హలో... రాంగ్ నెంబర్.! - 33

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 33

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

నో టెన్షన్' డిటెక్టివ్ ఏజెన్సీ. నాయర్ ఎదురుగా కూర్చుని వుంది ప్రియంవద. ఆమె చేతిలో పొగలు కక్కే కాఫీ వుంది. టేబుల్ మీద వున్న ట్రేలో బిస్కెట్స్ వున్నాయి.

నాయర్ చెప్పడం మొదలుపెట్టాడు.

"మీకు చెప్పినట్టుగానే మూడ్రోజుల్లో మొత్తం ఇన్ ఫర్మేషన్ సేకరించాం. మీ ఆయన ఉమనైజరే. పోనీ వేశ్యల దగ్గరకి వెళ్ళే మనిషి కాదు. నగరంలో వున్న రెండు వందల ఇరవై మంది కాల్ గర్ల్స్ లో ఏ ఒక్కరికీ మీ వారితో సంబంధం లేదు. సిటీలో వున్న బిజినెస్ మాగ్నెట్స్ అడ్రస్ లు సేకరించి, వాళ్లను ట్రాప్ చేసే పనిలో వుంటారు. కొందరు కాల్ గర్ల్స్ అందులో ఏడుగురు కాల్ గర్ల్స్ తీవ్రంగా ప్రయత్నించారు. గత మూడు నెలల్లో ఎన్నోసార్లు మీవారిని ఫోన్లో కాంటాక్ట్ చేసారు. పర్సనల్ గా కలుసుకున్నారు. మీవారు దుబాయ్ వెళ్లడానికి ముందు మాలినా అనే అమ్మాయి ఓ ప్రపోజ్ పెట్టింది. మీవారితో పాటు దుబాయ్ వస్తానంది. ట్రిప్ ఖర్చు ధరిస్తే చాలని అంది. ఆ విధంగా ఫ్రీగా దుబాయ్ చూడొచ్చన్న పథకం అది. అయినా మిస్టర్ శ్రీకర్ యాక్సెప్ట్ చేయలేదు.

ఇప్పటి వరకూ మా పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే, అతనికి అయిదుగురు అమ్మాయిలతో పరిచయం వుంది. చిత్రాంగి అనే ఆవిడతో మొన్నటి వరకూ పరిచయం వుండేది. లేటెస్టుగా అక్షిత అనే అమ్మాయితో పరిచయం అయింది.

మీవారు శ్రీరామచంద్రుడు కాదు. ఖచ్చితంగా శ్రీకృష్ణుడే. అయితే మా పరిశోధనలో ఓ గమ్మత్తయిన విషయం తెలిసింది మీ వారు ఎవరికీ తనో బ్రహ్మచారినని, పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసగించలేదు. అదేదో సినిమాలో ఓ డైలాగ్ నాకు బాగా గుర్తుంది. 'నేను చెడిపోయిన  వాళ్లని చేరదీసాను కానీ, నాకుగా నేనెవర్నీ చెడగొట్టలేద'ని...మీవారి మనస్తత్వం ఆ సంభాషణకు సరిగ్గా సరిపోతుంది. ఇదీ క్లుప్తంగా మా రిపోర్టు" చెప్పి ప్రియంవద వంక చూసాడు.

ఆమె మొహంలో కలవరపాటు. భర్తకు ఇతర అమ్మాయిలతో సంబంధం వుందని తెలిస్తే ఏ భార్యకైనా కలిగే కలవరపాటే అది.

"సారీ మిసెస్ ప్రియంవదగారూ. మీకీ విషయం షాకింగ్ గా వుంటుందని తెలుసు. అయినా డబ్బు తీసుకుని మా క్లయింట్లకు అబద్దం చెప్పలేము కదా" నాయర్ అన్నాడు.

"నో...నో...మిస్టర్ నాయర్...యు హావ్ డన్ ఏ గుడ్ జాబ్. మీ పని మీరు చేసారు. ఎనీహౌ...కచ్చితమైన సమాచారం సేకరించారు. థాంక్యూ"

"ఇందులో నా క్రెడిట్ కన్నా మా జేమ్స్ బాండ్ క్రెడిటే ఎక్కువ. పని రాక్షసుడు" నవ్వుతూ అన్నాడు.

"జేమ్స్ బాండా?"

"అవును. మా పరిశోధన పూర్తి కాకుండా మీకు అతన్ని పరిచయం చేయకూడదని అనుకున్నాను. మా పరిశోధన పూర్తయింది. మీకు అభ్యంతరం లేదనుకుంటే నేను అతడ్ని పరిచయం చేస్తాను" చెప్పాడు నాయర్.

"తప్పకుండా. నాకూ అతడ్ని చూడాలని వుంది. కేవలం మూడ్రోజుల్లో అతనీ పరిశోధన ఎలా పూర్తిచేసాడో తెలుసుకోవాలని వుంది" ప్రియంవద ఆసక్తిగా చెప్పింది.

నాయర్ ఇంటర్ కమ్ బటన్ ప్రెస్ చేసి రిసెప్షన్ కు ఫోన్ చేసి చెప్పాడు. "జేమ్స్ బాండ్ ని వున్నఫళంగా రమ్మను" అని.

రెండు నిమిషాల్లో జేమ్స్ బాండ్ చైర్మన్ క్యాబిన్ తలుపు చిన్నగా తట్టి లోపలికి వచ్చాడు. అతని చేతిలో సమోసా వుంది. మరోచేతిలో సమోసాలు వున్న కవర్ వుంది.

"జేమ్స్ బాండ్ వాటీజ్ దిస్..." అడిగాడు కాసింత కోపంగా.

"అయామ్ సారీ. మీరు వున్నఫళంగా రమ్మని చెప్పారు కదా. అందుకని...ప్లీజ్ హేవిట్ సర్" అంటూ తన చేతిలో వున్న సగం తిన్న సమోసా ఇవ్వబోయి, వెంటనే "సారీ" అంటూ సమోసాలున్న కవరు టేబుల్ మీద పెట్టాడు.

నాయర్ గుర్రుగా చూసాడు.

అంత టెన్షన్ లోనూ ప్రియంవద పెదవుల మీద సన్నటి చిరునవ్వు.

"ఈవిడ ప్రియంవదగారు. మిసెస్ శ్రీకర్" పరిచయం చేసాడు నాయర్.

ప్రియంవద రెండు చేతులూ జోడించింది. జేమ్స్ బాండ్ చేతిలో వున్న సమోసా పళ్ల మధ్య పెట్టుకుని రెండు చేతులు జోడించాడు.

"ముందు సమోసా తినడం పూర్తి చెయ్" నాయర్ కోపంగా అన్నాడు.

జేమ్స్ బాండ్ నమలకుండా సమోసాను మింగేసి "ఇప్పుడు చెప్పండి సార్" అన్నాడు కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ.

"మిసెస్ ప్రియంవద గారు నీ ఇన్వెస్టిగేషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. పరిశోధన పూర్తయ్యింది కాబట్టి డిటైల్స్ చెప్పవచ్చు.

జేమ్స్ బాండ్ ఉత్సాహంగా ప్రియంవద వైపు తిరిగి చెప్పాడు.

"నా ఇన్వెస్టిగేషన్ హిస్టరీ మోస్ట్ థ్రిల్లింగ్ అసయిన్ మెంట్ మేడమ్. మీ వారి గురించి తెలుసుకోవడానికి రెండు వందల ఇరవై మంది కాల్ గర్ల్స్ ని కలిసాను"

"ఒకేసారి అంతమందిని ఎలా కలిసారు?"

"సింపుల్. అందరికీ ఫోన్ చేసి ఫలానా దగ్గరకి రండి. వచ్చిన వాళ్ళందరికీ తలా ఓ కూపన్ ఇస్తాను. 'డ్రా'లో గెలిచిన అయిదుగురికి వాళ్లు ఒక్క గంటలో సంపాదించే డబ్బును బహుమతిగా ఇస్తాను అన్నాను. ఇదేదో వెరైటీగా వుందని అందరూ వచ్చారు. అందరికీ మీవారి ఫోటో, ప్రింట్లు తీయించి ఇతనెప్పుడైనా మీ దగ్గరకి వచ్చారా అని అడిగాను. అందరూ రాలేదు అని చెప్పారు. తర్వాత డ్రా తీసి అయిదుగురికి గిఫ్ట్ అమౌంట్, మిగతా వారికి స్నాక్స్ ఇచ్చాను. అఫ్ కోర్స్...అది మా ఆఫీసు అకౌంట్లోదే. కేవలం రెండు గంటల్లో పని పూర్తయింది. ఇక మిగతా ఎంక్వయిరీ..." అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.

సరిగ్గా పావుగంట పట్టింది. అతను చెప్పడం పూర్తయ్యాక ప్రియంవద అంది. "మీరు బ్రిలియంట్...సినిమాల్లో ట్రయ్ చేయకుడదూ"