సిల్లీ ఫెలో - 100

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 100

- మల్లిక్

"బాబోయ్... ఇలా తర్జనభరజనలు చేసి ప్రయోజనం లేదు. నువ్వు వెంటనే వెళ్ళిపో... ఆ మోహన్ గాడికి ఏదయినా నీకు తోచింది చెప్పు. సీత వీపుమీద చెయ్యితో తోసాడు బుచ్చిబాబు.

బట్టలు తీసెకెళ్ళాలా?" అడిగింది సీత.

"ఊ... నీ సూట్ కేస్ తీసుకుని వెళ్ళు"

"ఇంతకీ ఎన్ని రోజులు వాళ్ళింట్లో వుండాలి?"

"అబ్బా! నేను తర్వాత వచ్చి మాట్లాడ్తా కదా నువ్వెళ్ళు.

"కూరా, చారు అన్నీ అయిపోయాయి. నువ్వు అన్నం మాత్రం వండుకో"

"సరే సరే సరే... నువ్వు పద"

సీత సూట్ కేసు నడుకుని వెనక తలుపుగుండా బయటికెళ్ళి పోయింది.

బుచ్చిబాబు పరుగెత్తుకుంటూ వెళ్ళి ముందు తలుపులు తెరిచాడు.

ఎదురుగా పర్వతాలరావు కోపంగానూ, పార్వతమ్మ అయోమయంగానూ నిల్చుని వున్నారు.

"అదేంట్రా! ఒంటరిగా వుండి హోటల్ తిండి తిని నీ మతేమైనా చలించిందా పాపం?" అడిగింది పార్వతమ్మ.

"కాదు... దెయ్యం పట్టింది తింగరెధవకి" ముక్కులు పొంగిస్తూ అన్నాడు పర్వతాలరావు.

"రండి... రండి" లోపలికి రండి నాన్నా! బాగున్నావా అమ్మా?" అంటూ వారి చేతిలోని సూట్ కేసులు అందుకుని లోపలికి దారి తీసాడు బుచ్చిబాబు.

ఆ ఇద్దరూ అతని వెనకాలే లోపలికి వచ్చారు.

"ఆ! ఏం బాగోడమోలే? నువ్వెళ్ళిన దగ్గర్నుంచి నీ మీద బెంగపెట్టుకున్నా చూడు ఎలా చిక్కిపోయానో పాపం" అంది పార్వతమ్మ.

"నువ్వేం చిక్కలేదు. బాగానే ఉన్నావే" అన్నాడే బుచ్చిబాబు సూట్ కేసులు హాలులో ఓ మూల పెడుతూ.

"ఆ! నోరు తెరిచింది పార్వతమ్మ.

"వచ్చిన వెంటనే మొహాన దభీలున తలుపేసేసి పావుగంట బయట నిలబెట్టి అప్పుడు కుశలప్రశ్నఇస్న్నావా ఏబ్రాసివెధవా? సాలు తలుపులు ఎందుకేసావు? లోపల ఏం వెధవపని చేస్తున్నావు?" మండిపడ్డాడు పర్వతాలరావు.

"జవ్వ...  హవ్వ" మూతి మీద కొట్టుకున్నాడు. "నేనేం వెధవ పని చేస్తాను సిల్లీగా? ఇల్లంతా చాలా కంగాళీగా ఉంది. మీరు అలాగే చూస్తే బాధతో గిజగిజలాడిపోతారని తలుపులేసేసి ఇల్లు నీట్ గా సర్ది తర్వాత తలుపులు తీసా".

"ఏడ్చినట్టేవుంది నీ నిర్వాకం. మరి మమ్మల్ని చూసి అంతచేటున ఎందుకరిచావు?"

"అంటే.. అదీ... ఆనందం పట్టలేక అలా అరిచావన్నమాట."

నిజమేనా అన్నట్టు చూసాడు పర్వతాలరావు బుచ్చిబాబు వంక.

"మీరు కూర్చోండి. నేను కాఫీ కాచి పట్టుకొస్తా" అన్నాడు బుచ్చిబాబు వంటగదిలోకి వెళుతూ.

"అయ్యో! నువ్వు కాఫీ కాయడం ఏంట్రా పాపం... నేనొస్తా పద ని బుచ్చిబాబు వెంటపడింది పార్వతమ్మ.

వంటగదిలోని చారు, కూరగిన్నెలు చూసి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంది పార్వతమ్మ.

"ఏంట్రా? నువ్వు స్వయంగా వంటపని చేసుకుంటున్నావా?"

"హిహిహి... అవునే అమ్మా... నేనే చేసుకుంటున్నా సిల్లీగా!" అన్నాడు బుచ్చిబాబు.

"అయ్యో పాపం! అందుకేరా నాయనా చిక్కిపోయావు."

"నేనే వండుకుంటున్నానంటే అందుకే చిక్కిపోయావ్ అంటావు. నేను వంట చేసుకోకుండా హోటల్లో తింటున్నానంటే హోటల్లో తిండి పడక చిక్కిపోయానంటావు. ఎలాగయినా నువ్వామాట అనడం మాత్రం ఖాయం."

"అదేరా తల్లిప్రేమంటే..." బుచ్చిబాబు నెత్తిన చిన్నగా మొట్టింది పార్వతమ్మ.