'కారు' కూతలు

చిన్నప్పుడు మూడు చక్రాల సైకిలు తొక్కుతున్నప్పటి నుంచి కార్లు అంటే ఇష్టం నాకు. అసలు ఆ మాటకొస్తే కారు అంటే ఇష్టం లేనిదెవరికీ? చిన్నప్పుడు మనమందరం కారు నడిపేస్తున్నట్లు ఊహించుకుని, 'డుర్ డుర్' అని శబ్దం చేస్తూ రెండు చేతుల్తో స్టీరింగ్ తిప్పుతూ, గేర్లు మారుస్తూ, మధ్యలో 'పోయ్ పోయ్' అని హరన్ కొడ్తూ, ఎన్ని వందల మైళ్లు పరిగెత్త లేదూ! చిన్నప్పుడు, కనపడ్డ కారు బొమ్మలన్నీ కత్తిరించి గోడలకు అంటించే వాడిని. నిజం కారు కొనుక్కోవడానికి 30ఏళ్లు పట్టిందనుకోండి. అది వేరే విషయం.

మెడికల్ కాలీజీలో, సుధాకర్ గాడి స్కూటర్ మీద తిరుగుతూ, వర్షంలో తడిచినప్పుడల్లా వాడిని తిట్టుకునే వాడిని. వీడికి కారు ఎందుకు లేదా అని. మంచి మనసులు నిన్మాలో, ఎస్వీ రంగారావు దార్లో బస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లందరినీ తన కార్లో ఎక్కించుకొని వెళుతుంటాడు. అది చూసి, నేను కూడా తెగ ఇంప్రెస్ అయిపోయి, నేను కూడా ఎప్పటికైనా కారు కొని, అలానే ప్రజాసేవ చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు, అలా చేస్తే, కిడ్నాప్ చేస్తున్నానని పోలీసులు పట్టుకుంటారేమోనని భయం వేసి మానుకున్నాను. 1990 లో ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు మొదటి కారు కొన్నాను. నిస్సాన్ మైక్రా అని మన మారుతీ లాంటి బుల్లి కారు. సెకండ్ హ్యాండ్ ది.

అప్పటి జీతంలో అంతకంటే శీను లేదు మనకి. కానీ బోల్డంత ఆనందమేసింది. Ferrari కారు కొన్నట్లు ఫీల్ అయిపోయాను. ఆ కారులో రెండేళ్లు జీవితం బాగానే వుంది. కానీ జీతం పెరక్కపోయినా, సంసారం పెరిగే సరికి, కొంచెం పెద్ద కారు కొనాల్సిన అవసరం పడింది. బుర్రలో ఆలోచన రావడం ఆలస్యం. వెంటనే ఆ పని చేయాల్సిందే దాని బాగోగులు బేరీజు వేయడం ఆచి, తూచి అడుగేయడం లాంటి మంచి అలవాట్లు మనకు లేవాయే. అలానే, వెంటనే, నిస్సాన్ అమ్మేసి, ఆస్టిన్ అనే కారు కొన్నాను, ఇంగ్లాండ్ లో కార్లు కొనేముందు అందరూ, ఆటోకార్ అనే ఓ మ్యాగజైన్ కొని, దాంట్లో ఇచ్చిన కార్ల రేటింగ్ ను బట్టి, కొంటారు కానీ, మనం కొంచెం తేడా కదా.

అందుకనే కారు కొన్న మర్నాడు, మ్యాగజైన్ కొన్నా. తీరా చూస్తే, బెస్ట్ కారు కింద అమ్మేసిన నిస్సాన్ కారు, వరస్ట్ కారు కింద ఆస్టిన్ కారు వున్నాయి. “నే చెప్తే విన్నావా?” అని మా ఆవిడ వేసిన చెళుకులు మరింత బాధ పెట్టాయనుకోండి. ఇక అప్పటి నుంచి మొదలయినాయి బాధలు. వారానికోసారి ఆగిపోయేది కారు. నా కారు మీద, నా డ్రైవింగ్ మీద జోకులతో జనం పండగ చేసుకునే వారు. మరీ పండగ రోజులు ఎక్కువవుతున్నాయని ఆస్టిస్ అమ్మకానికి డిసైడ్ అయిపోయాను. కొన్న గ్యారేజ్ కే వెళ్లాను.

ఆ సదరు ఓనరు, “ఈ కారు నేను కాదు కదా. తలకాయ ఉన్న ఏ వెధవా కొనడు" అన్న ఫక్కీలో సమాధానమిచ్చారు. దాంతో తెగ కోపమొచ్చి, కారు రివర్స్ చేస్తుండగా, ఓ చిన్న ప్రమాదం జరిగిపోయింది. అక్కడే వున్న ఓ కుర్ర కారుని నా ముసలి కారు కొంచెం గాఢంగా ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దుకు పరిహారం చెల్లించి, నా సుత్తి కారుని వేరే చోట, చాలా తక్కువకి అమ్మి బరువైన గుండెలతో, తేలికైన జేబుతో బయటపడ్డాను.

“నీకు కారు అచ్చిరాదు. ఎద్దులబండి కొనుక్కోబ్రదర్" అని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ, ఇంగ్లాండ్ లో ఎద్దులు, బర్రెలు దొరక్క మళ్లీ కారు కొనాల్సి వచ్చింది.

“ఈసారన్నా నాల్గు పౌండ్లు ఎక్కువ అప్పు చేసి, మంచి కారు కొను" అని మా ఆవిడ ఇచ్చిన ఉచిత సలహాని పెడచెవిన పెట్టి, ఓ పాత ఆడి కారు కొన్నాను. నా స్నేహితుడు, డా. కృష్ణయ్య కారు అది. ఆ కారుని మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఎనిమిది గుర్రాల రథాల్ని తోలినట్లు తోలేవాడు. కానీ ఆ కారు కూడా నేను కొన్నాక బే'కారు' అయిపొయింది. డ్రైవర్ వైపు డోర్ తెరవడానికి వచ్చేది కాదు. అటూ, ఇటూ చూసి. ఎవ్వరూ చూడ్డం లేదని నిర్ధారించుకుని, రెండో వైపు నుంచి నా కారులోకి నేను దొంగ లాగా దూరే వాడిని.

ఆ 'రథం' లండన్ నుంచి వస్తుండగా దారిలో మధ్యలో ఆగిపోయింది ఓ అర్ధరాత్రి సమయంలో. రికవరీ వ్యాన్ సహాయంతో గ్యారేజీ ముందు వదిలేసి, నీరసంగా ఇంటికి చేరాను. మర్నాడుదయమే గ్యారేజ్ ముందు నుంచి ఫోన్ వచ్చింది. సారాంశమేమిటంటే, రాత్రి కొందరు దొంగ సచ్చినోళ్లు ముచ్చటపడి కారు అద్దాలు పగులగొట్టి, స్టీరియో పట్టుకెళ్లారని. అంతా రిపేరు అవ్వడానికి, అసలు కారు కొనడానికి అయిన దానికంటే ఎక్కువయినాయి పైసలు.

“చెప్తే విన్నావా?” అన్న డైలాగు నుంచి ఓ మెట్టు ఎక్కి మా ఆవిడ "నీకు చెప్పడం అనవసరం" అని, పెదవి విరిచింది.

“పెళ్ళికొచ్చిన కూతురు గుండెల మీద కుంపటి" అనే తెలుగు నానుడి ఫక్కీలో నాకు 'మొసలి డొక్కు కారు గుండెల మీద హీటర్' అయిపొయింది. చాలా గ్యారేజీలు నా ఐరన్ లెగ్ తుప్పు పట్టేదాకా తిరిగి, చివరికి ఎదురు డబ్బులిచ్చి ఆ కారుని వదిలించుకున్నా. ఆ దేశంలో, పాత కారు స్క్రేప్ కింద వదిలించుకోవాలంటే డబ్బులు కట్టాల్సిందే. చివరికి లెక్క వేస్తే, సెకండ్ హ్యాండ్ కార్లకి పెట్టిన డబ్బులతో మంచి కొత్త మెర్సిడస్ కారు వచ్చేదని తేలింది.

“నిన్ను ఆ దేవుడు కూడా బాగు చేయలేడు" అని మా ఆవిడ ఇంకో 'కారు'కూత కూసే ముందే, మూటా ముల్లె, తట్టా బుట్టా, బోనూ జాయింటూ, సర్దుకొని ఇండియాలో దిగిపోయాను. ఇప్పుడు నాకు ఏ రకమైన టెన్షన్ లేదు. ఏ కారు కొనాలో పిల్లలు డిసైడ్ చేస్తారు. ఎక్కడ అప్పు చేయాలో మా ఆవిడ చెపుతుంది. నేను చివరికి డ్రైవింగ్ కూడా చేయనక్కర్లేదు. ఎందుకంటే, నే పక్కనున్న కార్లని, ముందున్న జనాల్ని, వెనుకనున్న ఎలక్ట్రిక్ పోల్స్ ని కొట్టుకుంటూ డ్రైవ్ చేస్తానని మా వాళ్లందరి ఏకాభిప్రాయం.

కానీ నా ఉద్దేశంలో ఇది వట్టి పు'కారు'.