హలో... రాంగ్ నెంబర్.! - 55

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 55

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

స్ట్రీట్ లైట్ల వెలుతురులో దుబాయ్ అందాలను ఎంజాయ్ చేయలేకపోతోంది లూసీ. రోడ్డు మీదికి వచ్చింది. ఆమె పెదవుల మీద శుష్క మందహాసం. మనసు శూన్యమైన ఫీలింగ్. బాధలోనూ ఆనందం కలిగింది ఒక్క క్షణం. అవును. తనకు ఇప్పుడు స్వేచ్చవుంది. మనసులో ఏ గిల్టీ ఫీలింగ్ లేదు. ఆలోచిస్తూ ఆ రాత్రంతా రోడ్డు మీదే గడిపింది.

*         *       *

విన్సెంట్ తెల్లారేక రోడ్డు మీద వున్న లూసీని పలకరించను కూడా పలకరించలేదు. లూసీ నిశ్శబ్దంగా ప్లాట్ లోకి వెళ్ళింది. తన బట్టలు...పాస్ పోర్ట్, కొద్దిపాటి డబ్బు తీసుకొని బయటకు నడిచింది.

రోడ్డు మీదికి వచ్చింది. పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి విన్సెంట్ కు ఫోన్ చేసింది.

"విన్సెంట్..గుడ్ బై..గుడ్ బై ఫరెవర్..నువ్వు నన్ను నీ అవసరాలకు వాడుకున్నా, నన్ను హింసించినా, ఒకప్పుడు నన్ను ఆకలి బాధ నుంచి కాపాడావు. అందుకు థ్యాంక్స్. నా వల్ల సాధ్యమయ్యే ప్రతీ పని నీకు చేసి పెట్టాను. ఐ థింక్ నేను నీ రుణం ఎక్కువే తీర్చుకున్నాను. గుడ్ బై మిస్టర్ విన్సెంట్. ఏ రోడ్డు మీద వున్న నన్ను ఆదుకున్నావో...ఆ రోడ్డు మీదే నిర్దాక్షిణ్యంగా వదిలేసావు. మళ్లీ ఆ రోడ్డు మీది నుంచే నా ప్రయాణం మొదలుపెట్టాను. బై.." ఫోన్ పెట్టేసింది లూసీ.

ఆమె చేతిలో శ్రీకర్ ఇచ్చిన విజిటింగ్ కార్డు వుంది. కార్డు తాలూకు స్పర్శ ఆమెలో సెక్యూర్డ్ ఫీలింగ్ కలుగజేస్తోంది.

*          *          *

తలుపు మీద శబ్దం కావడంతో గతం తాలూకు స్మృతుల నుంచి బయటపడింది. షవర్ ఆఫ్ చేసి, నైటీ వేసుకొని బయటకు వచ్చింది.

సర్వీస్ బాయ్ వచ్చాడు. పది నిమిషాల్లో బెడ్ ని నీట్ గా సర్ది, బెడ్ షీట్ ని 'వి' షేప్ లో ఫోల్డ్ చేసి వెళ్ళాడు.

డిన్నర్ చేయాలని అనిపించలేదు.అలానే మంచం మీద వాలిపోయింది. మళ్లీ ఆలోచనలు ఆమెను కందిరీగల్లా చుట్టూముట్టాయి.

తను ఇండియా వచ్చి తప్పు చేసిందా? రేపు విన్సెంట్ తన ఉనికి కనిపెట్టి, శ్రీకర్ కు ఫోన్ చేసి తన గురించి నెగటివ్ గా చెబితే, తనని ఉద్యోగంలో నుంచి తీసివేయమని చెబితే...? తనకు ఇండియాలో తెలిసిన వాళ్ళెవరున్నారు?

ఏ ధైర్యంతో తను వచ్చింది? కేవలం ఆవేశంలోనే వచ్చిందా? తనకు తనే ప్రశ్నలు వేసుకుంటోంది. ఏ ప్రశ్నకూ తన దగ్గర సమాధానం లేదు. బహుశా కాలం దగ్గరే ఆ సమాధానం వుండి వుంటుంది.

*          *        *

శ్రీకర్ లూసీ దగ్గర్నుంచి ఇంటికి బయల్దేరాడు.

అతని కారుని జేమ్స్ బాండ్ బైక్ మీద ఫాలో అవుతున్నాడు. శ్రీకర్ హోటల్ కు వెళ్ళడం, బయటకు రావడం చూసాడు. అతను ఏ నెంబర్ గదిలోకి వెళ్ళాడో గమనించలేకపోయాడు.

శ్రీకర్ సరాసరి ఇంటికే వెళ్ళడం చూసి, జేమ్స్ బాండ్ ప్రియంవదకు ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు.

*            *          *

ప్రియంవద శ్రీకర్ వంకే చూస్తోంది. శ్రీకర్ మాత్రం తనకేమీ పట్టనట్టు ఓ మేగజైన్ చదువుతూ కూచున్నాడు. మధ్య మధ్య ప్రియంవదను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈలోగా బబ్లూ వచ్చాడు.

"డాడీ..మీరిద్దరూ గొడవపడ్డారా?" అడిగాడు ఇద్దరి వాలకం చూసి.

"నీకిలాంటి డౌట్ ఎందుకు వచ్చింది?" అడిగాడు శ్రీకర్ బాబ్లూని దగ్గరకి తీసుకొని.

"ఎన్ని టీవీ సీరియల్స్ లో ..ఎన్ని సినిమాల్లో చూడలేదు. హీరోయిన్, హీరో గొడవ పడతారు. మొహాలు చూసుకోరు. గుర్రుమని ఆపుడప్పుడు చూస్తుంటారు" బబ్లూ ఎక్స్ ప్లెయిన్ చేసి మరీ చెప్పాడు.

"బబ్లూ..నువ్వు బాగా ముదిరిపోయావు. వెళ్ళు, వెళ్ళి పడుకో" అన్నాడు శ్రీకర్.

బాబ్లూ ఓసారి తల్లి వంక, మరోసారి తండ్రి వంక చూసి వెళ్ళిపోయాడు.