హలో... రాంగ్ నెంబర్.! - 44

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 44

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"అన్నట్టు ఇందాక ముద్దు సంగతి చెప్పనే లేదు" అంది మళ్లీ కాస్త వెనక్కి వెళ్తూ.

"ఇదిగో ప్రియా..ఇలా అయితే నేను టిఫిన్ చేయనంతే." బుంగమూతి పెట్టి అన్నాడు శ్రీకర్.

ఈలోగా అతనికి పొలమారింది.

ప్రియంవద నీళ్లకోసం చూసింది. ఖాళీ వాటర్ బాటిల్ వుంది. వెంటనే మినీ ఫ్రిజ్ దగ్గరికి నడిచి ఫ్రిజ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీస్తూ పరీక్షగా చూసింది.

టిఫిన్ కవర్లు కనిపించాయి. ఆ కవర్లన్నీ ఓ క్యారీబ్యాగులో కుక్కీ మరీ వున్నాయి. ప్రియంవద వాటిని బయటకు తీసింది.

శ్రీకర్ 'అయిపొయింది' అనుకున్నాడు మనసులో.

"ఇదేమిటి? టిఫిన్ తెచ్చిన కాగితాలు, కవర్లు ఫ్రిజ్ లో పెట్టారేమిటి? ఫ్రిజ్ ఏమైనా డస్ట్ బిన్నా" అడిగింది  ప్రియంవద.

"అవునా, ఆ బాయ్ కు బుద్ధి లేదు. టిఫిన్ చేసాక వాడిపని చెప్పాల్సిందే" అన్నాడు శ్రీకర్.

"అవునూ...ఇన్ని టిఫిన్ కవర్లు ఎక్కడివి?" అనుమానంగా మొగుడివంక చూస్తూ అడిగింది.

"ఇదిగో ప్రియా...ఇలా అయితే నేను టిఫిన్ చేయను. అయినా కట్టుకున్న భర్తని అనుమానించే జబ్బేమిటే నీకు" విసుగు నటిస్తూ అన్నాడు.

"కట్టుకున్న భర్తను కాకుండా ఎదురింటావిడ భర్తనో, పక్కింటావిడ మొగుడినో అనుమానించడానికి నాకు వేరే ఏం పని లేదనుకున్నారా? మీకుమల్లె అమ్మాయిల వెంట పడ్డం తప్ప" ఫినిషింగ్ టచ్ ఇస్తూ అంది.

"అబ్బ..ఎక్కడికి వెళ్లినా తిరిగి టాపిక్ అక్కడికే తెస్తావు. అయినా మనలోమాట....నువ్విప్పుడు ఎంత అందంగా వున్నావో తెలుసా? ఈ అందానికి తోడు ఓ కొత్త చీరకొనిస్తాను...పద..." అన్నాడు ప్రియంవద వంకచూస్తూ. సాధారణంగా ఆడవాళ్లు చీరలనగానే అన్నీ మర్చిపోతారని అతని నమ్మకం.

"నాకు చీరలు చాలానే వున్నాయి. ఇప్పుడెం వద్దుగానీ, నాకన్నా అందంగా వున్న వాలు మీకు బోల్డుమంది తెలుసని నాకు తెలుసు. ముందు టిఫిన్, కాఫీల పని చూడండి. తర్వాత డిస్కషన్ మొదలెడదాం" అంది ప్రియంవద.

*                  *                 *

అన్నంతపనీ చేసింది ప్రియంవద. శ్రీకర్ టిఫిన్ చేయడం పూర్తి కాగానే "ఇప్పుడు చెప్పండి" అంది.

శ్రీకర్ కి మెంటల్ బ్యాలెన్స్ తప్పుతోన్నట్టు అనిపిస్తోంది.

"ఇది...ఆఫీసు..ఇక్కడ నీ ఇంటరాగేషన్ వద్దు" అన్నాడు.

"నేనెప్పుడు....ఎక్కడ...ఎలా మొదలెడతానో నాకే తెలియదు" అంది ప్రియంవద.

సరిగ్గా అప్పుడే 5637 4677 కు ఫోన్ వచ్చింది.

శ్రీకర్ ఓరకంట ప్రియంవద వంక చూసాడు.

"ఎత్తండి....ఎత్తి మాట్లాడండి. వచ్చింది 5637 4677 లో కదా...." అంది.

శ్రీకర్ ఫోన్ ఎత్తాడు.

"హ..లో...వ్...ఇందాక ఫోన్ చేసి ఫోన్ లో ముద్దు పెడితే రేస్నాన్స్ లేదు. ఎందుకమ్మా..." అటు వైపు నుంచి షాలిని గొంతు హస్కీగా.

అంటే....ఇందాక తనకు ఫోన్ లో ముద్దు పెట్టింది షాలినా?

ప్రియంవద ఓ చెవి శ్రీకర్ ఫోన్ కాల వైపు వేసింది.

"ఏంటీ...మీకు సిటీ అందాలు చూపించాలా? ఆల రైట్..ఓ అరగంటాగి ఫోన్ చేయండి. ఒకే...బై" అంటూ ఫోన్ పెట్టేసాడు.

"సిటీ అందాలు చూపించమని వచ్చిన ఫోన్ కాలా? తన అందాలు చూపిస్తానని అమ్మాయి చేసిన ఫోన్ కాలా?" అడిగింది ప్రియంవద.

"ప్రియా ఆఫీసులో సెటైర్లొద్దు ప్లీజ్..." అన్నాడు శ్రీకర్ గంభీరంగా నటిస్తూ.

"ఆల్ రైట్....సాయంత్రం ఇంటికి వస్తారుగా. అప్పుడు మాట్లాడుకుందాం. బై" అంటూ లేచింది.

ప్రియంవద బయటకు వెళ్ళే ముందే శ్రీకర్ చూడకుండా డిజిటల్ వాయిస్ రికార్డర్ అతని భ్రీఫ్ కేసులో పెట్టింది.

ప్రియంవద వెళ్లిన అరగంటకు మళ్లీ ఫోన్ వచ్చింది షాలిని నుంచి.

ఈసారి హుషారుగా అటెండ్ అయ్యాడా ఫోన్ ని రెచ్చిపోతూ. ఆ మాటలన్నీ డిజిటల్ వాయిస్ రికార్డర్ లో రికార్డ్ అవుతూనే వున్నాయి.

సో....వాట్...