సిల్లీ ఫెలో - 15

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 15

- మల్లిక్

 

"అమ్మాయెం చేస్తోందో?" అడిగాడు వెంకట్రావు.

బుచ్చిబాబు సీత గురించి, సీత చేస్తున్న ఉద్యోగం గురించీ వెంకట్రావుకీ చెప్పాడు.

"అబ్బో! అయితే కష్టమేనే. అసలే నీకు విజయవాడకి ట్రాన్స్ ఫర్ వచ్చింది. నువ్వేమో అక్కడ, ఆమేమో ఇక్కడ!!"

"అదే ఆలోచిస్తున్నా... ఏం చేయాలా అని, పెళ్ళి చేసుకున్నాక నేనక్కడ తానిక్కడ అయితే ఏం బాగుంటుంది చెప్పు సిల్లీగా?"

"ఇందులో ఆలోచించడానికేముందీ... నీ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ని కాన్సిల్ చేయించుకోవడమే!"

"కుదుర్తుందా? మనం ఏకాంబరం గాడిని అడిగితే కట్ వీల్లేదు. అది హెడ్డాఫీసు ఆర్డర్ అన్నాడు సిల్లీగా"

"అడక్క అడక్క వాడినే అడిగావ్? మనకర్థం కాని వింత తిట్లు తిట్టడానికి తప్ప వారెందుకూ పనికిరాడు. అయినా నాకు ఒకటిరెండు సోర్సులున్నాయిలే. వాటి ద్వారా ప్రయత్నించవచ్చు." అన్నాడు వెంకట్రావు.

ఆ మాట వినగానే బుచ్చిబాబు రోడ్డుమీద ఠక్కున ఆగిపోయాడు.

"చూసావా... నాలో నేను సిల్లీగా మదనపడిపోతున్నానేగానీ నిన్ను ఓ మాటడుగుదామనే ఆలోచనే నాకు రాలేదు"

"ఎలా వస్తుంది నువ్వు సిల్లీఫెలోవి కదా?" పోజు కొడుతూ అన్నాడు వెంకట్రావు.

"పద. లోపల కూర్చుని ఏదైనా తింటూ మాట్లాడుకుందాం"

"స్వీట్స్ ఫ్రెష్ గా ఏమున్నాయోయ్?" సర్వర్ ని అడిగి "ఇందాక మాకేం స్వీట్స్ లేవా అని అన్నావ్ గా?" అంటూ వెంకట్రావ్ ను చూసి నవ్వాడు బుచ్చిబాబు.

"బాసుంది ఫ్రెష్ గా వుంది సార్.. జాంగ్రీ కూడా బాగుంది సార్" చెప్పాడు సర్వర్.

"రెండు బాసుంది తీసుకురా. అయిదు నిముషాలయ్యాక రెండు మసాలా దోసెలు కూడా తీసుకురా" ఆర్డర్ ఇచ్చాడు బుచ్చిబాబు.

"అలాగే సార్" అంటూ వెళ్ళిపోతున్న సర్వర్ ని వెంకట్రావ్ వెనక్కి పిలిచాడు.

"ఏం సార్?" అడిగాడు సర్వర్.

"నాకు జాంగ్రీ కూడా తీసుకురా!" చెప్పాడు వెంకట్రావ్.

సర్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

"చెప్పు. ఏదో సోర్సు వుందన్నావ్ ఏంటది?" కుతూహలంగా ముందుకు వంగుతూ అడిగాడు బుచ్చిబాబు.

"ఓ పని చేద్దాం..." అని క్షణాలు ఆగాడు వెంకట్రావు.

బుచ్చిబాబు ఆత్రంగా వెంకట్రావ్ మొహంలోకి చూసాడు ఏం చెప్తాడోనని.

"చార్ మినార్ చౌరస్తా దగ్గర యాదగిరి వున్నాడు. అతన్ని కలుద్దాము."

"యాదగిరి ఎవరు? మినిస్టరా?" ఉత్సాహంగా అడిగాడు బుచ్చిబాబు.

"కాదు! కిళ్ళీకొట్టువాడు..." బుచ్చిబాబు మళ్ళీ అడగబోయాడు.

వెంకట్రావ్ బుచ్చిబాబు వంక చాలా సీరియస్ గా చూశాడు.

"ముందు నన్ను తిననిస్తావా?"

బుచ్చిబాబు బుస్సున నిట్టూర్చి బుర్రకాయ్ ఊపాడు సరేనన్నట్లు.

వెంకట్రావ్ స్వీటు ప్లేటు దగ్గరికి లాక్కున్నాడు. బుచ్చిబాబు కూడా బాసుంది ప్లేటు దగ్గరకు లాక్కుని స్పూన్ తో కాస్త నోటిలో వేసుకున్నాడు.

వెంకట్రావ్ బాసుంది, జాంగ్రీ లపక్ మని, చప్పరించుమని, చప్పరించుకుంటూ తినేదాకా చాలా ఓపిగ్గా ఎదురుచూశాడు బుచ్చిబాబు.

వెంకట్రావు మంచినీళ్ళు గటగటా త్రాగి ఖాళీ గ్లాసు టేబుల్ మీద పెట్టి "స్వీట్స్ చాలా బాగున్నాయోయ్" అన్నాడు బుచ్చిబాబుతో.

"అవునా... హిహి!" పైకి అని మనసులో హమ్మయ్య అనుకున్నాడు బుచ్చిబాబు.

"అసలు ఇంతకీ ఒక కిళ్ళీ కొట్టువాడు నా ట్రాన్స్ ఫర్ ...."

బుచ్చిబాబు ఏదో అడగబోయేంతలో సర్వర్ వేడివేడిగా రెండు దోసెలు తెచ్చి వీళ్ళ టేబుల్ మీద వుంచాడు.

"ఉండు. ఇప్పుడు నీకు చెపుతూ కూర్చుంటే దోసెలు చప్పగా చల్లారిపోతాయ్" అని బుచ్చిబాబు మీద విసుక్కుని వెంకట్రావ్ దోసెప్లేటు లాక్కుని ఓ ముక్క తుంపి నోటిలో వేసుకుని పచక్.. పచక్ మని నమిలాడు.

బుచ్చిబాబు సర్వర్ వంక సీరియస్ గా చూశాడు.