సిల్లీ ఫెలో - 50

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 50

- మల్లిక్

 

"రా.... రా కూర్చో! పాపం నామీద అభిమానంతో అంత దూరం నుండి వచ్చావ్. హి... హిహి! బలవంతంగా నవ్వు తెప్పించుకుని నవ్వుతూ అన్నాడు మినిస్టర్ మిన్నారావ్.

బుచ్చిబాబు మినిస్టర్ మిన్నారావ్ ఎదురుగా సోఫాలో దర్జాగా కూర్చున్నాడు.

అప్పుడే ఫోన్ మోగింది.

"హలో... ఆ నేనే మిన్నారావ్ ని. మినిస్టర్ మిన్నారావ్ ని! ఏంటీ బ్రోతల్ హౌస్ ఓపెనింగా? అబ్బ ఇప్పుడు కాదులేవయ్యా... ఓ ముఖ్యమైన మీటింగ్ లో వున్నా.. తర్వాత ఫోన్ చెయ్యి..." అంటూ ఫోన్ పెట్టేశాడు మిన్నారావ్.

"చెప్పు బుచ్చిబాబూ.. ఏం తాగుతావ్? కాఫియా, కూల్ డ్రింకా?" అడిగాడు మినిస్టర్ మిన్నారావ్ బుచ్చిబాబుని.

"అబ్బే... ఏం వద్దులెండి... నేను వెళ్తాను. అసలే మీరు బ్రోతల్ హౌస్ ఓపెనింగ్ కి కూడా వెళ్ళాలి" సోఫాలోంచి లేవబోతూ అన్నాడు బుచ్చిబాబు.

"కూర్చో కూర్చో.. సరేగానీ నిన్నేదో అడిగావే... నీ ట్రాన్స్ ఫర్ విషయం గురించి. ఏంటది? మళ్ళీ నిన్ను విజయవాడకే వేయించాలని కదూ?" ముందుకు వంగి బుచ్చిబాబు మొహంలోకి చూస్తూ అడిగాడు మినిస్టర్ మిన్నారావ్.


*             *             *

సీత పకపకా నవ్వింది.

"అయితే మినిస్టర్ మిన్నారావ్ గాడిని భలే ఏడిపించావన్నమాట" అంది నవ్వాపుకుంటూ.

"మరి? లేకపోతే నాతోనే అమర్యాదగా మాట్లాడతాడా?" అన్నాడు బుచ్చిబాబు.

"అయితే నీకు విజయవాడకి ట్రాన్స్ ఫర్ తప్పకుండా చేయిస్తారంటావా?"

"చచ్చినట్టు! ఎవరికోసం!!"

కొన్ని క్షణాలు ఆగి సీత సందేహంగా ఇలా అంది.

వాడు నీకేం హాని తలపెట్టడు కదా?

"వాడా? భలేదానివే? నేనంటేనే భయపడి చస్తున్నాడు సిల్లీఫెలో. వాడి జుట్టు నా చేతిలో వుంది... చూస్తూ వుండు. మరో వారం రోజుల్లో ట్రాన్స్ ఫర్ ఆర్డర్ నా చేతిలో వుంటుంది." గర్వంగా అన్నాడు బుచ్చిబాబు.

"నిజంగానా?"

"ఊ... టాన్స్ ఫర్ ఆర్డర్ రాగానే రిలీవ్ అయిపోయి మనం విజయవాడ వెళ్ళిపోదాం..." ఉత్సాహంగా అన్నాడు బుచ్చిబాబు.

కొన్నిక్షనాల నిశ్శబ్దం తరువాత సీత బుచ్చిబాబు భుజం మీద ఒరుగుతూ మెల్లగా అడిగింది.

"బుచ్చీ.. నన్ను అన్యాయం చేయవుగా?"

"లేదు సీతా... నేనలాంటి సిల్లీ పన్లు ఎన్నటికీ చెయ్యను" అన్నాడు బుచ్చిబాబు సీత తల నిమురుతూ.

"సార్.. పార్క్ మూసేసే టైం అయ్యింది. మీరిక లేవాలి"

పార్కు కాపలావాడి మాటతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరూ.


*       *              *


"ఎందుకు సార్ పిలిచారంట?" ఏకాంబరం ఎదురుగా నిలబడి అడిగాడు బుచ్చిబాబు.

ఏకాంబరం ఉలకలేదు. పలకలేదు. నిలువు గుడ్లేసుకుని బుచ్చిబాబునే చూస్తున్నాడు.

"సార్... మిమ్మల్నే సార్" స్వరం కాస్త పెంచి అన్నాడు బుచ్చిబాబు.

ఏకాంబరం కళ్ళు టపటపలాడించాడు.

"ఏంటో.. నువ్వు సిల్లీఫెలోవని అనుకున్నాగానీ.... నువ్వు సామాన్యుడివి కావయ్యోవ్.. గొప్ప కిష్కికిలాడివి" అన్నాడు.

"ఎందుకు సార్ అలా అంటున్నారు? నేనేదో కంపెనీ క్యాష్ కొట్టేసిన వాడినైనట్టు.

"కంపెనీ క్యాష్ కొట్టడం ఏముందయ్యా...

డస్కుఢమాల్ గాడయినా చెయ్యగలడు... నీలాగా ఎవరయినా చెయ్యగలరా?"

"నేనేం చేశాను సార్?" అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు.

"అబ్బ... ఎంత అమాయకుడిలా ఫోజ్ కొడ్తావోయ్... ఇదిగో ఈ లెటరు హెడ్డాఫీసు నుంచి ఇప్పుడే వచ్చింది. నీకు తెలియకుండానే వచ్చిందంటావా?" అంటూ ఆ లెటర్ బుచ్చిబాబు చేతికి ఇచ్చాడు ఏకాంబరం.

బుచ్చిబాబు ఆ కాగితాన్ని చూశాడు.

అది హెడ్డాఫీసు ఆర్డర్... బుచ్చిబాబుని హైదరాబాద్ నుండి విజయవాడకి ట్రాన్స్ ఫర్ చేస్తూ....

"కేవ్!"

సంతోషంతో గట్టిగా అరిచాడు బుచ్చిబాబు.

ఆ అరుపుకి ఏకాంబరం ఉలిక్కిపడ్డాడు.

"అబ్బ... ఎంతచేటున అరిచావయ్యా బాబూ... ఉలిక్కిపడి చచ్చా... నీ టంగు టస్కు మండ".

కోటు ముందుకు లాక్కుని "థూ... థూ..." అని ఛాతిమీద అనుకున్నాడు ఏకాంబరం.


*             *           *