హలో... రాంగ్ నెంబర్.! - 45

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 45

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

టీ కప్పులో తుపాను పరిణామం ఎంత తీవ్రంగా వుంటుందో, భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధాల ప్రస్తావన అంతే తీవ్రంగా వుంటుంది. ముఖ్యంగా భర్తకు మరో స్త్రీతో సంబంధం వుందన్న అనుమానం చాలు...ఆ ఇంట్లో టీ కప్పులో కూడా తుపాను రావడానికి.

సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. శ్రీకర్ ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండున్నరకి అయింది. అతని మనసు ఏదో ప్రమాద సంకేతాన్ని అందిస్తూనే వుంది. అతను అనుకున్నట్టే జరిగింది. ప్రియంవద అతని కోసమే ఎదుర్చూస్తోంది.

"ప్రియా...నువ్వింకా నిద్రపోలేదా?" చాలా క్యాజువల్ గా అడిగినట్టు అడిగాడు.

"నేను నిద్రపోయి చాలా సేపైంది. మీరు నన్ను పెళ్ళయినప్పట్నుంచీ నిద్రలోనే కదా వుంచుతున్నారు" అంది శ్రీకర్ వైపే చూస్తూ.

"అదేమిటోయ్....ఇవ్వాళ నువ్వచ్చం డైలీ టీవీ సీరియల్ లో హీరోయిన్లలా సాగదీసి మాట్లాడుతోన్నావ్" అన్నాడు నవ్వుతూ.

"అవును మరి...నా బ్రతుకు డైలీ టీవీ సీరియల్ లోలా తయారైందాయెమరి..." ముక్కు ఎగబీలుస్తూ అంది.

"అబ్బ...నీ మూడ్ ఇవ్వాళ బాగున్నట్టు లేదు. చాలా టైర్డ్ గా వుంది. స్నానం చేసొస్తాను" అంటూ బ్రీఫ్ కేస్ ణు సోఫాలో పెట్టి తన గదివైపు నడిచాడు. భర్త బెడ్ రూమ్ లోకి వెళ్ళడం గమనించింది. ఆ తర్వాత లుంగీలోకి మారి బాత్రూంలోకి దూరడమూ గమనించింది. భర్త ఎప్పుడైతే బాత్రూంలోకి వెళ్ళాడో...వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్లి, బాత్రూం గొళ్ళెం బయటనుంచి పెట్టింది చప్పుడు కాకుండా.

సోఫాలో వున్న బ్రీఫ్కేస్ ఓపెన్ చేసి, తను బ్రీఫ్కేస్ లో పెట్టిన డిజిటల్ వాయిస్ రికార్డర్ బయటకు తీసింది. ఆటో ఆఫ్ లో వుంది. ప్లే బటన్ నొక్కింది. డిజిటల్ వాయిస్ రికార్డర్ లో మాటలు వినిపిస్తున్నాయి. ముందు ఎవరో క్లయింట్ తో మాట్లాడిన మాటలు. తర్వాత బాయ్ తో మాట్లాడిన మాటలు.ఆ తర్వాత ఓ అమ్మాయితో మాట్లాడిన మాటలు.

"హాయ్...థర్టీటూ...థర్టీ...ఫోర్...థర్టీ సిక్స్..నువ్వా...వాటె ప్లజంట్ సర్ ప్రయిజ్...రమ్మంటావా? ఫోన్ లోనే టెంప్టింగ్ వాయిస్ నీది. ఇక కళ్ళెదురుగా కనిపిస్తే...ఇవ్వాళా...కుదర్దు ...బై"

తర్వాత మరో అమ్మాయితో...అవతలవైపు ఫోన్ లో ఏం మాట్లాడుతున్నారో వినిపించకపోయినా, భర్త మాటలను బట్టి వూహించింది.

క్షణ క్షణానికి ఆమె మొహం కోపంతో ఎర్రబడుతోంది. డిజిటల్ వాయిస్ రికార్డర్ ఆఫ్ చేసింది. బాత్రూం దగ్గరకి వెళ్ళి, బయట్నుంచి పెట్టిన గొళ్ళెం చప్పుడు కాకుండా తీసేసింది.

మంచం మధ్యలో కూచుంది. ఆమె చేతిలో డిజిటల్ వాయిస్ రికార్డర్ వుంది. శ్రీకర్ శానం చేసి బయటకు వచ్చి, భార్య చేతిలో పెన్ సైజ్ లో వున్న డిజిటల్ వాయిస్ రికార్డర్ చూసి  "ఏమిటి...నాతో ఏదైనా గొడవపడాలని డిసైడయ్యావా? ఆ గొడవని టేప్ చేసి ఆడియో రిలీజ్ చేస్తావా?" నవ్వుతూ అన్నాడు.

ప్రియంవద మౌనంగా రికార్డర్ ఆన్ చేసింది. అందులో రికార్డయిన మాటలు వినిపిస్తున్నాయి. శ్రీకర్ స్థాణువయ్యాడు. వెంటనే తేరుకున్నాడు.

"ఏమిటిది ప్రియా...చిన్నపిల్లలా...అన్నాడు వస్తోన్న కోపాన్ని అణిచిపెట్టుకుని, సాధ్యమైనంత మృదువుగా.

"నేనూ అదే అడుగుతున్నాను. ఏమిటిది సినిమాల్లో విలన్ లా...పికిరిలా...ఉమనైజర్ లా..." ఒక్క పద విశేషాన్ని తగిలిస్తూ కచ్చగా అంది ప్రియంవద.

"అర్థరాత్రి మద్దెల దరువన్నట్టు...రేపు ఉదయం మాట్లాడుకుందాం...నాకిప్పుడు ఆకలేస్తోంది" అన్నాడు శ్రీకర్.

"ఏం...అమ్మాయిలు అందాలను తప్ప అన్నాన్ని వడ్డించరా? అందాలను కొరుక్కు తినొచ్చారుగా...ఇంకా ఆకలెలా వేస్తుంది. నన్ను తాకొద్దు" అంది ఏదో అనబోతూ దగ్గరకి వస్తోన్న మొగుడ్ని చూసి.

"ఎన్ని గంటల వరకు?" నవ్వుతూ అడిగాడు ఆమె పక్కనే కూచుంటూ శ్రీకర్.

"ఒక ట్రెండు..మూడ్నాలుగు...వార...పది...జీవితాంతం నన్ను ముట్టొద్దు" అంది ప్రియంవద కోపంగా.

"కోపంలో కూడా నీ బాడీని చూస్తే, డెడ్ బాడీకి కూడా టెంప్టింగ్ ఫీలింగ్ కలుగుతుంది" భార్య నడుం మీద చేయేస్తూ అన్నాడు.

ప్రియంవద సీరియస్ గా చూసి అంది "ఛీఛీ..ఇంట్లో భార్య వుండగా, పరాయి అమ్మాయిలతో తిరగడానికి సిగ్గేయడం లేదు"

"లేదు...ఎందుకంటే నేను అమ్మాయిలతో బయటే తిరుగుతున్నాను కదోయ్..."

"ఛీ...ఛీ..మీకన్నా డ్రగ్ ఎడిక్ట్ లు నయం, కొన్నాళ్ళ తర్వాతైనా బయటపడతారు. అమ్మాయిలంటే ఇంత వీక్నేసా? అమ్మాయిల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు" కోపంతో అనేస్తోంది ప్రియంవద.

"నాకు అమ్మాయిలంటే వీక్నెసేం లేదు. డ్రగ్ ఎడిక్ట్ లా నేను ఉమన్ ఎడిక్ట్ నేమీ కాదు అదో సరదా" టాపిక్ ని సీరియస్ చేయనీయకుండా ప్రయత్నం చేస్తూ అన్నాడు.

"అదేం కాదు. అమ్మాయిల్లేకుండా మీరుండలేరు. హెరాయిన్, బ్రౌన్ షుగర్ అలవాటైన వాళ్ళు, అవి లేకపోతే ఎలా పిచ్చెక్కిపోతారో మీరూ అంతే...తాగుబోతులు తమ వ్యసనంతో ఎంత దిగజారుతారో మీరూ అంతే..." కోపంగా అంది ప్రియంవద.

"షటప్..నన్నంత చీప్ గా తీసి పారేయకు. అమ్మాయిలతో తిరగకుండా వుండడం పెద్ద కష్టమేమీ కాదు"