సిల్లీ ఫెలో - 45

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 45

- మల్లిక్

 

రాధ సీత వంక నోరు తెరుకును చూసింది.

"అయితే బుచ్చిబాబు చెప్పినదానికి నువ్వు ఒప్పుకున్నావా?"

"ఒప్పుకోక ఏం చెయ్యమంటావ్? అతనితో తెగతెంపులు చేస్కోమంటావా? బుచ్చిబాబుకి దూరంగా నేనుండలేను" అంది సీత.

"అలాగని నీ జీవితాన్ని బలిపెడతావా?"

"ఛీఛీ... బుచ్చిబాబు అలాంటివాడు కాదు. అన్యాయం చెయ్యడు. ఏదో సిల్లీగా ఆలోచిస్తున్నాడు అంతే!"

"మరీ ఇంత సిల్లీగానా? అయినా అతను చెప్పింది ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ అందరికీ తెలుసు మీరు భార్యాభర్తలు కాదని! అసలు అతని అమ్మానాన్నలు ఎలా ఊరుకుంటారు?"

"అందుకేగా అతను వేరే ఊరికిపోయి కాపురం పెడదాం అంటున్నాడు. విజయవాడకి ట్రాన్సుఫర్ ట్రయ్ చేస్తానన్నాడు" చెప్పింది సీత.

"మరి నీ విషయం ఏమిటి?"

"నేను లాంగ్ లీవ్ పెట్టి అతనితో పాటు విజయవాడ వెళతాను."

"ఏంటో ... నువ్వు చెప్పింది విని నేను జీర్ణించుకోలేకపోతున్నా"

"కానీ తప్పదు బుచ్చిబాబు చెడ్డవాడు కాదని నాకు తెలుసు. కొన్ని రోజులు పోతే తన ఆలోచనలు తప్పని తెలుసుకుంటాడు. అప్పుడు అందరిముందు నన్ను పెళ్ళి చేస్కుంటాడు"

"ఒకవేళ తన తప్పును అతను గ్రహించకపోతే?"

సీత ఆలోచనలో పడింది.

అవును... అతను గ్రహించకపోతే?


*          *           *

మినిస్టర్ మిన్నారావ్ ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు బుచ్చిబాబు.

"ఛీ.. సమయానికి వెధవ ఇంట్లో లేకుండాపోయాడు."

వెంకట్రావ్ ను తిట్టుకున్నాడు బుచ్చిబాబు.

మినిస్టర్ మిన్నారావు ఇంటికి వెంకట్రావుని తోడుగా తీసుకుని వెడదామని అనుకున్నాడు బుచ్చిబాబు. కాని వెంకట్రావు పనిమీద సొంత ఊరికి వెళ్ళాడు. అయినా మినిస్టర్ మిన్నారావుకి ఓసారి పరిచయం అయ్యాడు కదా అని తనే స్వయంగా రిక్వెస్టు చేద్దామని బయలుదేరాడు.

నిజానికి వెంకట్రావ్ ఊరినుండి వచ్చేదాకా అగొచ్చు కానీ ఈలోగా లీత మనసు ఇకడ మారిపోతోందోనని బుచ్చిబాబు భయం. అందుకే త్వరగా విజయవాడకి ట్రాన్సు ఫర్ చేయించుకుని వెంటనే అక్కడికి వెళ్ళిపోయి సీతతో కాపురం పెట్టేయ్యాలని అతని ఆత్రం. బుచ్చిబాబు మిన్నారావు ఇంటిగేటును సమీపించగానే గేటుదగ్గర గూర్ఖా బుచ్చిబాబుని గుర్తుపట్టి సెల్యూట్ చేశాడు. బుచ్చిబాబు దర్జాగా తల ఊగించి లోపలికి వెళ్ళాడు.

బుచ్చిబాబు డోర్ బెల్ నొక్కాడు.

కొన్ని క్షణాల తర్వాత మినిస్టర్ మిన్నారావు భార్య వెంకటలక్ష్మి తలుపు తీసింది. బుచ్చిబాబుని ఆమె గుర్తుపట్టింది.

"ఓ నువ్వా బాబూ! ఏంటీ?" అని అడిగింది.

"మినిస్టర్ గారున్నారండీ?" అడిగాడు బుచ్చిబాబు.

"ఉన్నారుగానీ నీ పేరేంటో మర్చిపోయానుగానీ.. ఏమని చెప్పమంటావ్?"

"నా పేరు బుచ్చిబాబు. కానీ లా చెప్పకండి. వీరేశం తాలూకు అని చెప్పండి."

"అట్టాగే"

ఆవిడ లోపలికి వెళ్ళి అరనిముషంలో బయటకొచ్చింది.