హలో... రాంగ్ నెంబర్.! - 52

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 52

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

అవునన్నట్టు తలూపి - తను నాయర్ దగ్గరకి వెళ్లిన విషయం, తన భర్త పందెం విషయమూ చెప్పింది.

"వెరీగుడ్...లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర..నాలాంటి డిటెక్టివ్ ల దగ్గర ఏమీ దాచకూడదు. ఇక మీరు నిశ్చితంగా వుండండి. నా ఇన్వెస్టిగేషన్ వెంటనే మొదలెడతాను"

"మీరా...ఈ పరిస్థితిలోనా? నాయర్ గారూ వేరే ఎవర్నో అపాయింట్ చేస్తానన్నారు" ఆశ్చర్యంగా అడిగింది.

"ఆయనలానే అంటాడు. వయసు పెరుగుతూంది కదా...కాస్త ఛాదస్తం, పైగా పెళ్ళి కూడా చేసుకోలేదు...మీ కేసు నేను టేకప్ చేస్తాన్లెండి".

"ఈ పరిస్థితుల్లో మీరు పరిశోధన చేయగలరా?"

జేమ్స్ బాండ్ గొంతు తగ్గించి "ఓసారి చెవి యిటు వేయండి" అన్నాడు.

ప్రియంవద ఏమిటన్నట్టు చూసింది.

"నేను బెడ్ మీద వుండి కూడా ఇన్వెస్టిగేషన్ చేసాను తెలుసా"

"అవునా...ఏమిటదీ?"

"డ్యూటీ డాక్టర్ కు, నైట్ షిఫ్ట్ లో పనిచేసే సిస్టర్ కూ కాసింత యింటిమసీ వుందిట. డాక్టర్ భార్య కేసు నన్ను డీల్ చేయమంది. హాస్పిటల్ బిల్లు మొత్తం కడతానని ప్రామిస్ చేసింది."

"అవునా...అయితే ఏం పరిశోధించారు?"

"నర్స్ తో డాక్టర్ కు కాసింత కాదు క్వింటాళ్ళంత యింటిమసి వుంది"

"మరి ఆ విషయం డాక్టర్ భార్యకు చెప్పారా?"

"లేదు...కానీ 'మీ ఆవిడకు మీ విషయం తెలిసింది. వెంటనే మీ ఇంటిమసీని కట్ చేసుకోండ'ని చెప్పాను. డాక్టర్ భార్య గయ్యాళి, ప్లస్ మహా అనుమానం మనిషిలా వుంది. నేను అసలు విషయం చెబితే, అతడ్ని పీకి పాకాన పెట్టడం గ్యారంటీ. అందుకే డాక్టర్ ని సున్నితంగా హెచ్చరించాను"

"మీరు అప్పుడపుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తారన్నమాట"

"నేను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను" చెప్పాడు జేమ్స్ బాండ్.

"సరే మీరు కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది"

"రోజులా...గంటలు చాలు...సాయంత్రం నుంచీ నేను మీ కేసు పనిలోనే వుంటాను"

"ఓ.కె. అన్ని ఎవిడెన్సూ కావాలి"

"ష్యూర్" చెప్పాడు జేమ్స్ బాండ్.

ప్రియంవద లేచి, హ్యాండ్ బ్యాగులో నుంచి కొంత డబ్బుతీసి ఓ కవరులో పెట్టి జేమ్స్ బాండ్ కు యివ్వబోయింది.

"నో...నో...మీ ఫీజులోనే అన్నీ వుంటాయి. మీ కేసు పూర్తయ్యేక, గ్రాండ్ గా పార్టీ యివ్వండి"

అలానే అన్నట్టు తలూపి బయటకు నడిచింది ప్రియంవద.

*                   *            *

ఇన్స్పెక్టర్ చండీ అ వేళ చుడీదార్ లో వుంది.

'నో టెన్షన్' డిటెక్టివ్ ఏజెన్సీ ముందు వుంది. రిసెప్సన్ దగ్గరకి నడిచి, "మిస్టర్  నాయర్ ని కలవాలి" అంది.

"అపాయింట్ మెంట్ వుందా?" అడిగింది రిసెప్షనిస్ట్.

లేదు అంటే కలవనివ్వదనే అనుమానంతో "యస్..వుంది" అంది.  

"అయితే నెంబర్ చెప్పండి" అంది.

"నెంబరా...నెంబరేమిటి?" అడిగింది అర్థంగాక.

"అపాయింట్ మెంట్ వుందంటున్నారు. నెంబర్ లేదంటున్నారు. కోడ్ నెంబర్ లేదా?"

క్రయిమ్ సినిమా సెట్టింగ్ లా వుందే ఈ ఆఫీసు అనుకోని...

"అయామ్ చండి...ఇన్స్పెక్టర్ చండీ" అంది కాసింత దర్పంగా.

రిసెప్షనిస్టు అనుమానంగా చూస్తూ... "అయితే మీ యూనిఫామ్ ఏది?"

"ఆ! లాండ్రీకిచ్చాను" కోపంగా అంది.

"మీ ఐడింటిటీ కార్డు?"

చండీకి మండింది. అయినా కోపాన్ని తమాయించుకుంటూ "సి మిస్...ఇన్స్పెక్టర్ లు మామూలు డ్రెస్ లో వుండకూడదని రూల్ ఏమైనా వుందా?" అని అడిగింది.

"అఫ్ కోర్స్...మరి ఐడింటిటీ"

"నా చేతిలో హ్యండ్ బ్యాగ్ లేదు. ఐడింటిటీ మరిచిపోయాను. అయినా పోలీస్టేషన్ లో మేము కూడా ఇలా క్రాస్ క్వశ్చన్లేయం. ముందు మిస్టర్ నాయర్ కు చెప్పండి" విసుగ్గా అంది.

రిసెప్షనిస్టు వెంటనే ఇంటర్ కమ్ బటన్ నొక్కి నాయర్ కు చెప్పింది. "సార్..మీకోసం ఇన్స్పెక్టర్ చండీ వచ్చారు."

నాయర్ కంగారు పడిపోయాడు "సివిల్ డ్రెస్ లోనా? యూనిఫామ్ లోనా?" అడిగాడు నాయర్.

మెల్లిగా గొంతు తగ్గించి చెప్పింది "సివిల్ డ్రెస్ లో సార్"

"రైట్...ఒక్క అయిదు నిమిషాల తర్వాత పంపించు. ఈలోగా ఎవరైనా కుర్రాడ్ని పంపించి రెండు చికెన్ పిజ్జాలు తెప్పించు."

"సరే సార్" అంటూ ఇంటర్ కమ్ బటన్ ఆఫ్ చేసి ఇన్స్పెక్టర్ వైపు తిరిగి "మీరు ఓ అయిదు నిమిషాలు వెయిట్ చేయండి మేడమ్...సార్ క్లయింట్ తో బిజీగా వున్నారు." చెప్పింది.

ఇన్స్పెక్టర్ చండీ అక్కడి వాతావరణాన్ని పరిశీలిస్తోంది. నాయర్ వెంటనే బాత్రూంలోకి దూరాడు. సబ్బుతో మొహం కడుక్కున్నాడు. అద్దం ముందు నిలబడి పౌడర్ రాసుకున్నాడు. దువ్వెనతో బట్టతలను మరోసారి అందంగా దువ్వుకున్నాడు. ఇన్స్పెక్టర్ చండీ ఖచ్చితంగా తనకోసమే వచ్చి వుంటుందని అతని ఉద్దేశం.

ఇంటర్ కమ్ బటన్ నొక్కి ఇన్స్పెక్టర్ చండీ బయటకు వెళ్ళే వరకూ ఎవ్వర్నీ లోపలికి పంపించొద్దని చెప్పాడు.


*                 *                 *