రాంపండు లీలలు..!

 

రాంపండూ - కవిత్వప్పందాలు

వాలెంతింటా వ్యవహారం తర్వాత రాంపండు కనబడటం మానేయడంతో అనంత్ ఆలోచనల్లో అతను కొద్దికాలం పాటు మరుగునపడ్డాడు. పాపం ఏమైపోయాడో, వాళ్ళ బాబాయి రాంపండుకి నెలనెలా ఇచ్చే డబ్బు ఇస్తున్నాడో లేదో అన్న ఆలోచన వచ్చింది కానీ గట్టిగా పట్టించుకుంటే మళ్ళీ ఏ లేడీ వస్తాదునో తీసుకొచ్చి రోజూ భోజనం పెట్టించమంటాడేమోనని అనంత్ ఊరుకున్నాడు. పరిస్థితి అలాగే కొనసాగేది కానీ యతి దగ్గర్నించి ఉత్తరం రావడంతో అనంత్ జీవితంలో రాంపండు పాత్ర పునః ప్రవేశం చేసింది.

సర్, మీకే ...” అని ఉత్తరం అందిస్తూ, అచలపతి దాచుకున్న నవ్వు చూడగానే అనంత్ కి అనుమానం వచ్చింది.

ఫ్రం అడ్రస్ చూడగానే నవ్వుకి అర్థం తెలిసిపోయింది. ఉత్తరం యతి దగ్గర్నించి.

యతి, సుతి ఇద్దరూ కవలలు. అనంత్ కి కజిన్స్. పెద్దవాళ్ళు చాలా ఉన్నత ఆదర్శాలతో పెట్టిన పేర్లని వీళ్ళు

చెడగొట్టేశారు. మతి లేకుండా పిచ్చి, పిచ్చి పనులు చేయడం, ఏదో ఒకటి చేసి నెత్తి మీదకు తెచ్చుకోవడం వాళ్లకు పరిపాటి. అనంత్ కంటే వయస్సులో కాస్త చిన్నవాళ్ళే అయినా అనంత్ తో ఫ్రెండ్లీ గా మెలుగుతారు - అంతా ఒకే జాతికి చెందినవాళ్ళే కాబట్టి. చివరికి అనంత్ కి ఏదో ఒక తలకాయ నొప్పి తెచ్చి పెడతారు. వాళ్ళ దగ్గర్నించి ఎప్పుడూ ఉత్తరం ఇత్తరం వచ్చినా దానిలో ఏదో ఒక కొత్త స్కీము ఉంటూనే ఉంటుంది. ఆచలపతికి వాళ్ళ చేష్టలు చూస్తే మహా వేడుకగా ఉంటుంది.

ఇవాళ్టి ఉత్తరంలో కూడా ఓ స్కీము ఉంది.

ఒరేయ్ అనంత్ ,

ఉత్తరం మీద అడ్రసు చూసి కంగారుపడ్డావా ? ఈ యతిగాడు వేంపూడి లో ఎలా తెలాడో అని తెల్లబోతున్నావా? పోకు. మన సుబ్బరామయ్య అంకుల్ లేడూ - వేంపూడి పిల్ల జమీందార్... వాళ్ళ ఇంట్లో నెల్లాళ్లగా మకాం పెట్టాం - నేనూ, సుతీనూ. వాళ్ళ అమ్మాయి సులోచన మంచి కంపెనీ ఇస్తుందిలే. మనకి వేరే పనిలేదుగా! నాలుగురాళ్ళు సంపాదించుకు రానిదే ఇంటికి రావద్దని మా నాన్న ఆంక్ష పెట్టేశాడు. సరేలే. బంధువులింట్లో ఉన్నట్టుంటుందనుకుని ఇక్కడే బిచాణా వేశాం. అన్నట్టు మీ ఫ్రెండు రాంపండు కూడా ఇక్కడే ఉన్నాడొరే! మాటల్లో నీ ప్రస్తావన వస్తే నువ్వు మంచి ఫ్రెండువని చెప్పాడు.

రాంపండు నైస్ ఫెలోరా. అతను కాస్త డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాట్ట. వాళ్ళ చిన్నాన్న డబ్బు సరిగా పంపటం లేదుట. నేనూ, గతీ, రాంపండూ కలిసి ఓ మంచి స్కీము వర్కవుట్ చేశాం. బోల్డు డబ్బులొచ్చే స్కీము. అంచేత నువ్వు ఒక గోనె సంచి నిండా డబ్బు తేవడంతో బాటు ఇంకో ఖాళీ గోనెసంచి కూడా ఎక్స్ట్ ట్రా పట్టుకురా. లాభాలన్నీ దాంట్లో పట్టుకుపోదువుగాని. రెండు డబ్బులూ కలవడం మంచిది కాదు. ఇక స్కీము గురించి లెటర్లో చెప్పాలంటే నీకు అర్థం కాదు.నీదసలే మట్టిబుర్ర, వెంట అచలపతిని తీసుకురా నీకర్థం కాకపోతే అతనికి చెప్తాం. నువ్వు అతని చేత అర్థం చేయించుకో. అర్థం అయినా, కాకపోయినా మాకుపెట్టుబడి మాత్రం పెట్టు. వెంటనే రా" - ఇట్లు యతి".

 

ఆ రోజు రాత్రి అనంత్ డిన్నర్ వేళకు వేంపూడి చేరగలిగాడు. వస్తూనే మేడమీద డిన్నర్ పార్టీ జరుగుతుంది. రమ్మనమని పిలుపు వచ్చింది. పావుగంటలో రెడీ అయి వెళ్ళేసరికి సులోచన పక్కనున్న సీటు మాత్రం ఖాళీగా ఉంది. సులోచన పక్కన కూచుందామని అనంత్ కి ఎంత మాత్రం ఉబలాటం లేదు. ఆ మాటకొస్తే ఏ ఆడపిల్ల పక్కనా కూచుందామని అనంత్ ఉబాలాటపడడు. కానీ సులోచన విషయంలో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఒకానొక దుర్బల క్షణంలో సులోచనను ప్రేమించినట్టు అనంత్ భ్రమపడటం కూడా జరిగింది. కానీ త్వరలోనే తెలిసి వచ్చింది. - సులోచన ఒక ఆదర్శాల పుట్ట అని.

పెళ్ళాడమని తండ్రి చూపించే బంధువుల కుర్రాళ్ళందరూ ఒట్టి పనికిమాలిన, పనిచేయని సజ్జనీ, తాత ముత్తాల ఆస్తి అరగదీయడం తప్ప కండలు కరిగించడం రాని వాజమ్మలని ఆమె అభిప్రాయం. అలాంటి వాళ్ళ కంటే డబ్బు లేకపోయినా కష్టార్జితాన్ని నమ్ముకున్న వాడినే కట్టుకోవాలని ఆమె అనుకుంది. ఆ కేటగిరీ లో అనంత్ ఈ జన్మలో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆమె అనంత్ ను పెద్దగా పట్టించుకోలేదు. ఆ విషయం గ్రహించిన అనంత్ కూడా సులోచన గురించి పట్టించుకోవడం మానేశాడు. రేపు పెళ్ళయిన దాకా ఉండి " రా, కష్టించి పని చేసి లోకాన్ని ఉద్ధరిద్దాం. పొలాలన్నీ హలాల దున్నుదాం. పల్లెటూళ్ళో పిల్లకు పాఠాలు చెప్పి నిరక్షరాస్యత పారద్రోలుదాం" అంటే చచ్చే చావు వస్తుందని తెలిసి ఎంత అందంగా ఉన్నా సులోచన మానాన సులోచన, తన మానాన తను విడివిడిగా బతకడం మంచిదనే నిర్ణయం తీసుకున్నాడు. అది ఇద్దరి మేలు కోరి తీసుకున్న నిర్ణయం కాబట్టి, ఇద్దరి మధ్య ఏ పొరవుచ్చాలు రాలేదు. మంచి కజిన్స్ లా , మంచి స్నేహితుల్లా మిగిలిపోయారు.

ఇప్పుడు సులోచన పక్కనే కూచుంటే పాత జ్ఞాపకాలు తన్నుకు వస్తాయేమోనని భయపడుతూనే గతిలేక ఆ కుర్చీలో

కూలబడ్డాడు అనంత్.

' హలో అనంత్, వచ్చేశావన్న మాట!' అంటూ పలకరించింది. సులోచన.

వచ్చేశా.” అన్నాడు అనంత్ అంతకంటే ఏమనాలో తోచక.

పోన్లే, మంచిపని చేశావ్. డిన్నర్ పార్టీ వేళకు వస్తావో రావో అనుకున్నా" అంది సులోచన మెచ్చుకోలుగా.

వచ్చాను కానీ. మీ నాన్న ఇవాళ ఇంత పెద్ద పార్టీ ఎందుకు ఏర్పాటు చేసినట్టు?” అడిగాడు అనంత్ చుట్టూ జనాభాను చూస్తూ.

నీకు తెలుసుగా. మా నాన్నకు కవిత్వం పిచ్చి. వీళ్ళంతా... అంటే వీళ్ళలో చాలామంది "సంచారకవులు" అనే గ్రూప్ కి చెందిన వాళ్ళు. వాళ్ళందరినీ భోజనానికి పిలిచాడు. వాళ్ళతో బాటు ఊళ్ళో కొంతమంది పెద్దల్ని కూడా..”

సంచార కవులేమిటీ? దిగంబర కవుల్లా?” అన్నాడు అనంత సూప్ చప్పరించి.

వీళ్లదీ ఓ ఉద్యమంలే. కవిత్వం గురించి సామాన్య ప్రజల్లో అవగాహన పెంచడానికి ఊరూరా తిరిగి, ఆదివారం పొద్దున్న అందర్ని ఓ చోటకు రమ్మనమని కవిత్వం పాడి వినిపిస్తారు. అలా వినగా, వినగా కవిత్వం అంటే మామూలు వాళ్లకు కూడా ఇష్టం పెరిగి, ప్రజా కవులు పుట్టుకొస్తారని వీళ్ళ థియరీ" వివరించింది సులోచన బట్లర్ కి అనంత్ పళ్ళెంలో వడ్డించమని సూచనలిస్తూనే .

అయ్యబాబోయ్, పదేసిమంది కవిత్వాలు ఒక్కపూట వినడమే! ఉగాది కవి సమ్మేళనాలు ఏడాదికోసారి వస్తాయి కాబట్టి పర్వాలేదు. కానీ ఇలా ఇంటి దగ్గరికొచ్చి కవిత్వం పాడేస్తే, పదిమందీ కలిసి చిత్రవధ చేసినట్టే!” అని హడలిపోయాడు అనంత్.

సులోచన విసుక్కుంది. “ నువ్వొకడివి. అందరూ ఒకే చోటికి వెళ్ళరు. పదిమంది ఒక టీముగా ఏర్పడి తాలుకా హెడ్ క్వార్టర్స్ కి వెళతారు. అక్కణ్ణించి ఒక్కోళ్ళు ఒక్కో ఊరికి ఆదివారం వెళ్ళి కవిత్వం వినిపిస్తారు. మళ్ళీ అందరూ కలిసి ఇంకో తాలూకాకి వెళతారు. అలాగన్న మాట..” అంది విసుక్కుంటూనే.

అయినా నీకివన్నీ పట్టవులే. హాయిగా కడుపులో చల్ల కదలకుండా పడుకుంటే చాలనుకునే వాళ్ళలో నువ్వొకడివి. లేక ఈ మధ్య పనికొచ్చే పని ఏదైనా చేస్తున్నావా?” అంది కాస్త వెక్కిరింపుగా .

సంభాషణ అక్కర్లేని పక్కదారులు పడుతుందని గ్రహించిన అనంత్ మాట మార్చబోయాడు. “ మీ నాన్నకి ఆ పక్కన కూచున్న పెద్దాయన శ్యామసుందరం గారేగా?”

అవును. ఆయనే ఈ ప్రాంతంలో ఈ ఉద్యమానికి చేయూతనిస్తున్నాడు. నాన్నా, ఆయనా చాలా కాలంగా ఫ్రెండ్స్".

తెలుసులే. పట్టుకుంటే వదలడు. ఓ సారి కవి సమ్మేళనంలో దొరికిపోయాను. ' సుబ్బరామయ్య గారి చుట్టాలబ్బాయిని కదూ' అంటూ పట్టుకుని వాయించేశాడు. నీలాంటి యువకుల్లో చైతన్యం రావాలంటూ పెద్ద కవిత ఒకటి వినిపించాడు". అన్నాడు అనంత్ గతం తలుచుకుని నిట్టూర్చి.

పాపం ఆయనకు తెలీదులే - నువ్వు ఏ కవిత్వానికి లొంగే ఘటానివి కాదని' అంది సులోచన పెదవి విరిచి.

ఎలా మాట్లాడినా తన బద్ధకం మీదకే సంభాషణ మళ్ళడం అనంత్ కి నచ్చలేదు. “ఆయన పక్కన కూచున్న కుర్రాడెవరు..? అతనూ కవేనా..?” అని అడిగాడు ఓ యువకుణ్ణి చూపించి..

శ్యామసుందరం గారి అన్నయ్యగారబ్బాయి. పేరు భాస్కర్. కవిత్వం అంటే ఇష్టమేలే కానీ లోకల్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. బీద పిల్లల కోసం ఊళ్ళో పెద్దలు ఓ స్కూల్ పెట్టారు. ఉత్సాహవంతులైన నా బోటి వాళ్ళు కావాలంటే వెళ్ళి ఉచితంగా పాఠాలు ..” అని సులోచన ఏదో చెబుతుండగా అనంత్ దృష్టి కాస్త మూలగా కూచున్న రాంపండు మీద పడింది. “అడుగో సన్నాసి...” అన్నాడు హుషారుగా .

ఏదో చెప్పబోతున్న సులోచన ఉలిక్కిపడింది. “ఎవరా సన్నాసి?”

రాంపండు, ఆ మూల ఎర్రచొక్కా వేసుకోలేదూ, వాడే, నా క్లాస్ మేటులే. మంచి ఫ్రెండు".

అతనా, బుజ్జికి ప్రైవేట్ చెబుతాడు.మీ ఫ్రెండా, బాబూ..?”

సులోచన గొంతులో పలికిన స్వరాలు రాంపండు మీద గౌరవాన్ని సూచించకపోవడంతో " ఏం అలా అడిగావ్?” అన్నాడు అనంత్.

ఏం లేదులే, అవును గానీ మీ ఫ్రెండుకి కాస్త బుర్ర తక్కువా?” అడిగేసింది సులోచన.

బుర్ర తక్కువా!? అలా ఎందుకనుకుంటున్నావ్ ?”

అబ్బే, నీ ఫ్రెండు కదాని అలా అంటున్నానని అనుకోవద్దు. అతని విధానం చూస్తే అదోలా అనిపించి అడిగా".

జోకులాపు. అతని తరహాలో వచ్చిన లోపం ఏమిటో చెప్పు" అన్నాడు అనంత్ కాస్త కటువుగా.

చెప్పనా!..అతను అదోలా పిచ్చిచూపులు చూస్తాడు నాకేసి.” సంజాయిషీ ఇచ్చుకుంది సులోచన.

పిచ్చి చూపులా..? ఎలా చూస్తాడో కాస్త ఇమిటేట్ చేసి చూపించు" ఆజ్ఞాపించాడు అనంత్.

చాల్లే, వీళ్ళందరి ముందు చేసి చూపిస్తే నాకే పిచ్చి అనుకుంటారు.”. అభ్యంతరం లేవనెత్తింది సులోచన.

ఫరవాలేదు. నేను నాప్ కిన్ ఎత్తి పట్టుకుంటాను. నా ఒక్కడికే చేసి చూపించు. వాళ్ళ బాబయ్య డబ్బివ్వడం మానేశాక వీడికి మతి భ్రమించిందేమోనని భయం వేస్తోంది. వాడి శ్రేయోభిలాషిగా వాడి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం నా బాధ్యత. నా విధి!” అనంత్ ఆవేశం చూసి సులోచన కరిగింది.

తను నాప్ కిన్ పైకెత్తి పట్టుకుని సహకరించగా సులోచన ఇచ్చిన ప్రదర్శన చూసి అనంత్ ముగ్ధుడై పోయాడు . ఒకటిన్నర సెకన్ల పాటు మాత్రమే సాగినా అది అనంత్ భయాల్ని దూరం చేసింది. సులోచన నోరు వెళ్ళబెట్టిన విధానం, దవడ జార్చిన విధానం, కళ్ళు పెద్దవి చేసి తెగులు తగిలిన కోడిలా చూసిన చూపు - రాంపండు వ్యాధి లక్షణాలను పట్టిచ్చాయి.

ప్రదర్శన పూర్తవగానే అనంత్ తృప్తిగా నిట్టూర్చాడు. “ ఇదే కదా, మరేమిటో అనుకుని అడిలి చచ్చాను. ఇది మామూలు రోగమేలే. వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు". అని తేల్చేశాడు.

ఈ సారి పిచ్చి చూపులు చూడటం సులోచన వంతయింది. ఇది మాత్రం ఇమిటేషన్ కాదు. ఆమె స్వంత చూపులే. “నన్నా! నాతో పెద్దగా పరిచయం కూడా లేదే!” అంటూ తెల్లబోయింది.

పరిచయాలేవీ అక్కర్లేదులే. ఎవరితో బడితే వాళ్ళతో ప్రేమలో పడిపోతాడు వాడు" అంటూ తేల్చేశాడు అనంత్. అన్నాడే కాని " థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్" అంటూ సులోచన మొహం మాడ్చుకుని అప్పడం నమలనారంభించడంతో నాలిక కరుచుకున్నాడు.

సులోచనా, నా ఉద్దేశం అది కాదు. నువ్వంటే వాడు ఇష్టపడటంలో ఆశ్చర్యమేముందంటు న్నాను. నా అంతట నేనే ఓ సారి నిన్ను పెళ్ళి చేసుకుందామనుకున్నాను" అంటూ సర్దిచెప్పబోయాడు అనంత్.

ఓ సారి పెళ్ళి చేసుకుందామనుకోవడం ఏమిటీ? భోజనానికి ముందు ఏమైనా వేసుకొచ్చావా అనంత్?” అంది సులోచన పళ్లు గిటకరించి.

అబ్బ, ఇదే ఆడవాళ్ళతో వచ్చిన చిక్కు. నేను చెప్పేదేమిటంటే.. నేను పెళ్ళి చేసుకుంటానని నిన్ను అడిగానా.. లేదా? అప్పుడు నువ్వు నవ్వి నవ్వి... ఎక్కిళ్ళు వచ్చేటంతగా నవ్వావా లేదా? ఎందుకడిగాన్రా దేవుడా అనుకుని బాధపడింది నేను. ఇప్పుడు నేనేదో తప్పు చేసినట్టు...” అనంత్ చెప్పబోతుండగానే సులోచన కోపం కరిగిపోయింది. 'సర్లే, సర్లే, నాదీ పొరబాటుందిలే. అలా నవ్వి ఉండకూడదు. అది వదిలేయ్ గానీ, మీ ఫ్రెండు అందంగానే ఉన్నాడులే" అంది.

మంచిదే, నీ కంటికి అందంగా ఉన్నాడంటే గొప్ప విషయమే! మేమంతా అలా అనుకోకపోయినా.. నువ్వంటున్నావంటే ..” అంటూ నాన్చాడు అనంత్. ఇది మళ్ళీ ఇంకో గొడవలోకి దారి తీయదు కదాని బెదురుతూనే.

సులోచన కోరగా చూస్తూ "అందంగా అంటే .. కొంతమందితో పోలిస్తే అనుకో"..అంది.

కొద్దిసేపటి తర్వాత రాంపండు కలిసినప్పుడు అనంత్ సంభాషణ యావత్తు చెప్పకుండా చివరి మాటలు చెప్పడం ముప్పు తెచ్చింది.

డిన్నర్ తర్వాత రాంపండు ఒంటరిగా దొరికినప్పుడు అనంత్ ఝాడించేశాడు. “ మీ బాబయ్యతో గొడవ తర్వాత అలా ఫేడవుటయితే ఎలాగరా? బతికున్నావో, కీర్తి శేషుడవయిపోయావో కనీసం ఫ్రెండ్సుకైనా తెలియనివ్వకపోతే ఎలా?”

రాంపండు నిట్టూర్చాడు. “ఏం చెప్పమంటావురా.. నా ముఖాన పొద్దుపొడవడం మానేసింది".

అలాగా..! మరి మా అందరికీ తెల్లవారుతోందే..”

'పక్షులు నాకోసం పాడడం మానేశాయి".

అలాగా! ఏ పక్షులు?”

రాంపండు కి కోపం వచ్చేసింది. “ ఏ పక్షులంటే పేరు పేరునా చెప్పాలేమిట్రా? పక్షులన్నీ కూడగట్టుకుని నాకోసం పాడకూడదని తీర్మానించుకున్నాయంతే !”

అనంత్ కి ఎలా రియాక్టవ్వాలో తెలియక, “ ఈ తీర్మానాల వెనుక మీ బాబాయి హస్తం ఏమైనా ఉందని అనుమానిస్తున్నావా ?” అని అడిగి చూశాడు.

రాంపండు చికాకు పడ్డాడు. “బాబాయ్ గొడవ మానరా. దీనికంతా కారణం - వాలెంతింటా ప్రవర్తన. ఆ గుంపంతా కలిసి చావబాదుతుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు తెలుసా?”

వీడి ప్రేమ మండిపోనూ, పొట్ట నింపుకోవడం కంటే ప్రేమ గురించే ఎక్కువ వర్రీ అవుతున్నాడన్నమాట అనుకుని అనంత్ "పోన్లే, నీ ప్రేమ చరిత్ర గ్రంథంలో మరో పేజీ చిరిగిపోయిందని అనుకుని ఊరుకో, అయినా ఇక్కడ తేలేవేమిటీ? ట్యూషన్ టీచర్ గానే సెటిలయి పోతున్నావేమిట్రా?” అని పరామర్శించాడు.

అదే నేనూ అడుగుదామనుకుంటున్నాను. నీకు వీళ్ళూ తెలుసేమిట్రా?” అన్నాడు రాంపండు కాస్త కోపంగా.

తెలుసా.. మా బంధువుల్రా బాబూ.. ఇంతప్పటి నుండి తెలుసు".

అంటే.. సులోచన కూడా నీకు చిన్నప్పటి నుండి తెలుసంటావ్? నువ్వెక్కడ తగిలేవురా బాబూ.. ఎక్కడికెళ్ళినా నువ్వే అడ్డు. దేశంలో అందమైన, డబ్బున్న అమ్మాయిలందరూ నీకు చుట్టాలేనా?” అంటూ విసుక్కున్నాడు రాంపండు.కాస్త ఆగి, “ఒరే అనంత్, సులోచనను నేను ప్రేమిస్తున్నానురా" అన్నాడు.

సులోచన మంచి అమ్మాయేలే".

అదేమిట్రా, అంత చులాగ్గా అంత క్యాజువల్ గా అనేస్తావ్. సులోచన దేవతరా, దేవత.కల్తీలేని దేవత. అవునొరే. డిన్నర్ టేబుల్ దగ్గర నా గురించి ఏమైనా చెప్పిందా?”

చెప్పిందిలే. నువ్వు అందంగా ఉంటావని అంది" అని అనంత్ సంభాషణలో ఓ ముక్క మాత్రం చెప్పడంతో రాంపండు వెంటనే ఊహాలోకంలోకి వెళ్ళిపోయి, కాస్సేపు విహరించి తిరిగి వచ్చినా ఎదురుగా అనంత్ కనబడటంతో చికాకు పడ్డాడు. “ఒరేయ్, నువ్వు నీ రూం కిపో , నేను వెళ్ళి కవిత్వం రాసుకోవాలి" అని ఆర్డరేశాడు.

పొద్దున్న అనంత్ లేచేసరికల్లా రాంపండు హాజరుగా ఉన్నాడు. కళ్ళు తెరవగానే " ఒరేయ్, సులోచనకు ఆ పేరెందుకు పెట్టార్రా" అని అడిగాడు.

అనంత్ చికాకు పడ్డాడు. “పాచిమొహంతో నేనెవడితోనూ కబుర్లు చెప్పను. అయినా అదేం ప్రశ్నరా? పిల్లలకు పేర్లు వాళ్ళ అమ్మా, నాన్న పెడతారు.”

చవటా, టెక్నికల్ డీటైల్స్ ఎవడికి కావాలోయ్. సులోచన అని పేరు పెట్టి నా కొంప ముంచారు. ప్రాస కుదిరి చావడం లేదు. సులోచనకు ప్రాసగా ఆలోచన తప్ప ఏదీ తట్టడం లేదు. అదే రాధ అనుకో. బాధ, వ్యథ... ఇలా ఎన్నో మాటలున్నాయి. అయినా ఏదో కాస్త కుస్తీ పట్టాను. చదువుతాను విను" అని రాంపండు ఉపక్రమించాడు.

ఒరేయ్, పాచి మొహంతో కబుర్లాడను అంటే, కవిత్వం వింటాను అని కాదు" అని ప్రకటించి అనంత్ బాత్రూం వైపు నడిచాడు. కానీ రాంపండు వదలలేదు. బాత్ రూం బయటే నిలబడి కవిత్వం వినిపించాడు. సులోచన నవ్వు ఎలా ఉందో, నడక ఎలా ఉందో బోల్డంత కవిత్వ సరంజామా సహాయంతో వర్ణిస్తుండగా యతి, సుతి వచ్చిపడ్డారు.

వస్తూనే యతి అందుకున్నాడు. “అనంత్, మై డియర్. వచ్చేశావ్. ఒరే సుతీ నే చెప్పలే.. హియర్ ఈజ్ అనంత్. ఆపదలో ఆదుకునే అనంత్. ఆప్తులంటే పడిచచ్చే అనంత్. అన్నివేళలా అనంత్ నే వాడండి. టింగ్..టింగ్..”

బాకా ఆపు. అసలు రప్పించిన పని ఏమిటో చెప్పు" అన్నాడు వాళ్ళకు కాఫీ ఇమ్మనమని ఆచలపతికి సైగ చేస్తూ.

అదేమిటీ, ఈ పాటికి రాంపండు చెప్పే ఉంటాడేమోననుకున్నా" అన్నాడు సుతి.

వాడా, వాడి గోల వేరే...” అంటుండగానే రాంపండు అడ్డు పడ్డాడు. “అదే..కవిత్వం అంటే వాడికి చెబుతున్నాను స్కీము గురించి ఇంకా రాలేదు" అన్నాడు గబగబా.

సుతి అనుకున్నాడు.”రైట్.. కవిత్వమేరా మనకు డబ్బు తెచ్చిపెట్టేది. స్కీము చెప్తాను విను. ఇక్కడ మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులే. పందాలు కట్టడానికి రేసుల సీజను కాదాయే.. ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే యతి గాడికి ఓ బ్రిలియంట్ అయిడియా వచ్చింది. ప్రస్తుతం ఈ ఏరియాలో ఈ సంచారకవుల బృందం తిరుగుతుంది. రాబోయే ఆదివారం నాడు పది ఊళ్ళల్లో వేర్వేరు కవులు కవిత్వం వినిపించబోతున్నారు. జనాలు లేచిపోయేంత వరకు వీళ్ళు పద్యాలు పాడుతూనే ఉంటారనుకో. అయితే ఎవరు ఎంత ఎక్కువ సేపు పద్యాలు వినిపిస్తారు అన్నదానిమీద పందెం అన్నమాట".

అంటే జనాభా చేత పందాలు కట్టించి వాళ్ళ అంచనాలు కరెక్టయితే కట్టిన దానికి ఇన్ని రెట్లు ఇస్తారన్నమాట "

అంతే కదా, గుర్రాల చరిత్రలాగానే ప్రస్తుతం ఈ తాలుకాలో తిరుగుతున్న కవుల చరిత్ర కూడా సేకరించి అందజేస్తున్నాం. ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళిన ఊళ్లలో ఎంతసేపు కవిత్వం చదివారు, ఎంతసేపు ప్రజల్ని ఆకట్టుకోగలిగారు. అని తెలుసుకోవడానికి సూర్యం అని మన ఫ్రెండుకే ఆ పని అప్పజెప్పాను. వాడు ఊళ్లు తిరిగి అక్కడ వాళ్ళ ఓపిక గురించి, వివరాలు సేకరించాడు. అంతేకాకుండా ఈ తాలూకాలోని ఊళ్ళు తిరిగి క్రితంసారి కవి సమ్మేళనానికి ఇంతమంది వచ్చారు. ఇంత సేపటికీ హాల్లో సగం ఖాళీ అయిపోయింది వంటి సమాచారం కూడా పోగేశాడు. వీటిని బట్టి ఓ చార్ట్ తయారుచేసి ఫలానా కవికయితే ఇన్ని రెట్లు ఇస్తాం అని అనౌన్స్ చేశాం. దాని ప్రకారం ఇప్పటిదాకా యాభై మంది కట్టారు. వచ్చే ఆదివారం మన ఏజెంట్లు ప్రతి ఊళ్లోనూ ఉండి కవిత్వం సెషన్ ఎంతసేపు సాగిందో సెకన్లతో సహా కరక్టుగా రికార్డు చేస్తారు. దాని ప్రకారం పందెం గెలిచినవారికి మనం డబ్బివ్వాలన్నమాట. ఓడిపోయినవారి డబ్బు మన దగ్గరే ఉంటుంది. నష్టపోయే ఛాన్స్ లేదులే. కాకపోతే ఈ స్కీముకి నీ దన్ను ఉందని తెలిస్తే డబ్బు బాగా వస్తుంది. ఈ బిజినెస్ లో నాలుగు డబ్బులు వస్తే మేం కాస్త తలెత్తుకు తిరగవచ్చని ఆశ. అందుకే నిన్ను పిలిచాం".

ఆలోచించిన కొద్ది అనంత్ కి ఈ కవిత్వస్పందాల స్కీము బాగానే ఉందనిపించింది. ఈ లోగా యతి అచలపతిని అడిగాడు. “ఏమోయ్, నువ్వు కూడా పందెం కట్టకూడదు" అని.

అచలపతి సమాధానం చిరునవ్వే,

రెట్టించి అడిగితే "చూద్దాం సర్..ఏ గుఱ్ఱం..అదే ఏ కవి గొంతు ఎలా తిరుగుతుందో తెలియకుండా రిస్క్ తీసుకోలేం కదా" అనేశాడు. అనంత్ ఎక్కువ ఆలోచించకుండానే సరే అనేశాడు.

మూడో రోజు బెట్ లు ముమ్మరంగా కడుతున సమయంలో రాంపండు, యతి, సుతి అనంత్ దగ్గరికి వచ్చారు. “అనంత్, నీకో విషయం చెప్పాల్రా. ఎలాగు విషయం ఇంతదాకా వచ్చేసింది కాబట్టి జరిగిన పొరబాటు నీక