హలో... రాంగ్ నెంబర్.! - 43

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 43

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"ఏంటీ...మాట్లాడరు"

"అదే...నువ్వు ఇక్కటి వరకూ రావడం ఎందుకు ప్రియా...నేనే ఏదో టిఫిన్ తెప్పించుకుని తింటాన్లే"

"ఇక్కడి వరకూ రావడం కాదూ, వచ్చాను. ఆఫీసు మెట్లేక్కుతున్నాను. ఫోన్ పెట్టేస్తున్నాను"

ఫోన్ డిస్కనెక్ట్ అయింది.

శ్రీకర్ కంగారు పెరిగింది. 'ఛ...తను డిస్ ప్లే నెంబర్ చూడకుండా ఎంత పనిచేసాడు. అయినా తన బుద్ధి ఏమైంది? డిస్ ప్లే లో నెంబర్ చూడకుండా మాట్లాడ్డమేనా? అంతకన్నా పెద్ద సమస్య మరోటీ...వెంటనే టిఫిన్ తీసుకువచ్చిన ప్యాకింగ్ కవర్లు డస్ట్ బిన్ లో వేద్దామనుకున్నాడు. ప్రియంవద వాటిని గమనించే ప్రమాదం లేకపోలేదు. బాయ్ ని వెంటనే బయట పారేయమని చెబితే...ప్రియంవద బాయ్ కు ఎదురైతే...

రెండు క్షణాల్లో అతనికో ఆలోచన వచ్చింది. గబగబా 'టిఫన్ కవర్లుణు ఓ క్యారీబ్యాగ్ లో కుక్కేసి, వాటిని ఫ్రిజ్ లో దాచేసాడు.

అప్పుడే ఛాంబర్ డోర్ తెరుచుకుంది. ప్రియంవదని చూసి ఓ వెర్రి నవ్వు నవ్వాడు.

"ఏంట్రా వెర్రినవ్వు" అడగనే అడిగింది అనుమానంగా ప్రియంవద.

"ఇది సంతోషపు, ఆనందపు ప్రేమ నవ్వు" అన్నాడు శ్రీకర్. ప్రియంవద హాట్ ప్యాక్ ఓపెన్ చేసి, టిఫిన్లు ప్లేట్లో సర్దింది. వాటిని చూడగానే శ్రీకర్ గుండె గుభేలుమంది. ఇప్పుడు తను అవన్నీ తినాలా?

ఇడ్లీ, వడ, ఆనియన్ దోశ...సేమ్ కాంబినేషన్.

"ఇవన్నీ తినలేనేమో..." అన్నాడు శ్రీకర్.

"వెధవ్వేషాలేయకండి. ఉదయం మీరు టిఫిన్ తినకుండా వచ్చారని ఫీలై తెచ్చాను. నేనూ ఏమీ తిన్లేదు" అంది ప్రియంవద.

ఒక్క క్షణం చివుక్కుమంది శ్రీకర్ మనసు అతి కష్టమ్మీద ఓ ఇడ్లీ నోట్లో పెట్టుకున్నాడు.

"మీరు తింటూ వుండండి బాయ్ తో కాఫీ తెప్పిస్తాను" అంతో శ్రీకర్ సమాధానం కోసం ఎదురుచూడకుండా బెల్ నొక్కింది.

బాయ్ లోపలికి వచ్చాడు. ఇందాకే సుష్టుగా తిని, మళ్లీ ఇప్పుడు తినబోతున్న బాస వంక అదోలా చూసాడు. ఆ చూపుల్లో రకరకాల ఫీలింగ్స్.

"ఏయ్...ఏంటలా చూస్తావు. బయటకెళ్లు" కోపంగా అన్నాడు శ్రీకర్.

"అతన్నెందుకండీ తిడతారు. కాఫీ తీసుకురావడానికి నేనే రమ్మన్నాను కదా..." అంటూ బాయ్ వైపు తిరిగి చెప్పింది.

"ప్లాస్క్ నిండా కాఫీ తీసుకురా"

"మేడమ్ ఇందాకే కాఫీ...తీ..." బాయ్ మాటలు పూర్తి కాకుండానే "కాఫీ తెచ్చాడు ప్రియా" చెప్పాడు గబగబా శ్రీకర్.

"అరె..ఇతను చాలా ఫాస్ట్ గా వున్నాడే" అంది మెచ్చుకోలుగా బాయ్ వైపు చూస్తూ ప్రియంవద.

వెంటనే బాయ్ సిగ్గుపడుతూ "టిఫిన్ కూడా..." అంటూ టిఫిన్ కూడా తెచ్చానని చెప్పబోయాడు. శ్రీకర్ బాయ్ ని వారించి వెళ్లిపోమని చెప్పాడు.

బాయ్ వెళ్లాక కాస్త రిలీఫ్ ఫీలయ్యాడు. టిఫిన్ తినలేకపోయాడు.

"అదేమిటి మీకు మూడ్నాలుగు టిఫిన్లు లోపలికి వెళ్తేగానీ తృప్తివుండదుగా...ఎలక కోరికినట్టు ఆ తినడమేమిటి?" అంది ప్రియంవద.

"అదేం లేదు...నువ్వు కూడా టిఫిన్ చేయలేదని బాధపడుతూ తింటున్నాను"

"అన్నట్టు ఇది కూడా కాస్త టేస్ట్ చేయండి" అంటూ హ్యాండ్ బ్యాగ్ లోంచి శ్రీకర్ పర్సనల్ విజిటింగ్ కార్డు తీసి ప్లేటులో పెట్టింది.  గతుక్కుమన్నాడు శ్రీకర్.

"ఇది...ఇదెక్కడిది?"

"నాకేం తెలుసు? అన్నట్టు మీ దగ్గర ఈ ఫోన్ వున్నట్టు నాకే తెలియదు. ఈ నెంబర్ నాకెప్పుడూ చెప్పనే లేదు. పైగా మీ ఫొటో ఒకటి..."

"అబ్బ..టిఫిన్ చేసేప్పుడు ఏమిటీ క్లాసు?" విసుగు మొహం పెట్టి అన్నాడు.

"టిఫిన్ చేస్తూ అయితేనే క్లాసు తీయచ్చని స్వయంగా నేనే టిఫిన్ పట్టుకొచ్చాను. ఇప్పుడే ఏముంది? తాపీగా కాఫీ తాగుతూ కూడా మాట్లాడుకోవచ్చు" అంది.

అంటే...మాంచి ప్లానింగ్ తోనే వచ్చిందన్న మాట. తనలో తానే అనుకున్నాడు శ్రీకర్.