Rating:             Avg Rating:       813 Ratings (Avg 2.98)

మై డియర్ రోమియో - 48

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 48

 

స్వప్న కంఠంనేని


ప్రేమ గొప్పదని అందరూ ఒప్పుకుంటారు.
అయితే అందరూ ప్రేమని ప్రోత్సహించే వారే అయి వుండరు.
అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో ఎప్పుడు పడతారా అని ఎదురు చూస్తుంటారు మంచివాళ్ళు, కవులూ, కతకులూ, కళాకారులు.
ఇక వాళ్ళ ప్రేమ ఎప్పుడు విఫలమవుతుందా అని ఎదురు చూస్తుంటారు కుటిలమతులు, కుతంత్ర జీవులూ, మనకు తెలిసిన ఫలానా ఫలానా వాళ్ళు.

వైభవ్ కాలేజీకి వెళ్ళేసరికి గోడలనిండా వైభవ్, హనితల ప్రేమ వ్యవహారాన్ని గురించి రాసి వుంది. ప్రేమికులకు శత్రువులు ఎప్పుడూ వుంటారు.
ఆ రోజు హనిత కాలేజీకి రాలేదు. వైభవ్ ఆమెకు ఫోన్ చేసి ఈ సంగతిని చెప్పాడు.
మర్నాడు కాలేజీ స్టూడెంట్స్ వచ్చేసరికి కాలేజీ మెయిన్ కాంపౌండ్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి వుంది.
"Yes I Love Vaibhav, So What'' - Hanitha
ఆమె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ గోడల వద్ద గుమిగూడి చూడసాగారు.
అదే సమయానికి హనిత అక్కడికి వచ్చింది. ఆ పూట ఆమె తన అన్న బైక్ సుజుకి సమురాయ్ మీద మగరాయుడిలా వచ్చింది. గుసగుసలాడుకుంటూ అంతా ఆమెకు దారి వదిలారు.
నేరుగా ఆమె ఆ రాతలున్న గోడవద్ద బండికి స్టాండ్ వేసి దాని మీద నిలబడింది.
"అవును నేను వైభవ్ ని ప్రేమిస్తున్నాను. ఆ సంగతిని చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గు పడడంలేదు. గర్వపడుతున్నాను. వైభవ్ ఎవరో తెలుసా? హి ఈజ్ ఏ హీరో ... ఏ రియల్ హీరో! అందుకే నేనతన్ని ప్రేమిస్తున్నాను. మన కాలేజీ గోడల మీదే కాదు. ఈ సిటీ అంతా రాయండి'' అని బండి దిగి స్టార్ట్ చేసి మగరాయుడిలా జుట్టును ఎగరేస్తూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. కాలేజీ లోపలికి మాత్రం కాదు. కాంపౌండ్ బయటికి.
సీరియస్ గా క్లాస్ జరుగుతుండగా నోటీస్ వచ్చింది. హనిత, వైభవ్ లు వచ్చి ప్రిన్సిపాల్ ని వెంటనే కలవాలన్నది ఆ నోటీస్ సారాంశం.
లెక్చరర్ హనిత, వైభవ్ లకు ప్రిన్సిపాల్ ని కలవమని చెప్పింది.
వైభవ్ లేవబోయాడు. అతన్ని ఆగమంటూ "క్లాస్ అయ్యాక వెళ్తాము'' నిర్లక్ష్యంగా చెప్పింది హనిత.
"మీట్ హిమ్ రైట్ నౌ'' కటువుగా చెప్పింది లెక్చరర్.
విసుక్కుంటూ లేచింది హనిత."ప్రతివాళ్ళూ ఇంతే. నన్నసలు చదువుకోనివ్వరు. డిస్టర్బ్ చేస్తుంటారు'' గొణుగుతూ బయటికి నడిచింది.
రూమ్ లోకి వెళ్ళగానే ప్రిన్సిపాల్ వాళ్ళను కూర్చోమన్నాడు.
"కాలేజీ మీ ప్రేమ డ్రామాకు స్టేజ్ కాదు. ప్రేమా, గీమా అన్నారంటే టీసీ ఇచ్చి పంపించేస్తాను'' బట్టతల మీద హనిత మూలంగా ఏర్పడ్డ బొప్పిని తడుముకుంటూ వార్నింగ్ ఇచ్చాడు.
"కానీ సర్ ...'' వైభవ్ ఏదో చెప్పబోయాడు.
"నో మోర్ ఇక్స్ ప్లనేషన్స్. సగం నువ్వీ కాలేజీలో అడుగుపెట్టినప్పట్నుంచీ కాలేజీ ఇలా చీప్ గా తయారయింది'' గాండ్రించాడు ప్రిన్సిపాల్.
హనిత ఇక ఊరుకోలేకపోయింది.
'అసలు ప్రేమంటే ఏమిటో తెలుసా మీకు? బతుకులో ఏనాడన్నా ఎవరినన్నా ప్రేమించారా? అసలు మీ మొహాన్ని ఏ ఆడది ప్రేమిస్తుంది సార్? కనీసం ... కనీసం తమరి పెళ్ళామన్నా తమర్ని ప్రేమిస్తుండా? ఐ డోంట్ థింక్ సో. ఇవాళ ఇంటికి వెళ్ళాక అడగండి తెలుస్తుంది. ఏమన్నారు? మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? మమ్మల్ని మీరు సస్పెండ్ చేస్తారా? మేమే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము. రేపట్నుంచీ మీరీ కాలేజీకి రావద్దు. వచ్చారంటే మీ బోడి బట్టతల మీద టప్ మని పేలినంత ఒట్టు! ఒకే?''
వైభవ్ ఆమెను వారించబోయాడు. కానీ ఆమె ఆగలేదు.
"మన కాలేజీలో ఎన్ని ప్రేమ జంటలున్నాయో తెలుసా? మన కాలేజీలో ఆడపిల్లల్ని దారుణంగా వేధించే హరాస్ చేసే మగ లెక్చరర్స్ వున్నారు. వాళ్ళందరి సంగతీ చూడండి. మా జోలికి మాత్రం రావద్దు'' హిస్టారికల్ గా లెక్చరిచ్చింది హనిత.
ప్రిన్సిపాల్ కి తను అనవసరంగా హనితతో గొడవ పెట్టుకున్నానేమో అనిపించింది. అయినా పైకి మాత్రం బింకంగా "ఏంటమ్మావై! నన్నెవరనుకుంటున్నావు మైండ్ యువర్ టంగ్'' గద్దించాడు ప్రిన్సిపాల్.
"అలాగా! సరే చూడు ఏం చేస్తానో స్టూడెంట్స్ యూనియన్'' గట్టిగా అరిచింది హనిత.
క్షణాలమీద ప్రిన్సిపాల్ రూమ్ ముందు స్టూడెంట్స్ జమయ్యారు.
"జిందాబాద్ ... జిందాబాద్'' అరవసాగారు.
"అర్థమైందా? స్టూడెంట్స్ పవరేంటో? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే కాలేజీ మేనేజ్ మెంట్ మిమ్మల్నే సస్పెండ్ చేస్తుంది జాగ్రత్త. కమాన్ వైభవ్'' వైభవ్ చేతిని పట్టుకుని బయటికి నడిచింది.
తుఫాను వెలిసినట్టుగా ఫీలయ్యాడు ప్రిన్సిపాల్.