సిల్లీ ఫెలో - 51

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 51

- మల్లిక్

 

"హవ్వ... హవ్వ... హవ్వ" నోటిమీద కొట్టుకున్నాడు పర్వతాలరావు.

"హమ్మో...  హమ్మో... హమ్మో..." గుండెలమీద బాదుకుంది పార్వతమ్మ.

"రామ... రామ... రామ...." నొసలు మీద బాధగా కొట్టుకున్నాడు మనసులో మాత్రం సంతోషిస్తూ బుచ్చిబాబు.

"అసలు ఏ వెధవరా నిన్ను ట్రాన్స్ ఫర్ చేసింది?" అన్నాడు పర్వథాలరాఉ.

"ఏమో నాన్నా... హెడ్డాఫీసులో ఎవడో తలమాసిన వెధవ ఈ సిల్లీ పని చేసినట్లు వున్నాడు."

"మొన్నీ మధ్యనే కదరా అబ్బాయ్ నీకు ట్రాన్స్ ఫర్ అయితే కాన్సిల్ చేసారు. మళ్ళీ చేసారేం?" అడిగింది పార్వతమ్మ.

"చెప్పానుకదమ్మా హెడ్డాఫీసులో ఎవడో తలమాసిన వెధవ ఉన్నాడని.. ఇది వాడిపనే"

"వాడు కేవలం తలమాసిన వెధవ కాదురా.. తల తుప్పట్టిన వెధవ! అయినా పోయినసారీ ప్రయత్నించిన ట్రాన్స్ ఫర్ ఆపుకున్నావు కదా.. ఈసారి మళ్ళీ ఏ వెధవనో పట్టుకుని ట్రాన్స్ ఫర్ ఆపుకునే ప్రయత్నం చెయ్యరాదూ?" అన్నాడు పర్వతాలరావు.

"లాభంలేదు నాన్నా.... మావాళ్ళు ఒట్టి సిల్లీఫెలోల్లా వున్నారు. నామాట ఒక్కళ్ళు కూడా వినేలాలేరు. కొన్నాళ్ళు విజయవాడ వెళ్ళి పని చెయ్యి తర్వాత మళ్ళీ హైదారాబాద్ వద్దువుగాని అన్నాడు మా బాస్"

"మీ బాస్ పనికిమాలిన వెధవలావున్నాడు"

"అబ్బాయ్ విజయవాడ వెళ్ళిపోతే ఎలాగండీ... పోనీ ఆపని చేద్దామా? మనం మన ఇంటిని అద్దెకి ఇచ్చేసి అబ్బాయితోపాటు పోదామా?" అంది పార్వతమ్మ.

తల్లిమాట వినగానే బుచ్చిబాబు గుండెల్లో గాభరాపుట్టింది.

"మీరా? నాతోనా? వస్తారా? హవ్వ హవ్వ... హవ్వ..  నేనైతే ట్రాన్స్ ఫర్ అయి చచ్చినట్టు విజయవాడ వెళుతున్నా.. మీకేం ఖర్మ పట్టింది విజయవాడ రావడానికి?" భయం భయంగా తల్లిదండ్రుల వైపు చూస్తూ అన్నాడు బుచ్చిబాబు.

"అదేంట్రా.... ఖర్మ పట్టడం ఏంటీ? అందరం చక్కగా కలసివుంటాం కదండీ!" భర్తవంక చూస్తూ అంది పార్వతమ్మ.

బుచ్చిబాబు మొహం పాలిపోయింది.

అతనిలో టెన్షన్ మొదలయింది. తను పడిన శ్రమంతా వృథాఅయ్యేలా వుంది.

తండ్రి ఏమంటాడోనని ఆందోళనగా ఆయనవంక చూశాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు పనిచేసే ఆఫీసు.

మీటింగు హాల్....

సమయం సాయంత్రం ఆరుగంటలు.

ఆ మీటింగుహాల్ లో బుచ్చిబాబుకి విజయవాడకి ట్రాన్స్ ఫర్ అయిన సందర్భంగా ఫేర్ వెల్ పార్టీ జరుగుతోంది. అందరూ బుచ్చిబాబు గురించి తలా అయిదేసి నిమిషాల చొప్పున మాట్లాడారు. ఆఖరున ఏకాంబరం బుచ్చిబాబు గురించి మాట్లాడం మొదలుపెట్టాడు.

అయిదు నిముషాలు గడిచాయి. ఏకాంబరం ఏదేదో మాట్లాడుతూనే వున్నాడు. అది ఫేర్ వెల్ పార్టీలో ఇస్తున్న ప్రసంగం కాబట్టి బుచ్చిబాబుని పొగుడుతున్నాడని అక్కడివాళ్ళు అనుకున్నారుగానీ లేకపోతే అతను బుచ్చిబాబును తిడుతున్నాడో, పొగుడుతున్నాడో వాళ్ళకే తెలిసేదికాదు.

ఏకాంబరం ధాటిగా మాట్లాడసాగాడు.

"మరి ఆఫీసులో పని విషయానికొస్తేనో? బుచ్చిబాబు లింగులిటాకి! అలాగే అతను ఏదయినా డ్రాప్టింగ్ చేస్తే డింగుటికా! ఆ విధంగా అతన్ని హోల్ మొత్తంగా చూస్తే టింగు పింగాణీ! బుచ్చిబాబు విజయవాడలో మరింత లింగులిస్కులా పనిచేసి మంచిపేరు తెచ్చుకుంటాడని ఆశిద్దాం! అయ్ విష్ హిమ్ ఆల్ సక్సెస్ " అంటూ కూర్చున్నాడు.

అందరూ చప్పట్లుకొట్టారు. ఆ తర్వాత బుచ్చిబాబుకి ఓ మొమెంటో యిచ్చారు.

దాని తర్వాత స్టాఫ్ స్నాక్స్ తిని కాఫీ తాగారు.

అందరూ బుచ్చిబాబుకి బేస్ విషెస్ చెప్పారు.

అందరి దగ్గరా శలవు తీసుకుని వెళ్ళిపోయే
సమయంలో ఏకాంబరం బుచ్చిబాబుని తన క్యాబిన్ లోకి తీసుకెళ్ళాడు.