హలో... రాంగ్ నెంబర్.! - 46

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 46

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"మీరా...వారం రోజులు కాదు కదా...ఇరవై నాలుగుగంటలు కూడా వుండలేరు. మీకు అమ్మాయిలంటే అంతపిచ్చి...అంత వ్యసనం"

"వారం రోజులు కాదు, నెల, రెండు నెలలు, సంవత్సరం...ఎంతకాలమైనా వుంటాను"

"మీరా..సంవత్సరం పాటా? ఏదీ వుండి చూడండి. తెలుస్తుంది" వ్యంగ్యంగా అంది ప్రియంవద.

"ఉం..టే"

"అలా వుంటే జీవితంలో మిమ్మల్నెప్పుడూ ఏ విషయంలోనూ నిలదీయను. మూడు నెలలు మీరలా ఏ అమ్మాయితో సంబంధం పెట్టుకోకుండా, నిగ్రహంతో వుండగలిగితే... ఆ తర్వాత మీరెలా...ఏ అమ్మాయితో తిరిగినా అభ్యంతరం పెట్టాను..కానీ.."

"కానీ...?"

"ఒకవేళ మీరు ఓడిపోతే..."

"నేను ఓడిపోతే...?"

"జీవితంలో ఏ అమ్మాయి వంకా కన్నెత్తి చూడకూడదు. అలా మీరు మరో అమ్మాయితో వెళ్ళినట్టు తెలిసినా మరుక్షణం బబ్లూని తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఊహూ...వాడ్ని చంపి, నేను చస్తాను" చివరి వాక్యం అంటోన్నప్పుడు చిన్నపాటి వణుకు ప్రియంవద గొంతులో.

"ప్రియా..."

"చెప్పండి...ఈ పందెం మీకు ఓకేనా...పందెం గడువు సంవత్సరం..బెట్ విలువ రెండు జీవితాలు...ఓ.కె.నా ?"

ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు శ్రీకర్. "ఓ.కె. ఈ పందానికి నేను రెడీ..ఈరోజు నుంచి..అంటే సెప్టెంబర్ 12 నుంచి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 11 వరకూ నేను ఏ అమ్మాయితోనూ సంబంధం పెట్టుకోను. ఒకవేళ ఈ పందెంలో నేను ఓడిపోతే జీవితాంతం ఏ అమ్మాయి వంకా కన్నెత్తి చూడను"

"ఒకవేళ మీరు ఈ పందెం గెలిస్తే మీరు చేసే ఏ పనులకూ నేను అడ్డురాను" అంది ప్రియంవద.

"ఓ.కె. మరి మన మధ్య ఈ పందానికి సాక్షి ఎవరు? బబ్లూని పెట్టుకుందామా?" శ్రీకర్ అడిగాడు.

"సిగ్గులేకపోతే సరి.." కోపంగా అంది ప్రియంవద.

"మనం సిగ్గొదిలేసి కాపురం చేస్తేనే బబ్లూ పుట్టాడు" రిటార్టిస్తూ అన్నాడు శ్రీకర్.

"ఇక నుంచీ అలా సిగ్గొదిలేసే సీన్లు మన మధ్య వుండవు" అంది ప్రియంవద.

"అదేంటి...సినిమాల్లో సిగ్గొదిలేస్తే సెన్సార్ కట్ కానీ, మొగుడూ పెళ్ళాల మధ్య ఏమిటి?"

"అవునంతే..సంవత్సరంపాటు మన మధ్య నో సెక్స్...నో రోమాన్స్"

"అదేంటి ఈ హంబర్ ఫిట్టింగేంటి?"

"అవునదంతే....సంవత్సరం పాటు ఏదోలా నా దగ్గర మీ కోర్కెలు తీర్చుకొని ఓర్చుకుంటారు. ఆ తర్వాత మీ యిష్టమున్నట్టు తిరుగుతారు. అలా ఏ అటాచ్ మెంట్ లేకుండా వుండడమే పందెం."

"ఒసే...మిలటరీ వాళ్ళ శిక్షణలో ఇంత ఘోరమైన పనిష్మెంట్లు వుండవే...బయట నోటచ్ అంటే అర్థముందిగానీ, ఇంట్లో ఈ రేషన్ ఏమిటి? పోనీ...రోజుకోసారి.."

"ఏం..టీ..." అతని మాటలు అర్థంకాక అడిగింది.