సిల్లీ ఫెలో - 20

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 20

- మల్లిక్

 

"ఛీ.... ఒట్టి చేతులతో వచ్చి పరువు పోగొట్టుకున్నాం...." అన్నాడు వెంకట్రావు.

"ఎందుకూ? మళ్ళీ వస్తాంగా... మినిష్టర్ మిన్నారావ్ వచ్చేదాకా ఇక్కడే కాపెయ్యాలి! ఇప్పుడే ఆ స్వీట్లూ, పళ్ళూ కొనేద్దాం" అన్నాడు వెంకట్రావు.

బుచ్చిబాబు బుర్రకాయ్ ఊపాడు.

ఇద్దరూ దగ్గర్లో వున్న మార్కెట్ కి వెళ్ళి కిలో స్వీట్లూ, రెండు డజన్ల యాపిల్స్ కొన్నారు. అక్కడినుండి మినిష్టర్ మిన్నారావ్ ఇంటికి కాస్త దూరంలో వున్న తూముమీద కూర్చున్నారు.

"మినిస్టర్ గారి భార్య మాటేంటి అంత యాసగా వుందీ?" అడిగాడు బుచ్చిబాబు.

"ఇప్పుడంటే మినిస్టర్ భార్యగానీ ఇదివరకు రిక్షావోడి భార్యేకదా? ఆ భాష ఇంకెలా ఉంటుందీ?" అన్నాడు వెంకట్రావు.

"అవునూ, ఇందాక మిన్నారావు మినిస్టర్ ఎలా అయ్యాడో చెప్తానన్నావు?" 

వెంకట్రావు గొంతు సవరించుకున్నాడు.

"ఈ మిన్నారావ్ రిక్షా తొక్కే టైంలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అందుకే రిక్షా కార్మికుల యూనియన్ లీడర్ గా ఉండేవాడు. ఆ తర్వాత స్లోగా డెవలప్ అయి రిక్షా అవతల పారేసి ఆటో కొనుక్కున్నాడు. త్వరలోనే ఆటో డ్రైవర్ల యూనియన్ కి కూడా లీడర్ అయ్యాడు. ఆ యూనియన్ కి లీడరుగా ఉండగానే గూండాలు, దాదాలతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. లోకల్ గా కాస్త పవర్ ఫుల్ అయ్యాడు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ఈ కాన్ స్టిట్యూయెన్సీ నుండి స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ సంఘ సేవకుడు అయిన మోహన్ రావుగారు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు. ఆయనకి ఎదురుగా నిలబడి గెలిచే సత్తా ఏ పార్టీలోనూ, ఎవరికీ లేదు... ఒక్క మిన్నారావుకి తప్ప!"

"అందుకే కాంగ్రెసువాళ్ళ కన్ను మిన్నారావు మీద పడింది. వాళ్ళొచ్చి ఇతన్ని పార్టీలో చేరమని, ఎమ్యెల్యేగా నిల్చోవడానికి టిక్కెట్టిస్తామనీ అడిగారు. ఇతను ఈ రాజకీయాలు నాకలవాటులేదు. నాకిట్టానే బాగుంది. నేను చేరను పొమ్మన్నాట్ట. అప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధే స్వయంగా ఇతనికి ఫోన్ చేసి రిక్వెస్టు చేస్తే కాంగ్రేసు పార్టీలో చేరి ఎన్నికలలో నిలబడి మోహన్ రావు గారిని చిత్తుచితుగా ఓడించాడు. మరి రిగ్గింగ్ చేసే దాదాలు గుండాలూ ఇతని చేతిలోనే ఉన్నారు కదా"

"యమ్మెల్యే అయ్యాక ఇతని కన్ను మంత్రిపదవి మీద పడింది. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో మిన్నారావ్ పాత బస్తీలో మత కలహాలు సృష్టించి అరాచకాలు సృష్టించాడు. ఇతని బాధపడలేక ఇతనని మొహాన మంత్రి పదవి పడేశారు. అప్పటినుండీ మంత్రి పదవి వెలగబెడుతూనే వున్నాడు. కాంగ్రెస్ పని అయిపోతుంది అని అంచనా కట్టి తెలుగుదేశంలోకి దూకేశాడు. ఆ తర్వాత యన్టీఆర్ వర్గంలోంచి చంద్రబాబు వర్గంలో దూకాడు. అలా తన పదవిని కాపాడుకుంటూ వస్తున్నాడు" చెప్పడం ఆపాడు వెంకట్రావు.

"ఉహూ... అయితే చాలా పవర్ ఫుల్లే. నువ్వు రిక్షావాడంటే సిల్లీఫెలో అనుకున్నా" అన్నాడు బుచ్చిబాబు "అయితే ఇతను చెపితే నా ట్రాన్స్ ఫర్ ఆగిపోతుందికదూ?"

"నైన్ టీ నైన్ పర్సెంట్ ఆగిపోతుంది."

"కానీ ఇతను మన మాట వింటాడంటావా?" సందేహంగా అడిగాడు బుచ్చిబాబు.