సిల్లీ ఫెలో - 41

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 41

- మల్లిక్

 

రెండు రోజులుగా బుచ్చిబాబు సీతని కలవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీత ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆమె ఆఫీసుకు రావడం లేదని చెప్పారు. పోనీ ఆమె ఉంటున్న వర్కింగు ఉమెన్స్ హాస్టల్ కి ఫోన్ చేస్తే రూమ్ లో లేదని సమాధానం!

సీత ఉండీ లేదని చెప్పిస్తోందని బుచ్చిబాబుకి అనిపించింది.

చివరకి మూడోరోజు అఫీసుకుకు ఫోన్ చేస్తే సీత దొరికింది. నీతో మాట్లాడాలి, పార్కుకి రమ్మని బుచ్చిబాబు సీతను కోరితే ఆమె నిరాకరించింది. కానీ అది మన భవిష్యత్తుకి సంబంధించిన విషయం. చాలా ముఖ్యమైన విషయం అని బుచ్చిబాబు బ్రతిమలాడితే చివరికి సరేనంది సీత.

సాయంత్రం ఆరు గంటలైంది.

అప్పటికీ అరగంట నుండీ బుచ్చిబాబు సీత కోసం అక్కడ రెస్ట్ లెస్ గా ఎదురుచూస్తున్నాడు. అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. అయిదున్నరకే వస్తానన్న సీత ఆరు అయినా రాలేదేంటి? తను ఊరికే బలవంతం పెడ్తుంటే అప్పటికి వస్తానని అందేమో?" సీత రాదేమో?

బుచ్చిబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు. సీత పడ్తున్న బాధ బుచ్చిబాబుకి తెలుసు. కానీ సీత బాధపడ్తుంది కదా అని కరిగిపోయి "సరే సీతా... నీ ఇష్టం" అంటే తన ఆదర్శం మొత్తం నాశనం అవుతుంది.

సీత ఇప్పుడు బాధపడినా తర్వాత తపక ఆనందిస్తుంది. తన బాధంతా ఇద్దరి ఆనందం కోసమే కదా! భవిష్యత్తులో తమ జంట ప్రేమించుకునే యువతీ యువకుల జంటలకు ఆదర్శం కావాలి. బుచ్చిబాబు ఆలోచనలు ఇలా సాగుతూ వుండగానే మరో పావుగంట గడించింది. ఈలోగా బుచ్చిబాబు కూర్చున్న బెంచికి కాస్త దూరంలో వున్న మరో బెంచిమీద భార్యాభర్తల జంట ఒకటి వచ్చి కూర్చుంది.

వాళ్ళని చూడగానే బుచ్చిబాబుకి వాళ్ళు భార్యాభర్తలని అర్థం అయిపోయింది.

ఇద్దరి మొహాల్లో నిరాసక్తత, ఎవరి బలవంతం మీదో పార్కుకి వచ్చినట్టు!

ఒకరి మొహంలో చిరునవ్వులేదు. మొగుడు ఒక దిక్కుకి చూస్తుంటే పెళ్ళాం మరోవైపు చూస్తోంది.

ఓ మాటా మంతీ ఏమీ లేదు.

ఇలాంటి జీవితాన్నా సీత కోరుకుంటుంది?

నో.... అలా కాకూడదు. ఎలాగైనా సరే సీత కళ్ళు తెరిపించాలి అనుకున్నాడు.

కానీ సీత వస్తేగా?

సీత వస్తానన్న సమయానికి అప్పుడే ముప్పావుగంట ఆలస్యం అయిపోయింది.

సీత ఇంక రాదు అన్న నిర్ణయానికి వచ్చిన బుచ్చిబాబు ఇంటికి వెళ్ళిపోవాలని బెంచిమీద నుంచి లేచి నిలబడ్డాడు.

అదే సమయంలో దూరంగా సీత రావడం అతనికి కనిపించింది. బుచ్చిబాబుకి ఆనందం కలిగింది. అతని మనస్సు కాస్తంత తేలికపడింది. కాని సీతని తను అనుకున్న విషయంలో వప్పించడం అంటే అంత తేలికయిన విషయం కాదని అతనికి తెలుసు.

సీత బుచ్చిబాబుని సమీపించింది.

"రా.... సీతా....రా! కూర్చో!" అన్నాడు బుచ్చిబాబు.

సీత మెల్లగా బెంచిమీద కూర్చుంది. ఆమె మొహంలో ఏ విధమయిన ఎక్స్ ప్రెషన్ లేదు. బుచ్చిబాబు కూడా ఆమె ప్రక్కన కూర్చున్నాడు.

"ఇంత ఆలస్యం అయితే నువ్విక రావేమో అనుకున్నాను" అన్నాడు బుచ్చిబాబు.

"ఆఫీసులో అర్జంట్ పనేదో తగిలి ఆలస్యం అయింది" చెప్పింది సీత బుచ్చిబాబు మొహంవంక కాకుండా ఏటో చూస్తూ.

"నామీద కోపం వచ్చిందా?" మెల్లగా అడిగాడు బుచ్చిబాబు.

సీత 'ఊ' అనలేదు. 'ఆ' అనలేదు. అలా ఏటో చూస్తూనే వుంది.

"ఇంతకీ నువ్వు ఏం నిర్ణయించుకున్నావు సీతా?" అడిగాడు.

"అంటే నీ నిర్ణయంలో ఏ మార్పూ రాలేదన్నమాట? నువ్వింకా నీ నిర్ణయం మార్చుకుని నన్ను పిలిచావనుకున్నా" అంది సీత కాస్త సీరియస్ గా.
అలా అంటున్నప్పుడు కూడా ఆమె బుచ్చిబాబు మొహం వంక చూడలేదు.

పరిస్థితి ఇలా సీరియస్ గానే వుంటుందని బుచ్చిబాబుకి తెలుసు. ఈ పరిస్థితిని ఎదురుకోవడానికి సిద్దపడే వచ్చాడు బుచ్చిబాబు.

సీత మానసికంగా సెటిల్ అవడం కోసం ఓ అయిదు నిముషాలు ఆగి తరువాత చర్చ ప్రారంభించాలని అనుకున్నాడు బుచ్చిబాబు.

 
అందుకే మౌనంగా ఉండిపోయాడు. అతని దృష్టి ప్రక్క బెంచి వైపు మళ్ళింది. ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఒక్క ముక్క కూడా మాట్లాడుకోవడం లేదు.

అప్ప్దుడే వారి దగ్గరికి శనగలూ, బఠానీలు అమ్మే కుర్రాడు వచ్చాడు.