సిల్లీ ఫెలో - 42

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 42

- మల్లిక్

 

"సార్... వేడి వేడి శనగలు, బఠానీలు కావాలా సార్?" ఆ కుర్రాడు భర్తని అడిగాడు.

"వద్దు బాబూ.. వెళ్ళు" కాస్త చికాకుగా సమాధానం చెప్పాడు భర్త.

బఠానీలు అమ్మే కుర్రాడు రెండడుగులు ముందుకు వేశాడు.

"ఇదిగో బాబూ... ఇలారా" అంటూ భార్య వాడిని పిలిచింది.

ఆ కుర్రాడు బేరం తగిలిందన్న ఆనందంతో మళ్ళీ వాళ్ళ దగ్గరకి వచ్చాడు.

"వాడినెందుకు పిలిచావు?" భార్యవంక క్రూరంగా చూస్తూ అడిగాడు భర్త.

"వాడితో అష్టాచమ్మా ఆడదామని పిలిచా.... లేకపోతే ఏంట్రా ప్రశ్న? నాకా బఠానీలు తినాలపించి పిలిచా" ఆవిడ సీరియస్ గా సమాధానం చెప్పింది.

"ఏం అక్కర్లేదు. నువ్వెళ్ళరా" బఠానీలు అమ్మే కుర్రాడి వక చికాకుగా చూస్తూ అన్నాడు భర్త. 

"నువ్వుండు బాబూ... రెండు రూపాయలు బఠానీలు ఇవ్వు" అంది భార్య.

"నాకు ఇలా రోడ్డుమీద బఠానీలు, శనగలు తినడం ఇష్టంలేదని చెప్పానా?"

"ఇది రోడ్డుకాదు పార్కు. అయినా మీకు ఇష్టం లేకపోతే మీరు తినకండి... నాకు ఇష్టం నేను తింటాను.

"ఛీ... అన్నీ లేకి బుద్ధులు, లేకి అలవాట్లు. మీ వంశమే అంత!" అన్నాడు చీదరగా మొహం పెట్టి భర్త.

"మాట్లాడితే మా వంశం మాటెత్తుతారేం? మాది లేకి వంశం అయితే మీది దరిద్రగొట్టు వంశం" మండిపడింది భార్య.

"మాటలు తిన్నగా రానియ్. లేకపోతే పళ్ళు రాల్తాయ్".

"బఠానీలు తింటే పరువు తక్కువగానీ పబ్లిక్ ప్లేస్ లో భార్య మీద ఇంత పెద్ద గొంతేసుకుని నానా మాటలు అంటే పరువు తక్కువ కాదనుకుంటా"

"నోర్మూయ్..... అతిగా మాట్లాడకు" అరిచాడు భర్త.

బఠానీలు అమ్మే కుర్రాడు నీకెందుకొచ్చిన గొడవ అని అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు.

"హు.. పెళ్ళి కాకముందు నా వెనకాల పడి నేను వద్దన్నా అన్నీ కొనిచ్చేవారు. ఇప్పుడు ఆఫ్ట్రాల్ బఠానీలు తినాలన్నా మీచేత అడ్డమయిన మాటలు పడాల్సివస్తుంది. ఛీ... ఛీ... మీతో బయటికొచ్చే కంటే ఇంట్లో ఓ మూల కూర్చుని వుండడమే మేలు" అంటూ ఆమె చివాలున లేచి పార్కు బయటికి చరచరా నడిచి వెళ్ళిపోయింది. ఆమె భర్త కూడా ధుమధుమ లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు.

జరిగిన తంతు అంతా బుచ్చిబాబుతో పాటు సీతకూడా చూసింది.

"చూశావా! వాళ్ళు కూడా ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నవాళ్ళే. ఇప్పుడు చూడు వాళ్ళ సంసారం సిల్లీగా ఎలా ఏడ్చిందో?" సీతతో మెల్లగా అన్నాడు బుచ్చిబాబు.

"అందరూ అలా వుండరు కదా?" అంది సీత.

"అందరూ అలాగే వుంటారు"

"అయితే ఏమంటావ్?" పెళ్ళి చేసుకోనంటావు? సరే అలాగే. అది నీ పర్సనల్ విషయం. నీ దారి నీది. నా దారి నా దారి ఒక్కటే. నాకు నువ్వు కావాలి" సీత చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"నీ ఉద్దేశం ఏమిటి? నువ్వు పెళ్ళి చేస్కోవు గాని నీకు నేను కావాలి! నీకు ఉంపెడుగత్తెగా ఉండమంటావా?" అతని చేతిలోంచి తన చేతిని లాక్కుంటూ అంది సీత. 

బుచ్చిబాబు ఆమె మాటలకు బాధపడ్డాడు.