కామ్రేడ్ రాంపండు

 

రాంపండు లీలలు (ఉడ్ హాస్ ఫర్ యూ)

కామ్రేడ్ రాంపండు

ఎమ్బీయస్ ప్రసాద్.

 

హాల్లో అనంత్ గారా? కులాసానా? ఏమిటి పార్కులో తిరుగుతున్నారు? ఇన్ స్పిరేషన్ కోసమా? పలకరింపు విని తలెత్తిన అనంతం, రాంపండు బాబయ్య సింహాద్రిరావుగారిని చూసి తెల్లబోయాడు. ఇన్ స్పిరేషన్ కోసమా? అన్నాడు అయోమయంగా.

అదేనండీ. మీ రచయితలకు ఎక్కడ ఇన్ స్పిరేషన్ వస్తుందో తెలియదు కదా! ప్లాటు కోసం వెతుకుతూ అలా పార్కులు, తోటలు, గుట్టలు తిరుగుతారు కాబోలు... అన్నాడాయన నవ్వుతూ.

అనంతానికి బల్బు వెలిగింది. రాంపండు పెసరట్ల సుబ్బిని ప్రేమించిన గొడవలో వాళ్ళ బాబయ్య దగ్గరికి తీసుకెళ్ళి ఆయన అభిమాన రచయిత కల్పనారాణి తనేనని పరిచయం చేసిన సంగతి గుర్తుకొచ్చింది. అనవసరంగా ఇరుక్కున్నానని ఆవాళే బాధపడ్డాడు. ముసలాయన, 'ఆ కథ ఎలా రాశారు, ఈ నవల ఎలా రాశారు' - అని అడిగి చంపుతున్నాడే! తక్షణం మాట తప్పించకపోతే మాట దక్కదని భయం వేసింది.

 

అబ్బే, కథ గురించి పాట్లు పడనండి. ఇంటిదగ్గర కూచున్నప్పుడు అలా ఓ వేవ్ వస్తే రాసి పారేయడమంతే! ఓసారి రాసేసిన తర్వాత ఆ కథ గురించి ఇక పట్టించుకోను. ఎవరైనా ఏదైనా పాత్ర గురించి అడిగినా ఏమో అనేస్తాను. అంతలా మర్చిపోతానన్నమాట. పార్కుకి సరదాగా వచ్చా! అదిగో ఆ మూల ఆ గడ్డం అబ్బాయి స్పీచి దంచేస్తుంటే తమాషాగా ఉందని వింటున్నాను.

పార్కులో అక్కడక్కడ జనం ఉన్నారు కానీ ఆ ఉపన్యాసం ఇచ్చే మూల మాత్రం జనం బాగానే ఉన్నారు. ఎర్ర విప్లవానికి ఎదురు సన్నాహం వంటి బ్యానర్లు కట్టి ఉన్నాయి. గడ్డం వున్న యువకుడే కాక ఇంకో ఇద్దరు, ముగ్గురూ మనుష్యులు మధ్యలో ఉన్నారు. చుట్టూ జనం మంత్రముగ్ధులయి వింటున్నారు. సమాజంలో డబ్భున్నవాళ్ళు బ్రేక్ ఫాస్టు కి పేదల రక్తం తాగి, పేదల మాంసాన్ని ఫ్రిజ్ లో దాచుకుని లంచ్ కి తింటారని ఆ కుర్రాడు గొప్ప నాటకీయంగా కళ్ళతో చూసినట్టు చెబుతున్నాడు. శ్రోతలంతా ఊగిపోతున్నారు. సింహాద్రిరావు చిరునవ్వు నవ్వాడు. నేను వింటున్నాను, విషయం ఏమయితేనేం, స్వీచ్ మాత్రం అద్భుతంగా ఉంది. మా ఆవిడ షాపింగ్ కాంప్లెక్స్ లో దూరింది. నీకు బోరు కదా, డాళింగ్, పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళి తిరిగొచ్చేయ్ అంది. పార్కులో వాక్ చేస్తుంటే బఠాణీలు చూడగానే నోరూరింది కొందామని వస్తే, అక్కడ ఆ గడ్డం స్పీకరు, ఇటూ మీరూ కనబడ్డారు.

మీ భార్య అంటే... అప్పుడు వంటచేసే వెంకమ్మగారిని చేసుకుంటానన్నారు... ఆవిడేనా? అడిగేడు అనంత్ ఆశ్చర్యంగా.

పాపం అనంత్ కి తెలియదు కానీ ఆవిడ వెంకమ్మ నుండి వెంకటేశ్వరిగా మారి చాలా రోజులయింది. తన లాభం కోసం సింహాద్రి రావు గారి ఛాందసభావాలు పోగొడదామని రాంపండు కల్పనారాణి నవలలు చదివిస్తే, అవి బాగా తలకెక్కి ఆయన వంటావిడని పెళ్ళాడేసి రాంపండు నోట్లో కరక్కాయ కొట్టాడు. ఇంటావిడగా మారుతూనే వంటావిడ పూర్తి పెత్తనాన్ని తన చేతిలోకి తీసుకుంది. అంతకుముందు జీతం డబ్బు పెట్టి గుర్రప్పందాలు ఆడే అలవాటు వల్ల అబ్బిన అశ్వజ్ఞానాన్ని ఎన్ కాష్ చేసుకుందామని గుర్రాలు కొనడం మొదలెట్టింది. మొగుణ్ణి దుమ్ముదులిపి, జుట్టుకు రంగేసి, షోకిల్లాగా తయారు చేసింది. తను అంతకంటే మించిన సీతాకోకచిలుకలా తయారయింది. డబ్బు ఇలాటివాటికి ఖర్చవడం వల్ల పాపం రాంపండు పాకెట్ మనీ దెబ్బతింది. అందువల్ల రాంపండు వాళ్ళ ఇంటికి రాకపోకలు తగ్గించేడు. ఇవన్నీ సగం, సగం చెప్పి సింహాద్రిరావు గారు వాళ్ళావిడ బ్లాక్ యారో అనే గుర్రాన్ని కొందని కూడా చెప్పాడు.

మరి మీరేమీ అనటం లేదూ? అని అడిగేడే కానీ అనంతం నాలిక కరుచుకున్నాడు. లేటు వయస్సులో పెళ్ళాడిన వాణ్ని అడగవలసిన ప్రశ్న కాదనుకుంటూ.

అనడం దేనికండీ? గుర్రాల వ్యాపారం కదా! పైగా అదేదో మంచి గుర్రమట! చాలామంది దానిమీద పందేలు కాస్తారు కూడానట! డబ్బొచ్చే వ్యాపారం ఏదైతేనేం? పైగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా! అన్నాడాయన.

ఖర్చులు పెరుగుతున్నట్టుగానే ఉంది మిమ్మల్ని చూస్తే. క్రితంసారి చూసినప్పుడు అరడజను ఆడపిల్లల తండ్రిలా ఉన్నవాడివి ఇప్పుడు పూలరంగడిలా ఉన్నావు అనుకున్నాడు అనంత్. ఆశ్చర్యంగా ఉపన్యాసం ఇచ్చే ఆ గడ్డపు కుర్రాడు అదే మాటంటున్నాడు అదే సమయానికి! చూడండి, ఆ ముసలాడికేసి! ఆరుగురు ఆడపిల్లల తండ్రిలా కుక్కి మంచంలో పడివుండవలసిన వాడు పూలరంగడిలా పడుచు పెళ్ళాన్నేసుకుని షికార్లు కొడుతున్నాడు అని అరిచాడు సింహాద్రిరావును చూపిస్తూ.

జనమంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడడంతో ముసలాయన ఇబ్బందిగా మొహం పెట్టాడు. నాకూ విప్లవం అంటే ఇష్టమే. ఆ మాటకొస్తే కాలేజీ రోజుల్లో నేనూ కమ్యూనిస్టునే. కానీ ఇలా బొత్తిగా పర్సనల్ గా ఎటాక్ చేయడం మర్యాద కాదంటాను. ఏమంటారు? అన్నాడు అనంతం సానుభూతి కోరుతూ.

అబ్బే, మీరంత ఫీలవక్కర్లేదు. పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటారు, మా హక్కు అని శ్రీ శ్రీ ఎప్పుడో డిక్లేర్ చేసేశాడు. ఇప్పుడు మీరు పబ్లిక్ ప్లేసులో ఉన్నారు కాబట్టి ఇది తప్పదు. మీ ఇంటికొచ్చి అన్నాడంటే తప్పుపట్టవచ్చు. అయినా మీరింత ఫేమస్ అని నాకూ తెలియదు. అన్నాడు అనంతం వెక్కిరింతగా.

నాకూ తెలియదు. నా గురించి వీడెవడికో బాగా తెలుసేమో! అంటుండగానే గడ్డంవాడి కంఠం మళ్ళీ మోగింది. ఆ పూలరంగడితో బాటు నిలబడ్డ పోతుటీగను చూశారా? జీవితంలో ఒక్కరోజు కూడా పనిచేసి ఎరగని ఘటం అది. కష్టజీవులను దోచి తాతముత్తాతలు సంపాదించిన ఆస్తిని అరగదీసి బతుకుతున్న బతుకు వాడిది. ఆంబోతు చేతనైనా పనిచేయించవచ్చేమోకాని వాడి చేత పని చేయించడం దేవుడి... కాదు కాదు అంతరాత్మ తరం కాదు...

ఈసారి కులకడం సింహాద్రిరావు వంతయింది. ఈ లీడర్లకి మంచి ఆరేటరీ ఉంటుందండీ. ఏం చెప్పినా, గొప్ప ఎఫెక్ట్తో చెప్తారు. నాకూ ముచ్చట వేస్తుంది. మీ కథల గురించి కూడా ఏమంటాడో...

అప్పటికే జనాలు వెనక్కి తిరిగి కొరకొరా చూస్తుండడంతో అనంతానికి భయం చేసింది లాక్కెళ్ళి పార్కులో చిత్తుకాగితాలు ఏరిస్తారేమోనని! ఫ్రీడం ఆ ఫ్ స్పీచ్ ఉండాలి గానండి. మరీ ఇంత ఇదిగా ఉండకూడదండి. బైదివే.. నాకూ కాస్త పని ఉంది. వెళ్తా అంటుండగానే సింహాద్రిరావు హేళనగా నవ్వాడు.

పనా? అటువంటిది ఏమీ చేయరని వాడంటున్నాడు... అంటూ.

ఏమాట కామాట చెప్పుకోవాలి. ఈ పోతుటీగ ఇంకోడి పొట్ట కొట్టదు... కానీ ఆ పూలరంగడున్నాడే.. తనను నమ్ముకున్నవారిని నిలువునా ముంచగలడు. నోటి దగ్గర కూడు లాగేయగలడు. వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లో నిప్పులు పోయగలడు.. ఇలాటి వాళ్ళు సంఘానికి పట్టిన చీడపురుగులు.... వీళ్ళని వదల్చడానికి డిడిటీ చాలదు. విప్లవం ఒక్కటే శరణ్యం... గడ్డం వాడు మళ్ళీ అష్టోత్తరం అందుకోగానే సింహాద్రిరావు మొహం జేవురించింది.

మా ఆవిడ షాపింగ్ అయిపోయి ఉంటుంది. వస్తా. అంటూ పరుగు, పరుగున మాయమయిపోయాడు. అనంతం అంతకంటే ముందే పారిపోయాడు.

మర్నాడు క్లబ్బులో అనంతానికి రాంపండు కనబడితే ఏరా కనబడటం లేదు? అంటూ పలకరించాడు.

ఏడిసినట్టుంది. కనబడ్డాను. వినబడ్డాను. నిన్న పార్కులో...

పార్కులో మీ బాబయ్య కనబడ్డాడు. నువ్వెక్కడున్నావ్?

ఉన్నానులే. ఆ గడ్డం వల్ల గుర్తు పట్టలేకపోయుంటావ్

గడ్డమా....? అనంతం ఆశ్చర్యపోయాడు.... అంటే హార్నీ ఆ గడ్డం వక్త... నువ్వా? ఓరి స్కౌండ్రల్!

చూశావా గడ్డం మహిమ! బాల్య మిత్రుడివి నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావ్! గడ్డం అద్దె డబ్బులు కిట్టినట్టే!

నీ కిదేం పోయేకాలం రా!

అసలు నువ్వేమిటి? విప్లవం ఏమిటి! అసలు నీలాటి పక్కా బూర్జువా...

ఒరే, భాష నాది. కాపీ కొట్టకు. అసలు సంగతి విను, ముందు ఈ సుందరాంగి ఫొటో చూసి ఎలా ఉందో చెప్పు... అంటూ జేబులోంచి ఓ ఫొటో లాగేడు.

చంపావ్! మళ్ళీ ప్రేమలో పడలేదుకదా!

మళ్ళీ ఏమిట్రా? ఇదొక్కసారే ప్రేమ! కితంవన్నీ ఒట్టి ఫ్యాన్సీ! పాసింగ్ ఫేజ్! మూర్చ వస్తే ఫిట్ అంటారు చూడు, అలాటివన్న మాట. కాస్సేపు ఉంటుంది. మళ్ళీ పోతుంది. కానీ ఈ వాలెంతింటా ఉంది చూశావూ...

పాపం అనంత్ చూడలేదు. చూసివుంటే పేరులోని తింటా భాగానికి ఆ అమ్మాయి ఎంత న్యాయం చేసిందో కళ్ళారా చూసేవాడు. ఆ పేరుకో కథ ఉంది. వాళ్ళ నాన్న సీతారామయ్య రష్యా వీరాభిమాని. రష్యన్ పేరులా ఉండాలని సీతారామయ్యస్కీ అని మార్చుకోబోయాడు పలకడానికి జనాలు కష్ట పడడంతో స్కీతారామయ్య అని మార్చుకుని తృప్తి పడ్డాడు. కూతురు పుట్టినప్పుడు తొలిమహిళా కాస్మోనాట్ వాలెంతినా తెరిష్కోవా పేరు పెట్టాడు.

స్కూలులో చేర్పించినప్పుడు టీచరు స్పెల్లింగు కుదరక తెరిష్కోవా కత్తిరించి పారేశాడు. వాలెంతినా పేరు వింతగా ఉండడంతో అటెండెన్స్ రిజిస్టర్ లో పేరు రాస్తూ, రాస్తుండగానే మారిపోయింది. మరో టిఏ వచ్చి చేరడంతో టెన్త్ క్లాసుకు వచ్చేసరికి అది చివరికి వాలెం తింటాగా తేలింది. పేరు గురించి తోటి క్లాసు పిల్లలు ఏడిపిస్తూంటే కోపం వచ్చి తింటా, తింటా అని ఛాలెంజి చేసి మరీ తినేసేది వాలెంతింటా! ఆమె కృషి ఫలితంగా పేరులోనే కాకుండా శరీర సౌష్టవం విషయంలో కూడా రష్యన్ మహిళతో పోలిక వచ్చిచేరింది.

అనంత్ అదే అన్నాడు. రష్యన్ అమ్మాయిలా వుంది. ఎక్కడ కలిశావ్? అని.

మొన్న ఓ ఊరెళ్ళి తిరిగొస్తూ బస్సు దొరక్క లారీ ఎక్కాను. టాప్ మీద కూచోబెట్టాడు. తింటా కూడా అక్కడే ఉంది. కాస్త దూరం వెళ్ళాక వర్షం వచ్చింది. గొడుగు తీసి దగ్గరకి రమ్మనమని ఆఫర్ చేశాను. సరేనంది. బోల్డు కబుర్లు చెప్పుకున్నాం...

ఆమెకి గొడుగు పట్టావంటే నువ్వు బాగా తడిసిపోయి వుంటావ్.

కరక్టే! బాగానే గెస్ చేశావే! కానీ నాకూ చలి తెలియలేదురా. ఒంట్లో ఒకటే వేడి. విప్లవం వచ్చాక తను డబ్బున్న వాళ్లందరినీ కత్తిపెట్టి డొక్కలో ఎలా పొడుస్తుందో తింటా వర్ణిస్తూంటే బలే హుషారుగా ఉందనుకో. అసలు తనకీ, వాళ్ళ నాన్నకీ జరిగే ఆర్గ్యుమెంట్స్ నువ్వు విని తీరాలి. వాళ్ళందరినీ తుపాకీతో కాలుద్దామంటాడు స్కీతారామయ్య. కాదు, కత్తే బెటరంటుంది కూతురు. చివరికి ఇద్దరూ కలిసి నన్ను తేల్చమంటారు...

పోయి పోయి నిన్నడగడమేమిటి? నువ్వు ఫలానా అని తెలియదా?

తెలియదు. నేను ఓ పెద్ద విప్లవకారుణ్ని పోలీసులు గుర్తుపట్టకుండా గడ్డం పెట్టుకుని మారువేషంలో తిరుగుతున్నానని అనుకుంటున్నారు. నువ్వు మీ ఇంటికి టీ కోసం పిలిచినప్పుడు వాళ్ళతో ఈ విషయం అనకురోయ్.

నేనెక్కడ పిలిచాను?

పిలిచావులే. నీకు తెలియదు. నన్ను, వాలెంతింటానీ, వాళ్ల నాన్ననీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి పిలిచావు.

సర్లే. రండి. డబ్బున్నవాళ్ళను తిట్టడం, వాళ్ళ తిండి తినడం.

విప్లవం తేవాలంటే బాగా తిండి తినాలోయ్, భగవాన్లూ. పైగా మీ ఇంట్లో తింటున్నామంటే శతృధనం దోస్తున్నట్టేగా, అంటే విప్లవంవైపు ఇంకో అడుగు వేస్తున్నామన్నమాట! బై,బై, వస్తా. రేపు కరీంనగర్ లో మీటింగుంది. స్పీచ్ ప్రిపేర్ చేసుకోవాలి....

టీలో ఉప్పు వాయిస్తానులే. నా ఉప్పు తిన్న విశ్వాసంతో ఈసారి స్పీచ్ లోనన్ను తిట్టకుండా వుంటావ్.

ఒరే, ఉప్పంటే గుర్తుకువచ్చింది. నేను టీ అనడంతో నువ్వు మిస్ లీడ్ అయినట్టున్నావ్. టీ అంటే టీ అనే కాదు, అచలపతికి చెప్పి రొయ్యల వేపుడు, చికెన్ బిర్యానీ, మటన్.... సర్లే నీకు చెప్పినా మర్చిపోతావ్. అచలపతికి నేను డైరెక్టుగా చెప్తానులే... కావాలంటే ఓ దాంట్లో ఉప్పు కాస్త ఎక్కువ వేయించు. ముందే చెప్తే అది వదిలేస్తా...

ఆదివారం మధ్యాహ్నం, అనంతం ఇంట్లో-

అది తింటా, ఇది తింటా, అని వాలెంతింటా ముందుగా చెప్పితింటే అదేమీ చెప్పకుండానే స్కీతారామయ్య తిన్నాడు. వాళ్ళిద్దరూ తిన్నదానికి రెట్టింపు లాగించేడు- వాళ్ళతో పాటు స్కీతారామయ్య అసిస్టెంటు చిన్ మిన్ (అసలు పేరు చిన్నయ్యట)! అసలు రాంపండు ఎజెండాలో చిన్ మిన్ లేడు. రాంపండు సీనులోకి రావడానికి ముందు వాలెంతింటా అతనంటే ఇష్టపడేదిట. కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేసింది. అయినా స్కీతారామయ్య పట్టుదల మీద అతన్నీ పిలవవలసి వచ్చింది.

రాంపండు పరిచయం చేయగానే స్కీతరామయ్య కామ్రేడ్ అనంత్ అని పిలవడంతో అనంత్ ఇబ్బందిగా ఫీలయ్యాడు. కానీ త్వరలోనే అది మర్చిపోయాడు, దానికి మించిన ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావడంతో. మా వాడికి ఇంకా విప్లవం గురించి సరిగ్గా అవగాహన లేదు. నేను వాడిని క్రమంగా మారుస్తున్నాను. ఇప్పడే కామ్రేడ్ అంటే వాడు ఉలిక్కిపడతాడు అని రాంపండు అంటున్నా స్కీతారామయ్య కామ్రేడ్ అంటూనే అన్నాడు. ఇక బక్కచిక్కిన నక్కలా ఉన్న చిన్ మిన్న్ ఉన్నంతసేపూ ఈ అన్నం ఎంతమంది పేదల స్వేదంతో ఉడికిందో అంటూ పద్యాలు పాడాడు. బొర్ర బాగా పెంచినావులే, బుర్ర పగలకొడతా అని పాటలు పాడేడు. అక్కడ బొజ్జ పెంచినది స్కీతారామయ్యే అయినా అదేమిటో అనంతే ఎక్కువగా సిగ్గుపడ్డాడు.

అచలపతి సాధ్యమైనంత వరకూ యజమానిని కాపాడేడు. విప్లవం గురించిన మాట వచ్చినప్పుడల్లా కంచంలో బిర్యానీ వడ్డించేడు. నోటినిండా స్వీట్లు కుక్కాడు. అవన్నీ గబగబా మింగేసి పద్యాలు పాడేడు చిన్ మిన్. స్కీతారామయ్య కూడా తక్కువ తినలేదు. అచలపతి సర్ అని అనంతాన్ని పిలుస్తుంటే చిరాకుపడ్డాడు. కామ్రేడ్ ఆచలపతీ, విప్లవం రానీ, మనందరం కలసి, వీళ్ళందరినీ తందాం. అని ఓదార్చాడు. ఈ మాటలు అస్సలు పట్టించుకోనివాళ్ళు ఇద్దరే! రాంపండూ, వాలెంతింటా. వాళ్ళిద్దరి వ్యవహారాన్నీ బాగా పట్టించుకున్నవాడు ఒక్కడే చిన్ మిన్! ముఖ్యంగా రాంపండు వీపుమీద చరిచినప్పుడు, రాంపండు తింటా బుగ్గ గిల్లినప్పుడు ఆ నొప్