సిల్లీ ఫెలో - 80

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 80

- మల్లిక్

 

బస్ స్టాప్ లో సిటీబస్ దిగి ఆఫీసువైపు వేగంగా అడుగులు వేయసాగాడు బుచ్చిబాబు. అతనికి చాలా కంగారుగా ఉంది. వంట తనే చెయ్యడం వల్ల ఆఫీసుకి దాదాపు ముప్పావుగంట ఆలస్యం అయ్యింది.

మళ్ళీ అంతలోనే మేనేజర్ మంగారావ్ రిలీవ్ అయి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చింది. ఆఫీసులో బాస్ అనేవాడు లేడు కాబట్టి కాస్త ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదు అనుకున్నాడు.

ఇందాక సిటీబస్సులో ప్రయాణిస్తున్న, ఇప్పుడు నడుస్తూ వున్నా అతను మాత్రం తన సమస్య గురించే ఆలోచిస్తున్నాడు. అయితే తన ఎప్పటికీ ఇలా కాఫీలూ, టిఫిన్లూ చేస్కుంటూ అన్నం, కూరలు వండుకుంటూ ఉండాల్సిందేనా? సీత ప్లాన్ అర్థం అయ్యింది. ఆ పన్లన్నీ చెయ్యలేక తను సరెండర్ అయిపోయి పెళ్ళి చేస్కుంటానని ఆమె ప్లాన్.

కాదు కాదు...అంది రాధ ప్లాన్! పళ్ళు కొరికాడు బుచ్చిబాబు.

అతను తల్లి పార్వతమ్మకి అప్పుడప్పుడూ వంటలో సాయం చేస్తుంటాడు. కాబట్టి అతనికి కాస్తో కూస్తో వంటొచ్చు! అందుచేత అతనికి వంట తంటా కాదు.

ఎలాగోలా మేనేజ్ చేస్కోగలడు కాబట్టి అతను లొంగడు.

ఎన్నాళ్ళు ఇలా చేస్తుందో చూద్దాం అనుకున్నాడు.

తెచ్చి పెట్టుకున్న కఠినత్వం ఎవరికీ మాత్రం ఎన్నాళ్లుంటుంది?!...

బుచ్చిబాబు ఇలా ఆలోచిస్తుండగానే ఆఫీసు వచ్చేసింది.

బుచ్చిబాబు సీట్లో కూర్చోగానే ప్యూను హడావిడిగా అతని దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు.

"ఏం సార్ ఇంత లేటొచ్చారు?" అన్నాడు ఆయాసపడ్తూ.

"ఏం?... ముప్పావుగంటకే కొంపలు మునిగిపోతాయా సిల్లీగా?' అన్నాడు బుచ్చిబాబు.

"ముప్పావు గంట కాద్సార్.. అయిదు నిమిషాలు లేటొచ్చినా కొంపలు మునిగిపోతాయ్ సార్! కొత్త బాస్ జాయిన్ అయ్యాడు!!"

బుచ్చిబాబు ఉలిక్కిపడ్డాడు.

"ఎప్పుడు? కంగారుగా ప్యూన్ ని అడిగాడు.

"నిన్ననే సార్. ఈయన చాలా స్ట్రిక్టులా ఉన్నాడు సార్.. మీరు రాగానే తన దగ్గరికి పంపమని చెప్పాడు సార్.. త్వరగా వెళ్ళండి సార్!

"అలాగే.. అలాగలాగే..."

బుచ్చిబాబు సీట్లోంచి లేచి తడబడే అడుగులతో బాస్ క్యాబిన్ వైపు అడుగులు వేశాడు.

ఇంట్లో సీతతో వేగుతున్నది కాక ఆఫేసులో ఈ చండశాసన ముండావాడితో సిల్లీగా వేగాలా అనుకున్నాడు. క్యాబిన్ డోరు తెరచి లోపల వున్న వ్యక్తిని చూసి బుచ్చిబాబు ఇంతింత కళ్ళుచేసుకుని, నోరు బోర్లా చాపి అలానే శిలాప్రతిమలా ఉండిపోయాడు.

ఆ కొత్తబాస్ ఎవరో కాదు.

ఏకాంబరం!....

చిత్ర విచిత్ర తిట్ల హారం!

"రావోయ్ రా!.. ఏంటక్కడే నిల్చుండిపోయావ్.. ఆ నోరుముయ్ ఈగలూ, దోమలూ దూరిపోగాలావ్!" అన్నాడు ఏకాంబరం.

బుచ్చిబాబు సర్దుకుని లోపలికి వెళ్ళి ఏకాంబరం ముందు వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. అక్కడే మోహన్ కూడా నిల్చున్నాడు.

"నిల్చున్నావేంటోయ్.. కూర్చో!..." అన్నాడు ఏకాంబరం కులాసాగా నవ్వేస్తూ.

బుచ్చిబాబు ఆ నవ్వుని చూసి కంగారు పడిపోయాడు.