హలో... రాంగ్ నెంబర్.! - 49

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 49

 

ముచ్చర్ల రజనీ శకుంతల

ఎప్పుడైతే శ్రీకర్ కారులో బయలుదేరాడో, వెంటనే ప్రియంవద ఆటోని కేకేసింది. ఓ ఆటో ఆమె ముందొచ్చి ఆగింది.

"ముందు వెళ్తోన్న కారును ఫాలో చెయ్" చెప్పింది ప్రియంవద.

ఆటో డ్రైవర్ కళ్ళు మెరిసాయి. 'మేడమ్ మీరా?" అన్నాడు ఆశ్చర్యం ప్లస్ ఆనందాన్ని మిక్స్ చేస్తూ.

ప్రియంవద ఓసారి ఆటో డ్రైవర్ మొహంలోకి చూసి అతడ్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది.

"మేడమ్ ఆరోజు కూడా మీరు ఇదే కారుని ఫాలో చేయమని చెప్పారు. పైగా ముంబయ్ లో కారు బాంబు పెట్టే బాపతు ఏమోనని అనుమానించారు. ఇప్పుడు కూడా అదే కారు...సేమ్ డౌటా మేడమ్?" ఆటో డ్రైవరు అడిగాడు.

"మొన్నామధ్య సి.యం. క్లైమోర్ తో చంపాలన్న ప్రయత్నం జరిగింది తెలుసుగా."

"తెలుసు మేడమ్...సి. యం. ఆ గండం నుంచి తప్పించుకున్నందుకు నేను కూడా వెళ్ళి పరామర్శించి ఓ బత్తాయికాయ యిచ్చి వచ్చాను"

"ఆ క్లైమోర్ అమర్చింది ఆ కారులో వెళ్తున్నాయనేమోనని డౌట్. నువ్వు ఫాలో అవ్వు...టాప్ సీక్రెట్" చెప్పింది ప్రియంవద.

ఆటో డ్రైవర్ హుషారుగా ఆ కారుని ఫాలో అవుతున్నాడు. నాలుగైదు మలుపులు తిరిగేసరికి, కారు కనిపించకుండా పోయింది.

"మేడమ్...కారు కనిపించడం లేదు. కారు నెంబర్ చెప్పి కంట్రోల్ రూమ్ లో కంప్లయింట్ ఇద్దామా?" అడిగాడు ఆటో డ్రైవర్.

"ఇంకా నయం ముందే చెప్పావ్. అలాంటి పనేమీ చేయకు. నీ ఆటోలోనే బాంబుల జిలిటన్ స్టిక్కులు తెచ్చానని అతను చెప్పగలడు" అంది ప్రియంవద.

"అయితే నాకెందుకు లెద్దూ" అన్నాడు ఆటో డ్రైవర్.

ప్రియంవద కు ఏం చేయాలో తోచలేదు.

అప్పుడు గుర్తొచ్చింది 'నో టెన్షన్ డిటెక్టివ్ ఏజెన్సీ'. వెంటనే ఆ అడ్రస్ చెప్పి అక్కడికి పోనివ్వమంది.

*              *             *

నో టెన్షన్ డిటెక్టివ్ ఏజెన్సీ.

రిసెప్షన్ దగ్గరకి వెళ్ళి నాయర్ ని కలవాలని చెప్పింది.

"యువర్ నెంబర్ ప్లీజ్" అడిగింది రిసెప్షనిష్టు. ప్రియంవదకు తన కోడ్ నెంబర్ గుర్తొచ్చి చెప్పింది. "థర్టీ సిక్స్"

రిసెప్షనిస్టు ఓసారి కంప్యూటర్ ఆన్ చేసి చెక్ చేసి "సారీ మేడమ్...ఆ నెంబర్ ఇన్ వాలిడ్. మీరు ముందుగా బాస్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి వుంటుంది"

ప్రియంవదకు ఒళ్ళుమండింది. అయిన తమాయించుకొని "ఓసారి చెప్పండి ప్రియంవద వచ్చారని" అంది.

రిసెప్షనిస్ట్ ఏమనుకుందో...ఇంటర్ కమ్ నొక్కి నాయర్ తో మాట్లాడి, ఇంటర్ కమ్ నొక్కి నాయర్ తో మాట్లాడి, ఇంటర్ కమ్ బటన్ ఆఫ్ చేసి చెప్పింది "మీరు వెళ్ళండి"

*                   *                 *

"సారీ...మా ఫార్మాల్టీస్ మాకుంటాయి. కొద్దిగా చికాకు పడ్డట్టున్నారు" అన్నాడు నాయర్ చిర్నవ్వుతో ప్రియంవద ఫీలింగ్స్ గమనించి.

"అది సరే...నాకు మీతో మళ్లీ పనిపడింది"

"చెప్పండి...కొత్త అస్సయిన్ మెంట్" చెప్పింది నవ్వుతూ.

"పార్ట్ టు నా?"

"అవును. మా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. అందుకు మీ హెల్ప్ కావాలి. ఆయన అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నట్టు ఆధారాలు కావాలి"

"అమ్మాయితోనా? అమ్మాయిలతోనా?"

"ఐ థింక్...అమ్మాయిలతో..."

"సరే...ఈసారి ఫీజులో మీకు కన్షేషన్ వుంటుంది."

"థాంక్యూ...ఈ ఎస్సయిన్ మెంట్ కు జేమ్స్ బాండ్ ని పంపించండి. ఓసారి ఆయన్ని కలవాలి. వీలవుతుందా?"

"సారీ...నాట్ నౌ...తర్వాతెప్పుడైనా కలవొచ్చు మీ అస్సయిన్ మెంట్ కు మరొకర్ని అరేంజ్ చేస్తాను"

"ఏం ఆయన మరో అస్సయిన్ మెంట్ లో బిజీగా వున్నారా? లాస్ట్ టైం నన్ను "సమోసాలు చేయడం వచ్చా" అని అడిగారు. ఈసారి ఆయన కోసం సమోసాలు చేసి తీసుకువస్తాను."

"ఆ సమోసాలే జేమ్స్ బాండ్ పాలిట మిస్సయిల్స్ అయ్యాయి"

"అదేంటి?"

"జేమ్స్ బాండ్ సమోసాల వీక్నెస్ కనిపెట్టి, హోటల్ కు పిలిచి పాయిజన్ కలిపిన సమోసాలు తినిపించారు. ప్రస్తుతం హాస్పిటల్ లో వున్నాడు."

"అయ్యో...అలాగా...నేనోసారి ఆయన్ని పరామర్శించాలి అడ్రసివ్వండి"

"సరే.." అంటూ నాయర్ అడ్రస్ రాసిచ్చాడు. ఆ అడ్రస్ కాగితం హ్యాండ్ బ్యాగులో పెట్టుకొని "మరి నేను వెళ్ళిరానా?" అంది.

నాయర్ టేబుల్ సొరుగు లాగి, అందులో నుంచి రెండు చాక్లెట్స్ తీసి ఒకటి ప్రియంవదకి యిచ్చి "హేవిట్...బాయ్ రాలేదు. బిస్కెట్స్ కూడా లేవు" చెప్పాడు.

"నో ప్రాబ్లెమ్. చాక్లెట్స్ నేను తినను. మీరూ తినకండి. అందులో పురుగులు వుంటున్నాయట. మా బబ్లూకి కూడా చెప్పాను. అయితే 'చాక్లెట్ నాన్ వెజ్ కిందికి వస్తుందా మమ్మీ" అని అడిగాడు" చిన్నగా నవ్వి చెప్పింది ప్రియంవద.

"ప్చ్...ఏం తిన్నారో ఏం తినకూడదో అర్థం కావడం లేదు" అన్నాడు ఆ రెండు చాక్లెట్స్ ని డస్ట్ బిన్ లోకి పారేస్తూ ప్రియంవద శ్రీకర్ కు సంబంధించిన డిటైల్స్ చెప్పి, రిసెప్షన్ కౌంటర్ లో అడ్వాన్స్ కట్టి బయటకు నడిచింది.

*                 *                *