హలో... రాంగ్ నెంబర్.! - 4

Get latest Mallik telugu famous comedy serials, Mallik telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 4

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

లూసీ, శ్రీకర్ ఒంటె మీద కూర్చున్నారు. శ్రీకర్ ముందు కూచున్నాడు.
"లూసీ...ఇందాక నువ్వు వెహికల్ డ్రైవర్ తో మాట్లాడింది ఏం భాష?"
"అరబ్బీ..."
"నీకు అరబ్బీ వచ్చా?"
"వచ్చు" అంది లూసీ
విశాలమైన ఎడారిలో ఒంటె మీద వెళ్తోంటే థ్రిల్లింగా వుంది. అప్పుడప్పుడు ఒంటె ఓ కాలు ముందుకు లేపి, మరో కాలు పైకి లేపుతున్నప్పుడు - లూసీ ముందుకు కదులుతోంది.
ఆమె శరీర స్పర్శ అతనికి ఆనందాన్నిస్తుంది.
"నీతో ఎడారిలో ఈ సంధ్యాసమయంలో ఇలాంటి ఒంటె ప్రయాణం మరచిపోలేను లూసీ" మనస్పూర్తిగా అన్నాడు శ్రీకర్.
"ఐ టూ సర్" అంది లూసీ.
ఒంటె మీది నుంచి దిగి, వెహికల్ కి షిఫ్టయ్యారు. దాదాపు రాత్రి ఎనిమిది అవుతుండగా బెల్లీ డాన్స్ స్పాట్ కు చేరుకున్నారు.
ఇసుకలో పక్కపక్కనే టెంట్స్ వేసి వున్నాయి. వాటికి మధ్యలో మెత్తటి పరుపులు పరిచివున్నాయి. వాటిముందు ఓ మంచం. దానిపై చిన్నగా వెలుగుతూ లాంతరు. పక్కనే సాల్ట్, పెప్పర్, సాస్ బాటిల్స్, దూరంగా బఫె డిన్నర్ ప్రిపేర్ అవుతోంది. డిస్కో లైట్స్ తో దూరంగా ఓ స్టేజ్.
అదంతా ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ లా వుంది శ్రీకర్ కు.
అరబ్ షేక్స్ లా డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దిగుతున్న టూరిస్ట్ లను చూసి ముచ్చటపడ్డాడు శ్రీకర్.
"సర్...ఇది ఎంటర్ టెయిన్ మెంట్ పాయింట్. ఇక్కడ మీరు షేక్ లా కాస్ట్యూమ్స్ వేసుకొని ఫోటో దిగొచ్చు. అమ్మాయిలతో డ్యాన్స్ చేయొచ్చు. మంచి డిన్నర్ వుంటుంది కూడా. ఈ రాత్రంగా మీ ఇష్టం" చెప్పింది లూసీ.
"నీతో సహా నా ఇష్టమా?" అడిగాడు లూసీ వైపు చూస్తూ.
"మీరు ఏ ఇష్యూని అయినా నాతో ఎండ్ చేస్తున్నారు." నవ్వుతూ అంది లూసీ.
"ఐ థింక్...యూ ఆర్ మై ఎండింగ్ పాయింట్" నవ్వి అన్నాడు శ్రీకర్.
దూరంగా ఓ ముస్లిమ్ లేడీ కూర్చొని మెహందీ పెడుతోంది.
"అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఆమె అత్యంత ఫాస్ట్ గా మెహందీ పెట్టడంలో నేర్పరి. గిన్నీస్ బుక్ లోకి కూడా ఎక్కింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా అది పెట్టడం ఆచారం. సర్...ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వెళ్ళి పెట్టించుకుణి వస్తాను. నాకు చాలా ఇష్టం." మురిపెంగా చెప్పింది లూసీ.
"అలాగే వెళ్లు. కానీ తొందరగా వచ్చేయ్ ! నాకు ఒక్కడ్నీ బోర్ కొడుతుంది."
"డెఫ్ నెట్ లీ సర్..."
"ఆడవాళ్ళు ఎక్కడైనా ఆడవాళ్ళే..' మనసులో అనుకున్నాడు శ్రీకర్.
*               *                *
కింద ఇసుక, పైన ఆకాశంలో చందమామ. చిత్రకారుడి ఆలోచనలకు, ఊహలకు స్ఫూర్తినిచ్చే దృశ్యం. అపురూపంగా దాచుకోవలసిన లక్షణాలు.
"వీడియో కెమెరా తీసుకువస్తే బావుణ్ణు, అనుకున్నాడు శ్రీకర్.
"లూసీ ఏంటి ఆలోచిస్తున్నావ్? ఈ ప్లేస్ చాలా బావుంది కదూ ! సినిమా వాళ్ళు చూస్తే తప్పకుండా లోకేషన్ గా ఉపయోగించుకుంటారనుకుంటా"
"చాలా సినిమాల్లో ఈ స్పాట్ వచ్చింది సార్. మరి తెలుగులో నాకు తెలీదు"
"నువ్వింతకు ముందు ఇక్కడికి వచ్చావా"
"గత పదేళ్ళుగా ఇక్కడికి వస్తూనే వున్నాను. విన్సెంట్ గారి దగ్గర పని చేయకముందు కొన్నాళ్ళు 'గైడ్' గా కూడా పనిచేసాను" చెప్పింది లూసీ.
"ఓహ్...అన్నట్టు నీ గురించి చెప్పనే లేదు...మీ వారేం చేస్తారు?"
"ఏ వారు?" అడిగింది నవ్వుతూ లూసీ. ఆ నవ్వులో ఉలికిపాటు వుంది. కలవరపాటూ వుంది.
"అదే...మీ శ్రీవారు?"
"డ్యాన్స్ ప్రోగ్రామ్ కు టైమైంది. వెళ్దామా..." లేచి మిడ్దీకి అంటిన ఇసుక దులుపుకుంటూ అడిగింది.
శ్రీకర్ కు అర్థమైంది. తన భర్త గురించి చెప్పడం లూసీకి ఇష్టం లేదన్న విషయం.
*                *                  *
అందమైన అమ్మాయిలు ఎక్స్ పోజింగ్ డ్రెస్సుల్లో మ్యూజిక్ కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంటే చూస్తున్నాడు శ్రీకర్.
"మీరూ వెళ్ళి జాయిన్ అవ్వొచ్చు" చెప్పింది లూసీ.
"నాకూ డ్యాన్స్ చేయాలంటే ఇష్టమే"
"ఇంకేంటి...వెళ్ళి జాయిన్ అవ్వండి." అంది ఉత్సాహపరుస్తూ లూసీ.
"బట్....ఇప్పుడు నాకు వాళ్ళతో డ్యాన్స్ చేసే మూడ్ లేదు."
"వై...ఎందుకు?"
"నీకు అభ్యంతరం లేకపోతే, నీతో డ్యాన్స్ చేస్తాను" చెప్పాడు శ్రీకర్.
ఒక్కక్షణం శ్రీకర్ వైపు చూసింది. అతని మొహంలో టీజింగ్ లేదు. అతను సీరియస్ గానే అడుగుతున్నాడు.
"చెప్పు లూసీ నాతో డ్యాన్స్ చేస్తావా?"
"విజ ప్లెజర్" అంది లూసీ. శ్రీకర్ హుషారుగా విజిలేసి డయాస్ వైపు కదిలాడు లూసీ చేయిపట్టుకొని.
*                  *                   *