సిల్లీ ఫెలో - 39

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 39

- మల్లిక్

 

కొంపదీసి తను తీస్కున్న నిర్ణయానికి బాధపడి ఏ బావిలోనో దూకి ఆత్మహత్య చేస్కొడానికి వెళ్ళలేదు కదా? సిల్లీగా ఆలోచిస్తూ అనుకున్నాడు బుచ్చిబాబు.

ఛీ.... ఛీ.. సీత ఆత్మహత్య చేస్కునేంత పిరికిమనిషి కాదు. తనకు తెలిసి సీత ఎటువంటి పరిస్థితినినా ధైర్యంగా ఎదుర్కోగల మనిషి.

మరి సీత ఎక్కడికి వెళ్ళినట్టో!

"సార్.... మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు. పొద్దున్న రాగానే మీకేదో ఫైలిచ్చారంటగా... దాన్ని తీసుకుని రమ్మన్నారు."

ఆలోచిస్తూ ఉండిపోయిన బుచ్చిబాబుతో ప్యూన్ అన్నాడు.

ఒక్క అయిదు నిముషాల్లో వస్తానని చెప్పు" ప్యూన్ తో అన్నాడు బుచ్చిబాబు.

ఆలోచనల్లో పడి ప్రక్కన పెట్టిన ఆ ఫైలుని తీసి సగం రాసిన నోటింగ్ ని పూర్తిచేసి ఏకాంబరం క్యాబిన్ లోకెళ్ళి ఆయన ముందు పెట్టాడు బుచ్చిబాబు.

ఏకాంబరం నోటింగ్ మొత్తం చదివి "నువ్వో పెద్ద ఠంగుఠలాకీ వోయ్! యూకెన్ గో" అన్నాడు.

బుచ్చిబాబు వెనక్కి తిరిగి గుమ్మంవైపు రెండడుగులు వేసాడు.

"ఏమోయ్ నిన్నే" ఏకాంబరం పిలిచాడు.

బుచ్చిబాబు వెనక్కి తిరిగి చూశాడు.

"ఏంటీ వెళ్ళిపోతున్నావ్" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఏకాంబరం.

"మీరే కదా సార్ యూకెన్ గొ అన్నారు?" అంతకంటే ఆశ్చర్యంగా ప్రశ్నించాడు బుచ్చిబాబు.

"అవును.... అన్నాను గానీ నువ్వేంటీ నేను నిన్ను ఠంగుఠలాకీ అని అంటే అది తిట్టోలేక పొగడ్తో తెలుసుకోకుండా పోతున్నావ్?"

"అలా అడిగి తెలుసుకునే మూడ్ లో నేనిప్పుడు లేను సార్!"

"అదేంటోయ్! త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నావ్. నీ మూడ్ బాగోలేదంటే ఎలా? మరీ లస్కు బస్కుగాడిలా మాట్లాడకు" అన్నాడు ఏకాంబరం.

"లేదుసార్... మాపెళ్ళి క్యాన్సిల్ అయ్యింది సార్!" చెప్పాడు బుచ్చిబాబు.

ఏకాంబరం ఆశ్చర్యంగా బుచ్చిబాబు వంక చూశాడు.

"క్యాన్సిల్ అయిందా?" అదేం?" 

"మా జాతకాలు అస్సలు కలవలేదంట సార్... జాతకం ప్రకారం నేను మేకనయితే తను సింహం అంటా సార్. మాకు పొత్తు కుదర్దు సార్."

"అయినా టంగుటొస్కాయ్ గాడిలా నువ్వు కూడా ఈ జాతకాని నమ్ముతావటోయ్?"

"నేను నమ్మడం కాద్సార్! ఇదంతా మా అమ్మానాన్నల నిర్ణయం సార్".

"పోనీ జాతకాలని నమ్మితే నమ్మారుగానీ మీ జాతకాలు మంచి సిద్దాంతికే చూపించారా లేకపోతే ఏ కిల్లారికిత్తిగాడికో చూపించారా?"

"లేదు సార్... ఈ సిటీలోనే ఫేమస్ అయిన పిలకల గుండుశాస్త్రి సిద్దాంతికి  చూపించాం సార్" 

"ఓ. ఐసీ!" తల పంకించాడు ఏకాంబరం.


*            *           *