సిల్లీ ఫెలో - 47

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 47

- మల్లిక్

 

బుచ్చిబాబు ఇంటికెళ్ళేసరికి అతనికోసమే పర్వతాలరావు, పార్వతమ్మ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

"ఏరా వెధవాయ్... ఇంతసేపూ అడ్డగాడిదలా ఎక్కడ తిరిగావ్? ఇందాకటి నుండి నీకోసమే ఎదురుచూస్తున్నాం" అన్నాడు పర్వతాలరావు.

"గుమ్మంలో అడుగు పెట్టీపెట్టగానే ఏంటండీ ఆ పాడు తిట్లూ పాపం" అంది పార్వతమ్మా.

"నావి పాడు తిట్లయితే మంచి తిట్లు చెప్పరాదూ? ఆ తిట్లే తిడతాను"

"అది కాదురా అబ్బాయ్. ఇలా కూర్చో.. నీతో ఓ మంచి విషయం చెప్పాలి" అంది పార్వతమ్మ.

బుచ్చిబాబు వాళ్ళ దగ్గర కూర్చున్నాడు.

"ఏంటో నీ మొహం చూస్తుంటే నువ్వెంత బాధపడుతున్నావో తెలుస్తుంది. ఆ సీత సంబంధం పోతే పోయింది. ఒట్టి వగలమారిది, దరిద్రపు గొట్టుది."

పార్వతమ్మ సీతని అలా తిడుతుంటే బుచ్చిబాబుకి చాలా బాధేసింది.

"ఏంటమ్మా! సీతని ఊర్కే ఎందుకు తిడతావు?" అన్నాడు వారిస్తూ.

"ఊర్కే తిట్టడానికి నాకేమయినా నోటి దురదా ఏంటీ. నేను కాబట్టి మామూలు తిట్లు తిడుతున్నా... అదే మీ నాన్నగారిలాంటోళ్ళు పచ్చిబూతులు తిడతారు అలాంటి నీతీజాతీ లేనివాళ్ళని"

"ఏం. నీ కంటికి నేను బూతులు మాట్లాడే అలాగా వెధవలా కనిపిస్తున్నానా?" విసుగ్గా భార్యవంక చూస్తూ అన్నాడు పర్వతాలరావు.

అయినా సీత పర్సనల్ విషయాల గురించీ, ఆమె క్యారెక్టర్ గురించీ మనకి అనవసరం. ఆమె సంబంధం వద్దని అనుకున్నప్పుడు ఆమె గురించి మనకెందుకు?" అన్నాడు బుచ్చిబాబు.

"అదీ నిజమేలే బాబూ" దీర్ఘాలు తీస్తూ అంది పార్వతమ్మ.

"అయినా అసలు విషయం చెప్పడం మాని ఇంకేంటో మాట్లాడతావేం?" మిర్రి మిర్రి చూస్తూ అన్నాడు పర్వతాలరావు.

"అదేరా... మీ సూర్యం మామయ్య లేడూ?" అంది పార్వతమ్మ.

"ఏదీ.. ఎప్పుడూ సిల్లీగా మాట్లాడే ఆ నీచ నికృష్టమైన మామయ్యేనా?" అడిగాడు బుచ్చిబాబు.

"ఛాల్లే ఊర్కోరా... అతనునీచ నికృష్టుడు ఎందుకయ్యాడు... పాపం చాలా మంచాడ్రా"

"వీడికంతేలే. ప్రతి వెధవా నీచనికృష్టిడిలానే కనిపిస్తాడు" పళ్ళు నూరాడు పర్వతాలరావు.

"అయినా అతడు మంచాడయితే నాకేం కాకపోతే నాకేం?" అన్నాడు బుచ్చిబాబు.

"నీకు కాకపోతే మరెవరికిరా? సూర్యం మామయ్య కూతురు నీకు తెలుసుగా?"

"నాకు తెలీదు"

"తెలియకపోయినా పర్లేదు. బంగారు బొమ్మలా వుంటుంది. అసలు ఆ పిల్ల గురించే మనకి ఇన్నాళ్ళూ గుర్తుకు రాలేదు. ఈవేళ ఏమీ తోచక ఫోటో ఆల్బంలు చూస్తుంటే ఆ అమ్మాయి ఫోటో కనిపించింది." చెపుతూ అంది పార్వతమ్మ.

"ఇప్పుడు ఆ విషయాలన్నీ నాకెందుకు చెపుతున్నారు?" అనుమానంగా చూస్తూ అడిగాడు బుచ్చిబాబు.

"ఆ సీత సంబంధం ఎలాగూ తప్పిపోయింది. నువ్వు సూర్యం మామయ్య కూతుర్ని చేసుకుంటే బాగుంటుందనీ."

"బాగుంటుందా? ఎవరికీ? నాకా, మీకా, సూర్యం మామయ్యకా లేకపోతే ఆ అమ్మాయికా?" విసుగ్గా అడిగాడు బుచ్చిబాబు.

"ఏమేవ్! ఈ వెధవకి కాస్త పైత్యం ముదిరినట్టుంది. అల్లం రసం ఇవ్వు" అన్నాడు పర్వతాలరావు.

"అయితే ఇప్పుడు నువ్వేమంటావ్? ఆ పనికిమాలిన పిల్ల అలా చేసిందని బాధపడుతూ జీవితాంతం పెళ్ళీపెటాకులు లేకుండా ఉంటావా?" అడిగింది పార్వతమ్మ.

"అలాగని నేననలేదే. ప్రస్తుతానికి నాకు పెళ్ళి చేసుకునే మూడ్ లేదు. ఇంక ఆ విషయం గురించి నా దగ్గర సిల్లీగా ప్రస్తావించకండి."

బుచ్చిబాబు చివాలున లేచి చకచకా తన గదిలోకి వెళ్ళిపోయాడు.