హలో... రాంగ్ నెంబర్.! - 23

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 23

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

న్యూ సెంచరీ అపార్ట్ మెంట్స్ ముందు ఆటో ఆగింది. ప్రియంవద ఆటోలో నుంచి దిగి, మీటరు చూసి డబ్బులు ఇచ్చి లోపలికి నడిచింది. పేరుకు అపార్ట్ మెంటే అయినా, అందులో వున్నవి దాదాపు ఆఫీసులే. రెండు లిఫ్ట్ లు పనిచేస్తున్నాయి.

ఉదయం ఆఫీసు టైం కావడం వల్ల హడావిడి ఎక్కువ వుంది. ఆ రష్ చూసిన ప్రియంవదకు ఒక్కక్షణం భయమేసింది. అంత రష్ లో తను లిఫ్ట్ లో వెళ్ళగలదా? ఏమాత్రం 'క్యూ' లో వెళ్ళినా ఈజీగా వెళ్ళొచ్చు. కానీ క్యూ కన్నా ఎక్కువగా ఒకరికొకరు తోసుకోవడమే ఎక్కువ కనిపిస్తోంది.

టైం చూసుకుంది. టెన్ థర్టీ. అప్పటికే పది నిమిషాలుగా చూస్తోంది. లిఫ్ట్ కిందికి దిగడం, పైకి వెళ్ళడమూ రద్దీగానే వుంటోంది. పరిచయస్తులు కూడా ఆ టైంలో ఏమీ తెలియనట్టు హడావిడిగా వెళ్ళిపోతున్నారు.

నాయర్ తనకోసం ఎదురుచూస్తూంటాడు. కనీసం తను ఆలస్యంగా వస్తోన్న కారణం అయినా చెప్పాలి. వెంటనే హ్యాండ్ బ్యాగ్ లో నుంచి మోబిటైల్ తీసింది. తను క్రితం రోజు స్టోర్ చేసుకున్న నాయర్ నెంబర్ కు డయల్ చేసింది.

"నేను లిఫ్ట్ దగ్గర వున్నాను. మరో పది నిమిషాల్లో వస్తాను. లిఫ్ట్ దగ్గర రష్ గా వుంది" చెప్పింది ప్రియంవద.

అవతలి వైపు నుంచి నవ్వు వినిపించింది.

"నవ్వుతారెందుకు?" ఉక్రోషంగా అడిగింది ప్రియంవద.

"మీరు లైఫ్ట్ దగ్గర నిలబడి ఎంతసేపైంది?"

"పది నిమిషాలు దాటింది" చెప్పింది ప్రియంవద.

"మా ఆఫీసు మూడో ఫ్లోర్ లో వుంది కదూ..."

"అవును"

"ఇఫ్ యూ డోంట్ మైండ్...మీరు కాస్త ముందుకు వచ్చి కుడివైపు తిరుగుతారా?" ఎందుకో అర్థం కాకపోయినా  అతను చెప్పినట్టు అలానే చేసింది.

"సరిగ్గా మీకు రెండు అడుగుల దూరంలో మెట్లు ఉన్నాయి కదూ..."

"ఉన్నాయి..."

"ప్లీజ్...మీరు అలా మెట్లెక్కుతూ మాట్లాడండి. ఈలోగా మీతో రెండు మూడు విషయాలు మాట్లాడాలి..."

ప్రియంవద మెట్లెక్కుతూ మాట్లాడుతోంది.

"మీ వారికి మీరు ఇక్కడికి వస్తున్న విషయం తెలియదు కదూ"

"లేదు..తెలియదు"

"వెరీగుడ్...అన్నట్టు ఈ ప్రెమిసెస్ లో మీకు తెలిసిన వాళ్ళెవరైనా వున్నారా?"

"లేరు"

"మీరెలా వచ్చారు..ఐ మీన్ కారులోనా? ఆటోలోనా?"

"ఆటోలోనే...ఎందుకడుగుతున్నారు?" నడుస్తూనే మాట్లాడుతోంది. అప్పటికే ఆమె రెండో ఫ్లోర్ లోకి ఎంటరైంది.

"కారులో అయితే...మీరు స్వంతంగా డ్రైవ్ చేస్తూ వస్తే పర్వాలేదు. డ్రైవర్ తో వస్తే, రేపా డ్రైవర్ మీరు ఇక్కడికి వచ్చిన విషయం మీ వారికి చెప్పొచ్చు."

"మీకు అలాంటి అనుమానం అక్కర్లేదు. మాకు ఒక్కటే కారు వుంది. అది ఆయన తీసుకెళ్ళారు. నాకు కెనటిక్ హోండా వుంది. అవసరమైతే తప్ప దానిమీద వెళ్ళను. ట్రాఫిక్ లో డ్రైవ్ చేయాలంటే కొద్దిగా భయం..."

"దాన్ని ఫోభియా అంటారు. ఈరోజుల్లో స్త్రీలు విమానాలు కూడా నడుపుతున్నారు. సరే, వదిలేయండి. అన్నట్టు మీరు కూల్ డ్రింక్ తీసుకుంటారా? టీ, కాఫీ లాంటివి?"

"కూల్ డ్రింక్స్ మొన్నటి వరకూ తాగేదాన్ని, పేపర్లో వచ్చిన న్యూస్ చదివాక అవి తాగడం మానేసాను. అలాంటి విషం తాగి చావడమెందుకని..."

"వెరీగుడ్..కొబ్బరిబోండాం నీళ్ళు చాలా మంచివి. ఆరోగ్యానికి, అందానికి కూడా. పళ్ళ రసాలు తాగండి."

అప్పటికే మూడో ఫ్లోర్ లోకి వస్తోంది.