హలో... రాంగ్ నెంబర్.! - 34

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 34

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

జేమ్స్ బాండ్ నవ్వి అన్నాడు "మీరింకా పోలీసు డిపార్ట్ మెంట్ లో చేరకూడదూ అంటారేమో అనుకున్నాను. అదేమిటీ నేను నిజంగా దర్యాప్తు చేయకుండా, అబద్దమాడుతూ నటించానని అనుకుంటున్నారా?"

"అయ్యయ్యో నా వుద్దేశం అది కాదు. పోలీసు డిపార్టుమెంట్ లో ఇలాంటి సాహసాలు వుంటాయా...సినిమాల్లో అయితే ఇలాంటి సాహసాలు నేను చాలా చూసాను. మీరయితే అలాంటి పాత్రలకు బాగా సూటవుతారు" అంది తాత్కాలికంగా తన బాధను మరిచిపోయి.

"థాంక్యూ మేడమ్" అన్నాడు జేమ్స్ బాండ్. ప్రియంవద నాయర్ వైపు తిరిగి "మీ ఫీజు? అంది.

"అడ్వాన్స్ గా ఇచ్చిన అమౌంట్ లోంచి పరిశోధనకోసం కొంత ఖర్చు చేసాం. మరో అయిదు వందలు మేమే మీకు ఇవ్వాలి. అతి తక్కువ సమయంలో పూర్తయిన పరిశోధన. మీ ఫైవ్ హండ్రెడ్ తిరిగి ఇస్తా. నేను ఫోన్ చేస్తాను. కౌంటర్ కలెక్ట్ చేసుకోండి" అన్నాడు నాయర్ ఇంటర్ కమ్ బటన్ నొక్కబోతూ.

"వద్దొద్దు. ఆ అయిదు వందలు మీ డిటెక్టివ్ ఏజెన్సీలోనే వుంచండి. నా గుర్తుగా ఓ మంచి వాల్ క్లాక్ కొనండి"

"ఓహ్...వెరీ నైస్ థాట్" అన్నాడు నాయర్.

ప్రియంవద జేమ్స్ బాండ్ వైపు తిరిగి అంది. "థాంక్యూ. అతి తక్కువ సమయంలో మీ ఇన్వెస్ట్ గేషన్ పూర్తిచేసారు"

"ఆ విషయం మా బాస్ కు చెప్పండి" నవ్వుతూ చెప్పాడు జేమ్స్ బాండ్.

ప్రియంవద నాయర్ దగ్గర సెలవు తీసుకుని బయటకు నడిచింది. వెళ్లే ముందు జెం బాండ్ తో చెప్పింది.

"ఎప్పుడైనా ఓసారి మా ఇంటికి రండి"

ప్రియంవద వెళ్లాక నాయర్ జేమ్స్ బాండ్ తో చెప్పాడు.

"నెక్స్ ట్ మంత్ నుంచి నీ శాలరీ ఐదు వందలు పెంచుతున్నాను"

"థాంక్యూ సార్. నన్నిక వెళ్ళమంటారా?" అడిగాడు, టేబుల్ మీద వున్న సమోసాల ప్యాకెట్ అందుకుంటూ.

నాయర్ నవ్వి, సమోసాల ప్యాకెట్ లోంచి ఓ సమోసా తీసుకుని వెళ్లమని చెప్పాడు.

*             *                  *

ప్రియంవద లిఫ్ట్ దిగి బయటకు వస్తుంటే పరుగెత్తుకుంటూ ప్రియంవద దగ్గరకి వచ్చాడు.

"ఎక్స్ క్యూజ్ మీ మేడం"

"ఓహ్...మీరా...ఏమిటి? ఆయాసంతో పరుగెత్తుకుంటూ వచ్చారు. ఎనీథింగ్ సీరియస్?" ఆందోళనగా అడిగింది.

"నథింగ్ ..జస్ట్ కుకింగ్ మ్యాటర్..."

"వాట్...?"

"మీకు సమోసాలు చేయడం వచ్చా?"

ఒక్కక్షణం అతనేం అడుగుతున్నాడో అర్థం కాలేదు.

"మీకు సమోసాలు చేయడం వచ్చా అని అడిగాను మేడమ్...ఆలూ సమోసా"

అతను చెప్పింది అర్థమయ్యాక చెప్పింది ప్రియంవద "బాగా వచ్చు...ఏం?"

"అయితే మీ ఇంటికి తప్పక వస్తాను. థాంక్యూ మేడమ్" అని జేమ్స్ బాండ్ వెనుతిరిగాడు.

*                 *            *

ప్రియంవద సీరియస్ గా ఆలోచిస్తోంది. ఆటోకన్నా వేగంగా ఆమె ఆలోచనలు కదులుతున్నాయి. ఇన్నాళ్లూ తన భర్తకు ఇతరులతో సంబంధాలున్నాయన్నది తన అనుమానం మాత్రమే. ఇప్పుడు నిజం. నమ్మకానికి వాస్తవానికి వున్న తేడా ఏమిటో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. పెళ్లయిన తర్వాత మొదటిసారిగా తీవ్రమైన సంఘర్షణకు లోనైంది ప్రియంవద.

తనిప్పుడు ఏం చేయాలి?
భర్తను నిలదీయాలా?
చేసిన తప్పుకు శిక్ష వేయాలా?
గొడవ మొదలుపెట్టాలా?

ఇది ప్రియంవదకు మాత్రమే కాదు, పెళ్లయ్యేక వివాహేతర సంబంధాలు పెట్టుకునే భర్తలను చూసి, ఏం చేయాలో తోచని చాలామంది భార్యల సమస్య.

ఈ విషయంలో తనెవరి సలహా అడగాలి? పోనీ నాయర్ నే అడిగితే...ఆ ఆలోచన రావడంతోనే హ్యాండ్ బ్యాగులో ఫోన్ తీసి నాయర్ కు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించింది. 

అటువైపు నుంచి నాయర్ చెప్పాడు

"ఏం చేయాలన్నది మీరే నిర్ణయించుకోవాలి. ఓ తండ్రిలా చెప్పాలంటే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడమే ఉత్తమం.

ఓ క్లయింట్ గా మీ సమస్యను డైవర్స్ తో సాల్వ్ చేసుకోవాలని అనుకుంటే డైవర్స్ కి కావాల్సిన ఆధారాలు, అదే మీ భర్తకు పరాయి స్త్రీలతో వున్న సంబంధాల తాలూకు సాక్ష్యాలు సంపాదించి ఇవ్వగలను. ఏం చేయాలో మీరే నిర్ణయించుకొంది. మీకెప్పుడు ఏ సాయం కావాల్సి వచ్చినా ఓ డిటెక్టివ్ ఏజెన్సీ చైర్మన్ గా కాక, మీ తండ్రిలా భావించి నా హెల్ప్ కోరవచ్చు...ఆల్ ద బెస్ట్ మీ చైల్డ్"

ప్రియంవద ఆ నెంబర్ ని ఎరేజ్ చేసింది.

*                  *                   *