సిల్లీ ఫెలో - 3

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 3

- మల్లిక్

 

"మీకు కోపం వస్తే కిల్లారి కిత్తి, టింగాల టిస్కి లాంటి విచిత్రమైన పేర్లతో ఎందుకు తిడతారు సార్? మాములుగానే అందరికి అర్థం అయ్యే భాషలోనే తిట్టొచ్చుగా"

"అలా తిడ్తే ఆఫీస్ స్టాఫ్ మొత్తం నా చెమ్డా లెక్కదీస్తారు. అర్థం కాని భాషలో తిడ్తే నేను సేఫ్"

"పోనీ పొగడ్తలయినా అర్థం అయ్యే భాషలో పొగడొచ్చు కద్సార్... విని మేం సంతోషిస్తాం కదా. అవికూడా మాకు అర్థం కాని భాషలోనే అంటారు."

"అర్థం అయ్యే భాషలో పొగిడ్తే హమ్మా... నేనింతటివాడ్నా అనుకుని కళ్ళు నెత్తిమీదకొచ్చేస్తాయ్. అలా కళ్ళు నెత్తిమీదకొచ్చేస్తే తర్వాత సరిగా పనిచేయరు డస్కుడమాల్ నాయాళ్ళు! అంటే ఏంటని అడక్కు అన్నట్టు నీ నాయనమ్మ ఒంట్లో బాగోలేదని తీరుబడిగా కబుర్లేస్కున్నావేం?"

బుచ్చిబాబు నాలుక కర్చుకున్నాడు.

"సారీ సార్... నేనిక వస్తాను సార్"

"ఊ... ఊ...." గంభీరంగా బుర్రకాయ్ ఊగించాడు ఏకాంబరం.

బుచ్చిబాబు క్యాబిన్ లోంచి బయటకు వచ్చాడు.

అక్కడ హాల్లో ఇందాక ఏకాంబరం చేత "కిల్లారి కిత్తి" అని తిట్టించుకున్న లత వెక్కి వెక్కి ఏడుస్తుండడం, నలుగురైదుగురు స్టాఫ్ మెంబర్లు ఆమెని ఊరడించడానికి ప్రయత్నించడం బుచ్చిబాబుకి కన్పించింది.

*            *            *

సీత పగలబడి నవ్వింది.

బుచ్చిబాబు ఆమె వంక తన్మయత్వంతో చూశాడు.

అయితే మీ మేనేజర్ని అలా బురిడీ కొట్టించావన్నమాట! త్వరగా వెళ్తానని అన్నందుకు అతను నిన్ను వింత తిట్లేమీ తిట్టలేదుకదా?" అడిగింది సీత నవ్వాపుకుంటూ.

"బురిడీ కొట్టించిన తర్వాత ఇంక తిట్లెందుకు తిడ్తాడు?

హయ్యయ్యో... పాపం మీ నాయనమ్మకి బాలేదా వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు" సీత చేతిని తన చేతిలోకి తీస్కుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"థియేటర్ వచ్చేసింది" అంటూ అతని చేతిలోంచి తన చెయ్యి లాగేస్కుంది సీత.

ఆటో థియేటర్ ముందు ఆగింది.

ఇద్దరు ఆటో దిగారు. బుచ్చిబాబు ఆటోడబ్బులు చెల్లించాక ఇద్దరూ థియేటర్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టారు. సీత తలెత్తి చూసింది.

సినిమాకి సంబందించిన పెద్ద పెద్ద కటౌట్ లు, సినిమా పేరు "పెళ్ళాం పిచ్చిది, ప్రేయసి చచ్చుది."

"సినిమా టైటిల్ చూస్తే ఇలాగుంది. ఏమైనా బాగుంటుందంటావా?" సందేహంగా అడిగింది సీత.

"జనం ఫర్వాలేదని అంటున్నారు. అయినా ఈ మధ్య అన్ని సినిమాలకి ఇలాంటి టైటిల్సే వుంటున్నాయి. పోనీ ప్రక్కథియేటర్ లో "మా నాన్నే మీ అమ్మకి మొగుడు' సినిమా ఆడుతుంది. దానికి వెళ్దామా?" అడిగాడు బుచ్చిబాబు.

"వద్దులే... దానికంటే ఇదే నయం అనుకుంటా. అవునుగానీ ఆ హీరో కటౌట్ అంతంత దండలు ఎవరేస్తారు? థియేటర్ వాళ్ళా, ఈ సినిమా తీసిన వాళ్ళా?"

"ఇద్దరూ కాదు. ఆ దండలు వేసింది హీరో అభిమానులు. ఈ హీరోకి వీరాభిమాబులు వున్నారు కదా!" అన్నాడు బుచ్చిబాబు.

ఇద్దరూ టికెట్స్ కౌంటర్ దగ్గరకి వెళ్ళారు. బుచ్చిబాబు అటూఇటూ ఓసారి పరికించి చూశాడు.

"ఏంటీ?" అడిగింది సీత.

"నాకు తెల్సినవాళ్ళెవరైనా వచ్చారేమోనని" మెల్లగా అంటూ టికెట్స్ తీసుకున్నాడు బుచ్చిబాబు.

సీత బుచ్చిబాబు వంక చిరాకుగా చూసింది.

"అంత భయపడేవాడిని నన్ను సినిమాకెందుకు తీసుకొచ్చావ్?" అంది.

బుచ్చిబాబు ఎంట్రెన్స్ వైపు అడుగులు వేసాడు.

"ఇలా దొంగ దొంగగా తిరగడం నాకేం నచ్చడంలేదు. హాస్టల్ కి లేటుగా వెళ్ళినప్పుడు మా వార్డెన్ నన్ను ఎలాంటి చూపులు చూస్తుందో తెల్సా? అంది సీత మళ్ళీ. బుచ్చిబాబేం సమాధానం చెప్పలేదు. ఇద్దరూ థియేటర్ లోకి వెళ్ళి సీటు నెంబరు వెతుక్కుని కూర్చున్నారు.

"చెప్పు. మనిద్దరం ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?" అడిగింది సీత బుచ్చిబాబు చేతిని తన చేతిలోకి తీస్కుంటూ.

"నాకు కాస్త టైం కావాలి. ఇంకా మా అమ్మనాన్నలకు నీ గురించి చెప్పలేదు. వాళ్ళకి నీ గురించి చెప్పాలి. మన పెళ్ళికి ఒప్పించాలి" అన్నాడు బుచ్చిబాబు తన రెండో చేతిని ఆమె చేతిమీద వేస్తూ. 

"అప్పటికి మనిద్దరం ముసలి ఒగ్గులైపోతాము" తన చేతిని వెనక్కి లాగేస్కుంటూ చిరుకోపముతో అంది సీత.

బుచ్చిబాబు ఏమీ అనలేదు.

అప్పుడే లైట్స్ గుప్పున ఆరిపోయాయ్.