సిల్లీ ఫెలో - 37

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 37

- మల్లిక్

 

"బానేవుంది. నువ్వు లేకుండా నేను భోజనం చెయ్యడం ఏమిటి రా?"

"ప్లీజ్ రాధ! నాకకలిగా లేదు. నన్ను బలవంతం చేయకు"

"పోనీలే, ఆకలిగా లేకపోతే కొంచమే తిను. నాకు కంపెనీ కోసమయినా రా.. లే" సీత వీపుమీద తడుతూ అంది రాధ.

సీత వెల్లకిలా తిరిగింది. ఆమె మొహం చూసి ఉలిక్కిపడింది రాధ.

సీత కళ్ళు ఎర్రబారి వున్నాయి. ఆమె కళ్ళవెంట ధారాపాతంగా కన్నీళ్లు కారుతున్నాయి.

"ఏంటి సీత ఏమైంది? వంట్లో బాగాలేదా? ఎక్కడయినా నొప్పా"

సీత తల అడ్డంగా ఊపింది!

"మరేంటి? ప్రొద్దున బాగానే వున్నావు కదా. సాయంత్రం నీ బుచ్చిబాబుని కూడా కలిసొచ్చావు. హుషారుగా వుండాల్సిందిపోయి ఇలా ఏడుస్తూ మీ ఇద్దరికీ ఎదయినా గొడవచ్సిందా?"

" మా పెళ్ళి క్యాన్సిల్ అయింది" వెక్కుతూ అంది.

రాధ ఆశ్చర్యపోయింది.

"ఇంతదాకా వచ్చిన తర్వాత పెళ్ళి కాన్సిల్ కావడం ఏంటి? అయినా ఆ ముసలాళ్ళ కిదేం పోయేకాలం?" ఆవేశంగా అంది.

"పాపం వాళ్ళనేమీ అనకు. వాళ్ళు చాలా మంచివాళ్ళు"

"మరి.... ఇంకెందుకు కాన్సిల్ అయ్యింది? బుచ్చిబాబుకి సినిమాలోల్లా గుడ్డి చెల్లెలో, కుంటి  చెల్లెలో వుండి దాని పెళ్ళయ్యే దాకా నేను చేసుకోను అనిగానీ అన్నాడా?"

సీత విరక్తిగా నవ్వింది.

"అలా అన్నా బాగుండేది. కాని ఇప్పుడు పెళ్ళి చేసుకోనని అంటున్నాడు" తలగడలో తల దాచుకుని భోరుమంది.

రాధ ఆశ్చర్యపోయింది.

"అంత హఠాత్తుగా ఆ నిర్ణయం ఏంటి.... కొంపదీసి నీమేదేదైనా అనుమానం వచ్చిందా?"

సీత తల అడ్డంగా ఊపింది.

"మరి దేనికి కాన్సిల్ అయింది" ఆత్రంగా అడిగింది రాధ.

సీత మంచంమీద నుంచి లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుని సాయంత్రం తనకూ బుచ్చిబాబుకూ జరిగిన సంభాషణ గురించి చెప్పడం మొదలుపెట్టింది.

సీత చెప్పేదాన్ని రాధ నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతూ వినసాగింది.


*           *        *
 
బుచ్చిబాబుకి పనిమీద మనసు లగ్నం కావడంలేదు. ఏ ఫైలు తెరిచినా సీత కన్నీళ్లు పెట్టుకున మొహమే కనిపిస్తోంది. కొంపదీసి నేను తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమో" అని అతని మనసుకి అనిపించినా సీత బాధపడుతూ వుండడం చేత అలా అనిపిస్తుందేమో గాని అది సరయిన నిర్ణయమే అనిపించసాగింది అతనికి ఆలోచించగా ఆలోచించగా.

కొత్తగా ఎవరయినా ఏదైనా పనిచేస్తే బాధపడాల్సిందే.

మొదటిసారిగా విధవని వివాహం చేసుకున్నవాడు ఎన్ని బాధలు పడ్డాడో మనకి తెలుసా? మొదటిసారిగా కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఏ ఏ సమస్యల్ని ఎదుర్కొన్నారో మనకి తెల్సా?

ఇదీ అంతే. ఈనాడు విమర్శించినవాళ్ళే రేపు సమర్థిస్తారు. సీతకి ఈవేళ తన నిర్ణయం సిల్లీగా అనిపించినా రేపు ఇది తెలివయిన నిర్ణయం అని తనే వప్పుకుంటుంది.

కానీ సేత బాధపడుతుంటే బుచ్చిబాబు మనసు కరిగిపోయింది.

సీత బాధపడుతుంది కదా అని ఇప్పడు పెళ్ళి చేసుకుంటే ఇద్దరి మధ్యా ప్రేమ నశించి జీవితాంతం ఇద్దరూ బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు సీత పడుతున్న బాధ కేవలం తాత్కాలికమయింది. జీవితాంతం ప్రేయసీ ప్రియురాలుగా శాశ్వతమయిన ఆనందాన్ని పొందవచ్చని సీతకు ఇప్పుడే తెలీదు. కానీ క్రమేణా తను ఆ నిజం గ్రహిస్తుంది అనుకున్నాడు బుచ్చిబాబు.

క్రితంరోజు సీత బాధపడుతూ వెళ్ళిపోయిన సంఘటన అతనికి గుర్తు వచ్చింది. బుచ్చిబాబు ఉండబట్టలేక సీత ఆఫీసుకి ఫోన్ చేశాడు.