సిల్లీ ఫెలో - 9

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 9

- మల్లిక్

 

"లేదు... డిస్కనెక్ట్ కాలేదు... నేనే లైన్లోనే వున్నాను" అరిచాడు బుచ్చిబాబు.

సీత ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది. బుచ్చిబాబుకి అర్థం అయ్యింది సీత కావాలనే అలా చేసిందని.

నిస్సత్తువుగా రిసీవర్ క్రెడిల్ చేశాడు బుచ్చిబాబు.

అప్పుడే ప్యూన్ వచ్చి "బుచ్చిబాబు గారూ... మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు!" అని చెప్పాడు.

బుచ్చిబాబు మేనేజర్ ఏకాంబరం క్యాబిన్ లోనికి వెళ్ళాడు.

"రావయ్య బుచ్చిబాబూ.... నీకో బ్యాడ్ న్యూస్!" అన్నాడు ఏకాంబరం.

"ఏంటండీ?" భయం భయంగా అడిగాడు బుచ్చిబాబు.

"నీకు విజయవాడు ట్రాన్స్ ఫర్ అయ్యిందయ్యా .... ఇదిగో.... ఇప్పుడే హెడ్ ఆఫీసు నుండి ఆర్డర్ వచ్చింది. ఏ కిల్లారి కిత్తిగాడు నీకు యీ ఆర్డర్ వేశాడో గానీ" అంటూ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ తీసి బుచ్చిబాబుకి ఇచ్చాడు.

ఆర్డరు చదివిన బుచ్చిబాబు మొహం పాలిపోయింది. కొన్ని క్షణాలపాటు అతని మెదడు మొద్దుబారిపోయింది.

"సార్... నేను ఈ ఆఫీసులో చాలా అవసరమనీ, ఈ ఆఫీసుకి బాగా పనికి అచ్చే నన్ను సిల్లీగా విజయవాడ ట్రాన్స్ ఫర్ చెయ్యడం అనవసరం అని మీరు రికమెండ్ చేస్తూ హెడ్డాఫీసుకు లెటర్ రాయండి సార్!" దీనంగా మొహంపెట్టి అడిగాడు బుచ్చిబాబు.

ఏకాంబరం తల అడ్డంగా ఊగించాడు.

"లాభంలేదు బుచ్చిబాబూ... హెడ్డాఫీసులో అందరూ డస్కు ఢమాల్ గాళ్ళళుంటారు. ఇలాంటి రెకమెండేషన్లు వాళ్ళు ఖాతరు చెయ్యరు... నీ విషయంలో నేనేం చెయ్యలేను...."

"సార్....! బాధగా అన్నాడు బుచ్చిబాబు ఇంకేం అనలేక.

రెండు క్షణాలు ఆలోచించి ఏకాంబరం ఇలా అన్నాడు.

"ఇంతగా ప్రాధేయపడుతున్నావ్ కాబట్టి ఓ సహాయం చేస్తా. నిన్ను వెంటనే రిలీవ్ చెయ్యకుండా అట్టే పెట్టుకుంటా... హెడ్డాఫీసు వాళ్ళు అడిగినా పెండింగ్ పని చాలా వుంది.... బుచ్చిబాబు కొన్ని రోజులపాటు నాకవసరం అని చెప్తా.... ఈలోగా నువ్వు నీ ట్రాన్స్ ఫర్ ఏ యమ్మేల్యోనే, మినిస్టర్ నో పట్టుకుని కాన్సిల్ చేయించుకునే ప్రయత్నం చేసుకో"

"అలాగే సార్.. ... థాంక్స్ సార్" అని అతని క్యాబిన్ లోంచి నీరసంగా బయటికొచ్చి తన సీట్ లో కూలబడ్డాడు బుచ్చిబాబు.

అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు....!

ట్రాన్స్ ఫర్ మీద విజయవాడ వెళ్ళిపోతే సీత ఇక్కడ, తను అక్కడా...

సీతకి దూరంగా ఎలా బ్రతకడం?....

ట్రాన్స్ ఫర్ ని ఎలాగైనా ఆపించాలి!

కానీ ఎలా?... ఎలా??.. ఎలా???

"కాబట్టీ..." చెప్తూ చెప్తూ ఆగి సీత మొహంలోకి చూశాడు బుచ్చిబాబు. ఆమె శ్రద్ధగా వింటుందని గ్రహించి మళ్ళీ కంటిన్యూ చేశాడు బుచ్చిబాబు.

"నేను ఎలాగైనా సరే నా ట్రాన్స్ ఫర్ ని ఆపుకోవాలి. లేకపోతే నువ్వు ఇక్కడ... నేను విజయవాడలో అమ్మో! నేను వుండలేను...."

"పెళ్ళీ పెటాకులు లేకుండా మాత్రం ఎన్నాళ్లయినా వుండగలుగుతావ్" బుంగమూతి పెట్టి అంది సీత.

అలా ఆమె బుంగమూతి మొహం చూసేసరికి బుచ్చిబాబుకి తెగ ముద్దొచ్చేసింది.

అటూ ఇటూ పరికించి చూసాడు. పార్కులో తమకి సమీపంలో ఎవరూ లేరు. సీతని ముద్దుపెట్టుకోవాలని బుచ్చిబాబు ముందుకు వంగాడు. మరుక్షణంలో ముద్దు పెట్టుకుంటాడనగా పొదల వెనకనుండి మెరుపులా చేతిలో బుట్టతో ఓ కుర్రాడొచ్చాడు.

"సార్... బఠానీలు కావాలా సార్!" అడిగాడు ఆ కుర్రాడు.

ఊహించని ఈ సంఘటనకి ఉలిక్కిపడి వెనక్కి పడ్డాడు బుచ్చిబాబు.

"బఠానీలు వద్దు! ఒకవేళ నీ దగ్గర పల్లీలు వుంటే అవికూడా వద్దు. గరంగరంగా వున్నా, చల్లగా వున్నా ఎలావున్నా వద్దు!" పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు.

సీత కిసుక్కున నవ్వింది. బఠానీలు అమ్మేకుర్రాడు బుచ్చిబాబు వంక ఓసారి నిర్లక్ష్యంగా చూసి అక్కడికి నాలుగైదు గజాల దూరంలో వున్న సిమెంటు బెంచిమీద కూర్చుని వాళ్ళనే చూడసాగాడు.

"వీడు ఇక్కడే ఎందుకు తగలబడ్డాడు సిల్లీగా? ఎక్కడికైనా వేరే చోటికెళ్ళి కూర్చోవచ్చుగా?" విసుక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"అది వాడిష్టం. ఇది పబ్లిక్ పార్క్!! ఎవరిష్టమొచ్చినచోట వాళ్ళు కూర్చుంటారు. వాడిని ఇక్కడ కూర్చోవద్దని అనడానికి మనకేం హక్కు లేదు. అంతేకాదు. మనం ఈ పార్కులోంచి బయటకెళ్ళేదాకా వాడిక్కడి నుండి లేవడు. మనకి కాపలా అన్నమాట. బఠానీలు కొనలేదన్న కసి తీర్చుకుంటున్నాడు!!' వచ్చె నవ్వును ఆపుకుంటూ అంది సీత.

"వీడి దగ్గర బఠానీలు కొంటే అప్పుడు శనగలవాడు వచ్చి కూర్చుంటాడు. ఎలా వీళ్ళతో చచ్చేది?" జుట్టు పీక్కున్నాడు బుచ్చిబాబు.

"అందుకే త్వరగా పెళ్ళిచేస్కో అప్పుడు నీకేవిధమైన అడ్డూ వుండదు."

"దాని గురించి మాట్లాడటానికే ఇప్పుడు నిన్నిక్కడికి రమ్మన్నాను."

బుచ్చిబాబు ఈ మాట అనగానే ఆమెకి ఎంతో ఉత్సాహం వచ్చింది. చటుక్కున వంగి కుతూహలంగా ప్రశ్నించింది. "అదేంటో కాస్త త్వరగా చెప్తావా?"

బుచ్చిబాబు గొంతు సవరించుకున్నాడు.