రాంపండు లీలలు..!

 

ఆటల పోటీల పందాల్లో ఓడిపోయాక రాంపండు అనంత్ దగ్గరికి వచ్చి భోరుమన్నాడు. “ ఆ హెడ్ మాస్టారు పరంధామయ్య నా కొంప ముంచాడ్రా.. అచలపతి వెళ్ళి తప్పు చేసినట్టూ, అది ఒప్పుకున్నట్టూ నటించడం ఏమిటీ? ఈయన అది నమ్మేసి మొదట వచ్చిన ఐదుగురినీ డిస్ క్వాలిఫై చేసేసి ఆరో అమ్మాయికి ప్రైజు ఇచ్చేయడమేమిటీ? అటు తిరిగి, ఇటు తిరిగి నా జేబు కొల్లగొట్టేశాడు దుర్మార్గుడు. ఘోరంగా దెబ్బతినేశాను.

అనంత్ ఓదార్చబోయాడు. “ఈ హెడ్ మాష్టార్ల వరస నీకు తెలియనిదేముంది? అంటూ! రాంపండుకి ఉక్రోషం వచ్చింది. “నాకొళ్ళు మండిందంటే మ పాత హెడ్ మాష్టారు రామబ్రహ్మం గారిని నొక్కేసినట్టు నొక్కి పారేయగలను ఏమనుకుంటున్నాడో" అంటూ రంకేలేశాడు. దాంతో అనంత్ కి గతం ఒక్కసారి కళ్ళముందు తిరిగినట్టయింది.

***

అప్పట్లో రాంపండు "జల్సా" అనే ఓ చిన్న పత్రికకి ఎడిటరుగా పని చేసేవాడు. అనంత్ ఓ రోజు అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు రాంపండు ఓ కవయిత్రితో ప్రేమలో పడ్డట్టు తెలిసింది. అదీ అనుకోకుండా..!అసలు ఆ వేళ పొద్దున్నే అనంత్ కి అచలపతికి ఓ పాటి మనస్పర్ధ వచ్చింది. ముందురోజు ఎగ్జిబిషన్ లో ఓ పూల కూజా కనబడితే హాల్లో పెట్టవచ్చని అనంత్ కొని తెచ్చాడు. అది హుందాగా లేదనీ, హాల్లో పెట్టించుకునే అర్హత దానికి లేదని అచలపతి వాదన.

ఇదిగో చూడు ఆచలపతీ, నువ్వు నేను వేసుకునే డ్రస్సు దగ్గర్నించి, బూట్ల దగ్గర్నించి అన్నింటినీ శాసించాలని చూసినా సహించాను. కానీ ఈ ఫ్లవర్ వాజ్ విషయంలో మాత్రం ఎవ్వరి మాట వినదలుచుకోలేదు". అంటూ అనంత్ ధాటిగా చెప్పేసి బయటికి వచ్చేశాక ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక అనుకోకుండా రాంపండు ఆఫీసు వైపు నడక సాగించాడు.

ఓ పత్రిక ఎడిటరు దగ్గరికి వెళితే వచ్చే సహజమైన ప్రశ్న " మా లేటెస్టు ఇస్యూ చదివేవా?” అని హృదయమున్నవాడు, పైగా ఎడిటరుకి స్నేహితుడైన వాడు దానికి 'లేదు' అని చెప్పలేడు అవునని చెప్పాలంటే పత్రిక చదవాలి లేకపోతె "అది బాగుందా? లేక దీనికంటే అది బాగుందా?” అని ఎదురయ్యే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టం. “జల్సా" పత్రిక చదిసి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే ఫ్రెండైన రాంపండు ని తప్పించుకు తిరగడమే మంచిదన్న అభిప్రాయంతో అనంత్ అతని ఆఫీసుకి వెళ్ళడమే మానుకున్నాడు.

కానీ ఆ వేళ అచలపతి గొడవతో మతిపోయిన అనంత్ కాస్సేపటికీ "జల్సా" ఎడిటర్ గుమ్మం దగ్గర తేలేడు. అది "ప్రైవేట్" అని రాసి ఉన్న గుమ్మం, ఎడిటర్ కి అత్యంత సన్నిహితులు మాత్రమే రాదగిన ద్వారం. తక్కిన వాళ్లందరూ దానికి ఎదురుగా ఉన్న ఆఫీసులో వెళ్ళి వేరే ద్వారం ద్వారా ఆ రూం లోకి రావాలి. అనంత్ ఎడిటర్ ఫ్రెండు కాబట్టి ఈ ద్వారం ద్వారా వెళ్ళడానికి ఎవరూ అభ్యంతర పెట్టారు. కానీ అసలు అభ్యంతరం ఎడిటరు దగ్గర్నించే వస్తుంది- వచ్చిన వాడు అతని పత్రిక చదవకుండా చేతులూపుకుంటూ వచ్చేడంటే!

అందుకే అనంత్ వెళుతూనే రాంపండుని కంగ్రాచ్యులేట్ చేసేశాడు. “నీ లేటెస్టు ఇస్యూ బ్రహ్మాండంగా ఉందోయ్ ! అవును గానీ మీ బాబాయ్ ఎలా ఉన్నాడు? నీ పాకెట్ మనీ ఏమైనా పెంచాడా? లేక ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి అక్కర్లేదన్నాడా?”

మాట మార్చడానికి రాంపండు ఒప్పుకోలేదు

పత్రిక నీకు నిజంగా నచ్చిందా?”

ఆహాఁ"

మొత్తమెంతా..?”

ప్రతీ పేజీ"

ముఖ్యంగా ఆ కవిత లేదూ...”ఏకాంతం"!?”

అక్షరం అక్షరం.. ఆణిముత్యం"

మాస్టర్ పీసు కదా"

అవును బ్రహ్మాండం.. ఇంతకీ ఎవర్రాసారు?” అన్నాడు అనంత్ ఇక పై ఎలా మెచ్చుకోవాలో తెలియక.

రాంపండుకి ఒళ్ళు మండిపోయింది. “కింద పేరు వేశాంగా" అని విసుక్కున్నాడు...

పేరు మర్చిపోయానులేరా..” అనంత్ సర్దుకున్నాడు.

ఆ కవిత .. ఆ అద్భుతమైన కవిత.. రాసినది" ఒక్కసారి ఆగి ఊపిరి పీల్చుకుని రాంపండు ఎనౌన్స్ చేశాడు.

సుమనోహరి"

రాంపండు ఆ పేరు ఉచ్చరించిన తీరు చూస్తేనే అనంత్ కి అనుమానం వచ్చింది. రాంపండుకి మళ్ళీ ప్రేమరోగం పట్టుకుందాని..? కాసేపట్లోనే రోగ నిర్ధారణ కూడా అయిపోయింది. రాంపండు మళ్ళీ ప్రేమలో పడ్డాడు. సుమనోహరి ఎంత మనోహరంగా ఉంటుందో పావుగంట సేపు విన్నాక అనంత్ అడిగాడు.

ఇంతకీ నీ ప్రేమ గురించి ఆమెకు చెప్పావా?”

లేదు చెప్పలేదు నాకు భయంగా ఉంది"

భయం నీకెందుకురా? నిన్ను ప్రేమించే వాళ్ళకుండాలి గానీ" అని అనంత్ వాదించినా రాంపండు వినలేదు. సుమనోహరి ఒక దేవతట. ఆమె ముందు రాంపండు ఒక క్రిమిట. కాదు కీటకంట. కాదు పీపీలికంట. ఆమె చెయ్యి పట్టుకునే అర్హత లేదట చేయ్యేమిటీ? ఆమె ఎదుట నిలబడే అర్హత కూడా లేదని రాంపండు ఎనౌన్స్ చేశాడు.

నువ్వు సన్నాసివే కానీ మరీ అంత సన్నాసివి కావ" ని అనంత్ చెప్తుండగానే ఒక పెద్దాయన తలుపు తోసుకుని జబర్దస్తీగా వచ్చాడు, భారీమనిషి. పంచె లాల్చీ, పై మీద కండువా, చేతిలో చేతికర్ర, కంచుకంఠంతో "ఒరే రాంపండు' అంటూ రాగానే రాంపండు ఠపీమని లేచి అటెన్షన్ లో లేచి నుంచున్నాడు. ఆయన బర్రుమని కుర్చీ లాక్కుని కూచుని, “ ఊ కూచో" అనేదాకా రాంపండు కూచోలేదు. అదీ కుర్చీ అంచుమీదే కూచున్నాడు. ఏ క్షణంలోనైనా లేచి కుర్చీమీద నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు.

ఇదిగోనోయ్, ఇంకో వ్యాసం నీ కోసం ప్రత్యేకంగా రాసి పట్టుకొచ్చా "చోళుల కాలంలో చోళ్ళు తిన్నారా? లేదా?” అని వ్యాసం పేరు జాగ్రత్తగా చదివి అచ్చేయి అక్కడా, ఇక్కడా పారేయక, నీకు చిన్నప్పటి నుండి శ్రద్ధ తక్కువ. రెండ్రోజులకోసారి ఎక్కాలపుస్తకం పారేసుకునే వాడివి మూడు రోజులకోసారి పలక విరక్కొట్టుకునేవాడివి, ఇది చదివేటప్పుడు కాగితాలు నలిగిపోకుండా చదువు" అని ఆర్డర్లేస్తున్నాడు ఆ వచ్చినాయన. పక్కనే ఉన్న అనంత్ అనే మానవుడి ఉనికే పట్టించుకోకుండా!

పుత్రకామేష్టి యాగం చేసాక పాయసం కుండని అందుకున్నంత భయభక్తులతో రాంపండు అది అందుకున్నాడు. కానీ వచ్చినాయన తృప్తి పడ్డట్టు లేదు. “ఇప్పుడు బాగానే తీసుకుంటావ్. తర్వాత దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వవ్, క్రితం సంచికలో "శాతవాహనుల కాలంలో సనాతన వాహనాలు' వ్యాసం ఎక్కడో లోపలి పేజీల్లో వేశావ్ ఇదైనా కాస్త అందంగా, అందరూ చదివే చోట వేయి, నా ఫోటో అదీ కావాలంటే ముందే అడుగు. ఆఖరి క్షణంలో వెదకాలంటే కష్టం. ఇవన్నీ చెబుతున్నానంటే సంపాదకుడిగా నీ స్వేచ్చను హరిస్తున్నాని అనుకోవద్దు. నీకు తెలియదు కదాని, నా స్టూడెంట్ వి కదాని అభిమానంతో చెబుతున్నానన్న మాట. నువ్వు కలర్ ఫోటో వేసినా, బ్లాక్ అండ్ వేసినా నీ ఇష్టం అది నిర్ణయించుకునే హక్కు నీదే! వస్తా"

ఆయన వెళ్ళగానే రాంపండు జుట్టు పీక్కోవడం, తలకాయ టేబుల్ మీద పెట్టి వెక్కి వెక్కి ఏడవడం జరిగింది. అతన్ని ఓదారుస్తూ అనంత్ సేకరించిన సమాచారం ఇదీ - వచ్చినాయన రామబ్రహ్మం. రాంపండుకి ఎలిమెంటరీ స్కూల్ లో హెడ్ మాష్టారు. ఈ పత్రికలో వాళ్ళ మనవరాలి పెళ్ళి సంబంధం గురించి ప్రకటన ఇవ్వడానికి వచ్చి రాంపండుని చూశాడు. ఇక మనవాడే కదాని ఎస్సేల మీద ఎస్సేలు రాసి పడేస్తున్నాడు. వేయమని దండిస్తున్నాడు.”జల్సా" అని పేరు పెట్టిన పత్రికలో ఇంత సీరియస్ విషయాలేమిటని పాఠకుల గోల. ఆ ఉత్తరాలు పబ్లిషర్ కంటబడితే ఉద్యోగమే ఊడుతుందని రాంపండు గోల.

ఇలాంటివి రాయక్కరలేదని చెప్పెయలేకపోయావా?” అడిగాడు అనంత్.

రాంపండు దెబ్బతిన్నట్టు చూశాడు. “నీ ఎలిమెంటరీ స్కూలు హెడ్ మాష్టరు ఇప్పుడు నీ ఎదుట నిలబడితే నీకెలా అనిపిస్తుంది?”

దెయ్యాలను నమ్మాలనిపిస్తుంది. ఆయన చచ్చిపోయి పదేళ్లయింది.”

చచ్చి మనసు బతికించిన వాళ్ళ సంగతి కాదురా చావకుండా మనల్ని చంపుకు తినే రామబ్రహ్మం లాంటివాళ్ళ గురించి చెబుతున్నా. ఆయన నా కళ్ళెదురుగా కనబడగానే నేను నాలుగో క్లాసు కుర్రాడిలా మారిపోతాను. ఆయన ఎప్పుడు బెత్తం ఝలిపిస్తాడో, నేనెప్పుడు బెంచీ ఎక్కాల్సి వస్తుందోనన్న భయం నన్ను ఆవహిస్తుంది. 'యస్సార్, యస్సార్ ' తప్ప నా నోట ఇంకో మాట రాదు ఆయన జేబునిండా, సంచినిండా చోళుల గురించి, పల్లవుల గురించి రాసుకొచ్చి అచ్చువేయమని చంపుతాడు.

వేయకపోతే వీపు బద్దలు కొడతాడేమోనని భయం. మా పబ్లిషరు ప్రస్తుతం ఫారిన్ వెళ్ళాడు. వెనక్కి వచ్చి ఇవి చూశాడా, నా ఉద్యోగం పోవడం ఖాయం. ఒరే నేనేం చేయాలో తెలియడం లేదురా" అంటూ రాంపండు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.

ఇంటికి రాగానే అచలపతి కనబడటంతో పొద్దున్న మనస్పర్ధలను పక్కకు పెట్టి రాంపండు సమస్య గురించి డిస్కస్ చేశాడు అనంత్. ఆ సమస్యకు మూలకారణం కూడా కనిపెట్టేసేనోయ్, రాంపండు ఒక రకమైన కాంప్లెక్స్ తో బాధపడుతున్నాడు. అది కలగడానికి కారణం ఆ హెడ్ మాష్టర్. ఆ కాంప్లెక్స్ వల్లనే రాంపండు ఆ సుమనోహరికి తన ప్రేమను వెల్లడించలేకపోతున్నాడు. తనను తానూ తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. ఆ కాంప్లెక్స్ ను ఏదో అంటారయ్యా , అస్సలు గుర్తు రావడం లేదు.”

అచలపతి అందించాడు. “ ఇంగ్లిష్ లో ఇంఫీరియాలిటీ కాంప్లెక్స్, తెలుగులో ఆత్మ న్యూనతాభావం'

చూడగానే కరెక్టుగా చెప్పేవయ్యా.. ఇలాంటి మానసిక బలహీనతలన్నింటికీ అదే మూలకారణం. ఎవరి దాకానో ఎందుకు? నా మట్టుకు నాకే ఆ కాంప్లెక్స్ ఉంది తెలుసా..? మా పెద్దత్తయ్య లేదూ..? మాంకాళి అత్తయ్య, తనను చూడగానే నా చేత 13 వ ఎక్కం అప్ప చెప్పించుకునప్పుడు పిక్కపాశాలు పెట్టిన సంగతి, తన సెంటు బాటిల్ పగల కొట్టినప్పుడు నా వీపు బద్దలు కొట్టిన సంగతి, ఆముదం తాగనని మొండికేస్తే చింత బరిక పట్టి కొడతానన్న సంగతి- ఇవన్నీ గుర్తుకు వచ్చి వణికిపోతాను. ఇన్ఫీరియాలిటీ కాంప్లెక్స్ లో మునిగిపోతాను. “సరే అత్తయ్యా, సరే అత్తయ్యా" తప్ప మరో మాటే రాదు నా నోటి వెంట. ప్రస్తుతం రాంపండు తన హెడ్మాష్టరు రామబ్రహ్మం వల్ల. అదేవిధంగా బాధపడుతున్నాడు. ఆ కాంప్లెక్స్ పొగిడితే తప్ప రాంపండు ఓ ఇంటివాడవడు.”

అచలపతి గొంతు సవరించుకున్నాడు. “సర్, నా ఉద్దేశంలో అటునుండి నరుక్కురావడం మంచిదంటాను.”

అంటే రామబ్రహ్మం గారి సుపీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించమనా నీ ఉద్దేశం? అబ్బే, అది చాలా హెచ్చు మోతాదులో ఉందయ్యా, నా అంతటి వాడు పక్కన కూచున్నా పట్టించుకోలేదు తెలుసా?”

సర్, నా ఉద్దేశం అదికాదు, రాంపండు గారు ఎంతో గొప్పగా భావించే సుమనోహరి ఒక వేళ ఆయన ప్రేమను అంగీకరించిందనుకోండి. అప్పుడు కలిగే ఉత్సాహంతో ఆయన రామబ్రహ్మం గారిని తీసి అవతల పారేయగలుగుతారు"

ఆడదాని అంగీకారం మగవాడిలో అంత ఊపు కలిగిస్తుందని ఒప్పుకుంటాను కానీ అసలు రాంపండు తన ప్రేమను వ్యక్తపరిస్తే కదా, సుమనోహరి అవుననడానికి, కాదనడానికి...!”

దానికి ఎప్పటినుండో కధల్లో వాడిన ఫార్ములా ఉంది కదా సర్. రాంపండుకి ఆక్సిడెంట్ అయిందని తెలియబరిస్తే సుమనోహరి పరుగు, పరుగున వచ్చి "

'ఆచలపతీ, నీ బుర్ర బొత్తిగా బూజు పట్టిపోయిందోయ్ ...రాంపండు ఏ లారీ కిందో పడేదాకా ఆగి అప్పుడు సుమనోహరికి చెప్పి, ఆమె వచ్చి కన్నీళ్లు పెట్టుకుని 'నీ తోటే నేనూ చితినెక్కుతాన'ని అని 'నేనే పతివ్రతనైతే నాకు కట్టబోయే మంగళ సూత్రం నిలిపే భారం మీదే'నని దేవుళ్ళను నిలదీసి ఆ తర్వాత పెళ్ళాడి ఆమె ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో వీడెళ్ళి రామబ్రహ్మం గారిని.... 'అబ్బే ఇదంతా ఈ దశాబ్దంలో అయ్యే పని కాదు, కానీ నేనింకో మంచి ఐడియా చెప్తాను విని అంత గొప్ప ఐడియా నాకు ఎలా వచ్చిందో ఆ సంఘటన కూడా చెప్తాను విను. రేపు నా జీవిత చరిత్ర రాద్దామని నీకనిపిస్తే, విషయం అందుబాటులో ఉంటుంది.”

అచలపతి తలవంచాడు. “కానీయండి సర్.అన్నాడు అదేమంత ఎంకరేజింగ్ గా అనిపించకపోయినా అనంత్ తన కథ కొనసాగించాడు. “చూడు అచలపతీ, నేను మా మాంకాళి అత్తయ్య గురించి చెప్పాను కదా నాకు ఆవిడంటే భయం పోయిన ఘడియ ఒకటుంది తెలుసా? నువ్వు నమ్మవు కానీ అప్పుడు నేను "ఏమిటీవిడ గొప్ప?” అనుకున్నాను జరిగిందేమిటంటే మేమంతా కలిసి నార్తిండియా టూరుకెళ్ళి ఓ హోటల్ లో దిగినప్పుడు మా అత్తయ్య ముత్యాల హారం పోయింది. ఆ గది తుడవడానికి వచ్చిన పనిపిల్లే తీసిందని అత్తయ్య వెళ్ళి హోటల్ మేనేజరుకి ఫిర్యాదు చేసింది. అంతా కలిసి ఆ పనిపిల్లను నానా హింస పెట్టిన తర్వాత ఆ హారం అత్తయ్య పెట్లోనే కనబడింది. అప్పుడు ఆ పనిపిల్ల, దానికంటే ఎక్కువగా ఊరపందిలా ఉన్న ఆ హోటల్ మేనేజరూ కలిసి హిందీలో మా అత్తయ్యను తిట్టినా తిట్లు విని తీరాలి, అత్తయ్యకు హిందీ రాకపోయినా తిట్లజోరుకి అడిలిపోయింది. సగం, సగం అర్థమయి నేను ఆశ్చర్యపడ్డాను.- అత్తయ్యను ఇంతలా తిట్టినా ఫర్వాలేదని వర్షంలో తడిసిన పిల్లిలా అత్తయ్య వణుకుతుంటే నాకు ఆవిడంటే అస్సలు భయం పోయింది....

అచలపతి కథనానికి అడ్డు వచ్చాడు.” ...అంటే మీకు ఆవిడంటే ఇప్పుడు భయం పోయిందా సర్?”

అనంత్ విసుక్కున్నాడు. “పోయిందో, లేదో నీకు తెలుసు ఆచలపతీ. కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగివచ్చింది కానీ కొంతకాలం పాటు ఆవిడంటే లెక్కలేకుండా తిరిగాను. ఇక్కడ పాయింటేమిటంటే ఒక మనిషిని నిస్సహాయ స్థితిలో చూసినప్పుడు మనకు వాళ్ళంటే భయం పోతుంది. ఉదాహరణకి ఓ కంపెనీలో పనిచేసే వాడికి వాళ్ళ జనరల్ మేనేజరంటే భయం అనుకో, కానీ ఓ జనవరి ఫస్టు నాడు ఆయన తప్ప తాగి రోడ్డు పక్కన పడి ఉన్నాడనుకో,

అప్పటి నుండి ఆయనంటే భయం పోతుందా, లేదా..?

అంటే జనవరి1 దాకా ఆగి.. రామబ్రహ్మం గారిని తప్పతాగించి...”

ఆచలపతీ నా మాటలు నాకే అప్పగించాలని చూడకు, ఆ లోపునే రామబ్రహ్మాన్ని ఇంకోలా నిస్సహాయ స్థితిలో వెడతాను. వెళ్ళి మూడు కిలోల శుభ్రమైన మైదా పిండి తీసుకురా.”

మైదానా?” అనంత్ బుర్ర ఎటుపోతుందో అంతటి మేధావి అచలపతి కూడా ఊహించలేకపోయాడు.

అవును. నాదో బ్రహ్మాండమైన ప్లానుంది. రామబ్రహ్మం ఇవాళ మూడు గంటలకు వస్తానని చెప్పాడు. ఆ టైముకి రాంపండు ని ఆఫీసులో ఉండమని ఆర్డరేశాడు. రాంపండు రూముకి డైరెక్టుగా కాకుండా ఆఫీసులోంచి వెళ్ళేదారి మరోటి వుందని తెలుసుగా. ఆ వేళకు ఆ గుమ్మం పైన మైదాపిండి మూట ఏర్పాటు చేసి పెడతాను. ఆయన వచ్చి తలుపు తీయగానే ఆ పిండిమూట నెత్తిమీద పడుతుంది. ఒళ్ళంతా పిండి కొట్టుకుపోయిన రామబ్రహ్మాన్ని ఒక్కసారి చూస్తే చాలు రాంపండు భయం అంతా పటాపంచలైపోయింది.

* * *

మర్నాడు మధ్యాహ్నం రెండు నలభై అయిదు నిమిషాలకు మొదటి అంతస్తు మెట్లెక్కి అనంత్ "జల్సా" ఆఫీసుకి రావడం, ముందుగదిలో ఉన్న ఆఫీసుబాయికి గంటదాకా రావద్దని లంచం పెట్టి అక్కడి నుండి తరిమేయడం, కుర్చీ లాక్కుని స్కూలు రోజుల్లో టీచర్లను ఏడిపించిన కళను గుర్తుకు తెచ్చుకుని పిండి మూటను జాగ్రత్తగా తలుపుమీద బ్యాలెన్స్ చేసి పెట్టడం జరిగింది.

తన ఆనవాళ్ళు తుడిపేసి, ఏమీ తెలియనట్టు ఆ ప్రమాద స్థలం నుండి బయటపడి, అరగంట సేపు రోడ్డు మీద చక్కర్లు కొట్టి మూడుంపావుకి రాంపండు గదికి చేరి చూడబోతే రాంపండు లేడు. పైగా రామబ్రహ్మం మాత్రం చిర్రుబుర్రులాడుతూ కూచున్నాడు. మూడు గంటలకు ఉండి తీరాలన్న హెడ్ మాష్టారు మాట జవదాటగల ధైర్యం రాంపండుకెలా వచ్చిందన్న ఆశ్చర్యంతో బాటు రామబ్రహ్మం గారి ఒంటి మీద మైదా అవశేషాలు కూడా కనబడక పోవడం అనంత్ ను ఆశ్చర్యపరిచింది. మంచీ, మర్యాదా లేకుండా ఆయన కూడా తనలాగే ఎడిటరు ప్రైవేటు ఎంట్రన్సు లోంచి గదిలోకి దూరి ఉంటాడనుకున్నాడు.

మీరు ఆఫీసు గదిలోంచి రాలేదా?” అన్నాడు. అనంత్ మాట కలుపుదామని ప్రయత్నిస్తూ.

రామబ్రహ్మం చదువుతున్న పేపరులోంచి తలెత్తి చూశాడు. “మీరేదో అన్నట్టున్నారు" అన్నాడు కటువుగా. ఇక అనంత్ కు నోరు పెగలలేదు. తనూ ఇంకో పేపరు తీసి చడామడా చదివేయడం మొదలుపెట్టాడు.

ఓ పావుగంట పోయాక రాంపండు విజిల్ పాట వినబడింది. కొన్ని సెకండ్లలో కనబడ్డాడు కూడా. క్రితం సారి చూసిన రాంపండుకి ఈ సారి చూసిన రాంపండుకి కనబడ్డ దారుణమైన తేడా చూసి అనంత్ తెల్లబోయాడు రామబ్రహ్మం కూడా. ముఖ్యంగా రాంపండు తనని పిలిచిన పిలుపు విని మరీ తెల్లబోయాడు. “కాస్త లేటయ్యింది గురూగారు ఏమనుకోకండి "

రామ్మబ్రహ్మానికి ఒళ్ళు మండిపోయింది. “కాస్తేమిట్రా రాంపండు, నేను నిన్ను మూడు గంటలకు ముందే ఉండమన్నానా? లేదా? నాకిలాగ గంటల తరబడి వెయిట్ చేయడం అలవాటు లేదు"

రాంపండు కోపం తెచ్చుకోలేదు "సారీ అన్నానుగా ఇంతకీ మీకు కావాల్సిందేమిటీ? నిన్న పట్టుకు వచ్చిన ఆర్టికల్ ఎలా ఉందని అడగడానికేగా? నా సమాధానం రెడీ గా ఉంది, నాకేం నచ్చలేదు మా పత్రిక సరదాగా ఉండాలనుకునే వాళ్ళ కోసం పెట్టింది. ఈదురో దేవుడా అనుకునే వాళ్ళకోసం మార్చినప్పుడు కనబడం..”

రాంపండు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే సరిగ్గా తెలుస్తున్నట్టు లేదు. అసలలాంటి ఆర్టికల్ వేసుకునే అర్హత మీ పత్రికకు లేకపోయినా పోనీ ఏదో శిష్యుడివి కదాని"

నో థాంక్స్, ఇదిగో మీ వ్యాసం