సిల్లీ ఫెలో - 38

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 38

- మల్లిక్

 

"హలో.. ఎవరు?" అడిగింది అవతలి కంఠం.

"సీత కావాలండీ" అన్నాడు బుచ్చిబాబు.

"మీకు ఎవరు కావాలి అని నేను అడగలేదు. మీరెవరూ అని అడుగుతున్నా"

బుచ్చిబాబుకి వళ్ళు మండింది. ఇలా అధిక ప్రసంగం మాట్లాడాడంటే తప్పకుండా వాడు సీత బాసుగాడే అయివుంటాడు.

"నేనా? వల్లకాట్లో రామనాథాన్ని, సీతని పిలుస్తారా?" పళ్ళు కొరుకుతూ అన్నాడు బుచ్చిబాబు.

"ఒహోహో వల్లకాట్లో రామనాథమా, ఇది వరకు మీరు ఫోన్ చేశారు కదూ? అడిగింది అవతలి కంఠం.

"అవును" చెప్పాడు బుచ్చిబాబు.

"మీది దిబ్బ అన్నారు.. అవునా?"

"ఎస్.. మేం దిబ్బలోళ్ళమే! ఇప్పుడైనా సీతని పిలుస్తారా?"

"మీ దిబ్బవాళ్ళు ఎక్కువగా ఏ ప్రాంత్రంలో ఉంటారండీ? అడిగింది అవతలి కంఠం.

బుచ్చిబాబుకి సహనం నశిస్తోంది.

"రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా దిబ్బకర్రు గ్రామంలో మొత్తం మావాళ్ళే వుంటారు" కసిగా నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు.

"అలా చెప్పండి. రాయలసీమతో నాకెక్కువగా టచ్ లేదు. అందుకే మీ గురించి నేనెక్కువగా వినలేదు. చాల గమ్మత్తుగా ఉందే" అన్నాడు అవతలి వ్యక్తి.

"సరేగానీ ఇప్పటికైనా సీతని పిలుస్తారా?' అన్నాడు బుచ్చిబాబు.

"సీత ఈవేళ ఆఫీసుకి రాలేదు" చల్లగా చెప్పి ఫోన్ పెట్టేసింది అవతలి కంఠం.

అది విన్న బుచ్చిబాబుకి గట్టిగా కెవ్వుమని కేకేసి గట్టిగా జుట్టు పీక్కుని కసిగా నెత్తిన మొట్టుకోవాలనిపించింది. కానీ సెక్షన్ లో వాళ్ళు చూస్తే బాగుండదని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

సీత ఆఫీసుకి రాలేదంటే బుచ్చిబాబుకి కంగారు పుట్టింది.

సీతకి ఒంట్లో బాగోలేదా?లేకపోతే నిన్నటి తన ప్రవర్తనకి మానసికంగా దెబ్బతిని ఆఫీసుకు రాలేదా? బుచ్చిబాబు గబగబా మరో నెంబర్ డయల్ చేసాడు. అది సీత హాస్టల్ నెంబర్.

"హలో.. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్! అంది అవతల నుండి ఒక ఆడగొంతు. బహుశా వార్డెనేమో!

"హలో.... ఏమండీ ఓసారి సీతని పిలుస్తారా?'; రిక్వెస్టింగ్ గా అడిగాడు బుచ్చిబాబు.

"ఈ టైములో సీత ఇక్కడెందుకుంటుంది? ఆఫీసులో వుంటుంది." విసుక్కుంటూ సమాధానం ఇచ్చింది అవతల కంఠం.

బుచ్చిబాబుకి కోపం వచ్చినా తమాయించుకుని అడిగాడు. "అది కాదండీ, సీత ఆఫీసుకు ఇప్పుడే ఫోన్ చేసాను. ఈవేళ ఆమె ఆఫీసుకు రాలేదని చెప్పారు.

"అలాగా, సీత ఇక్కడకూడా లేదు. ఆఫీసని చెప్పి ఆ సీత "ఏ" రాముడితో షికారు కొడ్తుందో మరి" అని ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది ఆమె.

"డామిట్! సిల్లీ మనుషులూ, సిల్లీ వ్యవహారాలూ!" విసుగ్గా రిసీవర్ పెట్టేశాడు బుచ్చిబాబు.

సీత ఆఫీసుకి వెళ్ళలేదూ, హాస్టల్ లోనూ లేదంటే ఇంకెక్కడికి కెళ్ళింది?