హలో... రాంగ్ నెంబర్.! - 30

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 30

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

అర్థరాత్రి పన్నెండు దాటింది.
ఓ ఇరానీ హోటల్ లో నిద్ర రాకుండా వుండడానికి ఛాయ్ తాగి, అక్కడ్నుంచి థర్డ్ లెన్ స్ట్రీట్ కు వచ్చాడు డిటెక్టివ్ జేమ్స్ బాండ్. దూరంగా విసిరి వేయబడ్డట్టు వున్నా, అది చాలాపోష్ లొకాల్టీ అని చూస్తేనే అర్థమవుతుంది.
జేమ్స్ బాండ్ ఓ ఖరీదైన బంగళా ముందు తన బైక్ ని ఆపాడు. కోటు జేబులో నుంచి పాకెట్ సైజు డైరీ తీసి, అడ్రస్ సరిచూసుకున్నాడు. అదే డైరీలో సిటీలో వున్న కాల్ గర్ల్స్ వివరాలు వున్నాయి.
మొత్తం రెండు వందల ఇరవైమంది కాల్ గర్ల్స్ వున్నారు. అంతా కాస్ట్ లీ కాల్ గర్ల్సే. శ్రీకర్ లాంటి వ్యక్తి కాస్ట్ లీ కాల్ గర్ల్స్ దగ్గరకి తప్ప వెళ్లడని జేమ్స్ బాండ్ వుద్దేశం. ఆ డిటైల్స్ కనుక్కోవడానికే వచ్చాడు.
లాంగ్ కోటుతో, నెత్తిన హేట్ తో వచ్చిన జేమ్స్ బాండ్ ని విచిత్రంగా చూసాడు గూర్ఖా. అర్థరాత్రి ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి రావడం  ఆ గూర్ఖాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. చీకటి పడ్డంతోనే లింజుకునే వ్యాపారం జరిగే బంగళాలకు తను గూర్ఖా.
"విలాసిని మేడమ్ వున్నారా?" అడిగాడు జేమ్స్ బాండ్.
"ఉన్నారు. అపాయింట్ మెంట్ వుందా?" అతను జేమ్స్ బాండ్ రాకను మరోలా అర్థం చేసుకుని అడిగాడు. అపాయింట్ మెంట్ అంటే గూర్ఖా భాషలో 'బుక్' చేసుకున్నారా? అని అర్థం.
"లేదు...అయామ్ బాండ్..జేమ్స్ బాండ్...ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ తీసుకువెళ్ళి మీ మేడమ్ కు ఇచ్చి నేను కలవాలనుకుంటున్నానని చెప్పు" తన విజిటింగ్ కార్డు తీసిస్తూ చెప్పాడు.
విజిటింగ్ కార్డు వంక చూసి చెప్పాడు.
"మీరు కాసేపు వెయిట్ చేయక తప్పదు." జేమ్స్ బాండ్ స్టాండ్ వేసిన బైక్ మీద కూచున్నాడు. సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత ఆ బంగళా గేటు తెరుచుకుంది. ఓ హోండాసిటీ కారు బయటకు వెళ్ళింది.
అందులో ఏ కాంట్రక్టరో, బిజినెస్ మాగ్నెటో, ఫిల్మ్ పర్సనాల్టీయో వుండొచ్చు. ఎవరున్నా ఆశ్చర్యం లేదు. అయిదు అంకెల కరెన్సీ ఇవ్వగలిగితే తప్ప, ఆమెతో ఓ గంట గడపడం సాధ్యపడదు.
కారు వెళ్ళిపోగానే గూర్ఖా గేటు వేసి లోపలికి వెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చి చెప్పాడు జేమ్స్ బాండ్ తో "మీరు వెళ్ళండి సార్"
జేమ్స్ బాండ్ బంగళాలోకి వెళుతూ, పరిసరాలను పరిశీలించాడు. ఓ పక్కన డాబర్ మెన్ లు కట్టివేయబడి వున్నాయి. ఆమెకు సెక్యూర్టీ కూడా వుందని తెలుసు జేమ్స్ బాండ్ కు. కానీ ఎక్కడా కనిపించలేదు.
హాల్ లోకి అడుగుపెట్టాడు. అంతా ఖరీదైన ఫర్నీచరే. సోఫాలో కూచున్నాడు. అయిదు నిమిషాల తర్వాత రెండు కోక్ టిన్స్ తో వచ్చింది విలాసిని.
ముఫ్ఫై - ముఫ్ఫై ఐదుకు మధ్య వుండే విలాసిని మంచి పొడగరి. పొడుగుకు సరిపడా పర్సనాలిటీ. అలసిపోయినట్టుగా వుంది. నైటీలో వుంది. ప్రెషప్ అయి వచ్చినట్టు తెలుస్తోంది. తన చేతిలో వున్న ఓ కోక్ టిన్ ని జేమ్స్ బాండ్ కి యిస్తూ చెప్పింది "ఈ టైంలో కాఫీ ప్రిపేర్ చేయడం కుదర్దు. అయినా ఇక్కడికి వచ్చేవాళ్ళు వేరే డ్రింక్స్ ప్రిఫర్ చేస్తారు. మీరు కస్టమర్ కాదు, గెస్ట్ కదా...అందుకని...ప్లీజ్ హేవిట్..."
జేమ్స్ బాండ్ కోక్ ని అందుకుంటూ ఆమె వంకే చూస్తూండిపోయాడు.
"చెప్పండి మరో పావుగంటలో ఇంకో అపాయింట్ మెంట్ వుంది. సాధారణంగా అపాయింట్ మెంట్ లేకుండా నేనెప్పుడూ, ఎవర్నీ చూడను. ఓ కేసు విషయంలో మీ చైర్మన్ నాయర్ నాకు ఫేవర్ చేసారు. అందుకే టైం కాని టైం లో వచ్చినా మిమ్మల్ని లోపలికి రానిచ్చాను. చెప్పండి ఏమిటీ విషయం."
జేమ్స్ బాండ్ ఒక్కక్షణం మౌనంగా వుండిపోయేడు.
"డాక్టర్ దగ్గర, లాయర్ల దగ్గర, పోలీసుల దగ్గర విషయాలు దాచొద్దు. అఫ్ కోర్స్...మా లాంటి వాళ్ళ దగ్గర సంకోచాలు వద్దు...ఎనీ ఫేవర్..ఎవరితో నైనా ఏ రహస్యాన్ని అయినా చెప్పించాలా...లేదా మీ పర్సనల్..." ఆమె సగంలో ఆపేసి జేమ్స్ బాండ్ వంక చూసింది.
"నో..నో...అలాంటిదేమీ లేదు. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి" అంటూ కోటు జేబులో నుంచి ఓ ఫోటో తీసి ఆమెకు ఇచ్చాడు.
"ఏంటీ...ఇతడ్ని ట్రాప్ చేయాలా?"
"నో..నో...అతను ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చాడా?"
ఒక్కక్షణం తీక్షణంగా చూసి అంది విలాసిని.
"సారీ....వృత్తిపరమైన విషయాలను నేను చెప్పను. అతను వచ్చాడా? లేదా? అన్నది వేరే విషయం. అసలు లాంటి విషయాలు చర్చించను. నా దగ్గరకి రకరకాల మగవాళ్ళు రకరకాల కారణాలతో వస్తూంటారు. వాళ్ళ గురించి చెప్పడం నా ప్రొఫెషనల్ ఎథిక్స్ విరుద్ధం."
జేమ్స్ బాండ్ కు ఆమెలోని నిజాయితీ నచ్చింది. చేసే వృత్తి ఏదైనా నిబద్దత..నిజాయితీ అనవసరం.
"అఫ్ కోర్స్..మీరు అన్నది నిజమే. ఇందులో మీకు యిబ్బంది కలిగించే విషయం ఏమీ వుండదు. జస్ట్ ఈ ఫోటోలోని వ్యక్తి మీ దగ్గరకి వచ్చాడా లేదా? అన్నది క్లారిఫై చేసుకోవడానికే వచ్చాను."
"ఈ వ్యక్తి భార్య తన భర్త కాల్ గర్ల్స్ తో తిరుగుతూంటాడా? లేదా? అని పరిశోధించమని చెప్పిందా?"
"ఎగ్జాక్ట్ లీ..."
"సో...మీ బిజినెస్ లో భాగంగా, ఆ విషయాన్ని ఆమెకు తెలియజేయాలనే ప్రొఫెషనల్ కమిట్ మెంట్ తో నా దగ్గరకి వచ్చారు. సేమ్ ప్రొఫెషనల్ కమిట్ మెంట్ నాకు వుండకూడదని ఎలా అనుకున్నారు?" కాస్త తీక్షణంగానే అడిగింది.
"సారీ ! నా వుద్దేశం అది ఎంత మాత్రం కాదు"
"సో...ప్లీజ్..." అంటూ చేతిని గుమ్మం వైపు చూపించింది.
'ప్లీజ్ గెటవుట్' అనే పదాలను సంస్కారవంతంగా ఉపయోగించిందన్న విషయం అతనికి అర్థమైంది.
జేమ్స్ బాండ్ ఆ ఫోటోలోని కోటు జేబులో పెట్టుకొని
"థాంక్యూ...నా కోసం మీ టైం వెచ్చించారు. మీ ప్రొఫెషనల్ కమిట్ మెంట్ నచ్చింది" చిరునవ్వుతో చెప్పి, మరోమాట అన్నాడు.
"ఎప్పుడైనా రిలాక్స్ కావాలని అనుకున్నప్పుడు మీరు నాకు తప్పక గుర్తొస్తారు."
విలాసిని నవ్వి 'బై' చెప్పింది.
*             *              *

జేమ్స్ బాండ్ మళ్లీ ఇందాకటి ఇరానీ హోటల్ కు వెళ్ళి రెండు ఛాయ్ లు తాగాడు. కోటు జేబులోని డైరీ తీసి, మరికొందరి అడ్రసులు చూసుకున్నాడు. అందరూ విలాసినిలా సిన్సియర్ గా వుంటారన్న నమ్మకం లేదు. అందుకే తన ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగించాడు. తెల్లవారే వరకూ కాల్ గర్ల్స్ అడ్రసులు పట్టుకుని ఎంక్వయిరీలు చేస్తూనే వున్నాడు.
*              *               *