హలో... రాంగ్ నెంబర్.! - 26

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 26

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

"మరో విషయం. అర్థరాత్రుళ్ళు ఆయనకు ఫోన్ కాల్స్ వస్తూంటాయి. ఆ ఫోన్ కాల్స్ బయటకు వెళ్ళి మాట్లాడుతుంటారు. అంతా పొడి మాటలు. ఫోన్ మాట్లాడగానే ఆ నెంబర్స్ ని ఎరేజ్ చేస్తారు."

"రైట్..ఈ కారణాలు చాలు..అయినా ఈ కారణాలు ఏవీ లేకుండా, తమ భర్తలకు అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయో, లేదో ఎంక్వయిరీ చేయమని మా దగ్గరకి చాలా కేసులు వస్తాయి. ఒ.కె. ఇప్పుడు చెప్పండి. మీవారిని రెడ్ హ్యాండెడ్ గా మీకు పట్టించాలా? ఫోటోలతో సహా ఆధారాలు కావాలా? కేవలం ఇన్ ఫర్మేషన్ మాత్రమే మీకు అందజేస్తే చాలా?"

"నా అనుమానం నిజమా కాదా...అన్నది నాకు ఖచ్చితంగా తెలియాలి"

"ఓ.కె. నెక్స్ ట్..."

"అంతే...ఆ తర్వాత ఏమీ వద్దు. ఆయనకు అమ్మాయిలతో పరిచయాలు వున్నాయో, లేదో మీరు కన్ ఫర్మ్ చేస్తే చాలు"

"సరే" అంటూ టేబుల్ సొరుగులో వున్న ఓ పేపర్ తీసి ప్రియంవదకు ఇస్తూ..

"దీంట్లో మీవారి డిటైల్స్ రాయండి. మిమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన నెంబర్...ఏ ఏ సమయాల్లో కాంటాక్ట్ చేయాలి...పూర్తి వివరాలు రాసివ్వండి."

ప్రియంవద అతను చెప్పినట్టే చేసింది.

"అయిదు వేలు అడ్వాన్స్ గా ఇవ్వండి. మిగతా అమౌంట్ వర్క్ ని బట్టి వుంటుంది. ఏదైనా రీజనబుల్ గానే వుంటుంది. క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయం, అది మీకు కూడా మంచిది కాదు" క్యాష్ పే చేస్తాను. మీకివ్వమంటారా? రిసెప్షన్ లోనా?"

"రిసెప్షన్ లో 'పే' చేయండి. నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మూడు రోజుల వరకూ ఈ విషయంలో మీరు నన్ను కాంటాక్ట్ చేయకండి."

"మీరు చెప్పినట్టే చేస్తాను....అన్నట్టు ఈ కేసు ఎవరు డీల్ చేస్తారు?"

"అది సస్పెన్స్...మీకు, ఆ కేసు డీల్ చేసే వ్యక్తికి మధ్య ఎటువంటి పరిచయం వుండకూడదు. అది మా ముందు జాగ్రత్త చర్య...."

"సరే, మీ ఇష్టం" అని లేచి, బయటకు వెళ్ళబోతూ ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి అడిగింది.

"నన్ను లిఫ్ట్ లో కాకుండా, మెట్ల మీదుగా ఎందుకు నడిచి రమ్మన్నారు?"

"కేవలం ముప్పయి ఆరు మెట్లు ఎక్కడానికి మీరు లిఫ్ట్ కోసం ఇరవై నిమిషాలు వృధా చేస్తున్నారు. మీ హెల్త్ బాగా లేనప్పుడో...మరీ ఎక్కువ అంతస్తులో అయితే ఓ.కె. అందుకే మిమ్మల్ని నడిచి రమ్మన్నాను. ఇక మాట్లాడుతూ ఎందుకు రమ్మన్నానంటే...మీకు శ్రమ తెలియకుండా వుండడానికి. ఈలోగా నేను వివరాలు సేకరించడానికి... నడక ఆరోగ్యానికి మంచిది కూడా..."

"థాంక్యూ...ఇంకెప్పుడూ లిఫ్ట్ యూజ్ చేయను" చెప్పింది ప్రియంవద.

"థాంక్స్ నాకు కాదు. ఈ పుస్తకానికి..." అంటూ సొరుగులో నుంచి ఓ పుస్తకం తీసి ఇచ్చాడు.

"ఇది చదవండి. మీకే కాదు, చాలామందికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు నేనూ లిఫ్ట్ కోసం ఎదురు చూసేవాడిని ఈ పుస్తకం చదివాక, నా ఆలోచనా విధానం మారిపోయింది. ఇది మా 'నో టెన్షన్' తరపున గిఫ్ట్ అనుకోండి ఈ పుస్తకాన్ని చదివితే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు"

ప్రియంవద ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.

*            *         *

ప్రియంవద రిసెప్షన్ లో అయిదు వేలు చెల్లించి బయటకు నడిచింది. ఈసారి లిఫ్ట్ ద్వారా కాకుండా మెట్ల ద్వారా కిందికి వెళ్తోంది.

ప్రియంవద వెళ్ళిన అయిదు నిమిషాల తర్వాత ఇంటర్ కమ్ లో అడిగాడు నాయర్

"జేమ్స్ బాండ్ ఎక్కడ?"

"రిసెప్షనిస్టు ఒక్కసారి పైకి లేచి, హాలంతా చూసి "ఇప్పటివరకూ ఇక్కడే వున్నాడు. రాగానే మిమ్మల్ని కలవమని చెప్పనా సార్..." అని అడిగింది.

"మరో అరగంటలో అతను నా క్యాబిన్ కు రాకపోతే అతనికి డిస్మసల్ ఆర్డర్ రెడీ చెయ్..." చెప్పాడు నాయర్.

ఎవరా జేమ్స్ బాండ్? ఏమా కథ?