హలో... రాంగ్ నెంబర్.! - 58

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 58

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

ఫైల్ చూస్తున్నాడు శ్రీకర్. అప్పుడే రెడ్ కలర్ ఫోన్ మోగింది. దాని తాలూకు ప్యారలర్ ఫోన్ ఒకటి హాలులో వుంది. ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు. శ్రీకర్ ఫోన్ లైఫ్ట్ చేసాడు. అదే సమయంలో రిసెప్షనిస్టు ఫోన్ లిఫ్ట్ చేసింది.

అవతలివైపు ఎవరో మాట్లాడుతున్నారు.

"ఎట్ యువర్ సర్వీస్ ఆఫీసేనా?"

"యస్..." రిసెస్పనిస్ట్ సమాధానం.

"ఓ ఫ్రెండ్ కి బొకే పంపించాలి. మీరు పంపించగలరా?"

"సారీ..మీరు ఫ్లవర్ షాప్ కి వెళ్ళండి. మా దగ్గర అలాంటి సర్వీస్ లేదు."

"ప్లీజ్...నేను హైదరాబాద్ కు కొత్త. బెంగుళూర్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ కి బొకే పంపించి సర్ ప్రయిజ్ చేసి, తర్వాత నేను వెళ్ళాలని"

రిసెప్షనిస్ట్ ఫోన్ పెట్టేయబోయింది. వెంటనే శ్రీకర్ "వన్ మినిట్" అన్నాడు.

రిసెప్షనిస్ట్ కు అవతల బాస్ వున్నాడని అర్థమైంది.

"చెప్పండి మేడమ్. మీరు ఎవరికి బొకే పంపించాలి. మీరో పనిచేయండి. మీరెక్కడ వున్నారో అడ్రస్ యివ్వండి. మీరు సిటీకి కొత్త అంటున్నారు. కనుక...మా మనిషి మిమ్మల్ని పికప్ చేసుకుని మా ఆఫీసుకు తీసుకువస్తాడు. ఇక్కడనుంచే మీరు మీ ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళొచ్చు. అన్నట్టు మీరు ఎలాంటి బొకే పంపించాలో నిర్ణయించుకోండి"

"థాంక్యూ సర్. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్"

"శ్రీకర్..ఎట్ యువర్ సర్వీస్ చైర్మన్ ని చెప్పాడు కాసింత గర్వంగా.

"ఓహ్..గ్లాడ్ టు మీట్ యు సర్. ఎలాంటి బొకే పంపించమంటారు?" అవతలి నుంచి అమ్మాయి అడిగింది.

"పంపించే వ్యక్తిని బట్టి బొకేలు మారుతూవుంటాయి. హోల్డ్ మీ, సైలెంట్ ఫాల్, గోల్డెన్ బ్యూటీ, సింపుల్ విష్, బ్లిస్, సన్ గ్లో, పీస్ మేకర్. మార్వేల్, లేడీలక్...ఇలా మీ యిష్టం. మేమే పర్చేజ్ చేసి మా ఏజంట్ ద్వారా పంపిస్తాం లేదా ఫ్లవర్ పాట్ ద్వారా పంపిసాం....బట్ వుయ్ టేక్ స్మాల్ ఫీ"

"ఓ.కే. నేను ఎక్కడున్నానో చెబుతాను." అంటూ ఆ అమ్మాయి తన అడ్రస్ చెప్పింది.

"రైట్..మరో పావుగంటలో మా మనిషి మీ దగ్గర వుంటాడు. అతని టీషర్ట్ మీద ఎట్ యువర్ సర్వీస్ అన్న ప్రింట్ వుంటుంది. బై" చెప్పి ఫోన్ పెట్టేసి, రిసెప్షనిస్ట్ ని తన ఛాంబర్ లోకి పిలిచాడు.

రిసెప్షనిస్ట్ భయ భయంగా శ్రీకర్ ఎదురుగా నిలబడింది.

"మనకు ఫోన్ చేసే ప్రతీ వ్యక్తీ మన క్లయింటే కాకపోవచ్చు. వాళ్ళకు మనం సర్వీస్ చేసే అవకాశం లేకపోవచ్చు. బట్...సాధ్యమైనంతవరకు క్లయింట్స్ కు సర్వీస్ చేయాలి. మనకు ఫ్లవర్ షాప్ లేకపోతేనేం..మనం ఆర్డర్ యిచ్చి, ఆ పనిచేయించలేమా...సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళకు అంతా కన్ ఫ్యూజన్ గా వుంటుంది. మనం ఏమాత్రం మంచిగా మాట్లాడినా ఆ మౌత్ టాక్...పెద్ద పబ్లిసిటీ అవుతుంది. బిజినెస్ లో సిన్సియారిటీ వుండాలి. మీకు తెలియని విషయాలు, తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోండి. ఇంకెప్పుడూ మా వల్లకాదు...ఆ సర్వీస్ మా దగ్గర ఎవైలబుల్ కాదు..అని చెప్పకండి. నాకు నచ్చని విషయాలు అవి.

రిసెప్షనిస్ట్ అలానే అన్నట్టు బుద్ధిగా తల వూపి వెళ్ళిపోయింది.

*           *             *

ఉదయం నుంచి ఎట్ యువర్ సర్వీస్ దగ్గరే కాపు కాసాడు జేమ్స్ బాండ్. అతనికే క్లూ దొరకలేదు. మధ్యాహ్నం పన్నెండున్నర ప్రాంతంలో శ్రీకర్ బయటకు వచ్చాడు. అతని కారు థర్డ్ లైన్ వైపు వెళ్తోంది.

జేమ్స్ బాండ్ తన బైక్ కోసం చూసాడు. అప్పుడు గుర్తొచ్చింది. తను నీరసంగా వుండడం మూలాన బైక్ తేలేదని, వెంటనే ఆటోని కేకేసాడు. ఆటో వచ్చి అతని ముందు ఆగింది.

"ఆ కారును ఫాలో అవ్వు...అనుమానం రాకూడదు" చెప్పాడు జేమ్స్ బాండ్ ఆటోవాడికి.

"ఆ కారులో ఎవరున్నారు?"  అడిగాడు ఆటో డ్రైవర్.

"ఏం ఎందుకలా అడిగావు?" జేమ్స్ బాండ్ అడిగాడు.

"ఏం లేదు..ఎక్కువగా సినిమాల్లో ఇలా ఆటోని పిలిచి ఫాలో అవ్వమని చెబుతారు. మీరేమైనా పోలీస్ ఆఫీసరా?"


"యస్. ప్రమ్ క్రయిం బ్రాంచ్. త్వరగా ఫాలో అవ్వు...క్విక్" చెప్పాడు జేమ్స్ బాండ్.

ఆటో డ్రైవర్ జేమ్స్ బాండ్ క్రయిమ్ బ్రాంచ్ అని చెప్పగానే కిక్కిరుమనకుండా కారుని ఫాలో అయ్యాడు.

శ్రీకర్ కారు ఓ బంగళా ముందు ఆగింది.

కొద్ది దూరంలో ఆటో ఆగింది. జేమ్స్ బాండ్ బైనాక్యులర్ తో గమనించసాగాడు.

"సార్...ఈ బైనాక్యూలర్స్ లేకుండా చూడలేరా. నాకు స్పష్టంగా కనిపిస్తోంది" చెప్పాడు ఆటో డ్రైవర్.

జేమ్స్ బాండ్ ఆటో డ్రైవర్ వైపు చూసి...

"ఇందులో నుంచి చూస్తే క్లైమోర్ లు కూడా కనిపిస్తాయిలే" అంటూ ఆ ఇల్లు ఎవరిదో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయసాగాడు.

అతని మెమొరీ పని చేయడం ప్రారంభించింది. ఆ ఇల్లు మిస్ సిటీ షాలినిది. వెంటనే హుషారుగా ఈల వేయబోయి, ఆగిపోయాడు. ఆటో డ్రైవర్ కు మీటర్ చూసి, ఎక్ స్ట్రా కొంత డబ్బు యిచ్చి వెళ్ళిపోమన్నాడు.

*           *             *