.నా పని అయిపొయింది.” అంటూ రాంపండు తల పట్టుకుని కూచున్నాడు.

అంతలోనే అనంత్ కి తలలో బల్బు వెలిగింది.

“ఒరేయ్ రాంపండూ,కంగారు పడకు.నువ్వు చెప్పేది జనరల్ గా కరెక్టే కానీ అన్ని విషయాలలోను అలా ఉండాలని లేదు.కాలు విరక్కొట్టుకున్న ప్రతీ మగాడ్ని ఆడది ప్రేమించాలని లేదు. చూడగానే అయ్యోపాపం అనిపించినా, రెండు సార్లు కాళ్ళు ఒత్తి,మూడుసార్లు టెంపరేచర్ తీసేసరికి ఉత్సాహం చల్లబడుతుంది. రాత్రులు మేలుకుని, మంచం కోడు మీద తల పెట్టుకుని కునికిపాట్లు పడుతున్నప్పుడు హఠత్తుగా అనిపిస్తుంది.రోడ్డు మీద సవ్యంగా నడవడం కూడా రాణి వాణ్ణి కట్టుకుని జీవితాంతం ఏం సుఖపడతాను అని, కారు మీదకు వస్తుంటే ఓ గెంతు గెంతి తప్పించుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేనివాడు తమకు పుట్టబోయే పిల్లల్ని స్కూలుకి సరిగ్గా తీసుకెళ్ళగలడా ?అని పళ్ళరసం తీస్తూ దీర్ఘాలోచనలో పడుతుంది.”

“....అంతేకాదు,ఇలా చీటికిమాటికి కాలు విరక్కొట్టుకునేవాడిని పెళ్లి చేసుకుని శేష జీవితాన్ని హాస్పటల్ కీ, పళ్ళ మార్కెట్ కీ మధ్య రౌండ్సు కొడుతూ గడపాలా అని కూడా ఆలోచిస్తుంది.అంతకంటే హాయిగా గుమ్మడిపండులాంటి రాంపండుని కట్టుకుంటే తనే మంచం ఎక్కవలసి వచ్చినా ఫర్వాలేదు కదాని ధైర్యం తెచ్చుకుంటుంది.” అంటూ అందించాడు రాంపండు.

“కరెక్టు. ముఖ్యంగా సుమనోహరి వంటి ప్రాక్టికల్ మనిషి ఇలాంటి త్యాగమూర్తి వేషాలు వేయదు"

“అంటే, త్యాగమూర్తులంటే గౌరవడం కూడా లేదంటావా ?ఎదుటివాళ్ళు తన కోసం త్యాగం చేస్తున్నారన్నా బోనస్ మార్కులు వేయదంటవా ?” “ఖచ్చితంగా! ఇలాంటి సెంటిమెంటల్ పూల్ ని కట్టుకునిసుఖపదలేననుకుంటుంది. కూడా "

" థాంక్స్ రా. చాలా గొప్ప విషయం చెప్పి నా కళ్ళు తెరిపించావ్.”అని రాంపండు పరిగేట్టుకుని వెళ్ళిపోయాడు.

అప్పుడు కూడా అనంత్ కి తన గొయ్యి తనే తవ్వుకుంటున్నట్టు అనుమానం రాలేదు.

***

ఇంకో గంట పోయాక అనంత్ ఇల్లు చేరేసరికి ఫల్గుణుడి అక్క దుర్గగారు వచ్చి కాసేపు కథాకేళి చేసి వెళ్ళిందని, అనంత్ ని ఎలాగైనా చూడాలని తహతహలాడిందని అచలపతి చెప్పాడు

. “థ్యాంక్స్ చెప్పడానికా ?” అని అడిగేడు అనంత్.

“ఆవిడ ఉపయోగించిన భాష చూస్తే అలా అనిపించలేదు సర్ "అన్నాడు అచలపతి.

ఈ డిప్లమాటిక్ భాషను డీకోడ్ చేసుకునే ఓపిక లేక "ఇంతకీ మన క్షతగాత్రుడు బతికున్నాడా ?” అన్నాడు విసుగ్గా,

. “ఐదు నిమిషాల క్రితమే బెల్లు కొట్టి పిలిచి 'ఈ కొంపలో ఇంతకంటే మంచి బ్రాండ్ సిగరెట్టు లేదా ?' అని అడిగేరండి.” అనంత్ కి ఒళ్ళు మండిపోయింది.

చర చర తన బెడ్ రూమ్ లోకి దూసుకుని వెళ్లాడు.పేషంటు గారు సిగరెట్టు ఊదుతూ, డిటెక్టివ్ పుస్తకం చదివేస్తున్నాడు.అనంత్ ను చూస్తూనే

"రా,రా...అనంత్.వెల్ కమ్ హోమ్. హీరోయిన్ గదిలో విలన్ తాచుపాము పడేసడని నేను చెప్పినప్పటి నుండి పాపం నువ్వు వర్రి అవుతున్నావేమో , నో ప్రాబ్లమ్.ఇది ముందుగానే ఊహించి హీరో ఆ పాము కోరలు పీకేసాడు.” అని ఏదో చెప్పబోయాడు.

“ డోంట్ బాదర్ ఏ భౌట్ తాచుపాములూ, నాచుపాములూ....” అని విసుక్కున్నాడు అనంత్. ఫల్గుణుడు మందలించాడు.

“తాచుపాముల్ని అంత తేలిగ్గా తీసిపారేయకు. హిరో కోరలు తీసేసేడు కాబట్టి సరిపోయింది.లేకపోతే పాపం హీరోయిన్ ఈ పాటికి ఎక్కడుండేదో.అన్నట్టు దుర్గక్క వచ్చింది. నీతో మాట్లాడాలంది.

నువెక్కడికి పోయావ్ ? పాపం చాలాసేవు వెయిట్ చేసింది.”

“నాతో ఆవిడకు మాట్లాడాల్సిన విషయాలేమున్నాయి " అయోమయంగా అడిగేడు అనంత్.

“ఉందిలే.కాస్సేపటి క్రితమే రాంపండు వచ్చాడు.ఇద్దరం కలిసి మా దుర్గక్క వస్తే, ఎలా చెప్పాలా అన్న విషయం రిహాల్స్ చేస్తూ ఉంటే ఒక విషయం తట్టింది. నీకు గుర్తుందా? యాక్సిడెంట్ ఎవరు చేశారో అక్కకి చెప్పకుండా ఎవరో నన్ను గుద్ది వెళ్లిపోయారని చెప్దామనుకున్నాం కదా. కానీ మీ ఇంట్లో భోంచేసి ఈ మంచం మీదా పడుకుని వాసాలు లెక్క పెడుతూ వుంటే, నాకు హఠత్తుగా తోచింది. ఇలా చెప్పితే అక్క నమ్మదని, మరి దాని గురించి ఏం చేద్దామని అనుకుంటూంటే రాంపండు ఒక ఐడియా ఇచ్చాడు.ఈ యాక్సిడెంట్ నువ్వు చేశావని చెబితే సరిగ్గా అతుకుతుందని. నిజమే కదా, నువ్వు యాక్సిడెంట్ చేశావు కాబట్టే నీ ఇంట్లో పెట్టుకుని సేవలు చేస్తున్నావని చెబితే ఎవరైనా నవ్వుతారు.”

“హారి రాంపండూ !” అనుకుని అనంత్ నిర్ఘాంతపోయాడు

. “మరి సుమనోహరి నేరాన్ని తన నెత్తి మీద వేసుకుని త్యాగమూర్తిలా ఆమె దగ్గర ఫోజు కొట్టి...”

“అబ్బే, ఆ త్యాగాల వేషాలకు గిరాకీ లేదు.పొమ్మన్నాడు రాంపండు. నువ్వని చెప్పీయమన్నాడు. నేను చెప్పేశాను. కానీ దుర్గక్క ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేక పోయింది.తన తమ్ముణ్ని అవిటివాడిని చేసిన ఆ దుష్టున్ని పట్టుకుని....అదేమిటి అనంత్, అలా పళ్ళు కోరుకుంటున్నావ్. అది చాలా బ్యాడ్ హేబిట్.నాకు చిన్నప్పుడు ఆ అలవాటు ఉంటే లెక్కల మేష్టారు చెప్పి మాన్పించాడు. నీకు లెక్కల సబ్జక్ట్ ఉండేది కాదా....!

“నాకు తెలిసి నీకు కాలు బెణకడం తప్ప ఏ రోగమూ లేదు. ఆ మాత్రానికి అవిటితనమూ, దానికో అక్కగారి సింపతీనూ....” పళ్ళ మధ్య నుండే మాట్లాడాడు అనంత్. “

ఏమో బాబూ, మా అక్క సంగతి ముందే చెప్పాను. చాలా కోపిష్టి.రేపు మళ్ళీ వస్తుందట. ఈ సారి నిన్ను కలవకుండా వెళ్లనంది. మా బావ కూడా ఊర్నించి తిరిగి వస్తున్నాడు. మా అక్క ఎంత చెబితే అంత తనకి. కేసు పెట్టు, వాణ్ణి నాశనం చేసేయ్ అని అక్క అంటే చేసి తీరతాడు. చెప్పానుగా. బోల్డంత డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి. ఈలోగానే మా అక్కను మంచి చేసుకో. చల్లబడుతుంది. లేకపోతే నీ పని అంతే సంగతులు

" అని చెప్పేసి టేబుల్ మీద ద్రాక్ష పళ్ళు ఒక్కోటి తీసుకుని నోట్లో వేసుకో సాగాడు ఫల్గుణ్. అనంత్ కు ముచ్చెమటలు పట్టాయి. కాస్సేపు ఆలోచించి, 'ఇంతకీ మీ అక్కను మంచి చేసుకోవడం ఎలా ?”

“సింపుల్, ఆడవాళ్ళను మంచి చేసుకోవడానికి ఉండే స్టాండర్డ్ ఫార్ములా - పూలు! అక్కకి గులాబీలంటే ప్రాణం. గులాబీలతో కట్టిన బొకే ఇప్పుడే పంపించేసేయ్. ఫోనులో ఆర్డరిస్తే చాలు...వాళ్ళ ఊళ్ళో గుమ్మం దగ్గరికి అందజేసే ఏజన్సీలు ఉన్నాయి. రేపు తను వచ్చినప్పుడు నవ్వుతూ వస్తుంది. ఏదో పోరబాటయిందని చెప్పేసి చేతులో,కాళ్ళో పట్టేసుకో. విషయం క్లోజ్. అనంత్...డాక్టర్ నన్ను ఎక్కువ సేపు మాట్లాడద్దన్నాడు. రెస్టు తీసుకోమన్నాడు.అందువల్ల ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ ".

****

ఫల్గుణ్ చెప్పినట్టు గులాబీలు పంపించడం వల్ల ప్రభావం కనబడింది.మర్నాడు అనంత్ నిద్ర లేచేసరికి కుబేరరావు సిద్ధంగా ఉన్నాడు. కుబేరరావుకి గ్రీకువీరుడి ఫిజిక్. ఏదైనా మాట్లాడాలన్నా నాలుగు తన్నాక మాట్లాడచ్చులే అనుకునే రకం లా ఉన్నాడు. అంత డబ్బు ఉన్నవాడికి అంత గూండా లుక్ ఎలా వచ్చిందాని ఆశ్చర్యం వేసింది అనంత్ కి.పలకరించబోతే కసురుకుంటు న్నాడు. ఏం చేయాలో తెలియక ఆవంత్ ఊరుకున్నాక

“అసలు సంగతి కొద్దామా ?” అన్నాడు కుబేర్రౌడీ.

“ఓహో, మీదాకా వచ్చిందా ?” అన్నాడు అనంత్ కాస్త ఆశ్చర్యపడుతూ.

“మా ఆవిడ ఏ విషయమూ నా దగ్గర దాచదు తెలుసా ?” అన్నాడు కుబేరుడు కాస్త గర్వంగా.

“ఏదో చిన్న విషయం కదా ! చెప్పి వుండరనుకున్నా...” కుబేరరావు ఒక్క గెంతు గెంతాడు.

“ ఏమిటి చిన్నవిషయమా ? నేను ఊళ్ళో లేకుండా చూసి మా ఆవిడకు గులాబీలు పంపి, ప్రేమలేఖలు రాసి విసిగించడం చిన్న విషయమా? ” వాస్తవాలు తారుమారు చేయడం అనంత్ సహించడు.

“ ప్రేమలేఖ లెక్కడ రాశాను?” “పువ్వులతో బాటు పంపిన కార్డు మీద ' ప్రేమతో 'అని ప్రింటు లో లేదూ? పైగా అన్ని పూలా ? మా ఆవిణ్ణి పూలతో అభిషేకం చేద్దామనుకుంటున్నావా ? ఇలా న్యూసెన్సు చేసే వాళ్ళని వదిలి పెట్టడం నాకు చేత కాదు.” అరిచాడు కుబేరుడు.

“నాకూ చేత కాదు.” అని వినబడింది...అనంత్ వెనక నుండి.తిరిగి చూస్తే ఓ భారీ స్త్రీ.దుర్గమ్మగారు కావచ్చు. “ ఇంకా చూస్తూ నిలబడతారేం ?మా తమ్ముడి కాళ్ళు విరక్కొట్టి వాడికి సేవ చేసినట్టు నటించి నన్ను వలలో వేసుకుందామని చూస్తున్న వాడితో ఇంకా ముచ్చట్లేమిటి ?” అంటూ ఆవిడ ఉసిగోలపడం,

కుబేరరావు అనంత్ మీదకు ఉరకడం రెండు ఒకేసారి జరిగాయి.కానీ ఈ లోపునే అనంత్ పుటికీలు కొట్టుకునే పాట టెన్నిస్ బాల్ కుబేరరావు ప్రయత్నాలకు గండి కొట్టింది.వచ్చి అతని పాదాల కింద పడింది. కుబేరరావు గోడవైపుకి దూసుకుపోతుండగానే అనంత్ ఆ గదిలోంచి బయటపడి, బయట నుండి గడియ పెట్టేయడం జరిగింది. ఆ తరువాత ఐదు నిమిషాలలోపున కట్టుబట్టలతో, జేబులో క్రెడిట్ కార్డుతో అనంత్ బెంగుళూరు పారిపోయేడు...ఆచలపతికి తన సామ్రాజ్యం అప్పజెప్పి. ఈ దంపతులు, ఆ క్షతగాత్రుడు ఇల్లు ఖాళీ చేసేకనే తనకు కబురు చేయమన్నాడు.

****

పదిహేను రోజుల తరువాత బెంగుళూరులో టాక్సీలో వెళుతుండగా ' దుర్గా సూప్స్ ' అని ఓ పెద్ద బోర్డు అనంత్ కంటబడింది.పైన 'చూస్తే ఆగలేరు 'అని కాష్పన్. దాని కిందా ఆకలి చూపులతో ఓ సూప్ బౌల్ కేసి చూస్తున్న ఓ ఆత్రగాడి బొమ్మ. బొమ్మని ఎక్కడో చూసినట్టు, అతనికి తనకీ పోలికలు ఉన్నట్టు అనిపించింది అనంత్ కి. కొద్ది సేపట్లో తట్టింది.అది తన బొమ్మేనని, రుక్మిణి వేసి ఇచ్చిన కళాఖండం ఇలా బజార్న ఎలా పడిందో అతనికి అర్థం కాలేదు. వెంటనే విమానంలో ఇంటికొచ్చి పడ్డాడు.

అచలపతి తలుపు తీస్తుండగానే గంభీరంగా మొహం పెట్టి,” అచలపతీ, సంగతేమిటి ? ” అన్నాడు.

“పోస్టరా,సర్ ?రెస్పాన్స్ చాలా బాగుందిట సర్.సూప్ అమ్మకాలు కూడా పెరిగాయట "

“ అమ్మకాల మాట అడగలేదు నేను.నా బొమ్మ దాంట్లో...ఎలా...అందునా అంత దారుణమైన ఫోజులో....” అనంత్ కీ మాటలు దొరకడం లేదు.

“సర్, ఏదో ఒకటి చేసి కుబేరరావు గార్ని,దుర్గగార్ని ఎలాగోలా ఊరుకోబెట్టమన్నారు కదా....”

“అంటే మాత్రం ? ఇలా బొత్తిగా నా బొమ్మ వీధుల కెక్కించి.....”

“ఊరుకోబెట్టడం చాలా కష్టమైంది సర్.దుర్గ గారు రెచ్చగొట్టడం వలన కుబేరరావు గారు మరీ రెచ్చిపోయారు.ముఖ్యంగా గోడకు గుద్దుకుని ముఖం బద్దలయి, కాలు బెణికి మంచం మీద పడి వుండటంతో మరింత కసిగా ఉన్నారు.డామేజి కేసు పెట్టి మిమ్ముల్ని శంకరగిరి మాన్యాలు పట్టించందే వదిలి పెట్టనన్నారు.వాటిల్లో చాలా అనుభవం ఉందిట. చాలా సంపాదించాడట కూడా....”

“అయితే మాత్రం, బొత్తిగా నా బొమ్మను...రుక్మిణి నా మీద గౌరవంతో వేసి,ఇచ్చిన బొమ్మను అవమానించి....”

“మంచం మీద నుండి లేచిన రోజునే కుబేరరావు గారు ఆ బొమ్మ చూడటం సంభవించింది.హాల్లో దాన్ని పెట్టాలనే మీ కోరికను ఆ ముందురోజే నేను తీర్చగలిగాను. బొమ్మ చూస్తూనే ఆయన ఆలోచనలో పడ్డారు.ఆయన ఆలోచన చూసి నేనే సజేస్టు చేశాను.ఇలా పోస్టరు డిజైన్ చేసి, మార్కెట్ చేస్తే వాళ్ళ సూప్స్ బాగా అమ్ముడు పోతాయని. ఆయనకి ఆ ఐడియా నచ్చింది. ముఖ్యంగా బొమ్మలో ఆకలి చూపులు ఆయన్ని ఆకర్షించాయి.”

“ కానీ...ఆ బొమ్మ మీద కాపీరైట్ రుక్మిణిది. ఆమెకు చెప్పకుండా అలా ఉపయోగించడం నేరం.కళకు ద్రోహం చేయడం.”

“చెప్పకపోవడం ఏమీ లేదండి. రుక్మిణి గారిని రప్పించారు.ఫల్గుణరావు ఆమె ప్రతినిధిగా వ్యవహరించి బావగారితో బాగా బేరాలాడి రుక్మిణిగారికి మంచి రేటు ఇప్పించాడు.ఆవిడ హక్కులు వదులుకున్నారు.”

“ ఫల్గుణరావుకి అంత నేర్పు ఉందా ? ఏదీ ఆ గ్రీకు వీరుడితో బేరాలాడేటంత దమ్ము ఉందా ?ఆశ్చర్యంగా ఉందే ?”

“ సుమనోహరి గారూ అదే అన్నారండి.అంటూనే ముచ్చటపడ్డారండి. అటువంటివాడికి భార్యగా ఉండటానికి పెట్టి పుట్టాలన్నారండి.”

“అంటే ? " “అవునండి.సుమనోహరి గారు రాంపండు గారికి టాటా చెప్పేసి ఫల్గుణ గారిని పెళ్ళాడబోతున్నారండి

.” అనంత్ కాస్సేపు ఏమి మాట్లాడలేదు.కథలో మలుపులు అర్థం చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి కాస్త టైము పట్టింది

“ సుమనోహరికి ఫల్గుణుడు దక్కాడు. రుక్మిణికి డబ్బులు దక్కాయి. కానీ మధ్యలో నా బొమ్మ వాడనివ్వడం వల్లన నాకు కలిసి వచ్చింది ఏమిటి ?”

“ కోర్టుల చుట్టూ తిరగనక్కర లేకపోవడం "అన్నాడు అచలపతి మంచినీళ్ళు అందిస్తూ.

-ఎమ్బీయస్ ప్రసాద్

(పి.జి.ఉడ్ హవుస్ 'ది స్పాట్ ఆఫ్ ఆర్ట్ 'కథ ఆధారంగా)