సిల్లీ ఫెలో - 16

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,    Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 16

- మల్లిక్

 

"ఏం సార్ అలా చూస్తారు? చాలా త్వరగా తెచ్చానుకదా. అసలు మా హోటల్ లో ఉండేంత క్విక్ సర్వీస్ ఎక్కడా వుండదు తెల్సా?" అంతకంటే చికాకుగా చూస్తూ బుచ్చిబాబుతో అన్నాడు సర్వర్.

నువ్వు పానకంలో పుడకలా త్వరత్వరగా తెస్తున్నందుకే నాకు చిరాకు పుట్టిందిలే నాయనా అని మనసులో అనుకున్నాడు బుచ్చిబాబు.

దోసెలు తినడం పది నిముషాలపాటు సాగింది. తర్వాత కాఫీలు.

అదీ అయ్యాక వెంకట్రావు బ్రేవ్ మని త్రేన్చాడు.

ఆ ప్రహసనం మొత్తం అక్కడితో అయిపోయినందుకు బుచ్చిబాబు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.

సర్వర్ బిల్ తెచ్చి వెంకట్రావు ముందు పెట్టబోతే "అక్కడ... అక్కడ" అని బుచ్చిబాబుని చూపించాడు.

బుచ్చిబాబు బిల్ పే చేసాడు.

"ఇంక మనం పోదామా?" అంటూ వెంకట్రావు లేవబోయాడు.

బుచ్చిబాబు కంగారుగా లేచి వెంకట్రావు భుజాలమీద చేతులేసి బలంగా నొక్కి సీటులో కూలేసాడు.

"ఏంటి వెళ్ళిపోదామంటున్నావ్?" లోలోపల మండిపడుతున్నా పైకి నవ్వుతూ అంటూ తనూ కూర్చున్నాడు బుచ్చిబాబు.

"వెళ్ళక? కొంపదీసి ఇంకా థినిపిస్తాఆ ఏంటీ? నా వల్లకాదు బాబూ... కడుపు ఫుల్ అయిపోయింది" బొజ్జమీద అరచేయి తిప్పుతూ తృప్తిగా అన్నాడు వెంకట్రావ్.

"ఇప్పుడు తినడం గురించి కాదు నిన్ను ఆపింది. ఆ యాదగిరి గురించి ఏదో చెపుతున్నావుకదా విందామని" బలవంతంగా నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఏ యాదగిరి?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు వెంకట్రావు.

బుచ్చిబాబుకి మండింది. "ఏం.. పీకలదాకా స్వీట్లూ, దోశా తిని వేశాలేస్తున్నావా?" అని వెంకట్రావు కాలర్ పట్టుకుని వాయించాలనిపించింది. కానీ సహనం తెచ్చుకుని అడిగాడు.

"అదే.. చార్ మినార్ చౌరస్తాలో కిళ్ళీషాపువాడు వున్నాడన్నావే?"

"ఆ.. అవునవును..." గుర్తు చేసుకుంటూ బుర్రకాయ ఊపాడు వెంకట్రావు.

"మరి కిళ్ళీషాపువాడు నా ట్రాన్స్ ఫర్ ఎలా ఆపుతాడు?"

"కిళ్ళీ షాపువాడంటే ఒట్టి కిళ్ళీషాపువాడుకాదు.. వాడు హీరో నటవీర అభిమాన సంఘానికి ప్రెసిడెంట్."

"అయితే మనకేం ఉపయోగపడతాడు?"

"చాలా ఉపయోగపడతాడు. వాడూ హిందీ, నటుడు అమితాబ్ బచన్ అభిమానసంఘం ప్రెసిడెంట్ ఏబ్రాసిఖన్నా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. యాదగిరి ఏబ్రాసిఖన్నాని కలసి నీ ట్రాన్సు ఫర్ చెపితే, యాబ్రాసి ఖన్నా అమితాబ్ కి నీ కేసు రికమెండ్ చేస్తే, ఆయనగారు సోనియాగాంధీకి చెపితే, ఆమె ఎవడయినా సెంట్రల్ మినిష్టర్ కి చెపితే వాడు ఉరుకులు పరుగులు మీద మీ హెడ్డాఫీసుకి డి.ఒ. లెటర్ రాసి నీ ట్రాన్స్ ఫర్ ఆపుతాడు. మరి సోనియాగాంధీనా మజాకానా? రేప్రొద్దున్న పి.వి. నరసింహారావుని దింపేసి ఆమె ప్రయిమినిష్టరయిపోయినా అయిపోవచ్చు."

"అయితే ఓ కిళ్ళీషాపువాడి ద్వారా మనం సోనియాగాంధీని, సెంట్రల్ మినిష్టరుని అప్రోచ్ అయిపోవచ్చంటావు? ఇది నిజంగా జరిగేదేనంటావా? వినడానికే సిల్లీగా వుంది..." అనుమానంగా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు.

"తప్పకుండా జరుగుతుంది. కాకపోతే యాదగిరికి ఢిల్లీకి రానుపోను ఛార్జీలూ, హోటల్ ఖర్చులూ, పని జరిగాక వాడికి కాస్త కమీషను యివ్వాలి."

"కానీ ఈ చిన్న విషయానికి మనం సిల్లీగా సోనియాగాంధీ లెవెల్ దాకా వెళితే బాగుండదేమో? పాపం ఇలాంటి చిన్నచిన్న పనులు అప్పగిస్తే సోనియాగాంధీ ఏమనుకుంటుంది?" సందేహంగా అడిగాడు బుచ్చిబాబు.

"అదీ నిజమేననుకో." సాలోచనగా మొహం పెట్టాడు వెంకట్రావు.

"అయితే మనం ఎవరినయినా స్టేట్ మినిష్టర్ ని పట్టుకుని  పని చేయించుకుందాంలే, నువ్వేం వర్రీకాకు, నీ విషయాలు నాకొదిలెయ్. రెండు రోజుల్లో నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా..." అని నిలబడ్డాడు. బుచ్చిబాబు కూడా లేచి నిలబడ్డాడు.

ఇద్దరూ హోటల్ నించి బయటపడ్డారు.

*                 *                *