హలో... రాంగ్ నెంబర్.! - 59

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 59

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

శ్రీకర్ ఆ యింట్లో అడుగు పెట్టేసరికి షాలిని ట్రాన్స్ పరెంట్ నైటీలో వుంది. శ్రీకర్ ని చూసి ఎదురొచ్చింది.

"మీ కోసమే వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం ఫ్లయిట్ కు ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ కొత్త డిజైన్స్ కొన్ని వచ్చాయిట. ఫేమస్ డిజైనర్ రీతూ శర్మని కలుసుకోవాలి. మిస్ ఢిల్లీ పోటీలు ఈ నెలలో జరుగుతున్నాయట. వాటి గురించి బోల్డు డిటైల్స్ తెలుసుకోవాలి. ఇన్ని పనులున్నాయి. మీకోసమే ఈ వెయిటింగ్. మనకి ఎక్కువ టైం లేదు. మా వాళ్ళందర్నీ బయటకు పంపించేసాను" హస్కీకా అంది షాలిని.

ఓసారి షాలిని వంక చూసాడు. చాలా టెంప్టింగ్ గా వుంది. ఆమె చూపులో ఇన్విటేషన్ వుంది. చేతల్లో రొమాంటిక్ యాక్షన్ వుంది.

షాలిని భుజం చుట్టూ రెండు చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు.

"అన్నట్టు శ్రీ...డబ్బులు తెచ్చావా?" అడిగింది సడన్ గా గుర్తొచ్చినట్టు (గుర్తొచ్చి నట్టు నటిస్తూ.)

"డబ్బులా...ఏ డబ్బులు?"

"అదేంటి శ్రీ...చెప్పాను కదా...ఢిల్లీ వెళ్ళడానికి లక్ష రూపాయలైనా కావాలని. మీ కోసమే అందర్నీ పంపించాను" శ్రీకర్ కు అర్థమైంది. ఆమెకు లక్ష రూపాయలు కావాలి. కానీ ఈ విధంగా అడుగుతోంది. ఒక్కక్షణం అతని మూడ్ డిస్టర్బ్ అయింది.

"అదేంటి..అమౌంట్ తీసుకురాలేదా?" ఆమె కంఠంలో నిరాశ. శ్రీకర్ ఓసారి ఆమె వంక చూస్తూ అన్నాడు "నిజం చెప్పాలంటే మరిచిపోయాను. పోనీ ఈవెనింగ్ ఏర్ పోర్ట్ లో యిచ్చేదా?"

"ఈవెనింగా?" ఆమె మొహంలో నిరాశ. శ్రీకర్ నడుం పట్టుకున్న ఆమె చేతులు సడలిపోయాయి.

"పోనీ ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి డ్రా చేసుకురాకూడదు" చిన్న ఆశతో అడిగింది.

"ఇప్పుడా...టైం లేదు...ఈలోగా మీ వాళ్ళొస్తారు.

"మరేం ఫర్లేదు..కావాలంటే నేను కూడా వస్తాను."

"నువ్వు డ్రెసప్ అయ్యేసరికి లేటవుతుంది. నేను వెళ్ళి డ్రా చేసుకొని వస్తాన్లే."

"త్వరగా వెళ్ళండి. ఇవ్వాళ శనివారం కదా. త్వరగా క్లోజ్ చేస్తారు"

ఓసారి షాలిని వంక చూసాడు. ఆమెకు తను వెంటనే తెచ్చే డబ్బే ముఖ్యమని అర్థమవుతుంది. ఇవ్వాళ్ళ పరిచయం లోనూ తనూ ఖరీదైన గిఫ్ట్ లు కొనిపెట్టాడు. బోల్డుసార్లు క్యాష్ యిచ్చాడు ఇప్పటి వరకూ తనకు అన్ని అవకాశాలూ మిస్ అవుతూ వచ్చాయి. ఇప్పుడీ అవకాశం కూడా మిస్సవుతుందనిపిచింది.

"షాలిని...ఓ పని చేద్దాం..నువ్వు ఏర్ పోర్ట్ కు వెళ్ళేప్పుడు నేనే డ్రాప్ చేస్తాను. నా దగ్గర ఏటియం కార్డు వుంది. క్రెడిట్ కార్డూ వుంది. క్యాష్ గురించి నువ్వేం వర్రీ అవ్వొద్దు. ఇప్పుడీ అవకాశాన్ని మిస్ చేసుకోవడం ఎందుకు" నైటీలో నుంచి కనిపించే ఆమె నడుం ఒంపుని చూస్తూ అడిగాడు.

"ఈవెనింగ్ హడావిడిలో వుంటాం అయినా ఎంత...అఫెనవార్ లో రారూ..ప్లీజ్..." అంది అతడ్ని పంపించే ప్రయత్నం చేస్తూ.

"త్వరగా వెళ్ళోచ్చాక రెండు గంటలు వున్నా ఫర్లేదు" అంది కాసింత అసహనంగా.

శ్రీకర్ కు ఇరిటేటివ్ గా వుంది. ఛ...డబ్బు గురించే తప్ప, తన గురించి ఆలోచించదేమిటి? అదే ప్రియంవద అయితే..."వెధవ డబ్బు పోనిద్దురూ..వుండిపోకూడదు" అంటూ తనని చుట్టేయదూ...ప్రియంవద గుర్తుకు రాగానే అతనికి పొలమారినట్టు అనిపించింది. పందెం గుర్తుకు వచ్చింది.

"ఏమైంది శ్రీ...ప్లీజ్ త్వరగా వెళ్ళిరండి" అంది షాలిని.

ఓసారి తల విదిల్చి, బయటకు నడిచాడు శ్రీకర్. షాలిని కారు వరకూ వచ్చింది. "శ్రీ..లేటైనా ఫర్లేదు. క్యూ వుందని వచ్చేయకండి" అంది మరోసారి.

"షిట్..." విసుగ్గా అనుకొని, కారును రివర్స్ చేసి రోడ్డు మీదికి పోనిచ్చాడు.

*          *         *

జేమ్స్ బాండ్ వెంటనే ఆటో వాడిని కేకవేశాడు. ఆటో రాగానే ఎక్కి అందులో కూచుని కారును ఫాలో అవ్వమన్నాడు. ఆటో కారుని ఫాలో అవుతూంది. సరిగ్గా అప్పుడే జేమ్స్ బాండ్ దగ్గర వున్నసెల్ ఫోన్ రింగయింది.

ఆ నెంబర్ చూసి గుర్తుపట్టి "చెప్పండి" అన్నాడు.

"ఎంతవరకూ వచ్చింది మీ పరిశోధన?" అడిగింది ప్రియంవద.

"ఆ పనిమీదే వున్నాను. ఆటోలో కారును ఫాలో అవుతున్నాను. షాలిని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. కారు ఎక్కడికో వెళ్తోంది"

"ఓ.కే. వీలైతే ఫోటోలు కూడా తీయకూడదా?"

"చూద్దాం...ముందు మీరు ఫోన్ పెట్టేయండి. కారు కనుమరుగైతే కనుక్కోవడం కష్టం" అంటూ ఫోన్ కట్ చేసాడు.

శ్రీకర్ కారు బ్యాక్ ముందు ఆగడం గమనించాడు.

"ఆటో! ఆ బ్యాంక్ దగ్గర ఆపు" చెప్పాడు ఆటో డ్రైవర్ తో. ఆటో బ్యాంక్ దగ్గర ఆగింది.శ్రీకర్ కారు పార్క్ చేసి బ్యాంకు లోపలికి వెళ్ళాడు. అతన్ని ఫాలో అయ్యాడు జేమ్స్ బాండ్.

శ్రీకర్ చెక్ బుక్ తీసి దాని మీద అమౌంట్ వేసి, సంతకం చేసి 'క్యూ'ళో నిలబడ్డాడు. జేమ్స్ బాండ్ శ్రీకర్ వెనకే నిలబడ్డాడు. శ్రీకర్ చేతిలోని చెక్ కనబడుతోంది. అమౌంట్ ఎంతో తెలియడం లేదు. జేమ్స్ బాండ్ ఒక్క క్షణం ఆలోచించి, వెనక నుంచి ఎవరో తోసినట్టు శ్రీకర్ మీద పడ్డాడు.

శ్రీకర్ చేతిలోని చెక్ కిందపడిపోయింది. జేమ్స్ బాండ్ చెక్ తీసి శ్రీకర్ కు యిస్తూ, "సారీ" అని చెప్పాడు. ఈలోగా చెక్ మీద అమౌంట్ చూసాడు. లక్ష రూపాయలు.

శ్రీకర్ డబ్బు డ్రా చేసి, డబ్బును బ్రీఫ్ కేసులో పెట్టి, కారులో తన సీటు పక్కనే పెట్టి, కారు రివర్స్ లోకి తీసి షాలిని యింటి వైపు పోనిచ్చాడు.

సరిగ్గా అప్పుడే అతని మోబిటెల్ రింగయింది. అది అతని పర్సనల్ ఫోన్....56374677.