సిల్లీ ఫెలో - 24

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 24

- మల్లిక్

 

"ఏంటయ్యా అలా చూస్తావ్, మా వీరేశం చెప్పాడు కాబట్టి అయిదు వేలు... లేకపోతే ఇట్లాంటి కేసులకి పదివేలకి తక్కువ తీస్కోను" అన్నాడు మిన్నారావ్.

వెంకట్రావు బుచ్చిబాబుకి కనిసైగ చేశాడు. బుచ్చిబాబు "అలాగే సార్" అంటూ తల ఊపాడు.

నాలుగు రోజులు గడిచాయి.

ఆఫీసులో ఓరోజు ప్యూన్ వచ్చి "సార్! మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు!" అని బుచ్చిబాబుకి చెప్పాడు.

బుచ్చిబాబు రాస్తున్న ఫైలు ప్రక్కన పెట్టి ఏకాంబరం క్యాబిన్ లోకి వెళ్ళాడు.

"పిలిచారా సార్?" అడిగాడు బుచ్చిబాబు.

"ఆ... రావోయ్ రా! మొత్తానికి నువ్వో టంగుటపాస్కాయ్ వోయ్!!" అన్నాడు ఏకాంబరం.

"అంటే అది తిట్టా పొగడ్తా సార్?" అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు.

"పొగడ్తేనోయ్.... నీకో గుడ్ న్యూస్! నీ ట్రాన్స్ ఫర్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడే హెడ్డాఫీసు నుండి లెటర్ వచ్చింది. అది చెప్దామనే పిలిచాను. మొత్తానికి సాధించావోయ్... కంగ్రాట్స్!"

"థాంక్యూ సార్!"

బుచ్చిబాబుకి సంతోషంతో గట్టిగా కేక పెట్టాలని అనిపించింది కానీ ఏకాంబరం అర్థంకానట్లు తిడ్తాడని భయపడి ఊరుకున్నాడు.

ఇంక నీ సీట్లో కెళ్ళి జాగ్రత్తగా పని చేస్కో... ఏం?" అన్నాడు ఏకాంబరం.

"అలాగే సార్..." అని క్యాబిన్ బయటకొచ్చిన బుచ్చిబాబు ఇంక సంతోషాన్ని ఆపుకోలేక

"యాహూ!" అని అరిచాడు.

లోపలున్న మేనేజర్ ఏకాంబరం ముందు ఉలిక్కిపడి తర్వాత గట్టిగా కసిగా తిట్టుకున్నాడు.

బుచ్చిబాబు పెట్టిన కేకకి హాల్లోని అందరూ ఘోరంగా ఉలిక్కిపడ్డారు. హెడ్ క్లర్క్ సదాశివం ఇంకుబాటిల్ ని టేబుల్ మీద ఒంపేసుకున్నాడు. టైపిస్టు లత కళ్ళు గడగడా వణికి పూర్తిగా ఒక సెంటెన్స్ మొత్తం తప్పుల తడకలు టైపు కొట్టింది.

"ఈయన అరుపు పాడుగాను..." అంటుకుంటూ నోట్లో చీరకొంగు దోపుకుని గుడ్లనీరు కక్కుకుంటూ కుములిపోసాగింది లత.

"ఏంటమ్మా... ఏమైంది?" కంగారుపడుతూ అడిగాడు సదాశివం.

"బుచ్చిబాబు పెట్టిన కేకకి ఒక సెంటెన్స్ మొత్తం తప్పు చేసానండీ.

ఊహూ... ఊహూ... ఊహూ... బాధతో" ఊగిపోతూ అంది లత.

"దానికి అంతగా బాధపడాలమ్మా?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సదాశివం.

"మీరలానే అంటారండీ, ఈ లెటర్ తీస్కుని నేను బాస్ క్యాబిన్ లో కెళ్తే మళ్ళీ ఏ కిల్లారి కిత్తి అనో, టివ్వాల డివ్వి అనో నన్ను బూతులు తిట్టేస్తాడు!" కుమిలిపోతూ అంది లత.

"అదీ నిజమేనమ్మా! పోనీ ఓ పని చెయ్యరాదూ? ఆ పేపరు తీసేసి వేరేది పెట్టి మళ్ళీ ఫ్రెష్ గా టైపు చెయ్యి."

"నిజమే గానీ... మళ్ళీ బుచిబాబు గారు అరవరుగా?" కళ్ళు తుడుచుకుంటూ అడిగింది లత.

"ఏవోయ్... ఇంకా అలా అరవ్వుగా?" అడిగాడు హెడ్ క్లర్క్ సదాశివం బుచ్చిబాబుని.

"లేదు సార్!" సిగ్గుపడుతూ అన్నాడు బుచ్చిబాబు.

"అరవడంటలేమ్మా... నువ్వు మళ్ళీ ఫ్రెష్ గా టైపు చెయ్యి.... అయినా ఈ సారి అరిస్తే బాస్ బయటకొచ్చి అర్థంకాని బూతులు తిట్టి ఆయన్ని చీల్చి చెండాడెయ్యడూ?" అన్నాడు సదాశివం.

"అదీ నిజమేలెండి! అంది లత టైపు మిషన్ లోంచి ఆ కాగితాన్ని తీసేసి వేరే వైట్ పేపర్ ని పెడుతూ.

"ఇంతకీ నువ్వు అంత ఆనందంగా అరవడానికి కారణం ఏంటి బుచ్చిబాబూ... బాస్ నిన్నేమైనా డింగాల డిప్పి అని పొగిడాడా?" అడిగాడు సదాశివం.