హలో... రాంగ్ నెంబర్.! - 32

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 32

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"నిన్ను మీ ఆఫీసు దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఈ ఒక్కరోజే" చెప్పాడు శ్రీకర్.

చాలా రోజులుగా శ్రీకర్ ఇలానే చెబుతూ ఆఫీసు దగ్గర తనే డ్రాప్ చేస్తున్నాడు.

వాళ్ళిద్దరూ బయటకు రాగానే పక్కింటావిడ తన గొంతు పెంచింది.

"అబ్బో...రాజవైభోగం...మా రోజుల్లో ఇలాంటివి ఎగురుదుమా" అంటూ తన అక్కసును వెళ్ళగక్కింది.

అక్షిత మౌనంగా కారు దగ్గరకి వచ్చింది.

కారులో కూచోబోయిన శ్రీకర్ ఒక్కక్షణం ఆగి...కామెంట్ చేస్తున్న వాళ్ళ దగ్గరకి వచ్చాడు వాళ్ళు శ్రీకర్ అలా వస్తాడని వూహించలేదు. 

ఎదుటివాళ్ళు తమ నిష్టూర వాక్యాలను వినాలనే వుంటుంది చాలామందికి. అలా అని వాళ్ళు తమని నిలదీయకూడదు.

తమ మాటలు విని, బాధపడుతూ తలొంచుకు వెళ్ళాలి.

"హలో...గుడ్ కామెంట్స్. చూడబోతే మీ అందరికీ మనసులో తప్పు చేయాలనే కోరిక బాగానే వున్నట్టుందే" వాళ్ళ మొహం మీదే అనేసాడు.

"మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తోందా" ఒక్కసారిగా మూకుమ్మడిగా అడిగారు.

"అది తెలియాల్సింది మీకు...ఏం! మీ పని మీరు చూసుకోవచ్చుగా.

లేదంటే డైరెక్ట్ గా నన్నే అడగొచ్చుగా ఎప్పుడు...ఎవ్వరు...ఏం చేస్తున్నారా అని చూడ్డం...ఇతరుల మీద రాళ్ళు వేయడం మాని ఆ రాళ్ళతో మీరు మీ చుట్టూ సంస్కారం అనే గోడ కట్టుకోండి" అంటూ విసురుగా కారు దగ్గరకి వచ్చాడు.

బహుశా...ఆ అమ్మలక్కలు మళ్ళీ జీవితంలో ఇలాంటి దుస్సాహసం చేయకపోవచ్చు.

*           *          *

"అక్షితా...ఫీలవుతున్నావా?"

"లేదు" సన్నటి కన్నీటి పొరను కళ్ళుమూసి బుగ్గల పైకి రాకుండా వుండే ప్రయత్నం చేస్తూ అంది.

"చాలామందికి పక్క గడిలోకే కాదు మనసు గదిలోకీ తొంగి చూడకుడదన్న సంస్కారం వుండదు. ఫర్ గెటిట్" అన్నాడు.

అక్షితం ఏం మాట్లాడలేదు. అతని భుజం మీద తలపెట్టింది.

*                  *                *

శ్రీకర్ కారును ఫాలో చేస్తున్నాడు జేమ్స్ బాండ్.

ఆరోజు ఉదయం నుంచే శ్రీకర్ యింటి ముందు కాపువేసాడు.

శ్రీకర్ కారును ఫాలో అయ్యాడు.

శ్రీకర్ ఎన్ని గంటలకు ఇంటి నుంచి బయల్దేరాడు, ఎన్ని గంటలకు అక్షిత యింటికి వచ్చాడు, ఎంతసేపు ఆ యింట్లో వున్నాడు...అవన్నీ నాట్ చేసుకున్నాడు.

క్రితం రాత్రే...అతను కాల గర్ల్స్ నుంచి సమాచారం సేకరించాడు. అతనికి కాల్ గర్ల్స్ తో సంబంధాలు లేవు.

కాని అక్షిత అనే అమ్మాయితో పరిచయాలున్నాయి. ఆ వివరాలు నోట్ చేసుకున్నాడు జేమ్స్ బాండ్.

వాట్ నెక్స్ట్...?