సిల్లీ ఫెలో - 52

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 52

- మల్లిక్

 

"కూర్చోవోయ్!" అన్నాడు ఏకాంబరం. తన ఎదురుగా వున్న కుర్చీని బుచ్చిబాబుకి చూపిస్తూ.

"అబ్బే ఫర్లేదు సార్! నేను మీ ఎదురుగా కూర్చోవడం ఏంటీ సిల్లీగా!" మొహమాటపడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"అలా మొహమాటపడతావేంటోయ్ టింగుఠిలాణిలా... ఈరోజు నుండి నీకు నేను బాస్ ని కాదు. మరేం పర్లేదు కూర్చో కూర్చో"

బుచ్చిబాబు మెల్లగా కుర్చీ అంచుమీద కూర్చున్నాడు.

"ఏంటీ... నువ్విప్పుడేమయినా సస్పెన్స్ థ్రిల్లర్ లేదా హారర్ మూవీ చూస్తున్నావా మరీ అలా కుర్చీ అంచుమీద కూర్చున్నావు? హాయిగా వెనక్కి జారగిలబడి కూర్చోవయ్యా బాబూ!"

అలా కుర్చీ అంచుమీది నుండే వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు బుచ్చిబాబు. కునుకుతీసే ప్రోగ్రాం ఏదయినా వేసుకున్నావా? నువ్వో పెద్ద కిల్లారికిత్తెలా ఉన్నావే" విసుగ్గా మొహం పెట్టి అన్నాడు ఏకాంబరం.

బుచ్చిబాబు సర్దుకుని కూర్చుంటూ మెల్లగా అన్నాడు "సార్! ఇప్పుడు మీరు నాకు బాస్ కాదు.. అలా అని మీరే అన్నారు.

"అవును... ఇప్పుడు నేను కాదన్నానా?"

"అంటే ... మరీ.. మీరు కిల్లారికిత్తి అని తిడుతుంటేనూ? నసిగాడు బుచ్చిబాబు.

"ఓహోహో.. నిజమేకదోయ్. ఓరీ! అందుకేనోయ్ నాదంతా కస్కుబుస్కు వ్యవహారమని మా ఆవిడ అంటూంటుంది! సిగ్గుపడుతూ అన్నాడు ఏకాంబరం.

"ఎంతైనా మీ ఆవిడ చాలా తెలివైనవారిలా ఉన్నారు సార్! ఇంతకీ మీరు నన్నెందుకు రమ్మన్నారు సార్?"

"ఏం లేదోయ్... నీ కస్సలు ట్రాన్స్ ఫర్ కావాలనుకుంటే ట్రాన్స్ ఫర్, వద్దనుకుంటే ట్రాన్స్ ఫర్ కాన్సిల్ ఎలా సాధ్యం అవుతుంది?"

బుచ్చిబాబు ఏకాంబరం వంక సందేహంగా చూశాడు.

"మరేం పర్లేదులేవోయ్. నేనెవరికీ చెప్పనులే. చాలా పవర్ ఫుల్ రికమెండేషన్ పెట్టించి వుంటావ్.. కదూ?" కుతూహలంగా అడిగాడు ఏకాంబరం.

"అవును సార్."

"నీకు అంతగా సహాయం చేస్తున్న ఆ డింగాల డిప్పాగాడెవడు?"

"మినిస్టర్ మిన్నారావ్ సార్!" చెప్పాడు బుచ్చిబాబు.

"ఏంటీ? మినిస్టర్ మిన్నారావా? ఈ మధ్యన అతను మా కాలనీలో ఎండుచేపల షాపు ఓపెనింగ్ చేశాడయ్యా"

"అవును సార్. అతనే! సిల్లీగా యే షాపు ఓపెనింగ్ అంటే ఆషాపు ఓపెనింగ్ కి వెళ్తాడు."

"నీకంతగా సహాయపడ్తున్నాడంటే మీకు బంధువో, మీ ఫ్యామిలీ ఫ్రెండోఅయి వుంటాడు కదూ?"

"కాదు సార్. అతను నాకేమీ కాడు, అప్పడు డబ్బులు ఇచ్చి ట్రాన్స్ ఫర్ ఆపుచేయించుకున్నా!"

"అయితే మళ్ళీ డబ్బులిచ్చి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నావా?"

"కాదు సార్"

"మరెలా చేయించుకున్నావ్?"

బుచ్చిబాబు బుర్ర గోకున్నాడు.

"చెప్పు బుచ్చిబాబు... ప్లీజ్... నా లంబాల టింబివి కదూ!" బ్రతిమలాడుతూ అడిగాడు ఏకాంబరం.

"అయినా నేను ఎలా చేయించుకున్నానో తెలుసుకుంటే మీకేం లాభం సార్.

"లాభం వుంది బుచ్చిబాబూ! నేను కూడా ట్రాన్స్ ఫర్ చేయించుకుంటా"

మీరా? ఎక్కడికి?" ఆశ్చర్యంగా అడిగాడు బుచ్చిబాబు.

"గుంటూరుకి! అది మా సొంత ఊరు. ఇక్కడి నుండి మా సొంత ఊరికి వెయ్యమని హెడ్డాఫీసులో ప్రతి కిల్లారికిత్తిగాడిని ఎంతో ప్రాధేయపడుతూ సంవత్సరం పాటుగా అడుగుతూనే వున్నాను. కానీ ఏ డస్కుఢమాల్ గాడూ నాకు సహాయం చెయ్యడం లేదు.. నువ్వు విజయవాడకి ఎలా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నావో చెప్తే నేనూ అదే రూట్ లో వెళ్ళి గుంటూరు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాను!! ప్లీజ్ బుచ్చిబాబూ... నాకీ సహాయం చెయ్యి" ప్రాధేయపడుతూ అన్నాడు ఏకాంబరం.

బుచ్చిబాబు ఇబ్బందిగా మొహం పెట్టాడు.

"ఏం బుచ్చిబాబూ? నాకు సహాయం చెయ్యడం నీకిష్టం లేదా? అడిగాడు ఏకాంబరం బాధగా బుచ్చిబాబు వంక చూస్తూ.

"సరే సార్! మీకు వివరాలేమీ చెప్పను గానీ నేను ఎలా చెపితే అలా చెయ్యండి... మీకు ట్రాన్స్ ఫర్ అవుతుంది' అన్నాడు బుచ్చిబాబు.

"చెప్పు చెప్పు! నా డింగాలడిప్పి" ఆనందంగా, ఆత్రంగా ముందుకు వంగాడు ఏకాంబరం.


*           *               *