సిల్లీ ఫెలో - 75

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 75

- మల్లిక్

 

మర్నాడు బుచ్చిబాబు ఓ పబ్లిక్ బూత్ నుంచి ఆఫీసుకు ఫోన్ చేసి రెండు రోజులపాటు ఆఫీసుకు రానని చెప్పేశాడు. ఉదయం లేచిన దగ్గర్నుండీ ఆ ఇంట్లో గమ్మత్తయిన ఫార్సు జరుగుతోంది. వీలు చిక్కినప్పుడల్లా రాధా, సుందర్ ఒకరినొకరు కోరచూపులు చూస్కుంటున్నారు. ఇన్ డైరెక్ట్ గా దెప్పి  పొడుచుకుంటున్నారు.

టిఫిన్ గా అందరికీ ఇడ్లీలు పెట్టింది రాధ.

"నాకు ష్పూను మరియు ఫోర్కూ కావలెను. ఇటుల వట్టి షేటులతో తినిన ఎడల అమెరికాలో షూట్ చేయుదురు" అన్నాడు సుందర్.

సీత సుందర్ కీ, బుచ్చిబాబుకీ స్పూను, ఫోర్కులు ఇచ్చింది. రాధకి కూడా ఇవ్వబోతే "వద్దులేవే... నేనేం అమెరికాదాన్ని కాదు కదా. అమెరికా పద్దతులు ఇండియాలో పెడితే ఏం బాగుంటుంది? ఆబగా మనం తింటున్నది ఇండియా ఇడ్లీనేగా! అమెరికా ఇడ్లీ కాదుగా. ఇండియా ఇడ్లీని ఇండియా పద్దతిలో తింటేనే బాగుంటుంది" అంది రాధ సుందర్ వైపు కోరగా చూస్తూ.

"రాడగారూ... ఎవరికీ ఇష్టము వష్షిన పద్దతులలో వారు తిందురు. దీనికి ఇండియా, అమెరికా దేశముల ప్రషక్టి తెచ్చుట అనవషరము" అన్నాడు రాధ వంక సీరియస్ గా చూస్తూ సుందర్.

ఆ సమయంలో ఎందుకోగానీ బుచ్చిబాబు, సీత కూడా ఒకరినొకరు సీరియస్ గా చూస్కున్నారు.

అందరూ టిఫిన్ తినడం మొదలు పెట్టారు.

"పచ్చడిలో ఉప్పు కాస్త ఎక్కువైనట్టుంది కదే సీతా?" అంది రాధ.

"ఏమైనా తిన్నప్పుడు ఇట్లు వంకలు పెట్టిన ఎడల అమెరికాలో షూట్ చేయుదురు" అన్నాడు సుందర్ రాధ వంక కొరకొరా చూస్తూ.

"ఇతరుల అభిప్రాయాలకి విలువని ఇవ్వనివాళ్ళని మా ఆంధ్రలో అప్పడాల కర్రతో కొట్టెదరు" పళ్ళు నూర్తూ అంది రాధ.

"ఓ.. వాటెన్యూసెన్స్" అన్నాడు సుందర్.

 
"అబ్బా.. ఏం తల్నొప్పిరా నాయనా!" అంది రాధ తలపట్టు కుంటూ.

"ఏయ్ రాధా నువ్వూరుకోవే! ఎందుకూ అనవసరమైన గొడవ?" సీత రాధని మందలించింది.

"ఒరేయ్ సుందర్! నువ్వూరుకో... ఎందుకూ అనవసరంగా?" బుచ్చిబాబు సుందర్ ని మందలించాడు.

"ఎస్! ఇప్పుడు అనవసరం! అవషరం వున్నప్పుడు మాట్లాడ్తాం" అన్నాడు సుందర్ ఇడ్లీ ముక్కతుంపుతూ.

టిఫిన్లు అయ్యాయి! కాఫీలు కూడా అయ్యాయి.

అక్కడ ఆ నలుగుర్లోనూ చచ్చేంత టెన్షన్!

ఎవరికీ వారు ఎవరు ముందు ఆ టాపిక్ ఎత్తుతారు అని ఎదురు చూస్తున్నారు.

ముందుగా ఒకరు ఆ టాపిక్ ఎత్తితే మిగతావాళ్ళు దాని గురించి మాట్లాడవచ్చని అనుకుంటున్నారు. కానీ ఎవరూ ఆ టాపిక్ ఎత్తరు.

సరిగ్గా ఆ టైంలో బుచ్చిబాబు ఆఫీసులో పనిచేసే శేఖర్ వచ్చాడు.

"రండి సార్ రండి... ఏంటిలా వచ్చారు?" అంటూ శేఖర్ ని ఆహ్వానించాడు బుచ్చిబాబు.

"ఇప్పుడే ఆఫీసుకెళ్ళాను. మీరు సెలవు పెట్టి ఇంటి దగ్గరున్నట్టు చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను" అన్నాడు శేఖర్.

"ఓ.... అలాగా? అన్నట్టు మర్చిపోయాను. ఇతను సుందర్! నా ఫ్రెండ్, ఈమె సీత, ఆమె ఫ్రెండ్ రాధ" అంటూ పరిచయం చేశాడు.

"ఇంతకీ అర్జంటుగా మా ఇల్లు వెత్తుకుంటూ రావడానికి కారణం?"

"వచ్చేవారం నా పెళ్ళి, ఆఫీసులో అందరికి కార్డ్స్ ఇచ్చాను. ఇంక మీరొక్కరే మిగిలిపోయారు అందుకే వచ్చాను" అన్నాడు శేఖర్ తన హ్యాండ్ బ్యాగ్ లోంచి కార్ద్సు తీస్తూ.

"ఓ.. వాటె పిటీ" అన్నాడు సుందర్ తన కుడిచెయ్యి వెనక్కి పెట్టి పోనీటెయిల్ ఎగరేస్తూ.

"ఏంటండీ?" సుందర్ వంక అయోమయంగా చూస్తూ అన్నాడు శేఖర్.

"ఏం లేదు. ఓ.. వాటె సిటీ అంటున్నాడు మా వాడు. ఈ సిటీ వాడికి బాగా నచ్చిందంట. అంతే.. అంతే! ఇంతకీ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది?" అడిగాడు బుచ్చిబాబు.

"ఆ అమ్మాయి మా ఎదురింట్లో వుంటుంది. మేం ఇద్దరం ప్రేమించుకున్నాం. డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఖాళీగానే వుంటుంది. సిగ్గు పడ్తూ చెప్పాడు శేఖర్.

"ఓ... అయిహ్తే లవ్ మ్యారేజ్ అన్నమాట" చప్పరిస్తూ అన్నాడు బుచ్చిబాబు.

శేఖర్ తెల్లబోయి బుచ్చిబాబు వంక చూసాడు. అతని మొహంలోని ఎక్స్ ప్రెషన్ ఏంటో శేఖర్ కి అర్థం కాలేదు.

"పోన్లెండి! మీరు కొంతమంది మూర్ఖుల్లా కాకుండా ప్రేమించిన అమ్మాయిని చక్కగా పెళ్ళి చేసుకుంటున్నారు" శేఖర్ తో అంది సీత బుచ్చిబాబు వంక కోపంగా చూస్తూ.

"మూర్ఖులే పెళ్ళిచేస్కుంటారు" సీత వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు.

"అదేంటి అలా అంటారు? ఎవరైనా ప్రేమించిన అమ్మాయిని కాదని మరొక అమ్మాయిని చేస్కుంటే మూర్ఖుడుగానీ, ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేస్కుంటే మూర్ఖుడు ఎలా అవుతాడు?" వెర్రి మొహం వేసుకుని చూస్తూ అన్నాడు శేఖర్.

"అసలు ప్రేమించిన అమ్మాయ్, ప్రేమింషలేని అమ్మాయ్ అని ఆలోషన అనవసరము. ఎవరైననూ పెండ్లి చేసుకొనుట మంషి పనికాదని మేము షెప్పుకొన్నాం" అన్నాడు సుందర్.

శేఖర్ కంగారుపడ్డాడు. పొరపాట్న నేను మెంటల్ హాస్పిటల్ కి గానీ రాలేదు కదా? అనుకున్నాడు.

రాధకి అతని అవస్థ చూస్తే జాలేసింది. అతని భావం కూడా అర్థం అయిపోయింది.

"మీరు ఇంకాస్సేపు ఇక్కడే వుంటే  నిజంగానే పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సివస్తుంది ఆ కార్డు ఇచ్చేసి త్వరగా వెళ్ళిపోండి" అంది రాధ శేఖర్ తో.
శేఖర్ బుద్ధిగా తల ఊపుతూ కార్డు మీద శ్రీమతి& శ్రీబుచ్చిబాబు అని రాసి బుచ్చిబాబు చేతికి అందించాడు.


"మీరు కూడా పెళ్ళికి తప్పకుండా రండి" అని రాధ సుందర్లతో అన్నాడు భయం భయంగా చూస్తూ.

"అలాగే" అంది రాధ.

"నేనిక వస్తా. ఇంకా చాలామంది. ఇళ్ళల్లో ఈ దినం కార్డులు" అని నాలుక కరుచుకుని "పెల్లికార్డులు ఇవ్వాలి" అని తడబడే అడుగులతో బయటకి వెళ్ళిపోయాడు.

నలుగురూ సోఫాల్లో సెటిలయ్యాక ఉదయం నుండి వీళ్ళు ఎదురుచూస్తున్న చర్చ మొదలయింది.