హలో... రాంగ్ నెంబర్.! - 42

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 42

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

శ్రీకర్ తన ఛాంబర్ లోకి వెళ్లడంతోనే బాయ్ ని పిలిచి పర్సులో నుంచి డబ్బు తీసిచ్చి హోటల్ నుంచి ఇడ్లీ, వాద, దోశ, ప్లాస్క్ నిండా కాఫీ తీసుకురమ్మని చెప్పాడు.

బాయ్ ఓసారి శ్రీకర్ వంక విచిత్రంగా చూసి వెళ్లిపోయాడు. విపరీతమైన ఆకలిగా వుంది. ఒక్క క్షణం ప్రియంవద మీద పీకల్దాకా కోపం వచ్చింది. ఎంత పని చేసింది. తనతో నిజం చెప్పించడానికి పోలీసులు కూడా ఉపయోగించని ఇంటరాగేషన్ మెథడ్స్ ఉపయోగించింది. అవి తలుచుకుంటేనే కడుపులోని ఆకలి గొంతులోకి వచ్చేస్తోంది.

బాయ్ హోటల్ కి వెళ్లి అప్పుడే పదినిమిషాలు అయింది. క్షణానికోసారి డోర్ వంక చూస్తున్నాడు. ఉదయమే కంపల్సరీగా టిఫిన్ చేయడం వలవాటు. కాస్త అటు, ఇటూ లేటైనా ఆకలి కంగారు పెట్టేస్తుంది. జేబులో వున్న మోబిటెల్ మోగింది. అది తన పర్సనల్ ఫోన్.

"హలో శ్రీకర్" అన్నాడు డిస్ ప్లే మీద నెంబర్ చూడకుండానే.

ఒక చిన్న శబ్దం వినిపించింది అటు వైపు నుంచి. ఆ శబ్దం పెదవుల తాలూకుదని అర్ధమైంది.

"హలో...ఎవరు?"

మళ్లీ మరోసారి వినిపించింది 'మ్చ్' అంటూ.

"హూ ఈజ్ ద లైన్" సాధ్యమైనంత మృదువుగానే అడిగాడు. మరోసారి అయితే ఫోన్ లో ఆ ముద్ధుని ఎంజాయ్ చేసేవాడు. కానీ ఇప్పుడు కడుపులోని ఆకలి ఆ పని చేయనివ్వడం లేదు. ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.

"షిట్.." అనుకుంటూ మోబిటెల్ ని టేబుల్ మీద పెట్టాడు. ఈలోగా బాయ్ టిఫిన్లు తెచ్చాడు. శ్రీకర్ బాయ్ వంక చూసి వెళ్లిపోమన్నాడు. బాయ్ వెళ్లడమే అలస్యంల్...టిఫిన్ ప్యాక్ లు అన్నీ ఒక్కొక్కటీ గబగబా విప్పాడు.

ఇడ్లీ ముక్క తుంచి తినబోతూ ఆగాడు. అతనికి ప్రియంవద గుర్తొచ్చింది. తన మీద కోపంతో టిఫిన్ తినడం మానేసిందా? అసలే మొండి మనిషి. ఒక్కక్షణం అతనికి బాధేసింది. మళ్లీ అంతలోనే తిని వుంటుందిలే అని తనకుతానే సర్దిచెప్పుకున్నాడు.

ఇరవై నిమిషాలపాటు నాన్ స్టాప్ గా టిఫిన్ తినే కార్యక్రమాన్ని కొనసాగించాడు. మినీ ఫ్రిజ్ లోని వాటర్ బాటిల్ తీసుకుని మొత్తంనీళ్ళు గడగడా తాగేసాడు. అప్పుడు శాంతించింది అతని కడుపులోని ఆకలి.

ప్లాస్క్ లో నుంచి కాఫీ కప్పులోకి వంపుకుని తాగాక, పూర్తిగా రిలాక్సయ్యాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి ఫోన్ లో అపరిచిత ముద్దు విషయం.

ఫోన్ లో తనను ముద్దు పెట్టుకుంది ఎవరై వుంటారు? సరళా....దేవి.. మీరా...చిత్రాంగి......ఊహూ...వీళ్లవన్నీ ముదురు ముద్దులు...ఇంత స్వీట్ గా వుండవు. మరెవరు? అప్పుడు గుర్తొచ్చింది....షాలిని.

హలో...రాంగ్ నెంబర్..!

యాహూ....అని అరవాలనిపించింది. వెంటనే మోబిటెల్ లో ఆ నెంబర్ ఓసారి చూడబోయాడు. సరిగ్గా అప్పుడే మోబిటెల్ రింగయింది.

బహుశా...మళ్లీ షాలినే చేసి వుంటుంది. ఈ నెంబర్ తన పర్సనల్ ది కాబట్టి క్లయింట్ చేసే అవకాశం వుండదు. ఈసారి షాలినికి తను షాక్ ఇవ్వాలి. తనే వెంటనే ఇవ్వాలి, హలో అనకుండా.

ఆ ఆలోచన అతనిలో ఉత్సాహాన్ని రేపింది. వెంటనే సెండ్ బటన్ నొక్కి 'మ్చ్' అన్నాడు, అటువైపు నుంచి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తూ.

అదే అతను చేసిన పొరపాటు. సరిగ్గా ఆ సమయంలో భర్తకు ఫోన్ చేసింది ప్రియంవద. భర్త ఆఫీసుకు వెళ్లాక, అతని బట్టలు ఉతకడానికి జేబులు చెక్ చేస్తుండగా తనెప్పుడూ చూడని విజిటింగ్ కార్డు కనిపించింది. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా వెళ్లడం వల్ల ఓసారి పలకరిద్దామని ఈ నెంబర్ కు ఫోన్ చేసింది.

ఎప్పుడైతే భర్త ఫోన్ లో ముద్దు పెట్టాడో అప్పుడే ప్రియంవద బ్రెయిన్ షార్ప్ గా పన్జేయడం మొదలెట్టింది. వెంటనే తనూ 'మ్చ్' అంటూ ముద్దు పెట్టింది.

శ్రీకర్ రెచ్చిపోయాడు. తనూ ముద్దుపెట్టాడు. అటు వైపు ప్రియంవద రెస్పాన్స్ ఇస్తోంది. ఇలా కొన్ని సెకనులపాటు కొనసాగింది.

శ్రీకర్ కు ఇక దశలో విసుగొచ్చింది. "అబ్బ...ఫోన్ టు ఫోన్ కిస్ లేంటి...చాలిక" అన్నాడు రొమాంటిక్ వాయిస్ తో.

"ఇంటికి రండి లిప్ టు లిప్ కిస్ లు దొరకుతాయి" అంది ప్రియంవద.

వెంటనే ఆ గొంతు ఎక్కడో విన్నట్టనిపించింది ఆగొంతు...ప్రియంవదది.

"నువ్వా...ప్రియా..." అన్నాడు షాకింగ్ గా శ్రీకర్.

"అంటే నేను కాదనుకున్నారన్నమాట. ఎవరనుకుని ముద్దులు పెట్టారు?" అటు వైపు నుంచి ప్రియంవద అడిగింది.

మరోసారి తడబడ్డాడు. "ఎవరో ఏంటి...నువ్వే అనుకున్నాను"

"మరి...నువ్వా ప్రియా అని ఎందుకన్నారు?"

"అంటే...అది ఆశ్చర్యం ప్లస్ ఆనందం అన్న మాట" కవర్ చేసుకుంటూ అన్నాడు.

"మీ వాయిస్ లో డిఫెక్ట్ కనిపిస్తోంది" అంది ప్రియంవద.

"అబ్బ...నువ్వెప్పుడూ నన్ను నమ్మి చావవు కదా"

"సర్లెండి....టిఫిన్ చేసారా?" అడిగింది ప్రియంవద.

వెంటనే తన ముందున్న టిఫిన్ తాలూకూ ప్యాకింగ్ కాగితాల వంక చూసి "హెంత మాటన్నావ్ ప్రియా...నువ్వు లేకుండా నువ్వు పెట్టకుండా నేను టిఫిన్ చేయడమా..ఇలానే కాలే కడుపుతో చస్తాను కానీ టిఫిన్ చేయను"

"అంతొద్దు గానీ నేను వస్తున్నాను"

"నువ్వా ఇప్పుడా?"

"ఏం క్యాబిన్ లో ఎవరైనా వున్నారా?" అనుమానంగా అడిగింది ప్రియంవద.

"ఉన్నారు కాదు...ఉంది, నీ ఫొటో నా పర్సులో, నీ ప్రింట్ నా గుండెలో"

"కపిత్వం ఆపండి హాట్ ప్యాక్ తో వస్తున్నాను. ఎంతైనా తాళి కట్టిన మొగుడు కదా మీరు. మీకోసం ఆనియన్ దోశ, వడ, ఇడ్లీ తీసుకువస్తున్నాను"

ఉలిక్కిపడ్డాడు శ్రీకర్. అప్పటికే పొట్ట పగిలే స్టేజ్ వరకూ తిన్నాడు.